మెయిన్ ఫీచర్
స్వయం నిర్మిత మేధో సౌధం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బహుముఖ ప్రజ్ఞావంతులకు తెలుగునాట కొదవలేదనే మాట నిజమే! తెలుగునాట సంఘ సంస్కరణ ఉద్యమానికి ఒరవడి దిద్దిన ‘గద్య తిక్కన’ కందుకూరి వీరేశలింగం కవి- నవలాకారుడు- ప్రహసనకర్త- పత్రికా సంపాదకుడు- విద్యాలయాల నిర్మాత, నిర్వాహకుడూనూ. ఆధునిక తెలుగు సాహితికి ఆద్యుడనిపించుకున్న గురజాడ అప్పారావు అటు తెలుగులోనూ ఇటు ఇంగ్లీష్‌లోనూ కూడా గొప్ప కవి; మంచి కథకులు; అద్భుతమయిన నాటక కర్త; తొలితరం భాషాశాస్తవ్రేత్త; అన్నిటికీ మించి న్యాయశాస్త్ర పరమయిన లావాదేవీల్లో ఆరితేరిన నిపుణుడు. ఆంధ్రుల సాంఘిక చరిత్రను అక్షరీకరించిన సురవరం ప్రతాపరెడ్డి సమర్థుడయిన వకీలు- గొప్ప సాహిత్య పరిశోధకుడు- చక్కని కథకుడు- బాధ్యత కలిగిన రాజకీయవేత్త కూడా. ఆంధ్ర పితామహుడు మాడపాటి హనుమంతరావు గొప్ప విద్వాంసుడు- తొలితరం కథకుడు- తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని రగిలింపచేసిన సంస్కర్త- హైదరాబాద్ మేయర్‌గా రాణించిన రాజకీయవేత్త కూడా. ఇక అడివి బాపిరాజు ఒక చేత కలమూ మరో చేత కుంచె పట్టి బహుముఖీనమయిన ప్రజ్ఞను ప్రదర్శించారు. శివశంకరులు బహుభాషా కోవిదులు, బహుప్రక్రియల్లో నిష్ణాతులు, గద్య-పద్య- గేయ రచనల్లో తన ప్రతిభ ప్రదర్శించిన కవి కూడా. ఎంకి పాటల నండూరి సుబ్బారావు గొప్ప హిందూస్తానీ సంగీత విద్వాంసులు కూడా. చలం, కొడవటిగంటి, గోపీచంద్, శ్రీశ్రీ, ఆరుద్ర తదితరులు అనేక ప్రక్రియల్లో రాణించిన బహుముఖ ప్రజ్ఞావంతులే కదా! కానీ ఒకే వ్యక్తి ప్రముఖ కవిగానూ, ప్రసిద్ధ విమర్శకుడుగానూ, విశిష్ట చిత్రకారుడుగానూ, పత్రికా రచయితగానూ- సంపాదకుడుగానూ, తొలి తెలుగు కార్టూనిస్ట్- కవిగానూ, వేదాల గురించి సృజనాత్మకంగా ఆలోచించి-విస్తృతంగా రాసిన పరిశోధకుడుగానూ, ‘కన్యాశుల్కం’ నిపుణుడుగానూ, మార్క్సిస్టు మేధావిగానూ, తెలుగులో జర్నలిజం అధ్యయన కేంద్రానికి మొట్టమొదటి ప్రధాన అధ్యాపకుడుగానూ రాణించినవారు మాత్రం రాంభట్ల కృష్ణమూర్తి ఒక్కరేనేమో! ఆ రాంభట్లగారి శత జయంతి సంవత్సరమిది!
