మెయిన్ ఫీచర్

రామ నామం.. మధురాతిమధురం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవుడిగా జన్మించిన శ్రీరామచంద్రమూర్తి ఆదర్శ పురుషుడు. అందరికీ ఆరాధ్యదైవం. ధర్మ కార్యాచరణతో భాసిల్లిన మహాప్రభువు. ఆ మహనీయుని స్మరించిన వ్యక్తి అధర్మానికి పాల్పడజాలడు. పదకొండువేల సంవత్సరాలు ప్రజారంజకంగా పాలించి రామరాజ్యానికి తిరుగులేని కీర్తిని ఆపాదించాడు. ‘శంకరుని వంటి దైవం, లంకాధిపువైరి వంటి రాజను గలడే’ అని ఒక పద్యంలో ఉటంకించబడింది. తాండవకీర్తికి, రామమూర్తికి రెండవసాటి దైవము లేదంటూ ఏనుగునెక్కి నినాదం చేస్తానంటూ దాశరధీ శతకకర్త పేర్కొన్నారు. ధర్మము తెలిసినవాడు, సత్యవ్రతుడు భూతదయ కలవాడు ఇత్యాది పదహారు గుణాలతో ప్రకాశించే వారెవరైనా ఉన్నారా అని వాల్మీకి మహర్షి నారదుని ప్రశ్నించగా నారద మహర్షి శ్రీరాముని పేరును సూచించి, రామాయణ కావ్యరచనకు ఉపక్రమించమని ప్రోత్సహించారు.
వాల్మీకి రామాయణం, పఠించి అవగాహన చేసుకున్న పండితవరేణ్యులు ఎందరో రాముని సుగుణాలను అనునిత్యం కీర్తిస్తున్నారు. ఏదైనా వినకూడనిది విన్నా, జరగకూడనిది జరిగినా ‘రామ రామ’ అంటూ అప్రయత్నంగా రాముని తల్చుకొనడం మన సంస్కృతిలో భాగంగా మారింది. అతనెపుడూ అబద్ధం చెప్పడు అని ఎవరైనా అంటే అతనేమైనా శ్రీరామచంద్రుడా? అంటూ సంభాషణలో ఆశ్చర్యాన్ని ప్రకటిస్తారు అనేకులు. రామశబ్దం మన నిత్య జీవితంలో సమ్మిళితమై ఉన్నది. నేటికీ అనేకులు కాగితం లేదా పుస్తకం మొదటిపుటపై శ్రీరామ శబ్దం రాసి, తర్వాత తమ క్రయ విక్రయ విషయాలను పొందుపరుస్తారు. ఎందరో మహానుభావులు తమ తీరికవేళల్లో రామకోటి రాసి, సమయాన్ని సద్వినియోగం చేసుకుని తరిస్తున్నారు. రామమందిరం లేని గ్రామం భారతదేశంలో ఎక్కడా కనిపించదు.
శ్రీరాముని సుగుణాలలో ప్రథమంగా పేర్కొనదగినది ఏకపత్నీవ్రతం. ఒక వ్యక్తి ఒక స్ర్తినే పెళ్లాడాలన్న సాంఘిక కట్టుబాటు ఏర్పడినందువల్ల కుటుంబంలో సుఖశాం తులు నెలకొన్నాయి. బహుభార్యాత్వం ఎన్నో సామాజిక సమస్యలు తలెత్తేవి. అలాంటి వాటిని అరికట్టాలంటే నీతిగా నిజాయతీగా శీలవంతంగా ఉండే ప్రజలను తయారు చేయడానికి శ్రీరాముడు ఆదర్శ జీవనుడుగా తన జీవితాన్ని తీర్చి దిద్దుకున్నారు. ఏదైనా అసాధ్యమైన పని చేస్తే అది కేవలం భగవంతుడు కాబట్టి లేక రాజు కాబట్టి చేశాడు సామాన్యులకు ఏమొస్తుంది అనే భావం పెరగకుండా తాను కేవలం దశరథ మహారాజు పుత్రుడినని, తనకు రాజ్యభోగాలు ఉన్నా, లేకున్నా హంసతూలికలపై పడుకున్న పచ్చగడ్డిపై పడుకున్నా కూడా ఒకటే అని చెప్పాడు. చేసి కూడా చూపించిన ధీశాలి రాముడు. రెండవది పితృవాక్య పరిపాలన. తండ్రి చెప్పిన మాట జవదాటకుంటే, శ్రీరాముడు లక్ష్మణుడితో కలిసి విశ్వామిత్రుడి వెంట వెళ్లి యాగరక్షణ కావించి, రాక్షస సంహారం చేసి మరియు మిథిలానగరానికి వెళ్లి శివధనుర్భంగం కావించి సీతను పరిణయమాడి, తండ్రికి సంతోషం కలగచేస్తాడు. కైక కిచ్చిన వరం కారణంగా విషాద మనస్కుడైన దశరథుడు అరణ్యవాసానికెళ్లమని రాముని ఆదేశించకపోయినా కైకద్వారా విషయం తెలుసుకుని రాముడు ఒకే మాటకు కట్టుబడి ఉంటాడు అని తెలిపి నారబట్టలు ధరించి సీతాలక్ష్మణ సమేతుడై అడవులకు వెళ్లాడు.
