మంచి మాట

దివ్య సందేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉపదేశం అంటే ఒకరు, మరొకరికి దగ్గరగా కూర్చుని చెప్పే మంచిమాటలు. శ్రీమదాంధ్ర మహాభారతం శాంతి పర్వంలో భీష్మాచార్యులవారిని ధర్మరాజు, పితామహా! మానవుడు సుఖం పొందే మార్గం ఏదీ? అని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా భీష్ముడు ఒక పుత్రునికీ, తండ్రికీ మధ్య జరిగిన సంవాదమును ఉదాహరణగా చెబుతూ సమాధానం వినమన్నాడు. రాజా! స్వాధ్యాయాన్ని నిరంతరం అధ్యయనం చేసే ఒక ద్విజునికి మేధావి అనే సార్థక నామధేయుడైన పుత్రుడున్నాడు. లోక వ్యవహారం బాగా తెలిసిన వాడు. మోక్ష - ధర్మ అర్థాలలో నేర్పరి. కుశలుడూ కూడా! ఒకనాడు ఆ పుత్రుడు తండ్రి దగ్గరకు చేరి, తండ్రీ మానవుని ఆయుర్దాయం అతి శీఘ్రంగా క్షీణించిపోతుంది కదా! మరి తాను ఎలాంటి ధర్మాన్ని ఒక పద్ధతిలో ఎలా అనుష్ఠించాలో తెలుపమని ప్రశ్నించాడు. తండ్రి వివరిస్తూ, పుత్రా! బ్రహ్మచారిగా వుండి ముందుగా వేదాధ్యయనం చేయాలి. పిదప పుత్రులను కనడం కోసం పితృదేవతలను ఆరాధన చేయాలి. అగ్నిని ప్రథమంగా పూజిస్తూ యజ్ఞాలు ఆచరించాలి. తదుపరి అరణ్యాలకు వెళ్లి వానప్రస్థుడిగా కొంతకాలం వుండి ఆత్మజ్ఞానం సంపాదించడానికి యత్నించాలి అన్నాడు తండ్రి.
కుమారుడైన మేధావి, తండ్రీ! కాలమహిమ తెలిసి కూడా, పరిస్థితులను అర్థం చేసుకొని ధీరుడువలే యిలా చెప్పుట ఎందులకన్నాడు. అది విని తండ్రి, ఏమిటిది? ననే్నదో భయపెడుతున్నట్లు పలుకుతున్నావు. నీ మాటలో కొట్టడం- కప్పేయడం ఎగిరిపోతున్నవి అనే భావన వినబడినది. వాటి అర్థం తెలుసా అన్నాడు.
పుత్రుడైన మేధావి తండ్రితో ఇలా అన్నాడు. లోకాన్ని మృత్యువు హరిస్తూనే వున్నది. ముసలితనం కప్పివేస్తున్నది. రాత్రీ, పగళ్లూ ఆగక పరుగిడుతూనే వున్నాయి. అలాంటప్పుడు ఈ పనులన్నీ నీవు చెప్పినట్లుగా చేసుకుంటూ పోతూవుంటే మనకు శ్రేయోమార్గం ఎలా లభిస్తుంది? గడ్డిపరకలు ఏరుకుంటూ తింటున్నట్లు, తింటున్నవానిని గభాలున వచ్చి మీదపడి తోడేలు గొఱ్ఱెను తీసికొనిపోయినట్లు మృత్యుదేవత లాగికొనిపోతూ వుంది. ఏది శ్రేయస్కరమో ఆ పని ఈనాడే చేయి. రేపు చేద్దాం అనుకున్న పని నేడే చేయాలి. వీడు పని పూర్తిచేశాడా లేదా అని మృత్యువు నిరీక్షించదు. ‘నహి ప్రతీక్షతే మృత్యుః’ అని శాస్త్రం కదా.
యువకునిగా ఉన్న వేళల్లోనే ధర్మం ఆచరించాలి. జీవితం అశాశ్వతం కదా! ధర్మం ఆచరిస్తేనే కీర్తి కలిగి మరణానంతరం సుఖం కల్గుతుంది. పుత్రులు, పశువులు- సంపదలతో మనసంతా అన్యకార్యాసక్తమవుంటే, నిద్రపోతున్న లేడిని పులి ఎగరేసికొనిపోయినట్లు మృత్యువు తీసికొనిపోతుంది. అరణ్యం అనేది దేవతల నివాస ప్రదేశం. అమృతం - మృత్యువు ఈ రెండూ దేహంలోనే వున్నాయి. మోహంవలన మృత్యువును పొందుతాడు. సత్యం చేత అమృతమును పొందుతాడు. నాకు ఇతర యజ్ఞ యాగాదులతో పనిలేదు. నేను శాంతి యజ్ఞరతుడనై యుండి, బ్రహ్మ యజ్ఞంలో స్థిరపడి, వాక్, మనః కర్మలనే యజ్ఞములతో నేర్పుతో ఉంటాను. లోకంలో ఎవరు తమ వాక్కును, మనస్సునూ అదుపులో ఉంచుకుంటారో, ఏ పనిలో త్యాగం- సత్యం - తపస్సు నిండి వుంటాయో అట్టివారు అన్నింటినీ పొందగలుగుతారు. ఏకత్వము, సమతాభావదృష్టి- సత్యనిష్ఠ- సచ్ఛీలము- స్థిరత్వమూ దేనినీ దండించకుండా వుండుట, ఋజుత్వము. ఆయా కర్మల నుండి మెల మెల్లగా దూరంగా ఉండడం వీటిని మించిన సంపద. ధనం, ఐశ్వర్యం మరొకటి ద్విజునికి లేదు. మరణించేవారి ధనాలెందుకు? చదువులెందుకు, భార్య ఎందుకు? రహస్య ప్రదేశంలో దాగివున్న ఆత్మను అనే్వషించుకో. నీ పితామహులు ఎక్కడికి వెళ్లారు? నీ తండ్రి ఎక్కడికి వెళ్ళాడు? నీకేమైనా ఎరుకగలదా? అనే శాస్త్ర వచనాలను తెలుసుకొని నడుచుకోవాలంటూ పుత్రుడైన మేధావి తండ్రికి మోక్షమార్గాన్ని ఉపదేశించాడని భీష్ముడు ధర్మరాజుకు దివ్యసందేశాన్ని అందిస్తూ, రాజా! నీవు కూడా పుత్రుని మాటలు విని తండ్రి ఏమి చేశాడో అలాగే సత్య, ధర్మ పరాయణుడవై నా ఉపదేశం ఆలించి అలాగే చేయమన్నాడు.

- పి.వి.సీతారామమూర్తి