ఎనభయి వసంతాల జీవన సారాన్ని సామాన్య పాఠకులకు నచ్చేలా- ‘సొంత కథ’ చెప్పి ఒప్పించి, మెప్పించిన రచయిత రాంభట్ల. పుట్టింది ఎక్కడో తూర్పుతీరంలో అయినప్పటికీ, రాంభట్ల జీవనంలో అత్యధిక భాగం హైదరాబాద్‌లోనే గడిచింది. ఒకప్పుడు ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రాచ్య కళాశాల అధిపతిగా ఉండిన సరిపల్లె విశ్వనాథశాస్ర్తీ రాంభట్లకు స్వయానా మేనమామ. కానీ ఆయన ప్రభావం రాంభట్లపై దాదాపు లేదనే చెప్పాలి. ఉన్నమాట చెప్పుకోవాలంటే, రాంభట్ల ఒక స్వయంనిర్మిత మేధో సౌధం! రాంభట్ల పాఠశాలల్లో పెద్దగా చదువుకోలేదు- చదువుకున్నది కాస్తోకూస్తో ఉర్దూ మీడియంలోనే! మాతృభాష తెలుగులోనూ, స్వయంకృషితో నేర్చుకున్న ఇంగ్లీష్‌లోనూ, కొద్దోగొప్పో పాఠశాలల్లో చదువుకున్న ఉర్దూలోనూ రాంభట్లగారు తర్వాతి కాలంలో పాండిత్యం సంపాదించడం విశేషం. అంతకుమించి, లౌకిక సంస్కృతంలోనూ, వైదిక సంస్కృతంలోనూ ప్రవేశం కల్పించుకోవడానికి ఆయన - ఆరోజుల్లో- ఎన్ని అగచాట్లు పడివుంటారో ఊహించుకోవచ్చు. హైదరాబాద్‌లోని శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయంలాంటి గ్రంథాలయాల్లోనే ఆయన తెలుగు- సంస్కృత సాహిత్య అధ్యయనం సాగింది. ముఖ్యంగా రుగ్వేదం చదువుకోవడానికి తను చాలా కష్టపడవలసి వచ్చిందని ఆయన చెప్పేవారు. లిఖిత చరిత్రకూ, నిశ్చల నిశ్చితాలయిన కళా నియమాలకూ, పిడివాదపు ఇనప కచ్చడాలకూ అతీతంగా ఊహించగల సాహసం రాంభట్ల సొంతం; అది కేవలం స్వార్జితం!! భారతీయ తత్వశాస్త్రం, అలంకార శాస్త్రాల్లో చక్కని అభినివేశంతోపాటుగా, పాశ్చాత్య మనోవిజ్ఞాన శాస్త్రంమీద కూడా రాంభట్లగారికి మంచి పట్టుండేది. ఆనందవర్ధనుడు, అభినవ గుప్తుడు, క్షేమేంద్రుడు తదితరుల గురించి ఎంత ప్రభుత్వంతో మాట్లాడేవారో, మార్క్స్-ఎంగెల్స్, ఫ్రాయిడ్, యూంగ్ గురించి కూడా అంతే అధికారికంగా మాట్లాడగలగడం రాంభట్ల విశిష్టత. రాంభట్ల సుశిక్షితులయిన హిప్నోటిస్ట్. మ్యాజిక్‌మీద ఆసక్తితో అదీ నేర్చుకున్నారు. అయితే, మ్యాజిక్‌ను ఆయన ప్రధానంగా తంత్రంగా సాధన చేశారు.
పదహారేళ్ల ప్రాయంలోనే బతుకుతెరువుకోసం కార్మికుడిగా కాయకష్టం మొదలుపెట్టిన రాంభట్ల పాతికేళ్ల పరువంలో- 1945లో- పత్రికా రచన రంగంలో కాలుపెట్టారు. అడివి బాపిరాజు సంపాదకులుగా నిజాం నవాబు మొదలుపెట్టిన ‘తెలుగు మీజాన్’తోనే రాంభట్ల జర్నలిస్టు అయ్యారు. రాంభట్లను పత్రికా రంగానికి పరిచయంచేసిన పుణ్యం మీజాన్ పత్రికకు సహాయ సంపాదకులుగా ఉన్న శ్రీనివాస చక్రవర్తికే దక్కాలి! ‘డ్యూటీ ఎక్కిన’ తొలినాడే రాంభట్ల కాలమిస్ట్‌గా అవతారమెత్తడం విశేషం. ఆ పత్రికలో రాంభట్ల నిర్వహించిన ‘‘మిర్చీ-మసాలా’’ పేజీ కొత్తతరం పాఠకులకు సరికొత్త స్వరం సమకూర్చి చరిత్ర సృష్టించింది. నిజాం నవాబును నారాయణగూడా చౌరస్తాలో ఉరితీయాలని ‘మీజాన్’ సంపాదకీయంలోనే డిమాండ్ చేసిన దుస్సాహసి రాంభట్ల. