మెయిన్ ఫీచర్

చింతలు బాపే సింహాచలేశ్వరుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భ గవంతుడు నిరాకారుడు. కాని భక్తులకోసం సగుణరూపంలో వ్యక్తం అవుతుంటాడు. భగవంతుడు నిస్సంగుడు. కాని భక్తులకు తత్వం బోధపడడానికి సంగత్వాన్ని కల్పించుకుంటాడు. సర్వం తానే అయనా తనకేమీ పట్టనట్టు ఉంటూ అన్నీ తనవే నన్న భ్రమ కల్పించి భక్తులను పరీక్షిస్తుంటాడు. మళ్లీ ఆ భగవంతుడే తన భక్తుల కన్నీళ్లకు కష్టాలకు కరిగిపోయ తనను తాను భక్తుడు కోరుకున్న విధంగా వ్యక్తం అయ వారిని అక్కున చేర్చుకుంటాడు. ఇదీ అంతా భగవంతుని చిద్విలాసమని పెద్దలు అంటారు. ఆ సర్వభూత ప్రియుడైన సర్వేశ్వరు డు విశాఖపట్నంకు 15 కిలోమీటర్ల దూరంలో సింహగిరిపై 800 అడుగుల ఎత్తున సంపెంగలు, పొన్నలు, జాజాలు, విరజాజులు, జీడి, మామిడి, పనస, అనాస తదితర పుష్ప, ఫలవృక్ష శీతలచ్ఛాయల్లో, విశాల ప్రశాంత వాతావరణంలో లక్ష్మీ నరసింహుడై వెలసాడు.
ఆనందపరవశతంతో భక్తులు అపురూప శిల్పకళావైదుష్యంతో సుగంధ పరిమళ భరిత చందనాచ్ఛ్ధాతుడై వ్యక్తం అవుతున్న స్వామికి ఆస్థాన, భోగ, నవరత్న మంటపాలు, ప్రహ్లాద మండపం, సాలిగ్రామ పీఠం అంటూ ఎన్నింటినో ఏర్పరిచారు. ఈ స్వామిని శ్రీ వరహా లక్ష్మీ నృసింహస్వామిగా భక్తులు సేవిస్తుం టారు.
సింహాచలం, కృతశౌచం, అహోబలం అనేవి నారసింహుని దివ్యక్షేత్రాలే. కాని, హరి నామస్మరణా నిమగ్నులను ఎలా కాపాడతానన్న విషయాన్ని తెలపడానికే మహా విష్ణువు నరసింహుడై స్తంభంనుంచి ఆవిర్భ వించాడు. ఆ నరసింహుడే వరాహ నారసింహుడై సింహాచలాన నెలకొన్నాడు.
ఇక్కడి స్థలపురాణం ప్రకారం హిరణ్యకశ్యపుడు ఓసారి ప్రహ్లాదుని శిక్షించడంలో భాగంగా ఈ సింహాచలక్షేత్రంలో ప్రహ్లాదకుమారుని పడవే శాడట. ఆపైన ఆ పరమభక్తునిపై ఓ పర్వతా న్ని తోసివేశారట. కాని ఆ పర్వతమే తానై పూవు మీద పడినట్లు అతి మెత్తగా ప్రహ్లాదుని పై పడేటట్టుగా చేయడానికి ఆ లీలామానసచోరుడు భక్తవరదుడ యన మహావిష్ణువు పర్వతంగా నిలచాడట. ఇప్పటికీ ఈ పర్వతాన్ని ఆమూలాగ్రం చూస్తే ఈ పర్వతం సింహరూపంలో కనిపిస్తుందనేది స్థల పురాణ వాక్కు.
హిరణ్యకశ్యపుని సంహారానంతరం భక్తప్రహ్లాదు డు శ్రీహరినివరాహఅవతారంతో కలసిన నరసింహు నిగా తనకు గోచరమవ్వమని ప్రార్థించాడట. దాంతో భక్తుని కోరికను నెరవేర్చేపనిలో మహావిష్ణువు శ్రీవరాహ నారసింహు నిగా ఏతెంచాడు. సర్వులను బ్రోచే తల్లి జగజ్జనని యైన లక్ష్మీ మాత కూడా స్వామి చెంత చేరి స్వామిని శ్రీవరాహ లక్ష్మీ నారసింహుని చేసింది. అందుకే ఈ సింహాచల క్షేత్రంలో రెండురూపాలకు ప్రసిద్ధి.
