మంచి మాట

త్రిగుణాత్మకత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన సంఖ్యాశాస్త్రంలో మొదటి పది అంకెలు- (సున్న, ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది) వీటిలో ఒక్కొక్క అంకెకు ఒక్కొక్క ప్రత్యేకత / విశిష్టత ఉన్నది. సున్న (శూన్యం)- ఈ విశ్వానికి, రెండు - ద్వంద్వ ప్రవృత్తులకు ప్రతీకలుగా ఉన్నాయి. ఒక మూడు అంకెకు ఉన్న ప్రఖ్యాత విశిష్టతలు ముల్లోకాలు, ముక్కంటి, త్రిమూర్తులు, త్రిగుణాలు, త్రిశూలం మొదలైనవి. శ్రీకృష్ణ్భగవానుడు భగవద్గీతలోని పధ్నాలుగవ అధ్యాయంలో త్రిగుణాల గురించి వివరంగా విశదీకరించాడు. అవి- సాత్వికగుణము, రజోగుణము, తమోగుణము. సత్వగుణంకలిగి ఉన్న సాత్వికులలో- సత్వగుణం నిర్మలమయినదిగా ఉండి, సుఖంమీద, సముపార్జించవలసిన జ్ఞానంమీద ఆసక్తిని కలుగజేసి ఆత్మను బంధించి నియంత్రిస్తుంది.
రాగస్వరూపం, రాగానురాగాలవలన సంప్రాప్తించిన రజోగుణంవల్ల, ఈ రజోగుణ సంపన్నులు ఆశకు, కామనకు, కోరికకూ, ఆసక్తికీ బందీలవుతారు. అప్పుడప్పుడు వీరికి దుఃఖము కలుగజేస్తుంది. అజ్ఞానంవలన సంప్రాప్తించే తమోగుణం- ఈ తమోగుణాత్ములను, అవివేకానికి, మూర్ఖత్వానికి, వాచాలతకు బానిసలుగా మార్చి, పరాకు, నిద్ర, బద్ధకములతో ఆత్మను బంధిస్తుంది. సత్వగుణ సంపన్నులు మరణించిన తరువాత ఉత్తమ, ఉన్నత లోకాలను పొందుతారు. రజోగుణాత్ముల మరణానంతరం కర్మలమీద ఆసక్తికలవారిగా జన్మిస్తారు. తమోగుణాత్ములు- పశు పక్ష్యాదులకు, పామరులకూ, పాపులకు పుడతారు. రామాయణ, మహాభారతాలను స్మరించుకొంటే, ఆనాటి వ్యక్తులలో కూడా రకరకాల ప్రవృత్తులు, లక్షణాలు గల వ్యక్తులు తారసపడతారు. పరమ నిష్ఠాగరిష్ఠుడైన వశిష్ఠుడు సాత్విక లక్షణాలను అలవరచుకొని, బ్రహ్మర్షిగా పిలవబడినాడు. గాధేయుడు అనే క్షత్రియుడు రజోగుణ సంపన్నుడై, వశిష్ఠ మహారుషి ఆశ్రమంలో ఆధిత్యాన్ని స్వీకరించి, కామధేనువును తన వెంట తీసుకొనిపోవటానికి బలప్రదర్శనకు పాల్పడి, భంగపాటు చెంది, వెనుదిరుగుతాడు. తిరిగి తన రాజ్యానికి వెళ్లకుండా ఘోర తపస్సు నాచరించి రాజర్షిగా తరవాత మహర్షిగా మారతాడు. తరవాత త్రిశంకునికి త్రిశంకు స్వర్గాన్ని సృష్టించి చరిత్రలో విశిష్ట వ్యక్తిగా మారతాడు. ఆ తరువాత మరింత నియమ నిష్ఠలతో చరించి బ్రహ్మర్షిగా రూపాంతరం చెందుతాడు. ఈ వ్యక్తే విశ్వామిత్రుడు. ఇక్కడ విశ్వామిత్రుడు, మొదట తామస, రజోగుణాలను కలిగి ఉండి చివరకు సాత్విక లక్షణాలను అలవరచుకొనటంవలనే పైన వివరించబడిన సంఘటనలు సంభవించాయి. సాత్విక లక్షణాలను పుణికిపుచ్చుకొన్న మరికొందరు మహాపురుషులలో, దాసీగర్భాన జన్మించిన విదురుడు (మహాభారతంలో), దుష్టనడత కలిగిన రావణ సోదరుడు విభీషణుడు (రామాయణం) వరుసగా శ్రీకృష్ణుని, శ్రీరాముని భక్తులుగా ప్రఖ్యాతిగాంచారు. తమోరజోగుణాలను కలిగి వున్న మరికొందరిలో భక్త అంబరీషుని కష్టపెట్టిన దుర్వాస మునీంద్రుడు, కార్తవీర్యార్జునుడు స్థానం సంపాదించుకున్నారు. దుర్యోధనుడు ఈ కోవలోకే వస్తాడు. తమో రజోగుణాల కలయికగల మిశ్రమ గుణాత్ముడయిన వాల్మీకి, మొదట దొంగగా, తరువాత క్రౌంచ పక్షిని వధించిన వేటగాడుగా పేరు పొందినా ఆ తరువాత సంపూర్ణ సాత్వికునిగా మారి రామాయణ కావ్యకర్తగా జన్మసార్థకం చేసుకొన్నాడు.
ఈ మూడు గుణాలను అధిగమించిన వ్యక్తి పుట్టుక, ముదిమి, మరణం, దుఃఖాలనుండి విముక్తుడై అమృతపదమైన కైవల్యాన్ని పొందుతాడు. పరిసరాలతో ఏమీ సంబంధం లేనట్లు, సత్వగుణమైన సౌఖ్యాన్ని, రజోగుణ ధర్మమైన కర్మ ప్రవృత్తిని, తమో గుణమైన మోహాన్ని పట్టించుకోకుండా అతింద్రియ ధ్యాన యోగాన్ని సాధిస్తాడు. నేటి సమాజంలో అందరూ సాత్వికులుగా ఉండరు. తమ తమ నెలవులను బట్టి, పరిసరాలను బట్టి, అవసరాలబట్టి, తమో, రజో, సాత్విక గుణాలన్నింటిని ఒక నిష్పత్తిలో తమలో ఇముడ్చుకొని జీవితాలను కొనసాగిస్తారు. ఏది ఏమైనా స్వార్థాన్ని వీలయినంత వరకు తగ్గించుకొని తోటివారి ఉన్నతికి (అన్ని రంగాలలో) ప్రతి వ్యక్తీ సమాజం కొరకు పాటుపడితే ఇంతకన్నా మరేమి కావాలి?

-పొత్తూరి రాఘవేంద్రరావు