మెయిన్ ఫీచర్

ముక్తి నొసంగే ముత్తారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముత్తారం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం ముత్తారం గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం వుంది. మా పూర్వీకులైన కృష్ణరాయలగారి కోరిక తీర్చేందుకు, శ్రీ రామచంద్రుడు, భద్రాచలంలో వున్నట్లు మా గ్రామంలో కూడా వెలిసి, ముక్తివరం- ముత్తవరం- ముత్తారం రామాలయంగా దాన్ని ప్రఖ్యాతి గావించాడని ఈ ప్రాంతం వారి నమ్మకం. దీనికి తగిన ఆధారాలు తెనాలి దగ్గరున్న అంగలకుదురు గ్రామంలోని శ్రీ కోదండరామ సేవక ధర్మ సమాజం వారు ప్రచురించే ‘్భక్తిసంజీవని’ అనే ఆధ్యాత్మిక మాసపత్రికలో దొరికాయి. ఇటీవలే గ్రామస్తులంతా కలిసి జీర్ణావస్థలో వున్న ముత్తారం రామాలయాన్ని పునర్నిర్మించి, ఆ ప్రాంతంలో పెద్ద దేవాలయంగా చేసారు.
వామాంక సీతా సమేత లక్ష్మణ విగ్రహాలతో కూడాన భద్రాచలం రామాలయం భద్రాద్రి- కొత్తగూడెం జిల్లాలోకి పోయిన తరువాత, అదే తరహా ఆలయమైన ముత్తారం దేవాలయం భవిష్యత్‌లో మరింత జనాదరణ పొందేదిగా కాబోతున్నదని మేమంతా అనుకుంటున్నాం.
ముత్తారం రెవెన్యూ గ్రామానికి మరో రెండు శివారు వూళ్లున్నాయి. ఒకదాని పేరు ‘‘కోదండరామపురం’’.ఇది చాలా చిన్న వూరనాలి. మరో శివారు గ్రామం వనం వారి కృష్ణాపురం.
వనం కృష్ణరాయలుగారు దాన్ని నిర్మించినందున దానికాపేరొచ్చింది. ఒక్కసారి, 400 ఏళ్ల చరిత్ర వెనక్కువెళితే... 16వ శతాబ్దంలో మహారాష్ట్ర సరిహద్దులనుంచి వనం కృష్ణరాయలు తండ్రి ఇక్కడికి వలస వచ్చారని, ఆయనతోపాటు కమ్మరి, కుమ్మరి తదితర చేతి వృత్తులు చేసుకొనేవారు కూడా ఇక్కడికి వచ్చారని, అప్పట్లో ఇక్కడ పరిపాలకులైన రెడ్డిరాజులకు ఆయన సహాదారునిగా ఉండేవారని, కాలక్రమేణా రెడ్డిరాజులు పాలన ముగిసి నైజాం పాలనలోకి ఈ ప్రాంతం వచ్చిన దరిమిలా ఈ సంస్థానాన్ని ఆనుకొని పాలిస్తున్న రాజులు సమీపం8లోని నేలకొండపల్లివైపు నుంచి నిజాం సంస్థానానికి చొచ్చుకొని వస్తుండేవారని, దాన్ని అడ్డుకునేందుకు నిజాం రాజు కృష్ణరాయుల సహకారం తీసుకున్నారని, బదులుగా కొన్ని గ్రామాలు జాగీరుగా ఇచ్చారని ఒక కథ ప్రచారంలో వుందిక్కడ.
