మంచి మాట

ప్రసాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగవంతుని సృష్టిలో పనికిరానదంటూ ఏదీ ఉండదు. సూక్ష్మం నుండి స్థూలం వరకు వున్న ప్రతి ప్రాణి పరమాత్మ సృష్టిలోని భాగమే. చెట్టు చేమ, కొండ కోన, నదులు, సముద్రాలు, సూర్యచంద్రులు, గ్రహ నక్షత్రాలు- ఇలా జగత్తులోని అణువణువు దేవుని సంకల్పమాత్రంతో సృష్టింపబడినవే. సర్వజీవుల జీవనానికి అనుగుణంగా సృష్టికర్త ఏర్పరచిన ఒక ప్రణాళికాబద్ధమైన ప్రసాదమే ఈ ప్రకృతి. ఇన్ని సౌకర్యాలను మనకోసం అమర్చి అందించిన ఆ దైవానికి కృతజ్ఞతాభావంతో మనం చేసేదే పూజ లేక అర్చన. పూజలో భాగంగా భగవంతునికి మనం సమర్పించే పండ్లు, పదార్థాలు ప్రసాదంగా మనం స్వీకరిస్తాము.
దైవానికి నివేదించక ముందు పదార్థం- నివేదించిన తరువాత అది ప్రసాదం అవుతుంది. నివేదన చేసినపుడు కేవలం భగవంతుని చూపు పడినంతమాత్రాన ఆ ప్రసాదానికి ఎంతో మాధుర్యం, పవిత్రత, మహత్తు సిద్ధిస్తాయి. భగవంతుని చూపు పడిన తరువాత పువ్వయినా, పండయినా, అన్నమైనా అన్నీ ప్రసాదాలే. దేనినీ నిర్లక్ష్యం చేయకూడదు.
దేవునికి సమర్పించిన పూలమాలను ఇంద్రునికి ఇవ్వగా అతడు దానిని నిర్లక్ష్యం చేసినందులన తన పదవిని పోగొట్టుకోవలసి వచ్చింది. అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం ఎంతో మహిమాన్వితమైనది. వ్రత కథలో ప్రసాదాన్ని తీసుకోకుండా వెళ్లిన లీలావతి కుటుంబం కష్టాలపాలవుతుంది. అలాగే ఒక రాజుకూడా ప్రసాదాన్ని తిరస్కరించినందుకు ఎన్నో ఇక్కట్లకు లోనుకావలసి వస్తుంది. సత్యనారాయణవ్రతం చేసుకున్న వారెవరైనా ప్రసాదాన్ని బంధు, మిత్రులకు అందరికీ అందజేసి ఆ సత్యదేవుని అనుగ్రహానికి పాత్రులవుతుంటారు.
తిరుపతిలో శ్రీ వెంకటేశ్వరస్వామికి నివేదించిన లడ్డు ప్రసాదం ఎంతో ప్రఖ్యాతి వహించింది. లడ్డు మాత్రమే కాక వడలు, పాయసాలు, జిలేబీలు, అట్లు రకరకాల ప్రసాదాలు ఎంతో శుచిగా, రుచిగా తయారుచేసి శ్రీనివాసునికి కైంకర్యం చేయటం విశేషం. తిరుపతి వెళ్లివచ్చినవారు లడ్డు, వడ ప్రసాదాలను అందరికీ పంచిపెట్టడం ఒక ఆనవాయితీ. మరో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పూరీ జగన్నాథుని ప్రసాదం కూడా అత్యంత ప్రాముఖ్యత కలిగివున్నది. అక్కడ నివేదించిన అన్న ప్రసాదాన్ని ఎటువంటి భేదభావం చూపకుండా సర్వులూ భక్తిశ్రద్ధతో స్వీకరించటం జగద్విదితం. అందుకే ‘సర్వం జగన్నాథం’ అనేమాట వచ్చింది. శ్రీకృష్ణునికి వెన్న అంటే ఇష్టంకనుక కృష్ణమందిరాలలో వెన్నతోపాటు ఎన్నో రకాలైన మధుర పదార్థాలను తయారుచేసి లెక్కకు మిక్కిలిగా ఆరగింపు చేస్తారు. ఆ ప్రసాదాలను భక్తులందరూ ఎంతో ప్రీతితో ఆరగిస్తారు.
శిరిడీ సాయిబాబా మసీదులో ధుని ఏర్పాటుచేసి దాని నుండి వచ్చిన విబూదినే ప్రసాదంగా అందరికీ పంచిపెట్టేవారు. ఎందరో దీనులు, రోగులు బాబా వద్దకు వచ్చి తమ బాధలను చెప్పుకునేవారు. బాబా అందరికీ ఊదినే ఇచ్చి వారిని రోగాలనుండి, బాధలనుండి విముక్తి చేసేవారు. నేటికీ సాయి ఆలయాలలో ఊదీనే అత్యంత పవిత్రమైనదిగా భావించి భక్తులు స్వీకరిస్తున్నారు. స్వస్థతను పొందుతున్నారు.
ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క ప్రసాదం ప్రీతికరం అని భావించి ఆ విధంగానే సమర్పిస్తూ వుంటారు. వినాయకునికి ఉండ్రాళ్ళు, అమ్మవారికి పులిహోర, పాయసం, శ్రీకృష్ణుని వెన్న మీగడలు, వెంకటేశ్వరస్వామికి లడ్డూలు, సత్యనారాయణ స్వామికి రవ్వ ప్రసాదం, సూర్యభగవానునికి ఆవుపాలతో చేసిన మెత్తని పాయసం, శిరిడీ సాయిబాబాకు పాలకోవా, కలకండ, రొట్టెలు మొదలైనవి. ఆంజనేయస్వామికి అప్పాలు, శ్రీరామచంద్రునికి పానకం, వడపప్పు- ఇలా ప్రత్యేకంగా నివేదించటంతోపాటు పండుగల సందర్భాలలో అందరు దేవుళ్ళకు పంచభక్ష్య పరమాన్నాలు నివేదించి ప్రసాదాన్ని అందరూ భక్తితో స్వీకరిస్తారు.
ఏ దేవునికైనా ఎక్కువగా కొబ్బరికాయను కొట్టి నైవేద్యంగా పెడుతూంటారు. అరటిపళ్ళతో పాటు ఇంకా ఆయా కాలాలలో లభించే ఇతర ఫలాలను కూడా ముందుగా దేవునికి నివేదన చేసిన తరువాతనే తాము తినటం అనే నియమాన్ని కొందరు పాటిస్తూ వుంటారు. ధనుర్మాసం నెల రోజులు వైష్ణవాలయాలలో తెలతెలవారకముందే పులిహోర, చక్కెర పొంగలి, దద్యోజనం, రవ్వకేసరి, పాయసం ఇలా రొజుకొక రకంగా భగవంతునికి కైంకర్యాలు జరుగుతూ వుంటాయి. ప్రత్యేకంగా తయారుచేయబడే ఈ ప్రసాదాలు ఎంతో రుచిగా ఉండి భక్తులు విశేషంగా ఇష్టపడేలా చేస్తాయి.

- అబ్బరాజు జయలక్ష్మి