మంచి మాట

మంచి సంకల్పం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి సంకల్పం అనేది మంచి కార్యఫలితాలకి ఆదిగురువు. మన మనసులో మంచి సంకల్పం అనే బీజం పడితే అది మొలకై, మొక్కై ఎదగడానికి గట్టి కృషి, పట్టుదల, కార్యదీక్ష కలిసి సమిష్టిగా పనిచేస్తాయి.
‘‘మనుషులు కేవలం చేసే పనులే చూస్తారు - భగవంతుడు మన మనసులోని సంకల్పాన్ని చూస్తాడు’’. ఆ మాటల వెనుక ఎంతో అర్థం దాగివుంది. ఒక్కొక్కసారి మంచి సంకల్పంతో మొదలుపెట్టిన పనులు కూడా వెంటనే మంచి ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. అంత మాత్రం చేత ఆ వ్యక్తిని చెడ్డవాడుగానో, అతని ఆలోచనలు అపసవ్యంగా వున్నాయనో హేళన చేయకూడదు. సంకల్పంలో వున్న నిజాయితీని అర్థం చేసుకోవాలి. చిన్న చిన్న తడబాటులున్నా ఓర్పు వహించాలి. వీలైతే మంచి సలహా ఇచ్చి అతడు తన సంకల్పాన్ని నెరవేర్చడానికి చేయూతనివ్వాలి.
శ్రీకృష్ణుడు ఆనాడు పాండవుల తరఫున నిలబడటానికి కారణం బంధుప్రీతితో కాదు. పాండవులు మంచివాళ్లనే ఉద్దేశ్యంతోకాదు- పాండవులు యుద్ధం చెయ్యడానికి వెనుక వున్న సంకల్పంలో న్యాయంగా వుండడం. నిజాయితీగా వుండడం. మంచి సంకల్పానికి ఆ దేవుడి సహకారం కూడా వెన్నంటి వుంటుంది.
మంచి సంకల్పమే మనిషిని మంచి కార్యాలవైపు నడిపిస్తుంది. మంచి వ్యక్తిత్వంతో మామూలు మనిషి నుంచి ‘మనీషి’లా ఎదిగేలా చేస్తుంది. తన మీద తనకి ఆత్మవిశ్వాసాన్ని, గౌరవాన్ని పెంచుకునేలా చేస్తుంది. ప్రతీక్షణం చిరునవ్వుతో జీవించగలిగే ఆత్మస్ధైర్యం అలవడుతుంది. సంతృప్తితో నిండిన జీవిత గమ్యం సొంతమవుతుంది.
అయితే కేవలం సంకల్పంతో, గట్టి ప్రయత్నంతో మనకి ఉన్నతమైన పదవులు లభించవచ్చు. ఆర్థికంగా మంచి స్థితికి చేరుకోవచ్చు. సంఘంలో గొప్ప హోదా పెరగవచ్చు. దానితో పాటే ‘నా అంత గొప్పవాడు ఇంకొకడు లేడు. నా స్వయంకృషితో అన్నీ సాధించుకున్నాను’ అన్న అహం కూడా వచ్చి చేరుతుంది. అవన్నీ భౌతికమైన విజయాలు. మనుషుల్నే తప్ప మనసుల్ని తాకలేని విజయాలు. జీవితం సాగిపోతూ వుంటుంది. విజయమూలాలు అలంకారంగా మెడలో మెరుస్తూ వుంటాయి. చుట్టూ పొగడ్తలతో ముంచెత్తుతూ బంధు సమూహం చేరుతుంది. అయితే అంతరంగం ముందు ప్రతీక్షణం దోషిలా తల వంచుకుని నిలబడాల్సి వుంటుది. మనసు కోరుకునే సంతృప్తి అనేది ఎప్పటికీ దరిచేరదు.
సంతృప్తి లేని జీవితం అంటే స్వప్నంలో తిన్న పంచభక్ష్య పరమాన్నం లాంటిది. సంతృప్తిలేని విజయం ఓటమికన్నా గొప్పది కాదు. మంచి సంకల్పంతో వేసే అడుగు ఎంత చిన్నదైనా అది భగవంతుడి దగ్గరకు చేర్చే సోపానమే అవుతుంది. మంచి సంకల్పం మనసులో వుంటే కర్మలు కొంత నియమాలు తప్పినా అవి దైవకార్యాలే అవుతాయ. రావణాసురుడు గొప్ప శివభక్తుడు. వేద వేదాంగాలూ చదివిన గొప్ప పండితుడు. సకల శాస్త్ర కోవిదుడు. బలవంతుడు. మంచి బలగం వున్నవాడు, లంకాధిపతి. అయితే అవేవీ అతడికి కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టలేకపోయాయి. చరిత్రలో ఒక మంచి స్థానాన్ని ఇవ్వలేకపోయాయి. కారణం ఒక్కటే- అతడి సంకల్పంలో మంచితనం లోపించడమే. చేసిన కర్మల వెనుక దుష్ట సంకల్పం వుండడమే. చేసే పనుల ఫలితం దాని వెనుక దాగివున్న సంకల్పంమీదే ఆధారపడి వుంటుంది.
మనసులో మంచి సంకల్పం దృఢంగా వుంటే మన మాటలే మంత్రాలవుతాయి. కార్యాలన్నీ యాజ్ఞాలై శుభఫలితాలు అందిస్తాయి. మనసే మనిషిని ముందుకు నడిపిస్తుంది. సముద్రాల్ని అవలీలగా దాటి లంకకు హనుమంతుడు చేరుకున్నా, వానర సైన్యం చేత సముద్రం మీద వారథి కట్టించినా, ఆ గంగను భూమిమీదకు రప్పించినా.. వీటన్నింటి వెనుకా మంచి సంకల్పమే కారణం.మనం వేసే ప్రతి అడుగు ముందు ఆ భగవంతుడి ఆహ్వానం వుంటుంది. అచంచలమైన నమ్మకంతో నిండిన మంచి సంకల్పమే ఆ ఆహ్వానాన్ని అందుకుంటుంది. సంతృప్తికరమైన గమ్యానికి మనల్ని చేరుస్తుంది. మనిషికి భగవంతుడికి మధ్య వారధిగా నిలిచేది మంచి సంకల్పమే.

-డి.స్వర్ణశైలజ