మెయిన్ ఫీచర్

తిక్కన సోమయాజిలో ధర్మ ప్రవృత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశ్రీ అద్వయానంద భారతీస్వామివారి పూర్వాశ్రమ నామం తుమ్మలపల్లి రామలింగేశ్వరరావుగారు. వీరు వ్యాఖ్యానాలు, నవలలు, విమర్శలు, ఆధ్యాత్మిక గ్రంథాలు రచించారు. తిక్కన సోమయాజి ఐతిహాసిక నవల అందులో ఒకటి. నవలాస్రష్ట ఈ నవలలో కవిబ్రహ్మ తిక్కన సోమయాజి ధార్మిక ప్రవృత్తిని ప్రతిబింబింపజేశారు.
దాన ప్రతిగ్రహ యజన యాజన అధ్యయన అధ్యాపన వృత్తులను సమర్థవంతంగా నిర్వహించిన ధర్మశీలి కొట్టరువు తిక్కన. పరమ సాత్త్వికుడు. ఏకసంతాగ్రహి. గుణాధికుడు, విద్యాధికుడు, నిగమాగమసారహృదయుడు. తపశ్చక్రవర్తి. ఆనాటి కాశీ విద్యాపరిషత్తులో శాస్త్ర పాండిత్యంలో సాటిలేనివాడుగా పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా ఆ కాలంలో ఉత్తరాదివారికి దక్షిణాదివారంటే చిన్నచూపు. ప్రత్యేకించి న్యాయశాస్త్రంలో మరింత తక్కువగా చూసేవారు. దార్శనిక పాండిత్యం, సాహిత్యం అంటే దాక్షిణాత్యులదే అనే కీర్తిని తిక్కన సుస్థిరం చేశాడు. దానిలో వారిలోని చులకన భావాన్ని తుడిచిపెట్టాడు.
ఆరు శాస్త్రాలలోను విద్యావాదాలు చేసి జయపత్రాలు స్వీకరించిన విద్వాంసుడు. ప్రయాగలో, నవద్వీపంలో, జగన్నాథంలో మహా పండితులను కూడా విద్యావిషయంలో జయించాడు. ఈ విధంగా సకల విద్యావేత్తగా స్వస్థలానికి చేరుకున్న వెంటనే మహారాజా విద్యామంత్రి పదవితో సత్కరించాడు. తరువాత మహామాత్య పదవిని కూడా అలంకరించాడు. బుద్ధి సంపద, శాంతచిత్తము, చాణక్యుని రాజనీతి, గంధరాయణుని ప్రజ్ఞ, వశిష్ఠుని తపశ్శక్తి, సుమంత్రుని గాఢ ప్రభుభక్తి, సకల విద్యా పారంగత్యము కలవారే ప్రధానామాత్య పదవికి యోగ్యుడు అని ఖడ్గతిక్కన చేత సూచించబడి ప్రశంసింపబడినవాడు.
ఉభయకవిమిత్ర, బుధారాధన విరాజమాన, ఆంధ్ర భాషా కవిబ్రహ్మ, సర్వపృష్ఠాగ్నిచయన పౌండరీకాంత సర్వక్రతు నిర్వహణదక్ష, త్రయ్యంత నిష్ణాత, యత్సమరాధిపాచార్య, ప్రజ్ఞోగంధరాయణ అని మహారాజ సభలలో కీర్తించబడినవాడు. ఈ విధంగా అధ్యయన ధర్మాలు సంపూర్ణంగా నెరవేర్చినవాడైనాడు. ఇక అధ్యాపనం విషయానికి వస్తే మూలఘటికకేతన, మారన వంటి విద్వాంసులకు గురువుగా తన ధర్మాన్ని నిర్వర్తించాడు. అనుష్ఠాన భోజన నిద్రా సమయాలలో తప్ప మిగిలిన సమయమంతా విద్వద్గోష్ఠి, ఇష్టాగోష్ఠిలలో గడిపేవాడు.
