మెయన్ ఫీచర్

ఆంధ్రప్రదేశ్‌లో ఆరంభమైన హింసా రాజకీయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

2019లోనే ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగాల్సి వుండగా వివిధ కారణాలతో, ముఖ్యంగా రిజర్వేషన్ల సమస్యతో వాయిదాపడుతూ వచ్చాయి. జగన్‌గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 9 నెలలకు, ముఖ్యమంత్రి చొరవతో, కోర్టు తీర్పుతో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించడం జరిగింది. 4 దశల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. జెడ్‌పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు ఈ నెల 21న, మున్సిపల్ ఎన్నికలు 23న, సర్పంచ్ ఎన్నికలు 27 మరియు 29న జరుగుతాయి.
గ్రామాలలో అత్యంత కీలకమైన జెడ్‌పిటిసి, ఎంపిటిసి ఎన్నికలకు నామినేషన్స్ వేయడానికి ఈ నెల 11న ఆఖరు. మరి నామినేషన్లకు చివరి రోజైన బుధవారం ‘మాచర్ల’లో హింసా కార్యక్రమంతో రాష్ట్రంలో ఎన్నికలు వేడి రాజుకొనింది. విజయవాడ నుంచి మాచర్లకు వెళ్ళిన తెలుగుదేశం నాయకులు బొండా ఉమ, బుద్దావెంకన్న వాహనాలపై వైసీపీ కార్యకర్తలు తీవ్రంగా దాడి చేశారు. కారు ధ్వంసం చేశారు. ఒకరిద్దరికి స్వల్పంగా గాయాలు కూడా అయ్యాయి. సెన్సిటివ్ ఏరియా అనుకొనే పల్నాడులోని మాచర్లలో అందరూ ఊహించినట్లుగానే మొదటిరోజే హింసతో ఎన్నికల నాటకం ఆరంభమయింది. పంచాయతీ ఎన్నికలు సజావుగా సాగే రోజులు ఎప్పుడో పోయాయి. కుల కుంపట్లతో, వర్గాలుగా, మతాలుగా గ్రామాలు ఎన్నడో విడిపోయాయి. ఒకనాడు ఈ వర్గ వైషమ్యాలనేవి స్థానిక సంస్థల ఎన్నికలవరకే వుండేవి. కానీ నేడు పల్లెలు నాడులా స్వచ్ఛంగా, ఆర్గానిక్ కూరగాయల్లో వుండడం లేదు. ఎన్నికల అనంతరం కూడా అవే వర్గాలు అలాగే కొనసాగుతూ చీటికీమాటికీ కాలుదువ్వుకుంటుంటారు. రాజకీయాలు చొరబడ్డాకే పల్లెలు ఇలా తయారయ్యాయి. గాంధీగారు గ్రామప్రగతికి, గ్రామస్వరాజ్యానికి ఎన్నికలు దోహదపడి, స్వయంప్రతిపత్తికి సాధనవౌతాయని కలలుకన్నారు. కానీ రాష్ట్రంలో ఏ మారుమూల గ్రామాలకు వెళ్ళినా పార్టీలపరంగా, కులాల పరంగా గ్రామీణులు విడిపోయి మనకు కన్పిస్తారు. ఇది చాలా దురదృష్టం, దౌర్భాగ్యం. ఈ ఎన్నికల సమయంలో మనుషుల్లో ఆవేశకావేశాలు తప్ప, మంచిచెడుల విచక్షణ అన్నది కానరాము. 3 దశాబ్దాల క్రితం కూడా పల్లెల్లోకి ఎవరైనా క్రొత్తవారు వస్తే ఆ ఊరి గ్రామస్థులు ఆహ్వానించి, మంచినీరు ఇచ్చి ఎవరింటికయ్యా అని ఆప్యాయంగా పలకరించేవారు. కానీ నేడు అదే గ్రామీణులు ఎవరైనా ఊరిలోకొస్తే, మీది ఏ కులం? మీరు ఏ పార్టీవారు? అనే మొదటగా అడుగుతారు. మానవత్వాన్ని ప్రేమించే ప్రతి మనిషి ఆ ప్రశ్నలకు సిగ్గుతో తల దించుకొంటారు. మంచి అన్నదే లేనే లేదీ మనుషుల్లోన అన్న కవుల గీతం నిజం అనిపిస్తుంది. నిశితంగా పరిశీలిస్తే ఈ గ్రామాలకేమైంది? మమకారం, మంచితనం ఏమైనాయి? అన్న ప్రశ్నలు మదిలో కదలాడుతాయి. ఒకప్పుడు చాలామంది పట్టణాభివృద్ధిని తీవ్రంగా వ్యతిరేకించేవారు. పట్టణాలు మనుష్యుల మధ్య అడ్డగోడలు కడతాయని, మనుషుల్లో ఆప్యాయత, అనురాగాల్ని దూరం చేస్తాయని కూడా విమర్శించేవారు. కానీ నేడు పల్లెల పరిస్థితి కూడా అలాగే తగలబడింది. పంట పొలాల్లో సరిహద్దుల్లో ఘర్షణలు, సాగునీటి వాడకంలో కొట్లాటలు చివరికి నరుక్కోవడాల వరకు వెళ్ళిపోయాయి. వీటికి ఇక అంతం లేదు!
ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి రెండు రోజులైనా నిండకముందే పల్నాడు ఘటనతో రాష్ట్రంలో హింస ప్రారంభమయింది. సమస్యాత్మక ప్రాంతాల్లో పల్నాడు కూడా ఒకటి. చరిత్ర పూర్వోత్తర కాలంనుండి ఆ గడ్డ హింసకు నెలవై వుంది. కడప జిల్లా తర్వాత చంపుకోవడాలు, నరుక్కోవడాలు ఈ పల్నాడు గడ్డలోనే జరుగుతాయి. ఇక్కడి మనుషుల్లో బహుశా రోషం, పౌరుషం ఎక్కువ కాబోలు. జనవరి 7వ తారీఖు, అప్పటికింకా ఎన్నికలు ప్రకటించకపోయినా పినె్నల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల ఎమ్మెల్యేగారిని విజయవాడ వెళ్తుంటే, పెదకాకాని దగ్గర రాజధాని రైతుల పేరున తెలుగుదేశం నాయకులు ఆపి, ఆయనపై దాడి చేసి, ఆయన కారును ధ్వంసం చేశారు. ఆ ఘటనలో ఆయన గన్‌మెన్ కూడా గాయపడ్డాడు. అందుకు ప్రతిగానో ఏమో 11వ తేదీన బొండ ఉమ, బుద్దావెంకన్న కార్లపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసి, కారును ధ్వంసం చేశారు. ఆనాటి సీనే ఇక్కడ రివర్స్‌లో రిపీట్ అయింది. కాకుంటే ఇప్పుడు ఎన్నికలు రావడంవల్ల తెలుగుదేశం పార్టీకి ఈ సమస్యను ఆర్భాటం చేయడానికి ఎక్కువ అవకాశం లభించింది. ఆనాడు పినె్నల్లి అధికార పార్టీకి చెందినవాడు కావడం, తామే అధికారంలో వుండగా శాంతి భద్రతలు లేవని చెప్పడం అంత బాగుండదనో ఏమో వైసీపీ వాళ్ళు ఆ సంఘటనను ఎక్కువచేసి చూపించుకోలేకపోయారు. నాడైనా, నేడైనా ఇలాంటి దాడులు ఎవరుచేసినా తప్పే. చిన్ని సంఘటన అయినా భూతద్దంలో చూపించే నేర్పు, నైపుణ్యం తెలుగుదేశం పార్టీకి వెన్నతోపెట్టిన విద్యే. సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై వున్నా అది వాళ్ళు చేయలేకపోయారు. కాకుంటే సంఘటన జరిగిన వెంటనే డీజీపీగారు స్పందించి డీఐజీగారితో విచారణ చేయించడం, వెంటవెంటనే ఆ కారు ధ్వంసంచేసిన ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్‌చేయడం కూడా జరిగిపోయింది. పోలీసులు చాలా చురుగ్గా పనిచేశారు అని చెప్పవచ్చు. కాకుంటే తెలుగుదేశం నాయకులు విజయవాడనుండి మాచర్లకెందుకెళ్ళారో కూడా తేల్చాల్సి వుంది. ఆ రాత్రి ప్రెస్‌మీట్లలో బొండా ఉమ మాట్లాడిన తీరు మరింత రెచ్చగొట్టేలా వుండడం చాలా దురదృష్టం. చంద్రబాబు కూడా సంయమనం కోల్పోయి మాట్లాడడం మాటిమాటికి పులివెందుల, బీహార్ గూర్చి మాట్లాడడం కరెక్టు కాదు. ఇరుపక్షాల నాయకులు కూడా ఓర్పుతో, నిగ్రహంతో వుండడం చాలా అవసరం. రెచ్చగొడితే జరిగేది ‘హింస’ వొక్కటే. అది తప్పు. తప్పు ఎవరు చేసినా, చెడ్డపేరు వచ్చేది అధికారంలోని వైఎస్‌ఆర్‌సీపీదే అవుతుంది. తాము మాత్రం ఎట్టి పరిస్థితుల్లోను హింసకు, దౌర్జన్యాలకు పాల్పడరాదు.
