అంతర్జాతీయం

అసభ్యం.. ఆయన నైజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, అక్టోబర్ 13: మరో నెల రోజుల్లోగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్న తరుణంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మరో వివాదంలో చిక్కుకున్నారు. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్లు వెల్లడించే 2005 నాటి వీడియో బయటకు రావటంతో ఇప్పటికే అభాసుపాలైన ట్రంప్‌పై తాజాగా అయిదుగురు మహిళలు తీవ్రమైన ఆరోపణలు చేశారు. ట్రంప్ తమపై లైంగిక దాడికి పాల్పడ్డారని, వేధించారని వారు ఆరోపించారు. ట్రంప్ తమ సమ్మతి లేకుండా తమను ముద్దు పెట్టుకున్నారని ఇద్దరు మహిళలు చేసిన ఆరోపణలను ‘ద న్యూయార్క్ టైమ్స్’ ప్రచురించింది. మరో మహిళ చేసిన ఇలాంటి ఆరోపణనే ‘పామ్ బీచ్ పోస్ట్’ ప్రచురించింది. మాజీ అప్రెంటిస్ పోటీదారు జెన్నిఫర్ మర్ఫీ, పీపుల్ మ్యాగజైన్ రైటర్ నటాషా స్టోయ్‌నాఫ్ కూడా ట్రంప్‌పై ఇలాంటి ఆరోపణలే చేశారు. మూడు దశాబ్దాల క్రితం ఒక విమానంలో తామిద్దరం పక్కపక్క సీట్లలో కూర్చున్నప్పుడు ట్రంప్ తన ఒంటిని తడిమారని, ముద్దు పెట్టుకున్నారని 74 ఏళ్ల జెస్సికా లీడ్స్ ఆరోపించారు. ట్రంప్ టవర్‌లో ఉన్న ఒక సంస్థలో 2005లో తాను పనిచేసినప్పుడు ఒకసారి లిఫ్ట్‌లో తనకు అప్పట్లో అప్రెంటిస్ గేమ్ షోలో స్టార్ అయిన ట్రంప్ తారసపడ్డారని రాచెల్ క్రూక్స్ అనే మహిళ న్యూయార్క్ టైమ్స్‌కు తెలిపారు. అప్పట్లో 22 ఏళ్ల వయసు ఉన్న తనను ట్రంప్ నేరుగా తన పెదవులపై ముద్దు పెట్టుకున్నారని క్రూక్స్ ఆరోపించారు. 13 ఏళ్ల క్రితం ట్రంప్ ఫ్లోరిడాలోని అతనికి చెందిన ప్రాపర్టీ మార్-అ-లాగోలో జరిగిన ఒక పార్టీలో తన ఒంటిని తడిమారని, ముద్దు పెట్టుకున్నారని 36 ఏళ్ల మిండి మెక్ గిలివ్‌రే ‘పామ్ బీచ్ పోస్ట్’కు చెప్పారు. 2005లో ఒక ఉద్యోగానికి సంబంధించిన ఇంటర్వ్యూ పూర్తయిన తరువాత ట్రంప్ తన అనుమతి లేకుండా తన పెదవులపై ముద్దు పెట్టుకున్నారని మర్ఫీ అనే మహిళ ‘గ్రాజియా’కు చెప్పింది. 2005లో ట్రంప్, అతని భార్య మెలానియాను ఇంటర్వ్యూ చేయడానికి మార్-అ-లాగోకు వెళ్లినప్పుడు చోటుచేసుకున్న సంఘటనను స్టోయ్‌నోఫ్ అనే మహిళ బయటపెట్టారు. ఇతరులెవరూ లేనిచోటకు ట్రంప్ తనను తీసికెళ్లి, కొన్ని సెకన్ల వ్యవధిలోనే తనను గోడకు నెట్టి అతని నాలికను బలవంతంగా తన నోట్లో పెట్టారని స్టోయ్‌నోఫ్ ఆరోపించారు. ఆదివారం జరిగిన అధ్యక్ష అభ్యర్థుల రెండో డిబేట్‌లో తాను ఎప్పుడూ మహిళలపై లైంగిక దాడికి పాల్పడలేదని ట్రంప్ పేర్కొన్న నేపథ్యంలో ఈ అయిదుగురు మహిళలు తమకు జరిగిన చేదు అనుభవాలను వెల్లడించారు.
ప్రతి ఒక్కరినీ అవమానించారు: హిల్లరీ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్‌పై ఆయన ప్రత్యర్థి, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ మరోసారి విరుచుకుపడ్డారు. ట్రంప్ ప్రతి ఒక్కరినీ అవమానించడం ద్వారా అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ఇంతకుముందెన్నడూ లేనంత నీచ స్థాయికి దిగజార్చారని ఆమె విమర్శించారు. కొలొరాడోలో జరిగిన ఎన్నికల సభలో ఆమె మాట్లాడుతూ అధ్యక్ష ఎన్నికలకు ఇంకా మిగిలి ఉన్న నాలుగు వారాల పాటు ‘్భదగ్ధ విధానం’ వ్యూహాన్ని అనుసరించనున్నట్టు ట్రంప్ ప్రచారకర్తలు బుధవారం వెల్లడించారని పేర్కొంటూ, అంటే వారు ఎంత నిరాశానిస్పృహల్లో కూరుకుపోయారో అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. ట్రంప్ అనుసరించే ఈ ధోరణిని కొనసాగించనివ్వబోమని హిల్లరీ క్లింటన్ అన్నారు. ‘ఆయన నా గురించి ఏమన్నా నేను పట్టించకోను. మీ గురించి ఏమన్నా అంటే మాత్రం ఊరుకోను. నేను ఈ దేశంలో గల ప్రతి ఒక్కరి తరపున నిలబడతాను. ప్రతి ఒక్కరిని ఆయన (ట్రంప్) చేసే అవమానాల నుంచి రక్షిస్తాను’ అని అమెరికా మాజీ విదేశాంగ మంత్రి కూడా అయిన హిల్లరీ క్లింటన్ సభకు హాజరయిన ప్రేక్షకులను ఉద్దేశించి అన్నారు. ట్రంప్ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు వెల్లడించే 2015నాటి వీడియో ఒకటి ఇటీవల బయటపడటాన్ని ఆమె ప్రస్తావిస్తూ, మహిళలను ఆయన ఎలా చూస్తారు, మహిళల గురించి ఆయన ఎలా ఆలోచిస్తారనే విషయాన్ని నేడు ప్రపంచం అంతా విన్నది అని క్లింటన్ పేర్కొన్నారు.

చిత్రం.. మహిళలను వేధించినట్లు డోనాల్డ్ ట్రంప్‌పై ఆరోపణలు వెల్లువెత్తడంతో
న్యూయార్క్‌లోని ఆయన హోటల్ వద్ద ఆందోళన చేస్తున్న మహిళా సంఘాలు