మంచి మాట

ఆణిముత్యాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆలస్యం, శ్రమ, మందకొడితనం, భేదభ్రాంతి, మిధ్యాత్మత, నర్మోక్తి, ద్రోహం, పరదూషణ, గర్వం, భయం అనేవి మనిషిని పట్టి పీడించే చెడుగుణాలు.
ఆలస్యంవల్ల అమృతం కూడా విషమవుతుందన్నారు పెద్దలు. అందువల్ల అనుకున్న పని తొందరగా చేసుకోవడం మంచిది. చూద్దాంలే, చేద్దాంలే అని బద్ధకిస్తే నిస్సందేహంగా కార్యహాని జరుగుతుంది. ఏ పనైనా శ్రమ పడకుండా సాధ్యం కాదు. ఎక్కువో తక్కువో శ్రమపడాల్సిందే. శ్రమ పడకుండా ఫలితం పొందాలనుకోవడం హర్షణీయం కాదు. ఫలితం లభిస్తున్నప్పుడు శ్రమ లెక్కలోకి రాదు. నిజానికి శ్రద్ధతో పనిచేస్తే శ్రమ తెలియదు.
కొంతమంది ఎల్లప్పుడూ మందకొడిగా ఉంటారు. ఇది జీవితంలో చాలా ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. దీనివల్ల తమ పనులు తాము చేసుకోలేరు. అందుచేత తెల్లవారుజామున లేవడం అలవాటు చేసుకోవాలి. అప్పుడు బుద్ధి వికసిస్తుంది. మందకొడితనం మాయమవుతుంది. సృష్టిలో ఒక వస్తువుకు మరొక వస్తువుకు భేదం స్పష్టంగా గోచరిస్తుంది. ఈ భేద దృష్టి పోవాలంటే అభేద దర్శనం కావాలి. అభేద భావం సత్వగుణంవల్ల ఏర్పడుతుంది. దీనివల్ల స్వపర అనే భేదబుద్ధి నశించి అంతా ఒక్కటే అని సమదృష్టి ఏర్పడుతుంది.
నాస్తికులు ఆత్మస్థితిని ఒప్పుకోరు. ఆత్మ అశాశ్వతమని వారి భావన. శాస్త్రాలు, పురాణాలు, ఉపనిషత్తులు ఆత్మనిత్యమైనదని నిరూపించాయి. ప్రపంచ దేశాల్లోని విభిన్న మతస్థులు అందరూ ఆత్మజ్ఞానానికి సంబంథించినంతవరకు ఉపనిషత్ ప్రతిపాదితమైన సత్యాన్ని అంగీకరించారు.
కొందరు నర్మగర్భంగా మాట్లాడుతూ ఎదుటివారిని బాధపెడతారు. తమ మాటలు వారిని బాధపెడతాయని అనుకోరు. అటువంటి బాధను కలిగించకుండా ఉండాలంటే నిజమైన విషయం చెప్పి, అవసరమైతే దాన్ని నిరూపించి చూపాలి. ఇతరులకు ద్రోహం చేసి ఏదో బావుకుందామనుకునే వారు కొందరుంటారు. అందువల్ల పాపం మూటగట్టుకోవడం తప్ప మరో ప్రయోజనం లేదు. కనుక వారిని తమతో సమానంగా భావిస్తే ఎలాంటి ద్రోహ చింతనా కలుగదు.
కొంతమందికి పరదూషణ చేయడం ఒక అలవాటు. అలాంటి వారిని ఇతరులు కూడా నిందిస్తారు. తాము నిందించినా- ఇతరులు తమని నిందించినా రెండూ దుఃఖానే్న కలిగిస్తాయి. నిందింపతగని దేవతలను, మునులను, సాధు సజ్జనులను నిందించి వారికి సంతాపాన్ని కలిగించిన దుర్మార్గులు అనుభవించిన పాప ఫలితాలను ఒకటికి పదిసార్లు గుర్తుచేసుకుంటూంటే ఈ నిందా జాడ్యం తొలగిపోతుంది. అలా నిందించే వారిని నవ్వుతూ ఆహ్వానించి, కుశల ప్రశ్నలు వేసి ఆదరించాలట. అదే అటువంటి వారికి అద్భుతమైన చికిత్స అంటుంది. శాస్త్రం.
అంతేగాక పరదూషణ విషయంలో వౌనం పాటించడం కూడా ఎంతో మంచిదని చెబుతారు. వౌనమంటే అసలు నోర మెదల్చకుండా ఉండడం కాదు. చాలా మితంగా మాట్లాడటం అని అర్థం. ‘సత్యాయ మిత భాషిణాం’ అని కాళిదాసు రఘువంశ మహారాజులను గురించి వర్ణిస్తూ అన్నాడు. అంటే రఘువంశరాజులు సత్యంకోసమని మితంగా మాట్లాడేవారట. ఇందువల్ల ఎలాంటి అనర్థాలూ రావు. మనస్సుకు, వాక్కుకు మంచి శక్తి సహితం కలుగుతుంది.
లోకంలో ఎంతోమంది ధనగర్వంతోనో, బలగర్వంతోనో, విద్యాగర్వంతోనో నా అంతటి వారు లేరని విర్రవీగుతుంటారు. ఇలాంటి వారు గతంలో తమలా విర్రవీగిన వాళ్ళంతా చివరికి ఏమైపోయారో, ఎలాంటి అవమానాలకు గురై చరిత్ర గర్భంలో కలిసిపోయారో తెలుసుకుంటే చాలు. వారి గర్వం పటాపంచలవుతుంది. గర్వభంగమైన వారి కథలు పురాణాల్లో కోకొల్లలుగా ఉన్నాయి.
భగవంతుని యందు ప్రగాఢ విశ్వాసం ఉంచాలి. దైవమందలి విశ్వాసమే భయాన్ని దూరం చేసి ధైర్యాన్ని ప్రసాదించి, ఆపదలను గట్టెక్కిస్తుంది. ఇవి ఆదిశంకరులు ప్రవచించిన ఆణిముత్యాలు. ప్రశాంత జీవనానికి సోపానాలు.

- చోడిశెట్టి శ్రీనివాసరావు