రాముని భ్రాతృప్రేమ ఎన్నదగినది. ఇంద్రజిత్తు జరిపిన మహాయుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛిల్లి విగత జీవుడు కాగా మరో భార్య కుమారులు కావాలంటే ఇక్కడ దొరుకుతారు. కానీ లక్ష్మణుడి వంటి సోదరుడు దొరడని రాముడు విలపిస్తాడు. రాజ్యాన్ని అపహరించాడన్న ద్వేషాన్ని చూపకుండా వినయంతో తనను సమీపించిన భరతునికి పాదుకలిచ్చి రాజ్యపాలనలోని అనేక మెలకువలను చెప్పి అయోధ్యకు సాగనంపుతాడు శ్రీరాముడు.
రాముని భూతదయ- జటాయువు సీతజాడ తెలిపి రాముడికి ఉపకారం చేసాడు. రావణుడితో యుద్ధం చేసి గాయాలతో మరణించాడు. అతనికి ఉత్తరక్రియలు జరిపి కృతజ్ఞతను చాటుకున్న మహనీయుడు. కేవలం వానరుడు అని తలచకుండా సుగ్రీవునికి అభయమిచ్చి అధర్మానికి పాలుపడ్డ వాలిని సంహరించి కిష్కిందకు పట్ట్భాషషిక్తుడ్ని చేసి తనవంతు సహాయాన్ని అందించాడు. అలాగే విభీషణుడు రాక్షసుడైనా శత్రునగరం నుంచి వచ్చినవాడైనా ఆశ్రయమిచ్చి సలహాలను గైకొని లంకను ప్రవేశించి రావణ సంహారం చేసి సీతను తిరిగి పొందగలిగాడు. ఇలా మైత్రీభావంతో మెలిగి ఇతరులకు ఆదర్శంగా నిలిచాడు శ్రీరాముడు. ‘జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి’ అంటూ మాతృభూమి విశిష్టతను తెలిపి లక్ష్మణునికి తెలిపినవాడు జానకిరాముడు. ప్రాచీన కాలంనుండి ఎందరో మహానుభావులు రాముని కృపకు పాత్రులైనారు. ‘పలికెడిది భాగవమతమట, పలికించువాడు రామభద్రుండట’ అంటూ బమ్మెర పోతన భాగవతాంధ్రీకరణ గావించాడు. ‘అన్నీ నీవే అనుచు అంతరంగమున తిన్నగ వెదకి తెలుసుకొంటినయ్య! నిన్ను తప్ప ఇరులను వొల్ల జాల’నంటూ త్యాగరాజు కీర్తించాడు
‘తక్కువేమి మనకు రాముడొక్కడుండు వరకు’ అంటూ గోపన్న తన గీతాల్లో రాముని గొప్పదనాన్ని చాటిచెప్పాడు. రామనామ శబ్దం అతి మధురమైంది. పద్యం గాని, పాటగాని వచన రూపంలో గాని శ్రీరామ కథ విన్న ప్రతి వ్యక్తి హృదయం ఆనందంతో నిండుతుంది.

- వై.వి.రమణారావు