మహాభారత అనువాదమంటే సామాన్యమైన విషయం కాదు. దానికి పాండిత్యం మాత్రం సరిపోదు. దైవబలం అవసరం. యజ్ఞపురుషుని అనుగ్రహాన్ని పొందగోరి యజ్ఞాన్ని తలపెట్టాడు. యజ్ఞాది క్రతువులను శ్రద్ధ్భాక్తులతో పూర్తిచేసి సోమయాజి అయినాడు. ‘నభూతో న భవిష్యతి’ అనే రీతిలో మహాభారతంలోని పదిహేను పర్వాలను సృజించి కవిబ్రహ్మ అయినాడు. రచనా సంవిధానంలో నన్నయ్య, ఎఱ్ఱనలకు వారధిగా వుండి కవిలోకాన్ని మెప్పించి ఉభయ కవి మిత్రుడైనాడు. దేవతార్చానావిధిని నిరాటంకంగా కొనసాగించిన పరమ నైష్ఠికుడు తిక్కన. తనను బ్రాహ్మణునిగా ఆహ్వానించిన రాణి అభ్యర్థనను తెలుసుకున్నప్పుడు ఇది తగినదా కాదా ఆలోచించుకుని సముచితమే అని నిర్ణయించుకున్నాకనే బ్రాహ్మణ దంపతులుగా భార్యతో కలిసి వెళ్లి ఆమె సత్కారాన్ని స్వీకరించాడు. అగ్రహారాలను దక్షిణగా అందుకున్నాడు. యజ్ఞం పూర్తయ్యాక అన్నింటినీ దానం చేశాడు. అందరి కోరికలను తీర్చాడు, సువాసినిగా కన్నుమూయాలన్న భార్య కోరికను మన్నించాడు.
ఒక దశలో రాజ్యాధికారమంతా తిక్కన చేతికి చిక్కింది. తాను రాజ్యాన్ని పరిపాలిస్తానంటే వద్దనేవారు ఎవరూ లేరు కానీ అధికారంపైన ఏ మాత్రం ఆశలేని తిక్కన దానిని మనస్ఫూర్తిగా తన ప్రభువుకే సమర్పించాడు. దీనివల్ల అతనిలోని ప్రభుభక్తి, రాజ్యంపట్ల గల భక్తి, కృతజ్ఞత వెల్లడి అవుతున్నాయి. తిక్కన పుత్ర ధర్మాన్ని కూడా ఏ మాత్రం విస్మరించలేదు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు పరమపదిస్తే వారి అస్థికలను గంగలో కలిపేందుకు కాశీకి ప్రయాణమైనాడు. పితృకార్యాలను నిర్వర్తించడంలో ఏ మాత్రం వెనుకంజ వేయలేదు. తన కుమారుడు, అన్న కుమారుడు తల్లి అస్థికలను కలిపేందుకు వెళ్ళే సమయంలో వారి వెంట వెళ్ళాడు. పెద్దతండ్రిని, పెద్ద తల్లిని గౌరవించాడు. రాజ్యంలో ఏర్పడిన సమస్యలను తన శక్తియుక్తులతో అవలీలగా పరిష్కరించాడు. అందరూ ఆశ్చర్యపోయేలా చాతుర్యంతో వ్యవహరించాడు. దాన ప్రతిగ్రహ యజన యాజన అధ్యయన అధ్యాపక ధర్మాలు తిక్కనలో ఈ విధంగా వ్యక్తమైనాయి.