కృష్ణరాయలుగారు అచంచలమైన శ్రీ సీతారామ భక్తుడు. ప్రతి ఏటా భద్రాచలంలో జరిగే శ్రీరామనవమి ఉత్సవాలకు విధిగా హాజరయ్యేవాడట. అపర రామభక్తుడైన కష్ణరాయలు గోటితో స్వయంగా ఒడ్లను ఒలిచి మూటకట్టి నెత్తినపెట్టుకొని శ్రీరామనవమికి భద్రాచలం వెళ్లేవారట. ఆయనకు వృద్ధాప్యం వచ్చేవరకు ఈ సాంప్రదాయం కొనసాగింది. కృష్ణరాయలుగారు కాలం గడుస్తున్నాకొద్దీ, వయసుమీరుతుండడంతో, వెళ్ళి రావడానికి ఇబ్బందిపడుతుండేవాడు. అప్పట్లో ఆయన గుర్రంమీద వెళ్లొచ్చేవాడు. చివరకో సంవత్సరం గోదావరి నది దాకా వచ్చి, ఇకముందుకు వెళ్లలేక, అలసిపోయి అక్కడే పడిపోయాడు. భద్రాచలంలో రాముడి కల్యాణానికి వేళవుతుండడంతో, ఉత్సవ విగ్రహాలను కల్యాణ మంటపానికి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్వాహకులు. అయితే ఉత్సవ విగ్రహాల నుంచిన వాహనం లేపడం సాధ్యపడడం లేదు. ఎంతో బరువనిపించింది. చివరకు ఏం చెయ్యాలో పాలుపోని నిర్వాహకులకు, అశరీర వాణి అసలు విషయం బయటపెట్టింది. తన భక్తుడు గోదావరిలో అలసటతో పడిపోయాడని, అతడిని తోడ్కొని రమ్మని దాని సారాంశం. నిర్వాహకులు అలాగే చేసి కృష్ణరాయలుగారిని తీసుకొచ్చారు. ఆయన వస్తూనే తన చేయి వాహనం మీద వేయడంతో అది తేలికగా వాహకులకు మోసేందుకు అనువుగా మారింది. కృష్ణరాయలెంత భక్తుడో అందరికీ అర్థమయిందప్పుడు.
కల్యాణోత్సవం అయిపోగానే, ఎప్పటిలాగే తిరుగు ప్రయాణమయ్యారు కృష్ణరాయలుగారు. కొంచెం దూరం వెళ్లింతర్వాత ఆయనకు తన ముందు ఒక రథం పోతూ కనిపించింది. దాన్ని చేరుకుందామని ఆయన చేసిన ప్రయత్నమంతా వృధా అయింది. తనముందు రథం- దాని వెనుక ఈయన గుర్రం వూరి పొలిమేరవరకు చేరుకున్నారు. ముత్తారం సమీపంలోకి చేరుతూనే కృష్ణరాయలుగారు చూస్తుండగానే ముందున్న రథం అదృశ్యమైపోయింది. మర్నాడు ఉదయం జరిగిన విషయాన్నంతా గ్రామస్థులకు వివరించి, రథం అదృశ్యమైన ప్రదేశానికి సమీపంలో అన్నివైపుల ఏదన్నా వుంటుందేమోనన్న ఆశతో గాలించారు. ఆశ్చర్యంగా కొంత దూరంలో, భద్రాచలంలోని రామాలయంలో వున్న సీతారామ లక్ష్మణ విగ్రహాల లాంటి విగ్రహాలే కనిపించాయి వారికి. వామాంకం మీద సీత కూర్చున్న రీతిలో, భద్రాచల రాముడి విగ్రహాలు దొరకడంతో ఏం చెయ్యాలన్నది ఆలోచించసాగారు.
ఆ రాత్రి కష్ణరాయలుగారి కలలో కనిపించిన శ్రీరామచంద్రమూర్తి, ఆయనకు వయసు మీరడంవల్ల భద్రాచలం రావడం కష్టమవుతుందని భావించిన తానే ఆయన దగ్గరకొస్తున్నానని, ముత్తారంలో తనకు గుడి కట్టించి యథావిధిగా పూజలు జరిపించమని చెప్పాడు. శ్రీరాముడి విగ్రహాలు ఊరిలోనే లభించడంతో స్వామివారే అనుగ్రహించారని తలచి ఆలయ నిర్మాణం చేశారని చెపుతుండేవారు. ఆయన ఆదేశానుసారం కృష్ణరాయలుగారు ముత్తారం రామాలయాన్నీ, పక్కనే శివారు గ్రామమైన వనం వారి కృష్ణాపురాన్నీ నిర్మించారు. కృష్ణరాయలుగారు నిజమైన భక్తుడైనందునే రాముడు ఆయనున్న చోటికి పోయాడు.
