మంచి మాట

సహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవితంలో ఏదో ఒక ఘనకార్యం సాధించాలని ప్రతివారికీ కోరిక వుంటుంది. తమ శక్తినంతటినీ ఉపయోగించి ప్రయత్నాలు అన్నీ చేస్తారు. విజయం చేతికి అందుతున్నట్లే కానవస్తూ చేయి జారిపోతూ వుంటుంది. అలా చాలాసార్లు జరగవచ్చు. కానీ ఏ మాత్రం నిరాశ చెందకుండా ప్రయత్నం కొనసాగిస్తూనే ఉండాలి. అలా సహనంతో ప్రయత్నం కొనసాగితే విజయం తథ్యం అవుతుంది. ఈ విషయాన్ని నిర్థారించే గాధి కథను గుర్తుచేసుకొందాం.
గాధి ఒక అపురూప సుందరి. కుశనాభ మహారాజు కూతురు. సర్వ విద్యలూ నేర్చిన మహాప్రజ్ఞావంతురాలు. యవ్వనంలో వున్న వీరులందరూ ఆమెను భార్యగా పొందాలని తహతహలాడుతారు. దేవతలలో ప్రముఖుడైన వాయుదేవుడికే ఆమె పట్ల మోహం కలిగింది. ఒక అందమైన యువకుడిగా ఆకృతి ధరించి ఆమె ముందుకు వచ్చాడు.
‘సుందరీ! ప్రస్తుతం నీ సౌందర్యం శాశ్వతమైనది కాదు. నా దివ్య శక్తితో నీకు శాశ్వతమైన అపురూప సౌందర్యాన్ని లభింపజేస్తాను. నన్ను వివాహం చేసుకుని స్వర్గ సుఖాలను అన్నింటినీ అనుభవించు అన్నాడు.ఆ మాటలు విని గాధి ‘వాయుదేవా! నేను నా తండ్రి అయిన రాజర్షి శుకనాభుని అధీనంలో ఉన్నాను. ఆయన అనుమతి లేకుండా నేను ఎట్టి జవాబూ చెప్పలేను. నా భర్తను నేనే నిర్ణయించుకొనడం సాధ్యంకాదు. నా తండ్రి ఎవరిని నా భర్తగా నిర్ణయిస్తే అతడినే వరించి ఆరాధిస్తాను’ అని తెలిపింది. దానితో వాయుదేవుడు ఆగ్రహించి నువ్వు నీ సౌందర్యాన్ని కోల్పోయి కురూపిగా ఇకపై జీవించు అని శపించాడు. వెంటనే ఆమె ఒక కురూపిగా మారిపోయింది. దానితో ఆమె దుఃఖిస్తూ తండ్రితో విషయం చెప్పింది. విషయంతెలుసుకొన్న తండ్రి ఆమెను ఓదారుస్తూ- ‘సహనంతో అన్నీ సాధించవచ్చునమ్మా! ఏమీ ఆందోళన చెందకు. త్వరలోనే ఏదో ఉపాయం ఆలోచించి పెద్దల సహాయ సహకారాలతో మన ఆశలు సాధించుకుందాం’ అన్నాడు.
పండితులు అందరూ బాగా ఆలోచించి ‘ఆమెకు వివాహం అయితే ఆమె భర్త చేసుకున్న పుణ్య ఫలితంగా ఆమె తిరిగి శాపవిముక్తురాలై తన పూర్వ సౌందర్యాన్ని పొందగల్గుతుంది’ అని చెప్పాడు. ప్రస్తుతం కురూపిగా వున్న ఈ రాజకుమార్తెను పెళ్లాడటానికి ఏ రాజకుమారుడైనా ముందుకు వస్తాడేమో ప్రయత్నించండని ఆ రాజు తన మంత్రులను ఆజ్ఞాపించాడు.
మంత్రులు స్వయంగా వివిధ రాజ్యాలూ సందర్శించి శాపవశాన కురూపియైన ఈ రాజకుమారిని పెళ్లిచేసుకోవడానికి ఏ రాజైనా ముందుకువస్తాడేమోనని ప్రయత్నించసాగారు. ఈ పరిస్థితులను గమనించిన కౌంపిల్య రాజ్యం రాజకుమారుడు కురూపియైన ఆ రాజకుమారిని వివాహం చేసుకోవడానికి ముందుకు వచ్చాడు. అతడి పేరు బ్రహ్మదత్తుడు. రాజకుమారికి ఈ శాపం ఇచ్చిన వాయుదేవునే ప్రార్థించి, తపస్సు చేసి మెప్పించి తిరిగి రాజకుమారి పూర్వ సౌందర్యాన్ని పొందవచ్చునని అతడికి నమ్మకం కలిగింది. దాని ఫలితంగా గాధిని రాజు ఆ రాజకుమారునికిచ్చి పెళ్లిచేయ నిశ్చయించాడు.
అయితే రాజకుమారుడు బ్రహ్మదత్తుడు రాజు అనుమతి, రాజకుమార్తె అనుమతి తీసుకొని పెళ్లికి పూర్వం కొంతకాలం వాయుదేవుని గూర్చి తపస్సు చేయడానికి నిశ్చయించాడు. అతని తపస్సునకు వాయుదేవుడు మెచ్చి ఏం కావాలో కోరుకో అన్నాడు. బ్రహ్మదత్తుడు వాయుదేవునకు నమస్కరించి ‘దేవా! రాజకుమారికి నీవు ఇచ్చిన శాపాన్ని ఉపసంహరించి ఆమె సౌందర్యాన్ని తిరిగి ఆమెకు ప్రసాదించు’ అన్నాడు.
వాయుదేవుడు ప్రసన్నుడై తథాస్తు అన్నాడు.
రాజకుమార్తె తనకు మధ్యలో వాయుదేవుని శాపంవల్లనే వచ్చిన కురూపాన్ని విసర్జించి తిరిగి అపురూప సౌందర్యవతి అయింది. ఇది అసాధారణమైన సంఘటన.
ఆత్మవిశ్వాసం, సహనం వల్లనే ఈ అద్భుతం ఆమెకు సాధ్యం అయింది అని ఎవరైనా ఒప్పుకొనక తప్పదు కదా!

-సన్నిధానం యజ్ఞనారాయణమూర్తి