మంచి మాట

ఉత్తములు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏనుగుల్లో ఐరావతం, గుర్రాల్లో ఉశ్ఛైశ్రవం, వృక్షాల్లో కల్పవృక్షం, ధేనువుల్లో కామధేనువు, పక్షుల్లో కోకిల, వానరుల్లో హనుమంతుడు, పురుషుల్లో పురుషోత్తముడనే కృష్ణ భగవానుడు ఉత్తమ వర్గానికి చెందుతారు.
సత్యశీలత, సనాతన ధర్మనిరతి, సహన గుణ సాంప్రదాయము, సమర సాహసము, సమానత్వ గుణము మొదలగు ఉదాత్త లక్షణాలతో ఉన్నత శిఖరాలందుకొన్న ఉవిదలు, తమ మాన్య మానసాలతో జాతి నీతిని, భాతిని, విమల విఖ్యాతిని నిండుగ మెండుగ దండిగ నిల్పుకొన్నారు. కీర్తికి కిరీటాలుగా నిలిచారు.
కామంధుండగు రావణాసురుడు పతివ్రతా శిరోమణి అగు సీతమ్మను చెరబట్టి లంకలో శింశుపావృక్షం క్రింద నిర్బంధించిన సమయంలో, ఆ సీతాదేవి, కఠినుడగు రావణుని కర్కశ పల్కులను లెక్కచేయక ఏకపత్నీవ్రతుడగు శ్రీరామచంద్రుని తన మానసంలో మహోన్నతంగా నిల్పుకొని తదేక దీక్షతో స్మరించింది. కానీ లోకాపవాదాన్ని బాపుటకై శ్రీరాముని ఆదేశానుసారం, అగ్నిప్రవేశం చేసింది. అగ్నిదేవుడు ఆమెను సురక్షితంగా బయటికి పంపించారు. అగ్నికి ఆహుతి కాకుండా యథావిధిగా వచ్చిన సీతమ్మ మచ్చలేని మహిళామణిగా గుర్తించారు.
స్ర్తిలను గౌరవించుట మానవ ధర్మమని, అప్పుడే ప్రకృతి మాత పరవశించి ఉపద్రవాలను ఉపసంహరించుకొంటుందని, భవిష్యత్తును పల్కిన బ్రహ్మంగారు తన రచనా గ్రంథమగు కాళికాంబా శతకంలో పేర్కొన్నారు. అట్లే శతావధాని శ్రీ భూతపురి శర్మగారు తన కృష్ణ్భారతంలో ఒక సన్నివేశంలో స్ర్తిలు అనలజ్యోతులని కుల మత భేదాలకు అతీతంగా చల్లని మానసాలతో ఉల్లామలరగా వారితో భాషించాలనీ పేర్కొన్నారు. శ్రీ గురజాడ అప్పారావుగారు కన్యాశుల్కం అనే నాటకాన్ని రచించి బాల్య వివాహాలను ఎండగట్టాడు. వితంతు వివాహాలను ప్రోత్సహించిన రాజారాం మోహనరాయ్ సైతం చిరస్మరణీయుడు. సృష్టిలో స్ర్తీల పాత్ర ధాత్రికే మకుటాయమానం. సర్వలోకాలను పాలించే సర్వేశ్వరి అంశతో పుట్టే పునీతతారకలనుటలో సందేహం లేదు. అందుకు అనసూయ నిదర్శనం. ఆమె తమ ఆశ్రమం మీదుగా వెళ్ళే త్రిమూర్తుల ప్రయాణాన్ని భగ్నం చేసింది. వారు అసలు విషయం తెలిసికొని ఆమె పవిత్రతను పరీక్షించాలని మారువేషాలతో ఆశ్రమానికి వచ్చారు. దిగంబరధారి అయిన స్ర్తి తమకు ఆతిథ్యమిస్తే స్వీకరిస్తామన్నారు. అనసూయ వారిపై మంత్రాక్షతలు చల్లి చిన్న పిల్లలుగా చేసి దిగంబరధారియై వారి క్షుద్బాధను పోగొట్టింది. త్రిమూర్తుల భార్యలు, తమ భర్తలను వెదుకుకుంటూ వచ్చి, అనసూయ చేసిన ప్రతిభా విశేషాలను ప్రశంసించి, తమ భర్తల అసలు స్వరూపాలను ప్రసాదించమని పల్కారు. వారి కోరిక మన్నించిన అనసూయ త్రిమూర్తులకు స్వస్వరూపాలను దయచేసింది.
మరణించిన తన భర్తను తీసుకుపోవుచున్న యమధర్మరాజును వెంబడించిన సావిత్రి సాహసశక్తి, యుక్తి, పతిభక్తి కొనియాడతగింది. సావిత్రి పట్టుదల, దీక్ష, కార్యసాఫల్యము కావ్యాల్లో సువర్ణాక్షరాలతో లిఖింపబడ్డాయి.
శ్రీకృష్ణ పరమాత్మ లీలలు మహాద్భుతాలు. అవి నిత్యసత్యాలు. పరమ భాగవతోత్తమురాలుగా ప్రణతుకెక్కిన రుక్మిణి, ఆ మహితాత్ముని వరించింది. ఆమె భక్తికి సాటిలేదు. అసమానత్వాన్ని అందలమెక్కించే సత్యభామ, కృష్ణుడు తనకే సొంతం కావాలనీ, ఇతర అష్ట్భార్య ఇండ్లకు అరుగరాదనీ, పుణ్యకవ్రతం చేసింది. ప్రణయ అహంకారాన్ని పరమాత్ముడు అంగీకరించలేదు. ఆమె విభవాన్ని సర్వం తెచ్చి త్రాసులో వేసింది. కృష్ణుడు తూగలేదు. భర్త పరాధీనమయ్యే ప్రమాదం ముంచుకువచ్చింది. బిరబిరా రుక్మిణీ సతి వద్దకు వెళ్లి భోరున ఏడ్చింది. పతి సేవయే పరమాత్మ సేవగా అదే తన పరమ ధర్మంగా భావించిన రుక్మిణి వెంటనే వెళ్లి ఒక తులసీదళాన్ని త్రాసులో వేసింది. పరమాత్మ ఉండే త్రాసు పైకి లేచింది.
ఎవరి ధర్మాన్ని వారు తమ కర్తవ్యనిష్టతో పాటించాలి.సత్యధర్మాలను తమ ప్రాణంగా భావించేవారికి సమదృష్టి అలవడుతుంది. భగవంతుని తత్వం సులభంగా తెలుస్తుంది. ఎన్ని కష్టనష్టాలు కలిగినా కలియుగంలో ధర్మాచరణతో ఉన్నవారికి భగవంతుడు తోడునీడగా సదా ఉంటూనే ఉంటాడు. వారి ఆదర్శ్రపాయులుగా మిగులుతారు. ఇలా ఎందరో ఉత్తముల జీవితగాథలు, భారతమాత కంఠాభరణమై, కమ్రకాంతులతో విరాజిల్లుతూ ఉన్నాయి.

-విద్వాన్ వల్లూరు చిన్నయ్య