అంతర్జాతీయం

8 మంది భారతీయుల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖట్మాండు: నేపాల్ పర్యటనకు వచ్చిన ఎనిమిది మంది భారతీయులు ఓ హోటల్‌లో మృతి చెందారు. రాజధాని ఖట్మాండులోని ఓ హోటల్‌లో బసచేసిన టూరిస్టులు చనిపోయారు. పర్యాటకులు బస చేసిన గదిలో హీటర్ నుంచి గ్యాస్ లీకై మరణించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
హిమాలయ పర్వత ప్రాంతంలో విపరీతమైన చలి ఉండడంతో హోటళ్లు, రిసార్టుల్లో హీటర్ల వినియోగం తప్పనిసరి. ఎస్పీ సుశీల్ సింగ్ రథౌర్ కథనం ప్రకారం భారత్‌లోని కేరళ రాష్ట్రానికి చెందిన 15 మంది నేపాల్ పర్యటనకు వచ్చారు. ప్రసిద్ధ పర్యాటక కేంద్రం పోఖ్రాలో ఉల్లాసంగా గడిపారు. పర్యటను ముగించుకుని తిరుగు ప్రయాణంలో మకావన్‌పూర్ జిల్లా డామన్‌లోని ఎవరెస్ట్ పనోరమా రిస్టార్‌లో బస చేశారు. 15 మంది రిసార్టులో నాలుగు రూములు బుక్ చేసుకుని సోమవారం రాత్రి విశ్రమించారు. వేడి కోసం హీటర్ వినియోగంచుకోవడమే వారికి శాపమైంది. ఉదయం ఎలాంటి అలికిడి లేకపోవడంతో రిసార్టు సిబ్బంది మేనేజర్‌కు సమాచారం అందించారు. తలుపులు తెరిచి చూడగా ఎనిమిది మంది అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే వారిని ఖట్మాండులోని హెచ్‌ఏఎంఎస్ ఆసుపత్రికి తరలించగా చనిపోయినట్టు వైద్యులు ధృవీకరించారు. హీటర్ నుంచి వెలువడిన గ్యాస్ వల్లే ఊపిరి ఆడక చనిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎనిమిది ఒక గదిలో బస చేశారని మేనేజర్ చెప్పా రు. మిగతా గదుల్లో ఏడుగురు ఉన్నారని ఆయన అన్నారు. గదుల్లోపల నుంచి కిటికీల తలుపులకు గొళ్లాలు పెట్టడం వల్ల గ్యాస్ బయటకు వెళ్లలేదని మేనేజర్ పేర్కొన్నారు. మృతులను గుర్తించినట్టు పోలీసులు వెల్లడించారు. ప్రవీణ్ కృష్ణన్ నాయర్, శరణ్య శశి, శ్రీభద్రా ప్రవీణ్, అర్చనా ప్రవీణ్, అభినవ్ శరణ్య నాయర్, రంజిత్ కుమార్ అదతోలత్ పునాథిల్, ఇందు లక్ష్మి పీతాంబన్ రాగలతా, వైష్ణవ్ రంజిత్ చనిపోయారని ఎస్పీ వెల్లడించారు.
మృతుల్లో రెండు జంటలు, నలుగురు పిల్లలు ఉన్నారని ఆయన తెలిపారు. నేపాల్‌లో భారతీయులు మృతి చెందడంపై విదేశాంగ మంత్రి జై శంకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఖట్మాండ్‌లోని భారత రాయబార కార్యాలయం అధికారులు హెచ్‌ఏఎంఎస్ ఆసుపత్రికి వెళ్లి ఏర్పాట్లు చూస్తున్నారని ఆయన వెల్లడించారు. మృతదేహాలను స్వదేశానికి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఘటనపై కేరళ ముఖ్యమంత్రి పీ విజయన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతదేహాలు తీసుకురావడానికి సంబంధించి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. సాధ్యమైనంత త్వరంగా కేరళ టూరిస్టుల మృతదేహాల తీసుకురావడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారని విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీ మురళీధరన్ చెప్పారు. నేపాల్‌లో డిసెంబర్, జనవరి మాసాల్లో విపరీతమైన చలి ఉంటుంది. ఖట్మాండుకు దక్షిణాన 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న డామన్ దేశంలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. విదేశీ టూరిస్టులు డామన్ చూడడానికి ఎంతో ఆసక్తి చూపుతారు.
'చిత్రం... మృతదేహాలను అంబులెన్స్‌లోకి చేరుస్తున్న దృశ్యం