అంతర్జాతీయం

లష్కరే మరో ఐసిస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హంబర్గ్, జూలై 7: ప్రపంచ శాంతిని కబళిస్తున్న ఉగ్రవాదంపై జి-20 దేశాలు ఉక్కుపిడికిలి బిగించాలని భారత ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. శుక్రవారం నాడిక్కడ జి-20 సదస్సులో మాట్లాడిన మోదీ లష్కరే తొయిబా, జైషే మహ్మద్‌లను ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఐసిఎస్, అల్ ఖైదాలతో పోల్చారు. ఈ తీవ్రవాద సంస్థలు పేర్లు వేరైనా వీటి సిద్ధాంతం ఒక్కటేనని, దాన్ని ఉమ్మడి శక్తులతో మట్టుబెట్టాలని ఉద్ఘాటించారు. జర్మనీ రేవుపట్టణమైన హంబర్గ్‌లో జి-20 శిఖరాగ్ర సదస్సు నిరసనల మధ్య మొదలైంది. ఉగ్రవాదం, వాతావరణ మార్పు, రక్షిత వాదం తదితర అంశాలపై మోదీ సహా మెజారిటీ దేశాల మధ్య ఏకాభిప్రాయం స్పష్టమైంది. శిఖరాగ్ర సదస్సుకు ముందు జి-20 నేతలు సమావేశమే వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో ప్రపంచ దేశాల మధ్య సమన్వయం, విస్తృత స్థాయి సహకారం అవసరమన్నారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే, జైషే మహ్మద్ సంస్థలు నేరుగానే ప్రస్తావించిన మోదీ‘కొన్ని దేశాలు తమ రాజకీయ లక్ష్యాలను సాధించుకోవడం కోసం ఉగ్రవాదాన్ని పావుగా వాడుకుంటున్నాయి’అని పాక్‌పై పరోక్షంగా ధ్వజమెత్తారు. ఈ తరహాలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశాలను జి- 20 కూటమి కఠినమైన చర్యలతో ఎదుర్కోవాలని, దారికి తీసుకురావాలని మోదీ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా 11 అంశాలతో కూడిన కార్యాచరణ అజెండాను అందించారు. వీటిలో జి- 20 దేశాలు పరస్పరం ఉగ్రవాదులు జాబితాలను అందించుకోవడం, నేరస్తుల అప్పగింత, ఉగ్రవాదులు నిధులను అరికట్టడం, ఆయుధాలు అందకుండా చేయడం వంటి వాటిని బలంగా అందజేయాలని సూచించారు. కొన్ని దేశాలు ఉగ్రవాదాన్ని రాజకీయ లక్ష్యాల కోసం పెంచిపోషిస్తున్నాయని పాక్‌పై నేరుగానే ధ్వజమెత్తడం చర్చనీయాశంగా మారింది. ఉగ్రవాదం వల్ల ప్రపంచ శాంతికి తీవ్ర విఘాతం కలుగుతున్నా అంతర్జాతీయంగా ఈ మహమ్మారిని అణచివేసే రీతిలో ప్రతిస్పందన లేదంటూ మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో దేశాల మధ్య సమన్వయం కంటే కూడా ఉగ్రవాదుల మధ్యే సమన్వయం ఎక్కువ ఉందని వ్యాఖ్యానించారు.
భారత ఆర్థిక వ్యవస్థ గురించి, ఇటీవల కాలంలో తన ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి ఈ సందర్భంగా వివరించారు. గత ఏడాది నవంబర్‌లో 1000, 500 కరెన్సీ నోట్లను రద్దు చేశామని, అవినీతి, నల్లధనం చావుదెబ్బతిందని చెప్పారు. ఆర్థిక వ్యవస్థను కబళించే ఈ జంట రుగ్మతలపై మరింతగా పోరును తీవ్రతరం చేస్తామన్నారు. రక్షిత విధానాల వల్ల ప్రపంచీకరణ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని హెచ్చరించారు. రక్షిత విధానాల వల్ల కలిగే నష్టాలను దృష్టిలో పెట్టుకుని అన్ని దేశాలు వ్యవహరించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు.

చిత్రం.. జర్మనీలోని హంబర్గ్‌లో శుక్రవారం జరిగిన జి-20 ప్లీనరీ సమావేశంలో భారత ప్రధాని నరేంద్రమోదీ