మెయిన్ ఫీచర్

భక్తిరసామృతం రామకథాగానామృతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరయ పుత్రకామేష్టియందు పరమాన్నమున పరగ జనించిన పరబ్రహ్మము శ్రీరామావతారము. యజ్ఞప్రసాదంగా చైత్రశుద్ధ నవమినాడు పునర్వసు నక్షత్రంలో కౌసల్యానందవర్థనుడై, దశరథ సుతుడై మానవ రూపంలో అవతరించాడు. శ్రీరాముని తళుకు చెక్కులపై ముద్దుపెట్టడానికి కౌసల్య తల్లి ఏమి తపము చేసిందో కదా! శ్రీరామా! రారా! అని పిలవడానికి దశరథ మహారాజు ఎంత తపస్సు చేశాడో కదా! అని త్యాగయ్య ఉప్పొంగిన హృదయంతో రామయ్యను కొనియాడాడు, ‘‘పుంసాం మోహనరూపాయ’’ అని ఆకర్షించే స్వరూపం శ్రీరామునిది. నగుమోము కలవాడు. తన కుమారులంతా తేజశ్శాలులే అయినా దశరథుడికి రాముడు మరింత తేజశ్శాలి అనిపించేవాడట. రాజులకు, రాజు కుటుంబీకులకు, అయోధ్యా నగరవాసులకు కూడా ఆ నీలి మేఘ శ్యాముని సౌందర్యం ఎంత చూసినా తనివితీరేది కాదట. శత్రువులను కూడా ఆకట్టుకునే స్వరూపమట. బంగారానికి తావివలె శ్రీరాముని ధర్మతత్పరత, సద్గుణ సంపత్తి, సత్యభాషణం మొదలైన లక్షణాలు కూడా రాముడిని శోభాయమానం చేశాయి. సకల విద్యాపారంగతుడు, ధనుర్విద్యలోను, శస్త్ర విద్యలోను నిష్ణాతుడు, పట్టుమని పదహారేండ్లయినా నిండని రాముడిని నీవెంట పంపలేనన్న దశరథుని ఒప్పించి తనతో వెంట తీసుకునివెళ్లిన విశ్వామిత్రుడు బల, అతిబల అనే విద్యలను ఉపదేశించాడు. అస్త్ర విద్యలను కూడా ప్రసాదించాడు.
జనక మహారాజు యజ్ఞం చేయడానికి భూమిని దున్నుతూ వుండగా నాగటిచాలులో కనిపించిన బిడ్డకు సీత అనే పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. అయోనిజ అయిన ఆమెకు తగిన వయస్సు రాగా ఆమెను శివధనుస్సు ఎక్కుపెట్టినవారికే ఇస్తానని వీర్యశుల్కగా ప్రకటించాడు. ఇక్కడ రాముడు విశ్వామిత్రుని ఆనతిపై తాటకను సంహరించి యజ్ఞ పరిరక్షణ చేశాడు. యాగం పరిసమాప్తమయ్యాక విశ్వామిత్రుడు మిథిలానగరానికి వెళుతూ తన వెంట రామలక్ష్మణులను కూడా తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఎనిమిది చక్రాలున్న పెట్టెలో ఐదువేలమంది బలాఢ్యులు మోసుకుని తీసుకుని వచ్చిన శివధనుస్సును అవలీలగా ఎత్తి శివధనుర్భంగం గావించాడు. మంత్రి పరిషత్తు, పురోహితులు, పురప్రముఖుల నిర్ణయానుసారంగా ఉత్తర ఫల్గునీ నక్షత్రంలో అగ్ని సమక్షంలో సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. ఆ సందర్భంలో ‘‘ఈమె నా కుమార్తె సీత, నీకు సహధర్మచారిణి అవుతుంది. ఆమెను అంగీకరించి పాణిగ్రహణం చేయి. నీకు మేలు కలుగుతుంది’’ అని-
పతివ్రతా మహాభాగా ఛాయేవానుగతా సదా
ఇత్యుక్త్వ ప్రాక్షిపద్రాజా మంత్రపూత జలం తదా
మహాభాగ్యవంతురాలైన ఈమె పతివ్రత అయిన నీడలా నిన్ను అనుసరించి ఉంటుంది అని చెప్పి జనకుడు మంత్రపూతమైన జలం విడిచి కన్యాదానం చేశాడు. అది మొదలు సీతారాముల దాంపత్యం అన్యోన్యంగా విలసిల్లింది. సీతపై రాముడికి ఎంత ప్రేమ ఉన్నదో అంతకు రెట్టింపు ప్రేమ రాముడిపై సీతకు వున్నది. దానికి రెట్టింపు ప్రేమ సీతమీద రాముడికి వుంది. వారి పరస్పర ప్రేమాభిమానాలు భాషకు అందనివని వాల్మీకి మహర్షి వర్ణించాడు. ‘‘వజ్రాదపి కఠోరాణి మృదుభి కుసుమానివ’’ అన్నట్లు అంతఃపురంలో వైభవాలతో అలరారిన సీత ముళ్ళదారిలో నడిచినా మనోనిబ్బరాన్ని వీడలేదు. శివధనస్సును కదపగలిగిన శక్తి సంపన్నురాలామె. భర్తను ప్రశ్నించి వనవాసానికి తాను కూడా రావడానికి ఒప్పించిన ధీరురాలు. రాముడు సీతను ధర్మ పరిరక్షణకు అడవులకు పంపించినా సీతాదేవి రాముని ధర్మ పరిరక్షణలో తానూ సహకరించాలని వౌనంగా వేదనను అనుభవిస్తూ శత్రువులను గెలిచి తనను తీసుకుని వెళడతాని ఆశతో, విశ్వాసంతో, దృఢ నిశ్చయంతో ఎదురుచూసింది. తన కోరిక నెరవేరింది.
