మంచి మాట

పండుగ అంతరార్థం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశంలో పండుగలకున్న ప్రాశస్త్యం మరే దేశంలోను, ప్రాంతంలోను లేదని చెప్పాలి. ఎన్నో ఆచార వ్యవహారాలతో కూడిన సంప్రదాయ శాస్త్ర విజ్ఞానాన్ని పండుగల రూపంలో గుదిగుచ్చిన పుణ్యభూమి భారతదేశం.
ఈ దేశంలో జీవితమే ఒక పండుగగా భావించేవారున్నారంటే అతిశయోక్తికాదు. దీనిమూలంగానే మన సంస్కృతిలో అన్ని రోజులను పండుగ రోజులుగా జరుపుకోవడం జరుగుతున్నది. భూమి దున్నడానికి ఒక పండుగ, విత్తనాలు చల్లడానికి మరో పండుగ, పంట ఇంటికి వస్తే పెద్ద పండుగ, పశువును ఆదరించడం ఒక పండుగ. కాస్త ఘనమైన వారింట వివాహం అయితే నెల రోజుల పాటు పండుగే.
పూర్వం సర్వజన సమ్మతంగా ‘సర్వేజనా సుఖినోభవంతు’ అన్నట్లు పండుగలను రూపొందించినవారు మహర్షులు.
జన్మదినానికి ఒక ఉత్సవం, పిల్లలు పెరుగుతున్నపుడు ఒక్కో దశలో ఒక ఉత్సవం అంటూ ఏదో ఒక కారణం కల్పించి ప్రతిరోజూ జీవితాన్ని ఒక పండుగలా జరుపుకునేవారు. అసలు ఏ సంతోషము లేక, సందర్భమూ రాక జీవితాన్ని యాంత్రికంగా నెట్టుకుంటూపోతే ప్రయోజనం ఏముంటుంది? అలా కాకుండా పండుగలు, పబ్బాలు వుంటే పనులపట్ల ఉత్సాహం కలుగుతుంది. మనసులో ఉండే బాధలు తొలగిపోతాయి. రోగాలు రాకుండా ఉంటాయి. జీవితం సంతోషంగా సాగుతుంది. మానసిక వైద్యులను సంప్రదించవలసిన అవసరం కూడా వుండదు. ఆదరా బాదరాగా దేనినో అందుకోవాలని, వేగాన్ని పెంచుకుంటూ పోయే ఒరవడిలో జీవితానే్న కోల్పోయే ప్రమాదం వుంది. అందుకే అప్పుడప్పుడూ ఇటువంటి పండుగలు, సంబరాలను జరుపుకోవడం మంచిది. అసలు జీవితానే్న ప్రతిరోజూ ఒక పండుగలా భావించేవాళ్ళు ధన్యులు.
ఒకసారి వేటకు వెళ్లిన ఒక రాజు ఎడారిలో ఒంటరిగా చాలా దూరం వెళ్లిపోయాడు. రాజుని ఒక పల్లకీలో కూర్చోబెట్టి, ఆయన రాజ్యానికి తీసుకువెళ్ళడానికి ఆ ఎడారి ప్రక్కని గ్రామంలోని నలుగురు మనుష్యులు అంగీకరించారు. తను రాజ ప్రసాదానికి చేరుకోవడానికి ఆరు రోజుల సమయం పడుతుందని రాజుకి తెలిసింది.
మూడు రోజుల్లో తీసుకువెళితే వేయి బంగారు కానుకలు అదనంగా ఇస్తానని, రెండు రోజుల్లో చేరిస్తే రెండు వేల కానుకలిస్తానని రాజు ప్రకటించాడు. పల్లకిని మోస్తున్నవారు బంగారానికి ఆశపడి, వేగాన్ని పెంచుకుంటూ పోయారు కాని, ఆరు రోజులైనా గమ్యం చేరుకోలేదు పల్లకీని దింపివేసి ‘‘మహారాజా! క్షమించండి. వేగం మీద ధ్యాసతో ఎటు వెళుతున్నామో తెలియకుండా వెళ్లాము’’ అంటూ నిస్సహాయంగా చెప్పారు.
అలాగే జీవితంలో పండుగలు, వేడుకలు లేకుంటే చేసే పనుల్లో అసలు అర్థం అంటూ ఉండదు. కొంతకాలం తర్వాత ‘అసలు ఎందుకు జీవిస్తున్నాం’ అన్నదానికి కూడా అర్థం తెలియకుండా పోతోంది.
చదువునీ, జ్ఞానాన్నీ గౌరవించేవారు ‘సరస్వతీ పూజ’ అంటూ మేధను గౌరవిస్తూ పండుగ చేసుకుంటారు. వ్యాపారం చేసేవారు ‘లక్ష్మీపూజ’ అంటూ పండుగ చేసుకుంటారు. మిగతా వృత్తులవారు ‘ఆయుధ పూజ, పశువులపూజ’ ఇలా ఎన్నో జీవన అనుబంధాలను ఆధారం చేసుకుని పండుగలు చేసుకోవడమే భారతీయ సంప్రదాయ వైశిష్ట్యము. కొందరు పండుగలంటే రకరకాలుగా వంటలు చేయడంలోనే సమయం వృధా అయిపోతుందని భావిస్తుంటారు. కానీ ఈ పిండి వంటలలో కూడా ఆయుర్వేద వైద్య ఆరోగ్య సూత్రాలను ఇమిడ్చి పండుగ రోజులలో ఫలహారాలుగా స్వీకరించేలా చేయడంలోనే భారతీయ పండుగల ఘనత నిండి ఉన్నది. ఉండ్రాళ్ళు, వడపప్పు పానకం, అరిసెలు, గారెలు, పూర్ణాలు, అట్లు, పాయసం, దద్దోజనం, పులిహోర.. లాంటివన్నీ సంపూర్ణ ఆరోగ్య ఆహార పదార్థాలు. వీటిని పండుగ రోజులలోనైనా తీసుకునే భాగ్యాన్ని కల్పించడమే పండుగలలో ఉన్న గొప్పతనం.

-పి.వి.రమణకుమార్