మరి రాష్ట్రంలో ఎన్నికల సమరం ఆరంభమైంది. వైఎస్‌ఆర్‌సిపి మాత్రం ఎవరితోను పొత్తుకు ప్రయత్నించకుండా స్వంతంగానే అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది. ఇక మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో లోపాయికారిగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీతో సర్దుబాట్లు చేసుకొని ఎన్నికల్లో దిగింది. జనసేన మాత్రం అధికారికంగా సీపీఐ పార్టీతో పొత్తు పెట్టుకొంది. కాంగ్రెస్ పార్టీ కూడా వొంటరిగానే తలపడింది. మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈసారి తెలుగుదేశం పార్టీ, సీపీఐ పార్టీలు కలసి సీట్లు సర్దుబాట్లు చేసుకొన్నారు. ఇక జనసేన, బీజేపీ పార్టీలు కలసి రంగంలో దిగాయి. ఉమ్మడి ఎన్నికల ప్రణాళికను కూడా విడుదల చేశారు. మరి కాంగ్రెస్, సీపీఎం పార్టీలు కూడా ఎవరితోను సర్దుబాట్లు చేసుకోకుండా ఒంటరిగానే పోటీ చేస్తున్నాయి.
ఇక 660 జెడ్‌పీటీసీ, 10,047 ఎంపీటీసీ, 110 మున్సిపాలిటీలకు, 12 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. జెడ్‌పీటీసీ, ఎంపీటీసీలకు ఈనెల 21వ తారీఖున, మున్సిపాలిటీలకు 23న, 21,843 పంచాయతీలకు 27, 29న ఎన్నికలు జరగనున్నాయి.
2014లో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు దాదాపు అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగాయి. అప్పట్లో కూడా చాలా హింసాత్మక ఘటనలు జరిగాయి. అప్పుడెక్కువగా వైసీపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీపైనే ఎక్కువ ఆరోపణలు చేశారు. మరి ఆనాడు వైఎస్‌ఆర్‌సిపి 275 జడ్‌పిటిసి స్థానాల్లో, తెలుగుదేశం 373 జెడ్‌పీటీసీ స్థానాలు గెలచుకొన్నాయి. ఇక ఎంపీటీసీ స్థానాలకొస్తే టీడీపీ 5208 స్థానాలు, వైసీపీ 4207 స్థానాలు నెగ్గాయి. ఆ తర్వాత కొద్దికాలానికే అసెంబ్లీ ఎన్నికలు జరిగి తెలుగుదేశం అధికారం చేపట్టడం అందరికీ తెలిసిందే.
ఈసారి ఎన్నికల్లో మాత్రం అనేక మార్పులు చోటుచేసుకొన్నాయి. జగన్ ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా పంచాయత్‌రాజ్ చట్టానికి కొన్ని సవరణలు తీసుకొచ్చింది. ఈ చట్టం అందరికీ ప్రయోజనకరంగా వున్నాయి. డబ్బులు, మద్యం ఎరచూపి ఎన్నికల్లో నెగ్గితే, నేర నిరూపణ అయితే 3 సం.ల జైలుశిక్ష, ఫైన్ వేయడం కూడా జరుగుతుంది. మరో మంచి అవకాశం కూడా జగన్ సర్కారు ఈసారి ఓటర్లకు కల్పించింది. ప్రభుత్వం కొత్తగా ‘నిఘా’ అనే యాప్‌ను తయారుచేసింది. ఎవరు ఎలాంటి అక్రమాలకు పాల్పడినా అవినీతి చేసినా ఆ దృశ్యాలను ఏ పౌరుడైనా వీడియో తీసి ఈ యాప్‌కు పంపవచ్చు. తదనుగుణంగా పోలీసులు, ఎన్నికల కమిషన్ చర్యలుతీసుకొనే అవకాశం వుంటుంది. ఎన్నికలపై ప్రజలందరి ‘నిఘా’వుండడం