అంతర్జాతీయం

సైనిక చర్యకూ సిద్ధమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఆగస్టు 18: తమపైగానీ, తమ మిత్ర దేశాలపై గానీ ఉత్తర కొరియా క్షిపణి దాడులకు పాల్పడితే తగిన రీతిలో సైనికంగా బుద్ధి చెప్పడానికి, అవసరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని అమెరికా హెచ్చరించింది. ఉత్తర కొరియా ఎలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడ్డా ఉపేక్షించేది లేదంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ తాజా హెచ్చరిక వెలువడటం గమనార్హం. జపాన్ విదేశాంగ మంత్రి టోరో కోనో, రక్షణ మంత్రి ఓనో డెరా, అమెరికా రక్షణ మంత్రి జేమ్స్ మాటిస్‌లతో కలిసి నిర్వహించిన విలేఖరుల సమావేశంలో అమెరికా విదేశాంగ మంత్రి టిల్లర్‌సన్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
ఉత్తర కొరియా నుంచి ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనా దాన్ని తాము ఎదుర్కొంటామని, అందుకు సైనికపరంగా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయితే సైనిక శక్తిని వినియోగించడమన్నది తాము ప్రాధాన్యతనిస్తున్న అంశం కాదని, ఇతరత్రా ఈ సమస్యను పరిష్కరించేందుకే ప్రయత్నిస్తామని ఆయన తెలిపారు. తామే కాకుండా తమ మిత్రులతో కలిసి కూడా ఎలాంటి సవాలునైనా ఎదుర్కొంటామన్నారు. అమెరికాపైగానీ, దాని మిత్రదేశాలపైగాని ఉత్తర కొరియా క్షిపణి దాడికి పాల్పడితే తక్షణమే తీవ్ర చర్యలు తీసుకుంటామని అమెరికా రక్షణ మంత్రి మాటిస్ కూడా ఈ సందర్భంగా తెలిపారు. జపాన్, అమెరికా, దక్షిణ కొరియాలు సంయుక్తంగానే ఉత్తర కొరియా చర్యలను ప్రత్యేక రీతిలో ఎదుర్కొంటాయని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన జపాన్ రక్షణ మంత్రి ఓనోడెరా ‘ఉత్తర కొరియా మాపై దాడి చేస్తే మాకు అందుబాటులో ఉన్న క్షిపణి రక్షణ వ్యవస్థను వినియోగించుకుంటాం’ అని వెల్లడించారు.
అమెరికాతో కలిసికట్టుగానే ఈ విషయంలో వ్యవహరిస్తామని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దేశ రక్షణ విషయంలో రాజీ లేదని, ఇదే విషయాన్ని నేటి సమావేశంలో చర్చించుకున్నామన్నారు. సమస్యను తీవ్రతరం చేయకుండా దౌత్యపరమైన చర్చల ద్వారా పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలని ఉత్తర కొరియాకు టిల్లర్‌సన్ హితవు పలికారు. గతంలో మాదిరిగా కాకుండా ఇకముందు జరిపే చర్చలు అర్థవంతమైన రీతిలో సమస్యను పరిష్కరించేవిగా ఉండేలా చేయాల్సిన బాధ్యత ఉత్తర కొరియాపై ఉందన్నారు. ఏ చర్యకు దిగడానికి ముందైనా దాని పర్యవసానాలను ఆలోచించుకోవడం ఉత్తర కొరియాకు ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతైనా అవసరమని వెల్లడించారు.