భద్రాచలం రామాలయం కట్టిన కొన్నాళ్లకు ముత్తారం రామాలయం కూడా కట్టబడింది. అయితే మూడు నాలుగువందల సంవత్సరాల క్రితపు కట్టడమై నందువల్ల శిథిలావస్థకు చేరుకుంది. గర్భగుడిలోకి వర్షపు నీరు కూడా వచ్చే స్థితి కలగడంతో గ్రామస్థులంతా ఆలయాన్ని పునర్నిర్మించేందుకు నడుం కట్టారు. ఈతరం రామభక్తుడు, వనం గోపాలరావు ఆలయ పునరుద్ధరణకు అంకితమైన వారిలో ముఖ్యుడు. అయితే ఆలయ నిర్మాణం కేవలం మానవ సంకల్పమే అయితే ముందుకు సాగకపోవచ్చు గాని, దైవ సంకల్పం అయితే దాన్ని ఆపేవారుండరనేది అనుభవ పూర్వకంగా జరిగింది ముత్తారం దేవాలయం విషయంలో. పూర్వీకులు కట్టించిన ప్రాచీన దేవాలయ పునర్నిర్మాణానికి, పరోక్షంగా నాతో సహా వూళ్లో చాలామందిలో చొరబడి, వారి వంతు సేవచేసే అవకాశమిచ్చాడు భగవంతుడు. నా స్వగ్రామం ఆ వూరే. మా నాన్న వనం శ్రీనివాసరావుగారు పదేళ్ల క్రితం చనిపోవడానికి మూడు రోజుల ముందర మా కుటుంబానికి సంబంధించిన కొన్ని విషయాలు చెప్పారు. మా నాన్న చెప్పిన ముఖ్యమైన అంశాలలో రామాలయ ప్రస్తావన కూడా వుంది.
ప్రతి ఏటా రామాలయంలో గోదాదేవి కల్యాణం జరిపించడం మన కుటుంబం చేయాల్సిన పనుల్లో ఒకటని, అది నేను కొనసాగించాలనీ, అది సక్రమంగా జరగాలంటే దేవాలయంలో శ్రీకృష్ణ భగవానుడి విగ్రహం (త్సవ) ప్రతిష్టించాలనీ నాపై ఒక బాధ్యతపెట్టారు నాన్నగారు. అయితే వివిధ కారణాలవల్ల ఆయన అప్పగించిన పని చాలాకాలం వరకు నెరవేర్చలేకపోయాను.
2006 సంవత్సరం చివర్లో ముత్తారం దేవాలయంలో కృష్ణుడి ఉత్సవ విగ్రహం ప్రతిష్టించే ఆలోచన కార్యరూపం దాల్చడం మొదలైంది. మా వూళ్లో నా చిన్ననాటి స్నేహితుడు ఏటుకూరి నారాయణ ఇంకొందరం కలిసి కృష్ణవిగ్రహానికి రూపకల్పన చేద్దామని ప్రయత్నించాం. వారందరి సహాయంతో విజయవాడ సమీపంలో విగ్రహాన్ని తయారుచేయించి, 2007లో ప్రతిష్టకు సన్నాహాలు చేశాం. ముత్తారం దేవాలయంలో పనిచేస్తున్న అర్చకుడు వాసు (శ్రీనివాసరావు) మహా పండితుడు. వేదాధ్యయనం చేసినవాడు. ఆయన ఆధ్వర్యంలో మూడు రోజులపాటు అంగరంగ వైభోగంగా ముత్తారం దేవాలయంలో కృష్ణుడి ఉత్సవ విగ్రహ ప్రతిష్ట విజయవంతంగా జరిగింది.
అందరి సహాయ సహకారాలతో 2009 ఫిబ్రవరి నెలవరకల్లా ఆలయ నిర్మాణం పూర్తయింది. భద్రాచలంలో వలెనే ప్రతి సంవత్సరం శ్రీరామనవమి నాడు, ముత్తారంలో కూడా కళ్యాణోత్సవం అశేష జనవాహిని మధ్య జరుగుతుంది. చుట్టుపక్కల గ్రామాల నుండి వేలాది భక్తులు ఆ వేడుకను చూసేందుకు తరలి వస్తారక్కడికి.
భద్రాచలంలో మధ్యాహ్నం జరిగే కళ్యాణోత్సవం, ముత్తారంలో సాయంత్రం జరుగుతుంది. వామాంక సీతాసమేత లక్ష్మణ విగ్రహాలతో కూడిన ఈ ఆలయంలో శ్రీరామనవమిని సాయంత్రం 6 గంటల తర్వాత నిర్వహించడం నాలుగు శతాబ్దాలుగా ఆనవాయితీగా వస్తోంది. అప్పటి ముక్తవరపురమే ఇప్పటి ముత్తారంగా మార్పుచెందింది. వనం కృష్ణరాయుల ముగ్గురి కుమారులు, వారి సంతానం ద్వారా ఏర్పాటుఅయిన గ్రామమే వనంవారి కృష్ణపురంగా పిలువబడుతోంది. గోదాదేవి కళ్యాణం భోగి రోజున జరుగుతుంది.

- వనం జ్వాలా నరసింహారావు