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం గురించిన కీలకమయిన- విశ్వసనీయమయిన సమాచారం కోసం ఆ కాలపు కమ్యూనిస్టులు ‘తెలుగుమీజాన్’ పత్రికనే చూసేవారంటే, ఆ పత్రిక ఎలా వుండేదో ఊహించుకోవచ్చు. వట్టికోట ఆళ్వారుస్వామి ద్వారా రాంభట్లకు తెలంగాణ సాయుధ పోరాటం గురించిన విశ్వసనీయ సమాచారం అందుతూ వుండేది. దాన్ని వార్తల రూపంలో, వ్యంగ్యచిత్రాల రూపంలో రాంభట్ల అచ్చువేయించేవారు. అలా మూడేళ్లపాటు కొనసాగించగలగడంలో రాంభట్ల నిబద్ధత మాత్రమేకాక, అడివి బాపిరాజు- శ్రీనివాస చక్రవర్తి లాంటి పెద్దల ఔదార్యం కూడా ఇమిడి వుందని మర్చిపోకూడదు! 1950 దశకం తొలి నాళ్లలో- తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, ‘‘పోలిస్ యాక్షన్’’ నేపథ్యంలో -రాంభట్ల సకుటుంబంగా హైదరాబాద్ వదిలి వెళ్లేంతవరకూ ఆయన మీజాన్‌లో పనిచేస్తూనే వున్నారు.
రాంభట్ల చిన్నప్పటినుంచీ బొమ్మలు వేస్తూనే వున్నప్పటికీ, అడివి బాపిరాజు సాంగత్యంలోనే ఆయన చిత్రకళ పరిపూర్ణతను సాధించుకుంది. అప్పటివరకూ పెయింటర్‌గా రాణించాలనుకుంటూ ఉండిన రాంభట్లను కార్టూన్ కళవైపు మళ్లించింది బాపిరాజుగారే. నవ్వుతూ నవ్విస్తూ వుండడమే రాంభట్ల స్వభావం. బహుశా అందువల్లనే ఆయన కార్టూన్ కళ హృదయాన్ని అలవోకగా గ్రహించగలిగారు. పదిహేడు-పద్దెనిమిది శతాబ్దాల నాటికే విలియమ్ హాగార్త్‌లాంటివాళ్లు కార్టూన్ కళలో ప్రవేశపెట్టిన నైతిక ధోరణి, వంద సంవత్సరాల తర్వాత గానీ జేమ్స్ గిల్‌రే లాంటి వాళ్ల చేతుల్లో పదునుదేరి రాజకీయ వ్యంగ్య చిత్ర రచనగా పరిణమించలేదు. ‘పంచ్’లాంటి పత్రిక ద్వారా అది, మన దేశానికి చేరుకుని, స్వతంత్ర స్వభావాన్ని సంతరించుకోడానికి మరో వంద సంవత్సరాలు పట్టేసింది. ఇరవయ్యో శతాబ్ది ప్రథమార్థంలో తలిశెట్టి రామారావు పుణ్యమాని విశేష జనాదరణకు పాత్రమయిన కార్టూన్ చిత్రకళ పాతిక ముప్పై యేళ్లలోనే దేశవ్యాప్తంగా ప్రబల ధోరణిగా రూపుదిద్దుకుంది. ఆనాటి రాజకీయ వాతావరణంలోని వాడినీ, వేడినీ మన కార్టూనిస్టులు తమ కళకు ఆపాదించుకోవడానికి ఎక్కువ కాలం పట్టలేదు. ఆ తరానికి చెందిన రాజకీయ వ్యంగ్య చిత్రకారుల్లో అగ్రగణ్యుడు రాంభట్ల కృష్ణమూర్తి. స్వతహా మంచి కవికూడా కావడంతో, ఆయన చిత్రకళకు కవిత్వకళ తోడయింది. ఫలితంగా, 1950 దశకం తొలినాళ్లలో ‘శశవిషాణం’ రాజకీయ కార్టూన్- కవితాప్రక్రియగా అవతరించింది. లెక్కప్రకారం అది ఓ కాలమ్. అయితే, పూర్తిగా విభిన్నమయిన కాలమ్.