రాజధర్మం: విక్రమ సింహపుర రాజైన తెలుగు చోళరాజు తిక్క చోడదేవరాజు ధర్మభీతి కలవాడు. దేశంలో ధర్మం తగ్గిపోతోందని దేశంలో ధర్మప్రచారం విరివిగా జరగాల్సి వుందని ప్రజలకు ధర్మ రహస్యాలు తెలిసి ధర్మంపై ఆదరణ పెరగడానికై ధర్మస్వరూపమైన మహాభారతము దేశ భాషల్లోకి అనువదింపబడి ప్రచారం చేయబడాలని నిశ్చయించుకున్నవాడు. తిక్కన విద్యామంత్రిగాను, మహామంత్రిగాను మన్ననలందుకున్నాడంటే దానికి మహారాజు యొక్క సహృదయం కూడా కారణం. ఈ సంకల్పంతోపాటు మనుమసిద్ధి మహారాజు మహాభారత రచనకు కావలసిన హంగులన్నింటినీ సమకూర్చడం, ప్రోత్సహించడం గొప్ప విశేషం. తిక్క చోడ మహారాజు కూడా రాజ్య కాంక్షకు లోబడి రాజ్య సుఖాలలో మునిగిపోకుండా తగిన సమయంలో వానప్రస్థానికి వెళ్ళాడు. మహాభారత రచన పూర్తయిన తరువాత తిక్కనను సకల రాజలాంఛనాలతో సత్కరించాలని సన్నాహాలు
చేసుకున్నాడు. రాజు, రాజోద్యోగి అనే ఎక్కువ తక్కువలు మనకు ఎక్కడా ఏ విషయాన్నైనా సూటిగా స్పష్టంగా చర్చించగలిగే చొరవ, చనువు మనకు వీరిలో కనిపిస్తాయి. రాజ్యం సుఖశాంతులతో విలసిల్లడానికి, చక్కని సాహిత్యం వెలువడడానికి, విజయాలు చేకూరడానికి ఈ పరిస్థితి అవసరం. మహారాజు వైవాహిక జీవితంలో ఏర్పడిన చిన్న పొరపాటును, దోషాన్ని దిద్దే సమయంలో తాను కవినని, మంత్రిననే ఉదాసీన వైఖరిని అవలంబించకుండా తనకు తానై పూనుకుని వారి మధ్య సయోధ్య కూర్చిన ఆప్తుడు తిక్కన. ఇక్కడ రాజ్యం మేలును కాంక్షించాడు. ఎవరిలో ఆధిక్య భావన వున్నా ఇటువంటి లక్ష్యాలు నెరవేరవు. ప్రజల మాటకు విలువనిచ్చినపుడే రాజు ప్రజారంజకుడు కాగలుగుతాడు. మనుమసిద్ధి మహారాజు తన ధర్మాన్ని తప్పలేదు. తన వారు విజయాన్ని సాధించినపుడు చూపిన ప్రోత్సాహం, చేసిన సత్కారం తిరుగులేనిది. తానే స్వయంగా వారిని ప్రశంసించి మర్యాద చేశాడు. వారి కష్ట సుఖాలను తనవిగా భావించాడు. కాకతీయ రాజైన గణపతిదేవ చక్రవర్తి కూడా తిక్కన పట్ల చూపిన ఆదరాభిమానాలు అనుపమానమైనవి. తిక్కనకు సంతోషంగా సన్మానం చేసి అది తెలుగు భాషకు తెలుగుదనానికి, సరస్వతీదేవికి జరిపిన సత్కారంగా భావించాడు.
దాంపత్య ధర్మం: ఆ కాలం నాటి పరిస్థితులను అనుసరించి పతివ్రతా ధర్మాలను ఆకళింపు చేసుకుని వాటిని పాటించిన స్ర్తిలు మనకు ఈ నవలలో కనిపిస్తారు. రాణీ శీలా మహాదేవి తన భర్త పర స్ర్తి పట్ల ఆసక్తుడైనాడన్న విషయం తెలిసి కూడా నిబ్బరంగా అతనిలోని మార్పు కోసం ఎదురుచూసింది. ఆమె పడిన కష్టాలన్నీ తరువాత కాలంలో తీరినాయి. అన్నమాంబ కొమ్మన వెంట, పెద్దచానమ్మ ఖడ్గతిక్కన వెంట సహగమనం చేశారు. చిన్న చానమ్మ పసి వయసులో తన తండ్రి ఇచ్చిన వాగ్దానానికి విలువనిస్తూ ఎవరికైతే తనను ఇస్తానన్నాడో అతనినే పెళ్లాడతానని పట్టుపట్టి తపశ్శక్తితో సాధించుకున్న ధర్మాత్మురాలు. ఈమె అన్ని వేళల్లో తిక్కన వెంటనే వుండి సహధర్మచారిణి అనిపించుకుంది. యజ్ఞ సమయంలో, రాణి చేత సత్కారం పొందే సమయంలో గౌరవాన్ని పొందింది. సువాసినిగానే గౌరీ లోకానికి చేరుకోవాలన్న కోరిక కూడా తీరింది. పెద్ద చానమ్మ సహగమన సమయంలో భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకుని భర్త శిరస్సును తెప్పించగలిగింది. పరస్పర గౌరవాభిమానాలతో నిండిన దాంపత్య ధర్మం ఇందులో వుంది.
