మంచి మాట

మాటల మహిమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది’ అనే సామెత మాటఎంత ముఖ్యమైనదో ఎంత పదునైనదో చెబుతుంది. మంచిమాటలు మాట్లాడిన వారికి పూలబాట ఏర్పడితే నోటి దురుసు వారికి ముళ్లబాటలే అగు పడుతాయ. శత్రువులనైనా మాటలతో రజింపచేయవచ్చు అని పురాణాలు చెబుతున్నాయ.
హితాన్ని కలిగించేది, దుఃఖాన్ని కలగించకుండా ఉండే మాటలను మాట్లాడేవారు సజ్జనులుగా కీర్తించబడుతారు. వౌనం బంగారం మాట వెండి అని అన్నాసరే మాట ద్వారానే ఎన్నో మంచిపనులు చేయవచ్చు.
కొందరు సమయానుకూలంగా మాట్లాడి ఎదుటివారి కష్టాన్ని పోగొట్టుతారు అంతేకాకవారిని శాంతచిత్తులను చేసి వారు ధర్మాచరణను తప్పకుండా ఉండేలా చేస్తారు.రామాయణంలో సీతమ్మను రావణుడు అపహ రించాడు. ఎనె్నన్నో ప్రలోభాలు పెట్టాడు. మాటలతో ఎంతో హింసించాడు సీతమ్మను. వాటి అన్నింటినీ పడలేక ఆ సీతమ్మ చనిపోవాలని ప్రాణత్యాగానికి సిద్ధ పడింది. అపుడే మారుతి ఆ తల్లిని చూశాడు. ఆమె మనసు శాంతి పొందే లా మంచి రామకథను గానం చేశాడు. ఆ తరువాత మెల్లగా చెట్టు దిగి వచ్చి రాముని వార్తలను వినిపించాడు. ఆ తల్లిని వూరడించాడు. బతుకుపై ఆశకల్పించాడు. ఆమెలో మనో ధైర్యాన్ని నూరిపోశాడు. అట్లానే రాముని దగ్గరకు వెళ్లి సీతమ్మ కనబడిందని చెప్పి రామునిలో గూడుకట్టుకున్న నైరాశ్యాన్ని పారద్రోలాడు. రామునిలో ఆశను చిగురింప చేశాడు.
అంతేకాదు. ఇచ్చిన మాట మరిచిపోయ సుఖలాలసలో మునిగి పోయన సుగ్రీవునికి బుద్ధి చెప్పి కర్తవ్య బోధ చేసి కార్యోన్ముఖుడిని చేశాడు. రామునితో సుగ్రీవునికి సఖ్యత కలిగించాడు. సకల కార్యాలు సానుకూలపడే విధంగా చేసుకోవడానికి మనం మాట్లాడే మాట శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడుతుంది. కనుక మాట్లాడేటపుడు ఎంతో నేర్పుతోను, అహంకారం లేకుండా ఎదుటి వారిని నొప్పించకుండా మాట్లాడాలి. ఇలా మాట్లాడడం కూడా ఒక కళేనంటారు.
ఆచితూచి మాట్లాడాలి. మితభాషిగా ఉండాలి. హితమైన కార్యాలు చేస్తూ నలుగురికి హితవాక్యాలనే చెప్పాలి. అర్జునుడు కూడా బలశాలి. పరాక్రమతేజోవిలాసి కాని కురుక్షేత్రరంగంలో తనవారితో తాను యుద్ధం చేయవలసి వచ్చేసరికి తనకు అంతకుముందు జరిగిన అవమానాలను నష్టాలను అన్నింటిని మరిచి అయ్యో! నావారితోనే నేను యుద్ధం చేయాల్సి వచ్చిందే అని నీరుగారి పోయాడు.
వెంటనే అక్కడే ఉన్న కృష్ణుడు తనకు ధైర్యాన్నిచ్చాడు. కర్తవ్యాన్ని బోధించాడు. చేయవలసిన కర్మను చేయడానికి ధైర్యస్థైర్యాలను కలిగించాడు. దాంతోధైర్యం కోల్పోయన అర్జునుడు తిరిగి జవసత్వాలను కూడగట్టుకున్నాడు. గాండీవాన్ని చేతబట్టాడు. అన్యాయాలను ఎదుర్కొన్నాడు. ధర్మాన్ని స్థాపించడంలో ముందున్నాడు. విజయుడై నిల్చున్నాడు.
అట్లా మనం మాట్లాడే మాటలు ఎదుటివారికి హితాన్ని కలిగించాలి. వారిలో ఆత్మానందాన్ని కలిగించాలి. ఆపదలను ఎదుర్కోవచ్చనన్న స్థైర్యం వారిలోకలిగించాలి. మాట్లాడే మాటల్లో అపశబ్దాలు రానివ్వకూడదు. సోత్కర్ష ఉండకూడదు. అట్లాఅని ఎదుటివారికి లేని గొప్పతనాన్ని కూడా అంటకట్టకూడదు.సత్యమే ప్రియంగా మాట్లాడాలి. ఒకవేళ తప్పు కనుక ఉంటే ఆ తప్పు మరలా చేయకుండా ఉండే నైతికపరివర్తన కలిగించే మాటలు మాట్లాడడం మంచిది.

- సి. శ్రీనివాసరావు