అంతర్జాతీయం

మరింత పడిపోయిన పత్రికా స్వేచ్ఛ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్: ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీలో భారత్ రెండు స్థానాలు దిగజారింది. 180 దేశాలతో కూడిన ఈ జాబితాలో భారత్ 140వ స్థానానికి పడిపోయింది. భారత్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ సందర్భంగా ప్రత్యేకించి జర్నలిస్టులకు ప్రమాదం పొంచి ఉందని గురువారం విడుదలయిన ఒక నివేదిక విశే్లషించింది. ‘వరల్డ్ ప్రెస్ ఫ్రీడం ఇండెక్స్ 2019’లో నార్వే అగ్ర స్థానంలో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా జర్నలిస్టుల పట్ల శత్రుభావం పెరిగిందని ఈ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. ప్రత్యేకించి భారత్‌లో జర్నలిస్టులపై హింసాత్మక దాడులు జరుగుతున్నాయని, ఇలాంటి దాడుల కారణంగా గత సంవత్సరం ఆరుగురు భారతీయ జర్నలిస్టులు తమ విధినిర్వహణలో దారుణ హత్యలకు గురయ్యారని పేర్కొంది. భారత్‌లో ప్రస్తుతం పత్రికా స్వేచ్ఛపై వివిధ రకాల దాడులు జరుగుతున్నాయని తెలిపింది. పోలీసుల హింస, మావోయిస్టుల దాడులు, నేరస్థుల ముఠాలు, అవినీతి రాజకీయ నాయకుల నుంచి ప్రతీకార దాడులు వంటి వాటిని భారతీయ జర్నలిస్టులు ప్రధానంగా ఎదుర్కొంటున్నారని వివరించింది. భారత్‌లో 2018వ సంవత్సరంలో ఆరుగురు జర్నలిస్టులు వారి జర్నలిజం వృత్తిలో భాగంగా చేసిన కృషి కారణంగా దారుణ హత్యలకు గురయ్యారని పేర్కొంది. ఏడో ఘటనపై కూడా అనేక అనుమానాలు ఉన్నాయని తెలిపింది. భారత్‌లో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న అనేక ప్రమాదాలను, ప్రత్యేకించి ఇంగ్లీషేతర భాషా సంస్థలు నడుపుతున్న మీడియా సంస్థలకు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ముప్పును ఈ హత్యలు ప్రతిబింబిస్తున్నాయని తెలిపింది. భారత్‌లో ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జర్నలిస్టులపై బీజేపీ మద్దతుదారుల దాడులు పెరిగాయని కూడా ఈ నివేదిక వెల్లడించింది. ప్యారిస్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటియర్స్ (ఆర్‌ఎస్‌ఎఫ్- రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్) ప్రపంచ వ్యాప్తంగా జర్నలిస్టులపై జరుగుతున్న దాడుల వివరాలను సేకరించడంతో పాటు ఆ దాడులకు వ్యతిరేకంగా పోరాడుతోంది. అందులో భాగంగా ఈ నివేదికను విడుదల చేసింది. ఈ సూచీలో పాకిస్తాన్ మూడు స్థానాలు దిగజారి 142వ స్థానంలో, బంగ్లాదేశ్ నాలుగు స్థానాలు దిగజారి 150 స్థానంలో నిలిచాయి.