ప్రజాస్వామ్యానికి చాలా లాభదాయకం. మరి మన ఓటర్లు ఎంతవరకు దీనిని సద్వినియోగం చేసుకొంటారో చూద్దాం. ఈనెల 24, 27, 29న అన్ని స్థానిక సంస్థల ఎన్నికలకు కౌంటింగ్ జరుగుతుంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లు చాలా జాగరూకతగా వుండాల్సిన అవసరం చాలా ఎక్కువ. వాస్తవంగా చూస్తే ప్రజలకు చాలాదగ్గరగా అందుబాటులో వుండే వ్యక్తులే ఈ జెడ్‌పీటీసీ, ఎంపీటీసీ, కార్పొరేటర్స్, సర్పంచ్‌లు. స్థానిక సమస్యలపై ప్రజలెక్కువగా ఆధారపడేది వీరిపైనే. అందుకే ప్రతి ఒక్క ఓటరూ ఓటువేసే ముందు, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా, స్వంత నిర్ణయంతో అభ్యర్థుల గుణగణాల్ని క్షుణ్ణంగా తెలుసుకొని, మంచివారినే ఎన్నుకోవాల్సిన అవసరం వుంది. గ్రామాల్లో అయితే గ్రామీణులకు అనేక సమస్యలు తలెత్తుతుంటాయి. పరిష్కారానికి గాను ఎక్కువగా సర్పంచ్‌లపై ఆధారపడుతుంటారు. ఇలాంటి కీలక స్థానంలో వున్న అభ్యర్థులు నిగర్విగా, సేవాతత్పరతతో వుండాల్సి వుంది. ఎన్నికలప్పుడు ఓటర్లకు తాయిలాలు పడేసి, మద్యం పంపిణీచేసి నెగ్గాలనుకొనే వ్యక్తులకు వోటువేయకుండా బుద్ధిచెప్పాలి. తమ మంచి చెడ్డలు, తమ బాగోగులు నిర్ణయించుకొనే మహత్తర అవకాశ సమయంలో ఓటర్లు తమ బాధ్యతను విస్మరించి, అసమర్థులను అందలం ఎక్కిస్తే తర్వాత 5 సం.లు బాధపడాల్సి వుంటుంది. రంగురంగుల్లో మురిపించే మేనిఫెస్టోలు విడుదలచేసే పార్టీలను చూసి కాకుండా, వ్యక్తిగత గుణగణాలపై అభ్యర్థులకు ఓటువేయాల్సి వుంటుంది. స్థానిక సంస్థలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులిస్తాయి. అదేవిధంగా స్థానిక టాక్స్ కలెక్షన్స్ ద్వారా కూడా నిధులు చేకూరుతాయి. ఆర్థిక పరిపుష్ఠతకే గ్రామాలకు ఎక్కువ నిధులు ఈయడం జరుగుతుంది. సేవా తత్పరతతో, ప్రజాభిమానం చూరగొనేందుకు అభ్యర్థులకు ఇది చాలా మంచి అవకాశం. అందరూ ఆలోచించాలి.
పట్టణాల సంఖ్య, పట్టణాభివృద్ధి పెరిగేకొద్దీ, గ్రామాలనుండి పట్టణాలకు వలసలు కూడా ఎక్కువవుతున్నాయి. నగరాల్లో జన సాంధ్రత పెరిగిపోతుండడంతో, అలా వచ్చిన అనేకమంది గ్రామీణులు చాలా ఇబ్బందులకు గురిఅవుతున్నారు. కొంతమంది బ్రతుకుదెరువుకోసం, మరికొంతమంది పిల్లల చదువుల కోసం పట్టణానికి వలసవెళ్తున్నారు. ఏది ఏమైనా పెరిగిపోయిన జనాభాతో పట్టణాలకెళ్ళి ఇబ్బందులు పడేకన్నా గ్రామాల్లోనే హాయిగా, స్వతంత్య్రంగా బ్రతకడం మంచిది.
మంచి అభ్యర్థుల్ని ఎన్నుకోవడంపై ప్రజలకెంత బాధ్యత వుంటుందో, అంతకన్నా పెద్ద బాధ్యత రాజకీయ పార్టీలపై, వాళ్ళు ఎంపికచేసిన అభ్యర్థులపై ఆధారపడి వుంటుంది. కనుక అన్ని పార్టీలు కూడా ‘గెలుపే’ లక్ష్యంగాకాక కాస్తా మంచి గుణాలు, సేవాతత్పరత ఉన్నవారిని తమ అభ్యర్థులుగా నిలబెట్టాలి.
