మంచి మాట

పరమాత్మ స్వరూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగవంతుడు జ్యోతిస్వరూపుడు. నిర్వికారుడు. అతడు పరమ బ్రహ్మస్వరూపుడు. తేజస్వి. మహానుభావులంతా అతనే్న ఉపాసిస్తారు. అతని ప్రకాశం వల్లనే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. అతడు స్వయం ప్రకాశకుడు. అతనినుండే ప్రకృతి ఉద్భవించింది. ప్రకృతినుండి మహత్తత్వం ప్రకటితమైంది. దాని లోపల సూర్యచంద్రులు ఆశ్రయించుకుని ఉన్నారు. భగవానుడు సావధానుడై సూర్యచంద్రులను, భూమ్యాకాశాలను దర్శిస్తున్నాడు. అతనినుండియే దిక్కులు పుట్టాయి. నదులు ఉద్భవించాయి.
సముద్రాలు ఉత్పన్నమయ్యాయి. స్వయంగా నశించేది అయినప్పటికీ కర్మలు అనుభవించకుండా ఈ దేహం అనే రధానికి ఉన్న మనసనే చక్రానికి ఇంద్రియాలనే గుర్రాలని కట్టి బుద్ధిమంతుడు, దివ్యుడు, నిత్యనూతనుడు అయిన జీవాత్మను పరమాత్మవైపు తీసుకునిపోతున్నాడు. ఆ పరమాత్మ రూపానికి ఏ ఇతర వస్తువులు పోలవు. దానిని ఏ చర్మ చక్షువులు చూడలేవు. నిశ్చయాత్మకమైన బుద్ధితో, మనసుతో దానిని తెలుసుకున్నవారు అమరులవుతారు. పది ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఈ పనె్నండింటిలో పరమాత్మ అంతర్లీనుడై వుంటాడు. కానీ విషయలోలులైనవారు లోకంలో భయంకరమైన దుర్గతి పొందుతారు. తమలోని అంతర్లీనుడైన భగవంతుని ధ్యానించక తేనెటీగలు నెలలో సగం రోజులు మధువును సంగ్రహించి మిగిలిన సగం రోజులు ఏవిధంగా తాగుతాయో అదే విధంగా భ్రమణ శీలులైన ప్రాపంచిక జీవులు పూర్వజన్మలోని సంచిత కర్మలను ఈ జన్మలో అనుభవిస్తున్నారు.
సమస్త ప్రాణులకు వారి కర్మానుసారంగా పరమాత్మ ఆహారపు ఏర్పాట్లు చేసే వుంచాడు. ఈ సంసారమనే అశ్వత్థ వృక్షానికి విషయాలు అనే ఆకులు ఉన్నాయి. అవి బంగారంలా మనోహరంగా భ్రాంతి కలిగిస్తాయి. రెక్కలు లేని ఈ జీవులు ఈ సంసారమనే అశ్వత్థ వృక్షాన్ని అధిరోహించి కర్మలు అనే రెక్కలు ధరించి తమ పూర్వ జన్మల ఫలితంగా భిన్న భిన్న జన్మలను భవిష్యత్తులో పొందుచున్నారు. ఏ జ్ఞానంవలన జీవులకు ముక్తి కలుగుతుందో అదే పరమాత్మనుండే సకల జీవులు ఉద్భవిస్తున్నాయి. కర్మ ముగిసిన వెంటనే తిరిగి పరమాత్మలో లీనమవుతున్నాయి. చివరలో ఏకమాత్రమైన ఆ పరబ్రహ్మమే మిగులుతుంది. ఈ సంసారం అనే నీటిపైన తేలియుండే హంస రూపమైన పరమాత్మ తనయొక్క సారాంశాన్ని బయల్పరచడం లేదు. అతడు దాన్ని బయల్పరిచినట్లయిన అన్ని బంధాలు, మోక్షాలు శాశ్వతంగా నశిస్తాయి. ప్రతి హృదయాంతరాళంలో అంగుష్ట మాత్రుడైన అంతర్యామి పరమాత్మ లింగ శరీరంతో సంబంధంవలన జీవాత్మ రూపంలో ఎల్లప్పుడు జనన మరణాలు పొందుతున్నాడు.
అట్టివానిని మూఢులు సందర్శించలేరు. సాధన సంపన్నుడైనా సాధన హీనుడైనా ఎవరైనా సరే అందరిలోను ఆ పరబ్రహ్మ సమభావంతో గోచరమవుతున్నాడు. ఆ పూర్ణ పరమేశ్వరుని తెలుసుకోవడం వలన ప్రయోజనం నశించి పోదు. మనసుతో సమానమైన వేగం కలిగిన వారైనా చివరకు వారు హృదయ స్థితుడైన పరమాత్మవద్దకే రావాలి. అత్యంత విశుద్ధమైన అంతఃకరణం కలవారు మాత్రమే అతన్ని చూడగలరు. తన్ను తాను అదుపులో వుంచుకుని దుఃఖం పొందని వాడు ముక్తుడవుతాడు. పాము బిలాన్ని ఆశ్రయించి తన్ను తాను దాచుకున్నట్టుగా డాంబికులు తమ పాండిత్యం, వ్యవహారాల మాటున పాపాలు దాచుకుంటారు.
మూర్ఖులు వారిని విశ్వసించి మోహంలో పడతారు. యోగజనులు ఉచ్చులో చిక్కుపడక ప రమాత్మను సందర్శిస్తారు. బ్రహ్మ స్వరూపం అంతటా సమానమే. బుద్ధిమంతుడైన మనిషి యుక్తుడై ఆ ఆనందబ్రహ్మను పొందాలని కోరుకోవాలి. అంగుష్ట మాత్రమైన అంతర్యామి అందరి హృదాంతరాళాల్లోను నిక్షిప్తుడు. కానీ ఎవరికీ కనపడడు. అతడికి చావు పుట్టుకలు లేవు. చరాచర స్వరూపుడు, రాత్రింబవళ్లు సావధానుడై వుంటాడు. అతనిని తెలుసుకున్న విద్వాంసుడు పరమానందంలో తేలుతాడు.

-పట్టిసపు శేషగిరిరావు