మంచి మాట

స్థిత ప్రజ్ఞత - ఆత్మస్థైర్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగవద్గీతలో తెలుపబడినట్లు సుఖదుఃఖాలు, భయ విభ్రమాలు, రాగద్వేషాలు, కోపతాపాలు, ఈర్ష్యాసూయలు మొదలగు ద్వంద్వ ప్రకృతుల ప్రభావం తన మీద పడకుండా చూసుకొని, మంచి ప్రవర్తన, నడవడికగల వ్యక్తిని, స్థితప్రజ్ఞుడిగా చెప్పుకోవచ్చును. దుఃఖాలకు క్రుంగిపోకుండా, సుఖాలకు పొంగిపోకుండా, భయమూ, రాగద్వేషాలను విసర్జించి, స్నేహము, వ్యామోహము లేకుండా మంచిగాని చెడుగానీ జరిగినప్పుడు మనోనిబ్బరంతో మసలుకోవటం కూడా అతని ప్రవృత్తిలోని భాగాలే. కోరికలకను, మనోకామనలను వదలిపెట్టి, పరమాత్మతో అనుసంధానమైన అలౌకికానందాన్ని అనుభవించకలగడం కూడా అతని స్వభావమే. ఇంద్రియాలను తన నియంత్రణలోకి తెచ్చుకొని, పరమాత్మమీద మనసుని లగ్నం చేయడం ద్వారా అతని ప్రజ్ఞ అచంచలమై స్థిరంగా ఉంటుంది. ఈ విధంగా నిశ్చలమైన, సుస్థిరమైన, అచంచలమైన బుద్ధి/ విజ్ఞానం కలిగి ఉన్న మనిషి స్థితప్రజ్ఞుడిగా వ్యవహరించబడతాడు. ఇతనికి సృష్టిలో ఎదురుండదు.
ఒక వ్యక్తికి స్థితప్రజ్ఞత సమకూరాలంటే అతనికి మనోనిగ్రహం, ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం, ఆత్మవివేకం, ఆత్మచింతన అలవడాలి. మనసుని నియంత్రించడం ద్వారా అతను ఇంద్రియాలను తన స్వాధీనంలో ఉంచుకోగలుగుతాడు. అంతేకాకుండా అతనికి నిర్మలమైన మనస్సు ఉండాలి. అప్పుడే మనశ్శాంతి లేమి, దుఃఖము, అసూయ, ఈర్ష్య, దుష్టచింతన, ఆత్మనిష్ఠ లేమి- ఇవి అతని వద్దకు చేరవు.
పురాణేతిహాసాలలో పరిశీలిస్తే స్థితప్రజ్ఞులైన మహా పురుషులు మనకు కొందరు కనబడతారు. రామాయణ కాలంలో మిథిలానగర చక్రవర్తి జనకుడు, సోదరుడైన రావణుడికి సద్బోధ చేసిన విభీషణుడు, ప్రజలను కన్నబిడ్డలలాగా మనోరంజకంగానూ, ప్రజారంజకంగానూ పరిపాలించిన శ్రీరాముడు స్థిత ప్రజ్ఞుల జాబితాలోకి వస్తారు. భారత, భాగతాలలో కృష్ణునికి ప్రియమైన అక్రూరుడు, మాంసం అమ్ముకొంటూ జీవించే ధర్మవ్యాధుడు, భీష్ముడు, ధర్మరాజులు ఈ కోవలోకే వస్తారు.
మనసులోని కోరికలను నియంత్రించుకుంటూ, వీలయినంతవరకు సాత్విక తత్వాన్ని అలవరచుకొని మనశ్శాంతి కలిగి ఉండాలంటే, ఆ వ్యక్తి ఆత్మస్థైర్యాన్ని కలిగి ఉండి, అజ్ఞానమనే బురదను మంచి బుద్ధితో కడుక్కోవలసి ఉంటుంది.
పూర్వం గురుకులాల్లో గురువులు తమ అంతేవాసులకు విద్య, విజ్ఞానం, రాజనీతిజ్ఞతతోబాటు, పురాణ, వేద పఠనాల వంటి అంశాలతో తర్ఫీదునిచ్చేవారు. వీటన్నింటితోపాటు సర్వేంద్రియాలను సక్రమంగా నిగ్రహించి, నియంత్రించే విధానాలనూ బోధించేవారు. ఆ శిష్యులందరికీ ఈ అంశాలలో ప్రతిభ , సౌశీల్యత, సౌభ్రాతృత్వం, అచంచలమైన శ్రద్ధాసక్తుల ద్వారానే లభించేది. మనోశక్తిని కూడగట్టి, సమీకరిస్తే మానవునికి ఆధ్యాత్మిక శక్తి జనిస్తుంది.
నేను ఈ పని చేయగలను, నేను సమర్థుడను, నాలో గొప్ప శక్తి ఉన్నది’ అనే భావనలు అహంభావపూరితంగా కాకుండా, ఆత్మవిశ్వాసంతో ఆత్మస్థైర్యంగా అనుకోగలిగిన నిత్య సాధకుడే స్థితప్రజ్ఞుడవుతాడు.
నేటి కాలంలోను వ్యాపారాత్మకమైన చదువులతోపాటుగా భగవద్గీత లాంటి మంచిగ్రంథ పఠనం చేయస్తే అటు భుక్తి కి అవసరమైన విద్య తోపాటు మనుషుల్లో ఉండవలసిన దయ, కరుణ, ఇతర ప్రాణుల పట్ల ఉండవలసిన కారుణ్యము లాంటి లక్షణాలు కూడా ప్రోది అవుతాయ. ప్రాణుల్లో ఉండే దైవాంశ గుర్తించే నైపుణ్యం సమకూరుతుంది. అపుడే స్వార్థంతో కూడిన ఆలోచనలు వెనక్కు వెళ్లి నలుగురికీ మంచి జరగాలనే ఆలోచనలు ముందుకు వస్తాయ. కనుక అందరూ మన ప్రాచీన సంపదలైన భారత భాగవత, భగవద్గీత, రామాయణాది పుస్తకాలను చదవాలి. తన మీద తనకు నమ్మకం ఏర్పడితే ఆత్మ విశ్వాసం కొరవడదు. అపుడు పక్కవాని సంపదను దొంగలించాలన్న దుర్బుద్ధి పుట్టదు. కనుక అందరూ స్థిత ప్రజ్ఞత్వాన్ని ఏర్పరుచుకోవడానికి యత్నిస్తారు.

- పొత్తూరి రాఘవేంద్రరావు