ఈ సింహాచలేశ్వరుని మొట్టమొదట కోరి వెలయంపచేసిన ప్రహ్లాదుడు కొలిచేవాడని పురాణాలు చెబుతున్నాయ. ఆ తరువాత పూజాదికాలకు ఆటంకాలు కలిగాయట. మళ్లీ కొన్నాళ్ల తరువాత పూరూరవ చక్రవర్తి ఊర్వశితో విహరిస్తూ ఈ కొండ భాగానికి రాగా ఇక్కడనుంచి విమానం ముందుకు కదలలేదుట. దీనికి కారణమేమిటా అని పూరూరవుడు ఊర్వశి తెలుసుకోవడానికి ప్రయత్నించి విఫలురయ్యారట. పూరూరవ చక్రవర్తి చింతనామనస్కుడై తిరిగి తన నిజవాసానికి వెళ్లి అఖిలభువనాలకు ప్రభువైన మహావిష్ణువును ప్రార్థించాడట. దుష్టదుర్మార్గాలకు అతి భయకరరూపుడైన లక్ష్మీ నారసింహునికి తన బాధను ఎరుకపర్చాడట. భక్తుల కల్పతరువైన లక్ష్మీనారసింహుడు పూరూరవుని కలలో కనిపించి తాను ఫలాన చోట ఉన్నానని తనకోసం ఆలయ నిర్మాణం చేయుమని, తనకు ధూప దీపనైవేద్యాలు సమర్పించమని ఆనతి నిచ్చాడట. అంతేకాక స్వామిదర్శనమయనవేళ ఆ పుట్టమట్టికి సరిపడా చందానాన్ని తనకు అలదమని కోరాడట ఆ స్వామి. అందుకే ప్రతివైశాఖ శుక్ల తదియ నాడు భక్తుల కొరకు స్వామి నిజరూప దర్శనం ఆ తరువాత పుట్టమన్ను స్థానంలో సుగంథ భరితమైన చందనం తో స్వామిని అలంకరిస్తాడట. అప్పటి నుంచి ఈ చందన మహోత్సవం జరుగతూనే ఉంది.
వైశాఖ శుద్ధతదియరోజునే చందనోత్సవం అని స్వామికి అతిగొప్ప సేవ నిర్వహించి భక్తులు తరిస్తారు. నిజరూప దర్శనం రోజు దగ్గరనున్న గంగాధార నుంచి జలాన్ని తీసుకొని వచ్చి స్వామికి అభిషేకం చేస్తారు. ఈ నిజరూపదర్శనానికి చంద నోత్సవం రోజున భక్తులు కిట కిటలాడ్తారు.
చందనోత్సవం, నిజరూప దర్శన వేడుకల్లోని ప్రత్యేక సేవలే కాకుండా స్వామికి నిత్సోత్సవ సేవలు ప్రముఖంగా జరుపుతారు. ముఖ్యమైన పండుగలరోజుల్లో స్వామికి విశేష ఉత్సవాలు జరుపు తారు. భక్తులైన ఆళ్వారుల పనె్నండు మందికి కూడా ఇక్కడ జన్మ దిన వేడుకలను నిర్వహిస్తారు. లక్ష్మీ నరసింహులకు నిత్య కల్యాణోత్సవాలు కూడా జరుగు తాయ.
స్వామిని దర్శించడానికి వచ్చే భక్తులకు సింహాచలేశ్వరునితో పాటుగా అండాళ్ సన్నిధి, చతుర్ భుజతాయార్ సన్నిధి, లక్ష్మీనారాయణస్వామి సన్నిధి సీతారామస్వామి సన్నిధి, త్రిపురాంతకస్వామిసన్నిధి, ఆంజనేయస్వామి సన్నిధి, వేంకటేశ్వరుని సన్నిధి ఇంకా కప్పస్తంభం, రాతిరథం ఇలాంటి వెన్నింటినో దర్శించ వచ్చు.
సింహాచలేశ్వరుని దర్శించుకున్న వారికి ఇహలోక సంపదలతోపాటుగా పరలోకంలో వైకుంఠుని ఆవాసం దొరుకుతుందని అంటారు.
స్వామికి తమ తమ కోరికలు తీర్చమని వేడు కుంటూ ఎన్నో ముడుపులు కడ్తుంటారు. ఈ సింహాచలేశ్వరుని కోడెదూడలు మక్కువని కోరిక తీరిన వారు కోడెదూడలను సమర్పిస్తుంటారు. సింహాచలందర్శనం చేసుకొన్నవారికి ఈలోకంలో కాని, పరలోకంగాని చింతలు ఉండవంటారు.

- హనుమాయమ్మ