అంతర్జాతీయం

ఇస్తాంబుల్ రక్తసిక్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్తాంబుల్, జనవరి 1: నూతన సంవత్సర ఉత్సవాలు టర్కీలో రక్తసిక్తమయ్యాయి. దేశంలో ప్రధాన నగరమైన ఇస్తాంబుల్‌లో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ ఉగ్రవాది నరమేధం సృష్టించాడు. శాంటాక్లాజ్ దుస్తుల్లో వచ్చిన ఆ దుండగుడు ఓ నైట్‌క్లబ్‌లో నూతన సంవత్సర వేడుకల్లో మునిగి ఉన్న వారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపి ఇద్దరు భారతీయులు సహా మొత్తం 39 మందిని హతమార్చాడు. ఈ దాడిలో 70 మందికి పైగా గాయపడ్డారు. ఇద్దరు భారతీయుల్ని అబిస్ రిజ్వీ, ఖుషీ షాలుగా గుర్తించారు. ఇస్తాంబుల్‌లోని రీనా నైట్‌క్లబ్‌లోకి ప్రవేశించడానికి ముందు ప్రవేశ ద్వారం వద్ద ఓ పోలీసును, పౌరుడ్ని హంతకుడు హతమార్చాడని అధికారులు చెప్పారు. దాడి జరిగిన సమయంలో ఆ నైట్‌క్లబ్‌లో ఆరేడు వందల మంది వరకూ ఉండి ఉంటారని తెలిపారు. నరమేధం అనంతరం పరారైన దుండగుడి కోసం పెద్ద ఎత్తున వేట సాగుతోందని, త్వరలోనే పట్టుకుంటామని హోం మంత్రి సులేమాన్ సోయ్లు తెలిపారు. మృతుల్లో 21 మందిని గుర్తించామని వీరిలో 16 మంది విదేశీయులని చెప్పారు.
కొత్త సంవత్సర ఆహ్వాన వేడుకల్లో తలమునకలైన అమాయకులపై అత్యంత దారుణంగా, కర్కశంగా దొరికిన వారిని దొరికినట్లుగా దుండగుడు కాల్చిచంపాడని ఇస్తాంబుల్ గవర్నర్ వాసిప్ సహిన్ బోస్పోరస్ చెప్పారు. చాలామంది భయంతో సమీపంలోని నీళ్లలోకి దూకారని, వారిని కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయరు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1.15 గంటల సమయంలో ఈ దాడి జరిగిందని, ఇది కచ్చితంగా ఉగ్రవాద దాడేనని కూడా అధికారులు తెలిపారు. దాడిలో పాల్గొన్నది ఒక్కరేనా ఇద్దరున్నారా అన్నదానిపై స్పష్టత లేదు. అయితే హంతకులు అరబిక్ భాషలో మాట్లాడటం విన్నామని ప్రత్యక్ష సాక్షుల కధనాన్ని బట్టి తెలుస్తోంది. ఈ దాడి 2015 నవంబర్‌లో ప్రాన్స్ రాజధాని పారిస్‌లో జరిగిన ఉగ్రదాడిని గుర్తుకు తెచ్చింది.
న్యూఇయర్ వేడుకలపై ఉగ్రవాదులు దాడులు చేయవచ్చన్న హెచ్చరికల నేపథ్యంలో అటు సిడ్నీ మొదలుకొని ఇటు పారిస్.. లండన్ దాకా ఐరోపాలోని అన్ని ప్రధాన నగరాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా ఇస్తాంబుల్‌లో 17 వేల మంది పోలీసులను నియమించారని, వారిలో కొంతమంది శాంటాక్లాజ్ డ్రెస్‌లో ఉన్నారని టీవీ వార్తలు పేర్కొన్నాయి. టర్కీలో ఇటీవలి కాలంలో మిలిటెంట్ దాడులు పెరిగిపోయాయి. గత ఏడాది అత్యధిక స్థాయిలోనే ఈ రకమైన దాడులు జరిగాయి. కుర్దిష్ మిలిటెంట్లు, ఐఎస్ ఉగ్రవాదులు ఆ దాడులకు పాల్పడినట్లు ప్రభుత్వం భావిస్తోంది. గత డిసెంబర్ 10న ఇస్తాంబుల్‌లో ఓ ఫుట్‌బాల్ స్టేడియం సమీపంలో జరిగిన జంట బాంబు పేలుళ్లలో 44 మంది చనిపోగా, పలువురు గాయపడ్డం తెలిసిందే. అంతకు ముందు జూన్‌లో ఇస్తాంబుల్‌లోని అతాతుర్క్ విమానాశ్రయం వద్ద జరిగిన బాంబు పేలుళ్లు, కాల్పుల్లో 47 మంది చనిపోయారు.

చిత్రం..పేలుళ్లు జరిగిన నైట్ క్లబ్ ప్రాంతంలో పోలీసుల గస్తీ