తెలుగునాట వ్యంగ్య, అధిక్షేప కవిత్వం శతాబ్దాలుగా ఉన్నదే.. ఆధునిక రీతిలోనూ, ఈ తరహా కవిత్వం పునరుద్ధరింప చేసిన ఘనత మాత్రం అభ్యుదయ కవులకే దక్కుతుంది. 1940 దశకంలోనే అభ్యుదయ కవులు వ్యంగ్య-అధిక్షేప కవితలను పాటలుగా రాయడం మొదలుపెట్టారు. బహుశా ఈ కోవలో తొలి తాంబూలం తాపీ ధర్మారావుకే దక్కాలి! పిలకా గణపతిశాస్ర్తీలాంటి సాంప్రదాయిక సంస్కృత విద్వాంసుడు కూడా ఈ బృందంతో చేరడం విశేషం. 1945లో శ్రీశ్రీ చక్రపాణి సంపాదకత్వంలో వెలువడుతూ ఉండిన ‘ఆంధ్రజ్యోతి’ మాసపత్రికలో ‘సిరిసిరి మువ్వ పద్యాలు’ మొదలుపెట్టి యాభయివరకూ రాశారు. వాటికి అనుబంధంగా ఆయన రాసిన ‘ప్రాసక్రీడలు’, ‘లిమఋక్కులు’ కూడా ప్రధానంగా వ్యంగ్య కవితలే.. ఇవీ యాభయ్యాభయ్యే రాయడం విశేషం. మొత్తం అన్నింటినీ కలిపి ‘మూడు యాభయిలు’ అనే పుస్తకంగా విడుదల చేశారు. శ్రీశ్రీ తర్వాత కొన్ని డజన్లమంది అలాంటి కవితలు రాయడానికి ప్రయత్నించారు కానీ, పెద్దగా సఫలం కాలేకపోయారు. ఈ ప్రయత్నాలకు పూర్తిగా భిన్నమయిన ఓ ప్రక్రియ త్వరలోనే మొదలయి పాతుకుపోయింది. అదే రాజకీయ కార్టూన్- కవితాప్రక్రియ. ఆ ప్రక్రియకు ఆద్యులు రాంభట్ల కృష్ణమూర్తి.
‘శశవిషాణం’ అంటే కుందేటి కొమ్ము అని అర్థం. అసాధ్యమయినదీ అస్తిత్వంలో ఉన్నట్లు ఆధారంలేనిదీ అయిన విషయం గురించి చెప్పడానికి ‘శశవిషాణం’ అనే పదాన్ని ఆలంకారికంగా వాడడం సంస్కృత సాహిత్యంలో కనిపిస్తుంది. భర్తృహరి సుభాషిత త్రిశతిలోని నీతి శతకంలోని అయిదో శ్లోకంలో ఈ మాట వస్తుంది. (ఈ శ్లోకానికి ఏనుగు లక్ష్మణకవి చేసిన అనువాదం- ‘‘తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు...’’ పద్యం- సుప్రసిద్ధం. అందులోని, ‘కుందేటి కొమ్ము’ అనేది శశవిషాణానికి అనువాదమే!) మహాయాన బౌద్ధవౌలిక సూత్రాల సంకలనంగా వెలువడిన ‘లంకావతార సూత్ర’లో కూడా ఈ మాట కనిపిస్తుంది. ‘‘వాగ్వికల్ప మాత్రం హి మహామతే శశవిషాణం స్వహేతు లక్షణాభవేత్’’ అనే సూత్రంలో ఈ కుందేటి కొమ్ము కనిపిస్తుంది. ‘శశివిషాణం’అనే పద్యాన్ని ‘‘చైతన్యపూరితమయిన, వాస్తవిక అస్తిత్వ చిహ్నాలేవీ లేని విషయం’’ అనే అర్థంలోనే ప్రయోగించారు. రాజకీయ వ్యంగ్య చిత్రాలతో కూడిన కవితలకు ‘శశవిషాణం’ అనే పేరుపెట్టడంలోని ఆంతర్యమేమిటో ఇవాల్టి పాఠకులకు వివరించనక్కర్లేదు. రాజకీయ రంగంలో చైతన్యంగానీ, వాస్తవికత కానీ కరువయిన నేపథ్యంలో ఆదర్శవాదం ‘శశవిషాణం’గా మిగలక మరేమవుతుంది?
