మెయిన్ ఫీచర్

వేదమూర్తి కుమారిల భట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైమినీ మహర్షి పూర్వమీమాస ప్రవర్తకుడు, కుమారుల భట్టు ఈయనకు ప్రథమ శిష్యుడు. ఈయన కుమారస్వామి అంశతో జన్మించి ప్రసిద్ధిగాంచాడు. కుమారుల భట్టు వేదకర్మ మార్గాన్ని పునరుద్ధరించాలని, గట్టిగా కృషిచేసిన కర్మిష్టి. ఇతడు సాక్షాత్తు మతాన్ని ఉద్ధరించడానికి అరుదెంచిన కుమారస్వామి అవతారం. అయితే నాస్తికులైన బౌద్ధతత్త్వాన్ని తెలుసుగొనగోరి, ఒక బౌద్ధమతాచార్యుని ఆశ్రయించి, బౌద్ధమత తత్త్వాన్ని గ్రహించాడు. కర్ణుడు తన పుట్టుక రహస్యం దాచి విలువిద్య నేర్చినట్లు కుమారుల భట్టు తను వచ్చిన ఉద్దేశ్యం దాచాడు.
ఒక రోజు తత్వవిచారణ జరుగుతూండగా వేద నింద జరిగింది. ఇది భరించలేని కుమారుల భట్టు కంట తడిపెట్టుకున్నాడు. అప్పుడు ఇతడి రహస్యము తెలిసిన నాస్తిక శిష్యులు, అతడిని మేడపై నుండి క్రిందకు పడదోశారు. అప్పుడు ఇది గ్రహించిన తను, వేదాలను వేడుకున్నాడు. ‘‘వేదాలు యదార్థమైతే, నన్ను రక్షించుగాక’’ అని ప్రార్థించాడు. అతడు ఈ మాట పూర్తి నమ్మకంతో అనకపోవడంతో, ప్రాణాలైతే దక్కాయి కానీ, ఒక కన్ను మాత్రము కనపడకుండాపోయింది. ప్రాణాలు దక్కినా, గురుద్రోహిగా, నాస్తిక వాదం విద్య నేర్చుకున్నందుకు ప్రాయశ్చితంగా ప్రాణ త్యాగం చేయాలనుకొని చుట్టూ ఊకపొట్టు పేర్చుకొని నిప్పంటించుకున్నాడు.
దగ్గర కొచ్చిన శిష్యులను వారించి, వారితో ప్రాణాలు శాశ్వితం కాదు. ‘‘వేదమే శాశ్వితం, వేదమే సర్వరక్ష’’ అని శిష్యులకు బోధించాడు. అట్టి సమయంలో విషయం తెలుసుకొని, శంకరులు వచ్చాడు. కానీ, అప్పటికే సగం కాలిపోయి, కొన ఊపిరితో ఉన్నాడు. అయినా శంకరులు అతనితో అతనిని బతికిస్తానన్నాడు. అందుకు కుమారుల బట్టు, అంగీకరించలేదు. అంత ప్రాణాపాయ స్థితిలో ఉన్నా చలించక స్థితప్రతిజ్ఞుడిగా ఉన్నాడు. శ్రీ కుమారుల భట్టు (కుమారస్వామి) వేదం యొక్క జ్ఞానకాండయైన వేదాంత శాస్త్రాన్ని ఉద్ధరించిన మహానుభావుడైన శ్రీ శంకరులను గుర్తించాడు. ఇంతవరకు ప్రత్యక్షంగా దర్శించలేదు. ఇప్పుడు సాక్షాత్తు మహేశ్వరుడి అవతారమైన శంకరులను దర్శించినందుకు, అపరమితానందము పొంది, శిష్యులతో కలిసి సముచిత సపర్యలుగావించాడు. వారి సపర్యలను శ్రీ శంకరులు ప్రీతితో గైకొన్నారు.శ్రీ శంకరులు తనచే విరచితమైన భాష్య గ్రంథాన్ని పరీక్షకై శ్రీ కుమారిల బట్టుచే శ్రవణం చేయించాడు. శ్రవణం తరువాత,. తనకు మహేశ్వరుని దర్శనం కలిగిందని, శ్రీ కుమారిల బట్టు తెలియజేశాడు. మహాత్మా! నన్నును గ్రహించండి, నా పరలోక యాత్ర సమయంలో భగవదర్శనం ముక్తి కలిగిస్తుంది గదా యని శ్రీ శంకరుని ఎంతో కీర్తించాడు.
