మంచి మాట

దివ్యదీపావళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుష్టశక్తులపై దైవీశక్తులు సాధించిన ఘన విజయ చిహ్నమే దీపావళి. ‘దీపం’ లక్ష్మీదేవి రూపం. సకల శుభాలకు, సంపదలకు చిహ్నం, దీపమే చీకట్లు పోగొట్టి సత్య దర్శనం చేయిస్తుంది. అనేక దీపాల వరసయే దీపావళి.ప్రతి సంవత్సరం ఆశ్వీయుజ మాస శుక్లపక్ష అమావాస్యనాడు దీపావళి పండుగ జరుపుకోవడం మన సంప్రదాయం.
శుభం భవతు కల్యాణి ఆరోగ్యం ధన సంపదః
మమ శత్రు వినాశాయః సంధ్యా జ్యోతిర్నమోస్తుతే
అంటూ దీపాలను వెలిగిస్తాం.
‘‘హిరణ్య వర్ణాం హరిణీమ్ సువర్ణ రజతస్రజామ్ చంద్రాం హిరణ్మరుూం లక్ష్మీం జాతవేదో మమావహా’’ అనే శ్రీసూక్తాన్ని పఠిస్తూ మహాలక్ష్మీదేవిని ఆరాధించడం దీపావళి ప్రత్యేకత. పాలకడలినుంచి ఉద్భవించిన మహావిష్ణువుకు ఇల్లాలైన మహాలక్ష్మి వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వస్తుందని ఆమెకు ఆహ్వానం పలకడం ఈ దీపావళిలోని ఓ విశిష్టత. దీపావళి సాయంసంధ్యవేళ ఇంట్లో వాకిటిలోను ఇంటి చుట్టూరా దీపాలను వెలిగించి టపాసులను కాలుస్తారు. లక్ష్మీదేవి పూజ చేస్తారు. దీనివల్ల మనసులోని అజ్ఞానం దూరమవుతుంది. దానితో పాటుగా పరిసరాలు పరిశుభ్రం అవుతాయ. సాధారణంగా దీపావళి పండుగను ఐదురోజులు జరుపుకుంటారు.
చంద్ర మండలం ఉపరితలం మీద నివసించే పితృదేవతలకు, అమావాస్య తిథి- మిట్టమధ్యాహ్నం అవుతుంది. సూర్యుడు తులారాశిలో ఉండగా వచ్చే దీపావళి అమావాస్యనాడు పితృ తర్పణాలు ఇస్తే వారికి ఉత్తమ లోకప్రాప్తి కలుగుతుందని శాస్త్రాలు పేర్కొన్నాయి. నరకంలో ఉన్న పితరులు ఈ రోజులలో బయటకు వస్తారని, వారికి కొరువులు అనగా దివ్వెలు దారి చూపిస్తాయని, నరక నివారణార్థం బాణా సంచా కాలుస్తారు. అమావాస్యనాడు పితృదేవతలకు తర్పణాలు యివ్వడం విధాయకం. జైన మత స్థాపకుడు వర్ధమాన మహావీరుడు దీపావళి అమావాస్యనాడు సిద్ధి పొందాడు. ఆ మహనీయుని దివ్య ఆత్మకు శ్రద్ధాంజలి చిహ్నంగా జైనులు దీపావళి జరుపుకొంటారు.
దీపావళికి ముందు ధనత్రయోదశి అని, వ్యాఘ్రద్వాదశి అని దీపావళి తరువాత బలిపాడ్యమి అని. యమవిదియ అని ఐదురోజులు జరుపుకుంటారు. బలిపాడ్యమి - బలిదాన గుణానికి సంతోషించి, వామనుడు అతనికి జ్ఞాన జ్యోతిని ప్రసాదించాడు. అజ్ఞాన చీకటిని పారద్రోలి జ్ఞాన దీపాల్ని వెలిగించటానికి సంవత్సరానికి ఒకసారి బలిచక్రవర్తి పాతాళంనుంచి భూమి మీదకు వచ్చే వరాన్ని పొందాడు. ఆ కారణంగా ఈ పండుగ చేసుకొంటారు.
దీపావళి మరునాడే కార్తికమాసారంభం. కార్తికంలో శివపూజలు ప్రత్యేకం. మొట్టమొదటి రోజు కార్తిక విదియ ఆరోజున యమవిదియ అని ‘్భగినీ హస్త్భోజనం’ అని అన్నదమ్ములు అక్కచెళ్లల ఇంటి విందుఆరగిస్తారు. దీనికి కారణం యమధర్మరాజు చెల్లెలైన యమున యింటికి ఈరోజున భోజనానికి వెళ్లాడట. అక్కడ ఆమె చేతి వంట తిని ఆ అప్యాయతను చవి చూసి చెల్లెల్ని ఏదైనా కోరుకోమన్నాడు. ఈరోజున సోదరి చేతి వంట తినే సోదరుడికి, నరక లోకప్రాప్తి, అపమృత్యు దోషం లేకుండా వరం ప్రసాదించవలసిందిగా ఆమె కోరింది.యముడు ‘తథాస్తు’ అన్నాడు . అందుకే ఈరోజు సోదరులు, సోదరీమణుల ఇండ్లల్ల్లో భోజనం చేస్తారు.
పరమేశ్వరుడిని దివ్యజ్యోతిగా ఆరాధించడమనేది హైందవుల సంప్రదాయం.
‘‘నతత్ర సూర్యో భాతి న చంద్ర తారకమే యస్య భాసా సర్వమిదం విభాతి’’
ఆ పరమేశ్వరుని రూపాలే సూర్యచంద్ర నక్షత్రాదులు ప్రకాశిస్తున్నాయి. కనుక, సూర్యచంద్ర నక్షత్రములు కూడా దీపములే. దీనినే వేదము ‘‘వేదాహమేతం పురుషం మహాంతమ్ ఆదిత్య వర్ణం తమసః పరస్తాత్’’ చీకటిని తరిమేసి వెలుగునిస్తూ ఆదిత్య స్వరూపుడైన ఆ పరమాత్మయే ప్రథమ దీపము అనేది వేదవాక్యం. అజ్ఞాన తిమిర శత్రువులను సాత్విక సామరస్యమనే విజ్ఞాన జ్ఞాన జ్యోతిచే పారద్రోలి, జీవితాన్ని సుఖమయం సుసంపన్నం చేసుకోవాలనే ఆధ్యాత్మిక తత్త్వాన్ని బోధించి, ఆనందమయ జీవన సరళికి మార్గాన్ని దర్శింపచేసే వెలుగుల పండుగ ‘‘దీపావళి’’.

- చోడిశెట్టి శ్రీనివాసరావు