ఈ నేపథ్యంలో, 50వ దశకం మొదట్లో రాంభట్ల- ‘విశాలాంధ్ర’ దినపత్రికలో- మొదలుపెట్టిన రాజకీయ కార్టూన్- కవితాప్రక్రియ ‘శశవిషాణం’. ఈ కార్టూన్- కవితా ప్రక్రియ ప్రధానంగా తెలుగు పత్రికారంగంలో సువ్యవస్థితమయింది. మురారి రాసిన ‘్ధర్తాయణం’ అరవయి దశకంలో ప్రాచుర్యానికి నోచుకోగా, మల్లిక్ ‘టుమ్రీలు’ డెబ్బయి దశకంలో పాఠకుల నాలికలపై నాట్యమాడాయి. డెబ్బయి దశకం ద్వితీయార్ధంలో దేవిప్రియ మొదలు పెట్టిన ‘సమాజానందస్వామి’ కూడా పాఠకులను ఆకట్టుకోగలిగాడు. ఎనభయి దశకంలో దేవిప్రియ - మోహన్ జోడీ ముందుగా ‘ఆంధ్రప్రభ’లోనూ, తర్వాత ‘ఉదయం’ దినపత్రికలోనూ కొనసాగించిన ‘రన్నింగ్ కామెంటరీ’ వారిద్దరికీ మంచి పేరుతెచ్చింది. ఇటీవలి కాలంలో సతీష్ చందర్ కూడా ఈ ప్రక్రియలో తన నేర్పు ప్రదర్శిస్తున్నారు. 1970-90 దశకాల మధ్యలో తెలుగునాట రాజకీయ కార్టూన్ ప్రక్రియ వేనవేల కొమ్మలూ రెమ్మలతో వికసించింది. అయితే, మన కవి-కార్టూనిస్టుల్లో చాలామందికి ఈ ప్రక్రియకు ఆద్యుడయిన వ్యక్తి మనమధ్యనే వున్న విషయం తెలియక పోవడాన్ని మించిన దురదృష్టమేముంది? కొందరికి ఈ విషయం తెలిసినా, తెలియనట్లు గడిపేశారు! కనీసం రాంభట్ల కృష్ణమూర్తి శత జయంతి సందర్భంగా నయినా, ఆయన్నూ, అపూర్వమయిన రాజకీయ కార్టూన్-కవితా ప్రక్రియ ‘శశవిషాణం’నూ తల్చుకోవడం మన కార్టూనిస్టుల, వ్యంగ్య-అధిక్షేప కవుల కనీస కర్తవ్యం!
* * *
(60వ దశకంలో ప్రముఖ కవి ఆరుద్రకు డయాబిటిస్ రావడంతో వైద్యుల సలహా మీద- ఆయన గడ్డం గీయడం మానేశారు. అది జరిగిన కొత్తలో ఆరుద్ర- రాంభట్ల మద్రాసులో కలిశారట. వాళ్లిద్దరూ పాత మిత్రులే! పలకరింపులయ్యాకా, ‘‘ఏమిటీ కొత్త గెటప్పు?’’ అనడిగారట రాంభట్ల. ‘‘నానృషిః కురుతే కావ్యమ్ అన్నారుగా పెద్దలు! అంచేత...’’ అన్నారట ఆరుద్ర గడ్డం దువ్వుకుంటూ. ‘‘నేనూ అందుకే మీసం కూడా తీసేశా!’’ అన్నారట రాంభట్ల. క్వశ్చన్ మార్క్ మొహం పెట్టారట ఆరుద్ర. ‘‘అదే నాన్-రుషిః కురుతే కావ్యం అని కదా పెద్దలన్నది!!’’ అన్నారట రాంభట్ల. మిత్రులిద్దరూ పగలబడి నవ్వుకున్నారట. ఇది ఆరుద్రగారే స్వయంగా నాతో చెప్పిన విషయం!)