అంతర్జాతీయం

హడలెత్తించిన హరికేన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మారిగట్, సెప్టెంబర్ 7: మొన్నటి హార్వీ హరికేన్ తర్వాత మరోసారి అమెరికాను వణికిస్తున్న మరో పెనుతుపాను ‘ఇర్మా’ ఆ దేశం వైపు దూసుకు వస్తున్న క్రమంలో కరేబియన్ దీవుల్లో భారీ విధ్వంసానే్న సృష్టించింది. కరేబియన్ దీవుల్లోని బార్బుడా, సెయింట్ మార్టిన్ దీవులను సమూలంగా నేలమట్టం చేయడంతో మొన్నటివరకు ఎంతో అందంగా కనిపించిన ఆ దీవులు ఇప్పుడు శిథిలాల గుట్టలుగా మారిపోయాయి. అట్లాంటిక్ సముద్రంలో సంభవించే పెను తుపానుల్లోనే అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తున్న ఇర్మా హరికేన్ ఈ వారాంతానికి అమెరికాలోని ఫ్లోరిడాను తాకవచ్చని భావిస్తుండడంతో ముందుజాగ్రత్త చర్యగా అనేక మందిని అక్కడినుంచి ఖాళీ చేయిస్తున్నారు. తీరాన్ని తాకే సమయంలో గంటకు 295 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని భావిస్తున్నారు. గురువారం తెల్లవారుజామున పోర్టారికో తీరాన్ని తాకిన ఇమ్రా ఆ తర్వాత బార్బుడా, సెయింట్ మార్టిన్ దీవులపై విరుచుకుపడింది. పెను తుపాను దాటికి పర్యాటకుల స్వర్గంగా భావించే సెయింట్ మార్టిన్ దీవిలో దాదాపు 95 శాతం ఇళ్లు దెబ్బ తిన్నాయి. కనీసం 8 మంది మృతి చెందగా 21 మంది గాయపడ్డారని ఫ్రెంచ్ వైపున ఉన్న సహాయక సిబ్బంది చెప్పారు. సెయింట్ మార్టిన్ దీవిలో సగం ఫ్రాన్స్‌లో ఉండగా, మిగతా సగం నెదర్లాండ్ అధీనంలో ఉంది. సహాయక సిబ్బందికి తోడ్పడేందుకు ఫ్రెంచ్ మంత్రి అన్నిక్ గిరార్ధిన్ నేతృత్వంలో సైన్యం, వైద్యులు, సహాయక సిబ్బందితో కూడిన ఓ బృందం ఆ ప్రాంతానికి చేరుకుంది. దీవిలోని దాదాపు 95 శాతం ఇళ్లు ధ్వంసమైనాయని స్థానిక ఉన్నతాధికారి డేనియల్ గిబ్స్ ఒక రేడియో ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ దీవిలోని జనం విద్యుత్, తాగు నీరు లేకుండా అల్లాడిపోతున్నారని ఆయన చెప్పారు.
బార్బుడా దీవి పరిస్థితి కూడా దాదాపు ఇదే విధంగా ఉంది. దీవిలోని ఇళ్లలో 95 శాతం దెబ్బతిన్నాయని, వీటిలో 30 శాతం పూర్తిగా ధ్వంసమైనాయని ప్రధాని గాస్టన్ బ్రౌన్ చెప్పారు. దాదాపు 1600 జనాభా ఉండే ఈ దీవిలో ఓ చిన్నారి మృతి చెందినట్లు తెలుస్తోంది. బార్బడోస్ దీవిలో అలల తాకిడికి జండెర్ వెనెజియా అనే 16 ఏళ్ల సర్ఫర్ మృతి చెందినట్లు తెలుస్తోంది. కాగా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెప్తున్నారు.