మంచి మాట

నాగుల చవితి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయులు ప్రకృతి ఆరాధకులు. భగవత్సృష్టియైన ఈ జగత్తులో స కల చరాచరమలు భారతీయులకు ఆరాధనీయమే. పంచ భూతాలతో సహా చెట్టు, పుట్ట, కొండ..ఒకటేమిటి ప్రకృతిలోని అణువణువు పూజనీయాలే! ప్రకృతి పరిరక్షణ భారతీయుడు ప్రధమ కర్తవ్యంగా భావిస్తూ వైదిక సంస్కృతి అందించిన పండుగలు, పర్వాలు జరుపుకుంటున్నాడు. అటువంటి పర్వమే కార్తీక శుద్ధ చవితి-నాగుల చవితి.
శ్రీ మహా విష్ణువుకు తల్పంగా వుండే అదృష్టం నాగజాతికి చెందిన ఆది శేషునికే దక్కింది. పరమశివుని ఆభరణాలుగా వెలుగొందిన నాగులు పన్నగ భూషణునిగా కీర్తించబడడానికి కారకులయ్యారు. వినాయకునికి, భైరవునికీ నాగులే యజ్ఞోపవీతాలు. కర్మసాక్షి సూర్యుని రధానికిగల అశ్వాలకు నాగులే పగ్గాలుగా వున్నాయి. క్షీరసాగర మధనంలో అమృతాన్ని అందుకునేందుకు మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని చిలకడానికి వాసుకియనే సర్పమే తాడుగా నిలిచింది. శనీశ్వరుని ఆయుధం సర్పం కాగా, కుజగ్రహాన్ని సర్పాలే కుదురుగా వున్నాయి. నాటి యుద్ధాలలో నాగాస్త్రానికి గల ప్రాముఖ్యం ఇంతా అంతా కాదు. రామలక్ష్మణులు నాగాస్త్రానికి బంధింపబడ్డ వైనం అందరికీ తెలిసిందే.
మహాభారతంలో జనమేజయుడు తలపెట్టిన సర్పయాగం, జరత్కారోపఖ్యానం ఎంతో ప్రసిద్ధమైనవి. జరత్కారి అను నాగజాతి స్ర్తికి జన్మించిన అస్తీకుడు సర్పయాగం నిలువరించడానికి చేసిన యత్నం ఫలించింది. నాగ దోషాలనుంచి విముక్తి పొందడానికి ఈ ఉపాఖ్యానం అందరూ చదవాలని, వినాలని ముఖ్యం నాగులచవితినాడు అలా చేస్తే నాగమాత అనుగ్రహం కలుగుతుందని అంటారు.
నాగుల చవితినాడు మహిళలు ఉత్సాహంగా పాల్గొంటారు. ఉదయమే ఇంటివారందరు శుచియై నాగులకు నివేదించడానికి పాలు, చలిమిడి, చిమ్మిలి, అరటిపళ్లు వీటితోపాటు ఎర్రటి గడులతో కూడిన వస్త్రం, పసుపు, కుంకుమ ఇతర పూజాసామగ్రి పట్టుకుని సమీపంలో పుట్టవద్దకు వెళ్లి అందరూ పూజించి నివేదనలు హారతి ఇస్తారు. పిల్లలు పుట్టవద్ద టపాసలు కాలుస్తారు. పుట్టమన్ను అందరూ చెవులకు పెట్టుకుంటారు. అలా చేస్తే వినికిడికిలోపం రాదని నమ్మకం. కనె్నపిల్లలకు త్వరగా వివాహం జరుగుతందని, నాగరూపుడైన సుబ్రహ్మణ్యుడు (స్కందుడు) అనుగ్రహంతో పిల్లలందరు విద్యావంతులవుతారని నమ్మకం. తెలియక చేసిన తప్పుల వల్ల తమందర్నీ క్షమించి చల్లగా చూడమని నాగుల చవితినాటి పూజలోని అంతరార్ధం.
యోగశాస్త్ర రీత్యా కుండలినీ శక్తి సర్పరూపంలో మూలాధార చక్రంలో చుట్టచుట్టుకుని ఉంటుందని, అరిషడ్వర్గాలనే విషాన్ని చిమ్ముతూ, మనిషిలోని సత్త్వగుణాన్ని నిర్మూలిస్తుందని, షట్చక్రాలపై ప్రభావం చూపిస్తుందని అంటారు. ఆ కారణంగా వెన్ను పూసకు ‘వెన్నుపాము’ అంటారని విశే్లషకుల వచనం. కుండలినీ శక్తికి ప్రతీకగా వున్న సర్పాన్ని ఆరాధిస్తే మనిషిలో అంతర్లీనంగా విషాగ్నిని చల్లార్చడానికి నాగుల చవితినాటి సర్పారాధాన ఎంతో యోగ్యదాయకమని అంటారు.
మానవుని జీవితం నిరంతరం సుఖప్రదంగా సాగాలంటే మనసు ప్రశాంతంగా వుండాలి. ఈప్రక్రియను ‘నాగం’ అని శాస్త్రం చెబుతున్నది.ఇది హృదయంనుండి ఎగువకు అంటే సహస్రారం వరకు చరిస్తూ వుంటుంది. ఈ గమనాన్ని ‘ఉరా’ అన్నది శాస్తమ్రు. అందుకనే సర్పాన్ని ‘ఉరగమని’ అంటారు. శరీరంలో వుండే ఈ ఉరగమును మనస్సనే సంగీతంతో నియంత్రించి సక్రమంగా నడిచేట్టు చేయగలగడంలో నాగుల చవితినాటి ఆరాధన ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది.
సర్పమును అగ్నిదేవతగా, సుబ్రహ్మణ్యునిగా పూజించే విధానం వేదాల్లో వుంది. అందుకే పలు దేవాలయాల్లో సుబ్రహ్మణ్యుని సర్పరూపంలో పూజిస్తారు. సర్పం మానవుల జీవన విధానంలో అక్కడక్కడ అవరోధంగా నిలుస్తుంటుంది. అందుకే సర్పదోషపూజలు, సుబ్రహ్మణ్యుని సర్పరూపంలో దేవాలయాలలో ప్రతిష్టించి మొక్కులు చెల్లించుకోవడం వంటివి జరుగుతున్నది. సర్పాన్ని లేదా సుబ్రహ్మణ్యుని అగ్నిదేవతగా కార్తీకమాసంలో పూజిస్తారు. ఈ మాసం అగ్నిదేవతకు విశేషమైనది. అగ్ని దేవతకు ప్రతిరూపులైన సూర్య చంద్రుల ద్వారా ఈ శక్తి లభిస్తుంది. కనుకనే కార్తీక మాసంలోనే అగ్నిదేవతా స్వరూపాలైన నాగదేవతను నాగుల చవితినాడు, సుబ్రహ్మణ్యుని మార్గశిర శుద్ధ షష్టినాడు ఆరాధించడం ఆనూచానంగా వస్తున్న సంప్రదాయం.

- ఎ.సీతారామారావు