రాముని పితృభక్తి అనన్య సామాన్యమైనది. తండ్రి కీర్తి ప్రతిష్ఠలకు భంగం కలగని రీతిలో తన వంశ మర్యాదను నిలిపే తలంపుతో తండ్రి మాటను జవదాటక అడవి దారి పట్టడానికి సిద్ధపడ్డాడు. రాముని భ్రాతృభక్తి కూడా ప్రశంసనీయమైనది. రాముడంటే లక్ష్మణుడికిప్రాణం. ప్రాణంకంటే ఎక్కువ. లక్ష్మణుడంటే రాముడికీ అంతే ప్రేమ. అదే ప్రాణధికమైన ప్రేమ. శరణు కోరినవాడు శత్రువైనా సరే కాపాడే గొప్ప లక్షణం రామునిలో వుంది. రాముడు శరణుజొచ్చినవారికి అభయమిచ్చాడు. విభీషణుడు, సుగ్రీవుడు శ్రీరాముని శరణు వేడుకున్నారు. ప్రజాహితమే తన హితంగా భావించాడు. ప్రజలకోసమే ప్రాణాధికంగా ప్రేమించిన ఇల్లాలిని కానలకు పంపాడు. కానరాని దుఃఖాన్ని అనుభవించాడు. ధర్మబద్ధంగా శత్రు సంహారం గావించి సీతాదేవిని తోడ్కొని వచ్చాడు. రాముని సుగుణాలు లోకానికి ధర్మాచరణను చాటి చెప్పాయి.
ప్రజాపతి సమః శ్రీమాన్ ధాతా రిపు నిషూదనః
రక్షితా జీవలోకస్య ధర్మస్య పరిరక్షితా
రక్షితాస్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా
వేదవేదాంగ తత్త్వజ్ఞో ధనుర్వేదే చ నిష్ఠితః
రాముడు బ్రహ్మతో సమానమైనవాడు. శత్రువులను జయిస్తాడు. తనవారిని రక్షిస్తాడు. జీవలోకం అంతటినీ రక్షిస్తాడు. ధర్మాన్ని పరిరక్షిస్తాడు. స్వధర్మాన్ని పాటిస్తాడు. వేదవేదాంగాల తత్త్వాన్ని గ్రహించాడు. ధనుర్వేదంలో నిష్ణాతుడు. అటువంటి రాముని కధ రామాయణం మనకు నిత్య పారాయణ యోగ్యమైనది.
యావత్ స్థాస్యన్తి గిరయః సరితశ్చ మహీతలే
తావద్రామాయణ కధా లోకేషు ప్రచరిష్యతి
ఈ లోకంలో పర్వతాలు నిలిచి వున్నంతకాలం, నదులు ప్రవహించినంతకాలం రామాయణం ప్రజల మధ్య వుంటుంది అని స్వయంగా బ్రహ్మదేవుడు పలికాడు. ఎవరి ఇంట పెండ్లి పనులు మొదలుపెట్టినా పసుపు దంచుతూ సీతాకల్యాణ వైభోగమే, రామ కల్యాణ వైభోగమే పాడుతూ సీతారాములను స్మరిస్తారు. ఏ పెండ్లి శుభలేఖపైనా అయినా సీతారాముల చిత్రాలు, ‘‘జానక్యాః కమలామలాంజలి పుటేయాః’’ అనే శ్లోకాలు వుండాల్సిందే. మంగళసూత్రధారణ సమయంలో సీతారాముల కల్యాణము చూతము రారండి అనే సన్నాయి మేళాలు వినిపిస్తాయి. అంతగా సీతారాములను మనమంతా ఆరాధిస్తున్నాం. సీతమ్మవారు కష్టాలు పడిందనో, రాములవారు వనవాసం చేశారనో అనుకోకుండా వారి ధర్మము, దాంపత్యము, అనురాగము, అనుసరణీయంగా భావిస్తున్నాం. ఇంతటి విశిష్టతను సంతరించుకున్నవారు కాబట్టి నేటికీ మన ఇళ్ళలోని పూజామందిరాలలో నిత్యపూజలందుకుంటున్నారు. వారు మన నిత్యజీవితంలో భాగమైనారు. ప్రతి కనె్నపిల్లా తనకు రాముడిలాంటి భర్త లభించాలని కోరుకుంటుంది. ప్రతి స్ర్తి తనకు రాముని లాంటి బిడ్డ కలగాలని కలలు కంటుంది. ప్రతి జంటా సీతారాముల్లా ఆదర్శ జీవితాన్ని గడపాలని ఆశిస్తారు.

- కె. లక్ష్మీ అన్నపూర్ణ