11వ తారీఖున నామినేషన్ల ఆఖరురోజున ఒక్క మాచర్లలోనే కదా ఇంకా చాలా ప్రాంతాల్లో కూడా కొన్ని హింసాత్మక ఘటనలు జరగడం చాలా శోచనీయం. ఎన్నికల్లో పోటీచేసే హక్కు ప్రతి పౌరుడికీ వుంటుంది. కొన్నిచోట్ల బిజెపి పార్టీ అభ్యర్థుల్ని నామినేషన్స్ వేయకుండా అధికార పార్టీవారు అడ్డుకొన్న సంఘటనలు కూడా అనేకం వెలుగుచూశాయి. ఇవి ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. పౌరుల హక్కులు కాలరాసే అధికారం ఏ ఒక్కరికీ లేవు. అలా జరిగితే అది నియంత పాలనే అవుతుంది గానీ ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ఏ పార్టీ కూడా ఇలాంటి దుశ్చర్యలకు, దురాగతాలకు పాల్పడకూడదు. పార్టీలు హుందాగాను, పోలీసులు అప్రమత్తంగాను వ్యవహరించాల్సి వుంది. ఎన్నికలు సజావుగా సాగేందుకు ఎన్నికల కమిషన్, పోలీసులు, రాజకీయ పార్టీలు సమిష్ఠిగా సహకరించాలి. భారతదేశానికి పట్టుగొమ్మలు మన పల్లెటూళ్ళు. అవి సమగ్రంగా అభివృద్ధిజరిగిననాడే భారతదేశమూ అభివృద్ధి చెందుతుంది.
పోటీచేస్తున్న వైసీపీ గాని, తెలుగుదేశం కానీ, బీజేపీ జనసేన గాని, కాంగ్రెస్ పార్టీ గాని హింసాత్మక ప్రణాళికలకు ‘స్వస్తి’ పలకాలి. ప్రతి పార్టీ నాయకుడూ తమతమ కార్యకర్తల్ని అదుపులో పెట్టుకోవాలి. ఎన్నికలు పూర్తిగా ముగిసేవరకు కార్యకర్తలపై ఆ కట్టడి అలాగే కొనసాగించాలి. అసత్య ఆరోపణలకు కూడా అన్ని పార్టీలు స్వస్తి పలకాలి. ఎన్నికలు హుందాగా జరగనీయండి. హింస ఎవరుచేసినా ఆ పార్టీని ప్రజలు వెలివేస్తారు. ఇది ఎవరూ విస్మరించరాదు. 2.82 కోట్ల ఓటర్లు ఈ ఎన్నికల్లో తమ వోటుహక్కును వినియోగించుకొంటున్నారు కనుక అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు జరిగినా, పార్టీ పెద్దలు వాళ్ళకు సర్దుబాటు చేయాలి.
ఎలక్షన్ కమిషన్ రాష్ట్రంలోని 11,251 ప్రాంతాల్ని, గ్రామాల్ని సమస్యాత్మకంగా గుర్తించడం జరిగింది. పార్టీలు, ప్రజలు, పోలీసులు అప్రమత్తంగా వుండి ఏ ఒక్క చిన్న సంఘటన కూడా జరక్కుండా చూడాల్సిన బాధ్యత వుంది. పత్రికలు, టీవిలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి వుంది. అప్పుడే ఈ ఎన్నికలు సజావుగా సాగే అవకాశం వుంది. ఎన్నికలు పూర్తి అయ్యేవరకు మద్యం దుకాణాలన్నీ కూడా బంద్ చేస్తామని పాలక వర్గపు మంత్రి ప్రకటించడం చాలా శుభపరిణామం. ఇలాంటి నిర్ణయం ఇంతవరకు ఏ రాష్ట్రం కూడా అమలుజరిపిన దాఖలాలు లేవు. ఎన్నికల్లో ఏ పార్టీ నెగ్గినా, ప్రశాంతంగా జరిగితే మాత్రం జగన్ పాలనకే మంచి పేరొస్తుంది. ప్రజావ్యతిరేక విధానాలపై తెలుగుదేశం, తాము అమలుచేసిన నవరత్నాలపై వైసిపి పార్టీలు రంగంలో దిగుతున్నాయి. రాష్టమ్రంతటా అప్పుడే ఎండలూ పెరిగిపోతున్నాయి. అందుకు తగ్గట్టు ఎన్నికల వేడి కూడా జత కలుస్తూ మరింత అగ్నిగుండంలా రాష్ట్రం మారిపోయింది. ఎలాంటి దుస్సంఘటనలు జరగకూడదని మనందరం ఆశిద్దాం!

- సమ్మెట, 9390745775