ప్రజలు:యుద్ధ సమయం ఆసన్నమైనపుడు అప్రమత్తంగా వుండడం అవసరం. ఎల్లప్పుడు సైనికులు, సేనాపతులు, ఇతర ఉద్యోగులు సిద్ధంగా ఉండాలి. నాగమనీడు, ఖడ్గతిక్కన మొదలైన వారంతా మహావీరులు. వీరావేశం కలిగినవారు. వీరు రాజ్యాన్ని ఎప్పుడూ కాపాడుతూ వుండేవారు. తమ రాజు బందీగా వున్న సమయంలో విక్రమ సింహపుర ప్రజలు ప్రభువుకోసం తల్లడిల్లిపోయారు. కంటికి రెప్పలా రాజ్యాన్ని కాపాడారు. శత్రువులు ముట్టడించినప్పుడు ఏ ఒక్కడూ శత్రువుకు సమాచారం అందించడం కానీ, శత్రుపక్షం చేరడం కానీ చేయలేదు. ఇది ప్రజల కర్తవ్య నిష్ఠకు నిదర్శనం. దుఃఖ సమయంలోను, ఆనంద సమయంలోను రాజు ఉద్యోగులతో వారి కుటుంబంతో కలిసిపోయి పంచుకోవడం కనిపిస్తుంది. ఒకరికొకరు ఆప్తులుగా, ఆత్మీయులుగా వుండగలిగే మంచి ఆదర్శం ఇందులో పాటించబడింది. మంచికి కానీ, చెడుకు కానీ ఊరు ఊరంతా కలిసిపోయి పంచుకోవడాన్ని రచయిత చక్కగా చిత్రించారు.
మహారాజులు, సామాన్యులు, ప్రజలు- ఇలా మానవులంతా ధర్మాన్ని పాటించడం ఒక ఎత్తు అయితే మూగజీవాలు కూడా ధర్మాన్ని పాటించడం చూస్తే మాత్రం కళ్ళు చెమర్చక మానవు. ఖడ్గ తిక్కన గుఱ్ఱం అనుభవించిన మూగవేదన హృదయాన్ని ద్రవింపజేస్తుంది. గాయాలపాలై చావు బ్రతుకులమధ్య కొట్టుమిట్టడుతూ గుఱ్ఱం శత్రు స్థావరాన్నుంచి స్వస్థలానికి తన యజమాని యొక్క తల తెగిన కళేబరాన్ని చేర్చి ప్రాణాలు వదలడంలో కరుణ రసం నిండి వుంది. గుఱ్ఱం కూడా ధర్మాన్ని పాటించింది. శత్రుపక్షంవారు మంత్రించిన ఆవులను వీరిపై వదిలినపుడు ధర్మం తప్పి ఆవులను బాధించలేదు. మీదుమిక్కిలి వీరంతా గోవుల చేత త్రొక్కబడి, చంపబడి గోవులు సృష్టించిన బీభత్సంతో అల్లాడిపోయారు. ఆవుల మీదికి ఉరకలేదు. కదలక మెదలక నిలుచుని ప్రాణాలు వదిలారు. ధర్మం ఈ విధంగా పతాక స్థాయిని చేరింది. బ్రహ్మహత్య, గురుహత్య, గోహత్యలను మహాపాతకాలుగా పరిగణించిన సందర్భాలు వున్నాయి. ఈ విధంగా తిక్కన సోమయాజి నవలలో ధర్మం సర్వత్రా వ్యక్తమైంది.

- కె.లక్ష్మీ అన్నపూర్ణ