మంచి మాట

సుప్రతీకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాచీన కాలంలో యుద్ధ రంగంలో సైనికులతోపాటు అశ్వికదళానికి, గజబలానికి ప్రాధాన్యత ఉండేది. మహాభారత యుద్ధంలో ఇలాంటి ఒక శక్తివంతమైన, మహత్తరమైన ఏనుగు కౌరవ పక్షాన పోరాడి పాండవ సేనలు ముప్పుతిప్పలు పెట్టింది. ఆ విశిష్ట గజమే సుప్రతీకం! ప్రాగ్జోతిష పాలకుడైన భగదత్తుని వాహనం ఇది. అన్ని ఏనుగులలాగా కాక దీనికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఉసిగొల్పగానే అది విరోధి మూకలపైన విజృంభిస్తుంది. కురుక్షేత్రంలో పనె్నండో రోజున దుర్యోధనుని కోరికపై భగదత్తునితోపాటు సుప్రతీకం కూడా రణరంగంలో ప్రవేశించింది. దీని మొదటి పోరాటం భీమసేనునితోనే. ఈ మహాగజం భీముని రథాన్ని తన తొండంతో పైకి ఎత్తి నేలకేసికొట్టింది. భీముడంతటివాడు చివరి నిముషంలో దుమికి దాని పొట్ట క్రింద ఎలాగో దాక్కుని అపాయం నుండి తప్పించుకొన్నాడు. భీమునకు ఏనుగుల మనోభావాల గురించి బాగా తెలుసు. భీముడు కనపడకపోవడంతో ‘్భముడు నలిగిపోయాడు’ అనే నినాదాలు మిన్నుముట్టాయి.
ధర్మరాజు భీతావహుడై దశార్ణవ రాజును భీముని సాయానికి వెళ్లమని ఆదేశించాడు. ఇతడు కూడా గజ బల శిక్షణకు సంబంధించిన పరిజ్ఞానం కలవాడే! కానీ సుప్రతీకం ఈ వీరుని అతని వాహనమైన ఏనుగులతో సహా మట్టుపెట్టింది.
ఇప్పుడిక సాత్యకి రంగంలో ప్రవేశించాడు. అతని రథానికి కూడా అదే గతి పట్టింది. సాత్యకి బ్రతుకు జీవుడా అని పారిపోయాడు. ఆ ఏనుగు విధ్వంసకాండ కొనసాగించింది. రథాలను పిండి చేసి గుర్రాలను పీచమణచి కాల్బలాన్ని తన కాళ్ల కింద నలిపివేసింది. భీముడు మళ్లీ ప్రయత్నించినా ఆ ఏనుగు అతని రథపు గుర్రాలను తీవ్రంగా గాయపరిచింది. వాటి శరీరాలు రక్తప్రవాహంతో నిండిపోయాయి.
ఈ విధ్వంసక శబ్దాన్ని విన్న అర్జునుడు ఇది ఆ మహాగజపు పనే అని గ్రహించి కృష్ణుని రథం అటువైపు పోనిమ్మని కోరాడు. భగదత్తుడు పదునాలుగు బాణాలను వరుసగా అర్జునిపై ప్రయోగించాడు. భగదత్తుడు ఒక ఇనుప బల్లెం లాంటి ఆయుధాన్ని కృష్ణునిపై విసిరాడు. దానిని అర్జునుడు మధ్యలోనే ఛేదించాడు. ఆయన వేసిన బాణంవల్ల సుప్రతీకం పాలభాగాన గాయం అయింది.
భగదత్తుడు మదగజాన్ని పురికొల్పడానికి శతవిధాలా యత్నించాడు. ఆ గాయపడిన గజం కదలడంలేదు. భగదత్తుడు కృష్ణార్జునులపై ‘వైష్ణవాస్త్రం’ ప్రయోగించాడు. అది భగ భగమనే మంటలతో దూసుకువస్తున్నది. శ్రీకృష్ణుడు మెల్లగా రధం నుండి క్రింద నిలబడ్డాడు. ఆ అస్త్రం మెల్లగా మెడ చుట్టూ తిరిగి ఆయన వక్షస్థలాన్ని ఒక పూలహారంగా అలంకరించింది. ‘కృష్ణార్జునులు నశించారు’ అంటున్న వాళ్లలో ఆశ్చర్యం నిండిపోయింది.
అర్జునుడు కృష్ణునితో ‘‘స్వామీ! నేను యుద్ధం చేయనని చెప్పి ఇలా నన్ను దీన పరిస్థితికి చేర్చారు’’ అన్నాడు. అప్పుడు స్వామి ‘‘నాయనా! ఇది సామాన్యమైన బాణం కాదు. దీనిని ఎవరూ నిరోధించలే రు. అందుకే నేను నిన్ను కాపాడవలసి వచ్చింది. తన దివ్యాయుధం నిరుపయోగమైనందుకు భగదత్తుడు నిరాశలో నిండి ఉన్నాడు. అతనిని, ఆ ఏనుగును దెబ్బతీయడానికి ఇదే తగిన సమయం’’ అని అర్జునునికి ఉద్బోధించాడు. ఒక శక్తివంతమైన బాణం ప్రయోగించడంతో ఆ ఏనుగు క్రిందపడి మరణించింది. మరో బలమైన బల్లేన్ని విసరడంతో భగదత్తుని అధ్యాయం పరిసమాప్తమైంది.
కౌరవ సేనలు భగదత్తుని పతనంతో చెల్లాచెదరైపోయారు. అప్పటికే ద్రోణాచార్యుడు ధర్మరాజువైపు దూసుకొని వస్తున్నారు. భగదత్తుని మరణంతో కొత్త బలంతో దృష్టద్యుమ్నుడు మొదలగువారు ధర్మరాజుని రక్షించారు. ఈ విధంగా ఒక మహాయోధుడు నేలకొరిగాడు. అప్రతిహతమైన ఆయన మహాగజం కూడా అసువులు బాసింది.
దీనివల్ల మనకు తెలిసేదేమంటే దుర్జనులు ఎంత బలం కలవారైనా సరే వారికి వారి అన్యాయం వారి దుర్నీతిని వారిని అపజయం వైపు అడుగులు వేయస్తుంది. సత్యధర్మాలను నమ్ముకున్నవారికి కాలయాపన జరిగినా విజయం వారినే వరిస్తుంది.

-కాకుటూరి సుబ్రహ్మణ్యం