మహాత్మా! వేదాలు కంటికి కనిపించే, విషయంను విస్మరించి, కనిపించని పారలౌకిక విషయాలనే ప్రతిపాదిస్తున్నవి. అట్లే వేదాలు సత్యం వద ధర్మం చర. అహింసా పరమో ధర్మం’ అనే పరమ ధర్మాలను ఉపదేశిస్తున్నవి. మరల అదే వేదం పశుహింసాత్మకమైన, యజ్ఞయాగాదులు, ఆమోదిస్తున్నది. కనుక పరస్పర విరుద్ధాలను బోధించే వేదాలు ప్రమాణాలు కాజాలవు. వేదాలు అసత్యాలు పలుకుతున్నవని నాస్తికులు ప్రచారం కావించసాగారు. దానిని సంపూర్ణంగా తెలుసుకొని, ఖండించదలచినాను. కాని ఇంతలోనే నాస్తికశిష్యులు కనిపెట్టి నాకు ప్రాణహాని తలపెట్టారు.
మహానుభావా! నేను చెప్పిన మాటల్లో పూర్తిగా విశ్వసం లేకుంకే ‘యది ప్రమాణం శ్రుతయః’అనే మాటలో ‘యది’అని సందేహాన్ని ప్రయోగించాను. వేదాలను సందేహించాను. గురుద్రోహం చేశాను. ఈ రెండు కారణాలవల్ల ప్రాణంపోవల్సింది. చావుతప్పి కన్నులొట్టపోయిన సామెతలా ప్రాణం దక్కింది, ఒక కన్ను పోయింది. ఇంకా ఈ ప్రాణం దక్కటానికి దైవకృపే కారణం. భగవద్గీతలో భక్తునికి ‘నమే భక్త ప్రణశ్యతి’ భరోసాలా నాకు శ్రుతివాక్యం నమ్ముకున్న వాన్ని కనుక ‘శ్రుతి మాత’ నన్ను రక్షించిందని శంకరునికి తెలియజేస్తాడు.
చివరగా శ్రీ శంకరునితో ఓ పరమహంస శ్రేష్టా! విశ్వరూపనామధేయుడూ, సర్వవిద్యాశిరోమణి అయిన మండన మిశ్ర పండితుణ్ణి శీఘ్రంగా కలుసుకోండి. మండనమిశ్ర, ఉభయ భారతదేవులంటే బ్రహ్మసరస్వతులని గ్రహించండి. ఈశ్వరావతారులైన తమ అభిష్టాలన్నీ నెరవేరుతాయి.
అవసాన కాలంలో నాకు తమ దర్శనభాగ్యం లభ్యమైనది. శరణు పొంది దీనుడనై ప్రార్ధిస్తున్నాను. నాకు తారకమంత్రం ఉపదేశించండి. బ్రహ్మతత్త్వ జ్ఞాన నేత్రం తెరచుకొనేట్లు అనుగ్రహించండి. సంసారం నుండి విముక్తుడనై బ్రహ్మపదాన్ని పొందేట్లు చేయండి. ఇదే నా చివరి ప్రార్థన.
శ్రీ కుమారిలబట్టు, శ్రీ శంకరులను ఈ విధంగా తారకమంత్ర బ్రహ్మోపదేశాన్ని కోరి, ఇక మాట్లాడటం నిలిపివేశాడు.
తారకబ్రహ్మాపదేశమంటే, ప్రణవ మంత్రోపదేశం. అంత్యకాలంలో ప్రణవతత్వమెరిగిన వాడు తిరిగి జన్మించాడు, ముక్త్ధిమం పొందుతాడు.
జీవితకాలమంతా వేద మార్గాన్ని ప్రతిష్ఠించడానికి కృషిచేసి, యజ్ఞయాగాదులనే కర్మలను చేసీ ఆత్మజ్ఞానం లేక పరితపిస్తున్న శ్రీ కుమారిల భట్టారకులపై శ్రీ శంకరులు దయాదృష్టి ప్రసరింపజేసి పరబ్రహ్మతత్వ్తోపదేశం విస్పష్టంగా ఉపదేశించారు. శ్రీ కుమపారిలభట్టు వాక్కును ఉపసంహరించుకొని, సరేంద్రియ కార్యాలను నిలిపి మనసును గురుపాద పద్మాలపై లగ్నం చేసి, జీవ బ్రహ్మైక్యత తత్త్వాన్ని పొంది, బ్రహ్మజ్ఞాన సంపన్నుడయ్యాడు. ఎన్ని జ్ఞానాలను సంపాదించినా, శాంతి లభించదు. కేవలం బ్రహ్మజ్ఞానం చేతనే పరమశాంతి లభిస్తుంది.

- జమలాపురం ప్రసాదరావు