మంచి మాట

శరణాగతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శరణాగతి తత్వమునకు కాలము ప్రధానము. ‘కాలేన అనవచ్ఛే దాత్’ అంటే కాలమునకు లొంగనివాడు భగవంతుడొక్కడే. కాలానికి లొంగకపోవడమే కాదు, కాలాన్ని తన ఆధీనంలో వుంచుకుంటాడు భగవంతుడు. కాలవశుడు జీవుడు. కాలాతీతుడు దేవుడు. మృత్యుగ్రస్తుడు జీవుడు. అమృత స్వరూపుడు దేవుడు. అందువల్లే దైవత్వమును ఆశ్రయించినప్పుడే కాలముతో కూడిన జీవతత్వము సార్థకం అవుతుంది. కాలకాలుడు అని కూడా భగవంతుని అంటారు. ‘కాల కాల ప్రపన్నానాం కాల భిన్నం కరిష్యతి’ అంటే కాలం జీవుడ్ని మింగుతుంది. కాని కాలానే్న మింగేవాడు దేవుడు. కనుక కాలాన్ని ఆధారం చేసుకుని జీవుడు తన కర్మలను ఆరాధన చెయ్యాలి. మొదట కర్మను ఆరాధన చేసి, కర్మమునకు నమస్కరించి ఏదైనా ప్రారంభించాలి. ఎందువల్లనంటే మనిషియొక్క పాపానికిగాని, పుణ్యానికిగాని, మంచికి కాని, చెడుకిగాని, ఉచ్ఛస్థితికిగాని, నీచస్థితికికాని కాలమే ప్రధానం. అంచేత మనం చేసే పనికి ముందు ఓ కాలస్వరూపుడైన భగవంతుడా! నన్ను పవిత్రమైన రీతిలో ప్రవేశపెట్టి, నేను చేసే ప్రతి పని సార్థకమైనదిగా తీర్చిదిద్ది నీ సన్నిధిలో, నీ పెన్నిధిలో నన్ను వుంచుకుని, నాకు రక్షకుడుగా వుండు’’ అని వేడుకోవాలి.
దృశ్య కల్పితమైన, మాయాపూరితమైన రుూ ప్రపంచం అంతా కాలములో లీనమైనటువంటిది. కాల ప్రభావముతో చేరినటువంటిది. కాలాన్ని ధిక్కరించి ఏ జీవీ జీవించలేదు. కాలం ఎవరికోసం ఆగదు. ప్రతి జీవి కాలమునకు అనుసరించి వుండవలసిందే! కాని కాలము జీవుని అనుసరించదు. కాలం ఓ పెద్ద ప్రవాహం వంటిది. సమస్త జీవులు, సమస్త పదార్థాలు ఈ కాల ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయి. ప్రవాహంలో కొట్టుకుపోతున్న వ్యక్తి అదే ప్రవాహంలో కొట్టుకొని పోతున్న మరో పదార్థాన్ని ఆశ్రయించినపుడు అది ఏ మాత్రం మనిషిని రక్షించలేదు. తను, తనాశ్రయించిన పదార్థం రెండూ ప్రవాహంలో కొట్టుకుపోతాయి. అందువల్ల కాల ప్రవాహంలో వుండే వ్యక్తులను గాని, పదార్థాన్నిగాని ఆశ్రయించడం, అంధులు అంధులను ఆశ్రయించినట్టు, అనుసరించినట్టు వుంటుంది. ఒక ఒడ్డుని ఆశ్రయించినపుడే తాను ‘రక్షితుడు’ కాగలడు. ఆ ఒడ్డే దైవము. ఆ గట్టే దైవము. అటువంటి దైవాన్ని ఆశ్రయించిన వ్యక్తి ఈ ప్రవాహానికి దూరమై, బాధలకు దూరమై, దుఃఖాలకు దూరమై విచారములకు దూరమై ఆనందంతో సంతోషంతో తన కాలాన్ని అంకితం చేసుకోగలడు.
‘నువ్వు ఈ కాల ప్రవాహంలో కొట్టుకుపోయే జీవివి. నీకు ఒడ్డు నేనే! నన్ను ఆశ్రయించినప్పుడే నువ్వు ఈ బాధలకి, దుఃఖాలకి గురికావు. కాబట్టి నన్ను ఆశ్రయించు!’ అంటూ తన యొక్క శరణాగతి తత్వాన్ని శ్రీకృష్ణపరమాత్మ బోధించాడు.
శరణాగతి అయిన తరువాత సర్వస్వము భగవంతునికి అర్పితం చెయ్యాలి. ఏవి, ఎప్పుడు, ఎక్కడ, ఎలా చేయాలన్నది అన్నీ భగవంతుడే చూసుకుంటాడు. ఇంక నాది నాకు అన్న అహంకారం ఏ మాత్రం వుండకూడదు. దీనికి రామాయణంలో ఓ చక్కటి చిన్న ఉదాహరణ చెప్పుకోవచ్చు. శ్రీరాముడు, సీత, లక్ష్మణులతో కలిసి చిత్రకూట పర్వతం చేరాడు. భగవంతుడు ఎప్పుడూ లీలామానుష విగ్రహడు. నటన సూత్రధారి, ఏ బాధలు, దుఃఖము, విచారము లేకపోయినప్పటికీ, దుఃఖంగానూ, విచారంగానూ, కష్టంగానూ వున్నట్టు నటిస్తాడు. శ్రీరామచంద్రుడు మనుష్యాకారం పొందినప్పుడు, మానవాతారకత్వాన్ని పొందినపుడు మనుషులకు సన్నిహిత సంబంధుడవుతాడు. భక్తులకు అందుబాటులో, అనుకూలముగా వుండే నిమిత్తం యిలా మానవాకారం ధరిస్తూ వుంటాడు. రాముడు పర్ణశాల నిర్మించే విషయంలో లక్ష్మణుడితో నీ ఇష్టం వచ్చిన చోట నిర్మించమని చెప్పాడు. అపుడు లక్ష్మణుడు రామచంద్రా! ఇదేమి నాకొక ఇష్టం అంటూ ఏమి ఉంది. నీవే ఎక్కడ నిర్మించమంటే అక్కడ నిర్మిస్తాను నేను కేవలం నిమిత్తమాత్రుణ్ణి నేను నీకు శరణాగతి పొందాను అని చెప్పాడు.
ఈవిధమైన శరణాగతి పొందితేనే అది శరణాగతి అవుతుంది కాని మరొకలాగా కాదు. ‘సర్వం నీదే’ అంటూ భగవంతునికి అర్పితము గావించడమే శరణాగతి యొక్క లక్షణం. సర్వకాల, సర్వావస్థలయందు భగవంతుని స్మరించడమే శరణగాతి!

- శివాని