మంచి మాట

శ్రద్ధ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘శ్రద్ధావాన్ లభతే జ్ఞానం’- శ్రద్ధావంతుడు జ్ఞానాన్ని సంపాదిస్తాడు. ‘శ్రద్ధ’ అంటే ఆస్తికబుద్ధి అన్నాడు శంకరాచార్యులవారు. భగవద్గీతలో శ్రద్ధ అనే పదానికి మూడు అర్థాలు చెప్పబడుతున్నాయి. అవి విశ్వాసం, నమ్మకం, గౌరవం. ఈ మూడు ఒక్కటై ఎవని మనసులో ఉండునో అతడే శ్రద్ధావంతుడు. జ్ఞానాన్ని సంపాదించాలన్న జిజ్ఞాస గలవానిని కూడా శ్రద్ధాళువు అనవచ్చు.
వ్యక్తి శ్రద్ధను అనుసరించి అతని వ్యక్తిత్వం ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే శ్రద్ధను సకారాత్మక మనస్తత్వం అని చెప్పవచ్చు. శ్రద్ధ మన దృష్టిననుసరించి వుంటుంది.
ఒకసారి శ్రీకృష్ణుడు అర్జునితో కలిసి పోతున్నాడు. కృష్ణుడు ఆకాశంవైపు చూస్తూ ‘‘అర్జునా! ఇటు చూడు ఆకాశంలో పావురాళ్ళు గుంపులు, గుంపులుగా పోతున్నవి’’ అన్నాడు.
అర్జునుడు ‘‘కృష్ణా పావురాళ్ళు వున్నాయా?’’ అన్నాడు.
‘‘పావురాళ్ళు లేనే లేవు అర్జునా...’’ చెప్పాడు కృష్ణుడు. వెంటనే అర్జునుడు ‘‘అవును కృష్ణా పావురాళ్ళు లేనే లేవు’’ చెప్పాడు.
ఈ విధంగా కృష్ణుడు ఏదంటే అదే అర్జునుడు బదులిచ్చాడు. ఇక్కడ పరిశీలించవలసినది పావురాళ్ళు ఉన్నాయా లేదా అన్నది కాదు. కృష్ణుని మాట పట్ల అర్జునునికున్న పరిపూర్ణమైన విశ్వాసం. ఆయన విశ్వాసమే శ్రద్ధ. ఇదే అత్యంత శక్తివంతమైనది.
నిజమైన భక్తుడు భగవన్నామ స్మరణ పట్ల ఎంతో శ్రద్ధ కలిగివుంటాడు. ఇలాంటి సంఘటనే శ్రీరామకృష్ణపరమహంస మరో కథగా చెప్పాడు.
శ్రీరామకృష్ణ పరమహంస శ్రద్ధకు పెద్ద పీట వేశాడు. వారి అభిప్రాయం ఏమిటంటే బాలల్లో వున్న శ్రద్ధ వ్యక్తులలో వున్నపుడే భగవంతుడు ప్రసన్నుడవుతాడు. అందుకు ఉదాహరణగా ఆయన ఒక కథ చెప్పడం జరిగింది.
ఒక ఊరిలో జటిల అనే బాలుడుండేవాడు. ప్రతిరోజు జటిల అడవి దారి గుండా గురుకులానికి వెళ్లాల్సి వచ్చేది.
ఆ దారిలో వెళ్ళడానికి ఆ బాలుడికి మహా భయంగా ఉండేది. ఆ మాటే తల్లితో చెప్పాడు. జటిల తల్లి తెలివిగా ఆలోచించింది. పిల్లవాడిలో భయం పోగొట్టాలని నిర్ణయించుకుంది.
‘‘నీకు భయం కలిగినపుడు మధుసూదనుని పిలువు’’ అన్నది.
‘‘మధుసూదనుడెవరు?’’ అడిగాడు జటిల.
‘‘అతడు నీకు అన్న’’ చెప్పింది తల్లి.
కొన్ని రోజుల తర్వాత జటిలుడు అడవిదారిన పోతూ ఉండగా జటిలకు చెప్పలేనంతగా భయమేసింది. వెంటనే ‘‘అన్నా.. మధుసూదనా...’’ అంటూ కేక వేసి పిలిచాడు. బదులు రాలేదు. ‘‘అన్నా మధుసూదనా! ఎక్కడున్నావ్? నాకు భయమేస్తుంది.. నా దగ్గరకు రా.. త్వరగా...’’ మళ్ళీ పిలిచాడు జటిల.
‘‘ఇదిగో తమ్ముడూ వస్తున్నా భయపడకు..’’ అంటూ అన్నయ్య రానే వచ్చాడు. తమ్ముని చేయి పుచ్చుకుని అడవి దాటించి అంతర్థానమైపోయాడు.
ఇంటికి వచ్చి తల్లితో జటిల అన్న మధుసూదనుడు వచ్చిన సంగతి చెప్పాడు. అంతే మాటవరసకు భయం పోగొట్టడానికి లేని అన్నను సృష్టించిన తల్లి నిశే్చష్టురాలయ్యింది. తన అబద్ధాన్ని కొడుకు శ్రద్ధా విశ్వాసంతో నిజం చేశాడు. సాక్షాత్తూ ఆ దేవదేవుడనే అన్నగా పిలిపించుకుని అడవి దాటాడు. సంతోషంతో పొంగిపోయిన ఆమె ఆ మధుసూదనునికి కోటి నమస్కారాలు అర్పించుకుంది.
అందుకే శ్రద్ధగలవానిదే జ్ఞానం అన్న మాటకు నిదర్శనాలు ఎన్నో చెప్పుకోవచ్చు. శ్రద్ధ లేని ఏ కార్యం కూడా సంపూర్ణ సఫలం కాదు. ఎంత శ్రద్ధ వుంటే అంత ఫలం దక్కుతుందన్నది సత్యం

-పి.వి.రమణకుమార్