అంతర్జాతీయం

మసూద్ అజర్ సోదరుడి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్: జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ సోదరుడు, కరడుగట్టిన ఉగ్రవాది ముఫ్తి అబ్దుర్ రవూఫ్‌ను పాకిస్తాన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అంతర్జాతీయ సమాజం నుంచి వస్తున్న ఒత్తిళ్ల మేరకు పాకిస్తాన్ అరెస్టు చేసిన నిషిద్ధ ఉగ్రవాద సంస్థలకు చెందిన 44 మందిలో రవూఫ్ కూడా ఉన్నాడు. నిషిద్ధ ఉగ్రవాద సంస్థలపై చర్యలో భాగంగా రవూఫ్, హమ్మద్ అజర్ సహా 44 మందిని అరెస్టు చేసినట్టు పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల శాఖ సహాయ మంత్రి షెహర్యార్ ఖాన్ అఫ్రిదీ మంగళవారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో చెప్పారు. భారత్ గత వారం పాకిస్తాన్‌కు పంపించిన పత్రాలలో ముఫ్తి అబ్దుర్ రవూఫ్, హమ్మద్ అజర్ పేర్లు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ఫిబ్రవరి 14వ తేదీన జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామాలో జరిపిన ఆత్మాహుతి బాంబుదాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందిన తరువాత భారత్‌తో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య పాకిస్తాన్ నిషిద్ధ ఉగ్రవాద సంస్థలపై అణచివేత చర్యలను ప్రారంభించింది. జైషే మహ్మద్‌పై చర్య తీసుకోవాలని కోరుతూ భారత్ కొన్ని పత్రాలను పాకిస్తాన్‌కు పంపించింది. పుల్వామా దాడి తరువాత ఐక్యరాజ్య సమితి (ఐరాస) భద్రతా మండలి ప్రకటించిన ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాల నుంచి పాకిస్తాన్‌పై ఒత్తిడి పెరిగింది. అయితే, ఒత్తిడి కారణంగా తాము ఈ చర్య తీసుకోలేదని పాకిస్తాన్ మంత్రి అఫ్రిదీ పేర్కొన్నారు. నేషనల్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా అన్ని నిషిద్ధ ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. మరో రెండు వారాల పాటు ఈ అణచివేత చర్యలు కొనసాగుతాయని, లభించిన ఆధారాల ప్రాతిపదికన అరెస్టయిన వారిపై తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన వివరించారు. ఏ దేశానికి వ్యతిరేకంగా కూడా ఉగ్రవాద కార్యకలాపాలను పాకిస్తాన్ గడ్డపైన అనుమతించకూడదనేది తమ ప్రభుత్వ విధానమని ఆయన పేర్కొన్నారు. ఐరాస భద్రతా మండలి ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలపై విధించిన ఆంక్షలను అమలు చేయడం కోసం పాకిస్తాన్ ప్రక్రియను నిర్దేశిస్తూ సోమవారం ఒక చట్టాన్ని ఆమోదించింది. ఇది జరిగిన మరుసటి రోజే ఉగ్రవాదుల అరెస్టులు మొదలయ్యాయి. పాకిస్తాన్ ప్రభుత్వం నిషిద్ధ ఉగ్రవాద సంస్థల ఆస్తులను తన నియంత్రణలోకి తీసుకున్నదని ఈ కొత్త ఆదేశాల అర్థమని పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మహ్మద్ ఫైసల్ పేర్కొన్నారు.