మంచి మాట

కర్మఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగవంతుడు మనకు కన్పించని ఓ అదృశ్య అద్భుత శక్తి. మనల్ని నడిపించేది భగవంతుడు. శివుని ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదని నానుడి. మన పూర్వజన్మ కర్మఫలం మానవ జన్మ. ఎనభై నాలుగు వేల కోట్ల జీవరాశుల్లో అతి తెలివైన ప్రాణి మనిషి. కాని కలి ప్రభావమో.. మానవ నైజమో.. మనిషి మనిషిలా జీవించడం లేదన్నది నేటి నిజం. తన ఆధిక్యత కోసం అయినవారిని.. ఇతరులను ఏ మాత్రం చూడకుండా మోసం చేస్తున్నాడు. కాని ఆ పాప ఫలితం తప్పక అనుభవిస్తాడు. పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగుతూ.. ననె్నవరూ చూడరనుకుంటుందట. అలాగే, మనిషి తను చేసే తప్పిదాలను ఎవరూ చూడరనుకుంటున్నాడు. కాని మనల్ని నడిపించే ఆ అద్భుత శక్తి అన్నీ గమనిస్తుంది. మనం చేసే కర్మ ఫలాలను ఇక్కడే అనుభవించక తప్పదు.
మనిషి మనిషిలా జీవించాలి. కష్టం సుఖం సమపాళ్ళలో ఆస్వాదించాలి. కష్టాలకు కృంగక, సుఖాలకు పొంగక ధీరుడిలా స్థితప్రజ్ఞతతో జీవించాలి. భగవంతుని యందు సదా భక్త్భివంతో జీవిస్తూ. జన్మనిచ్చిన మాతాపితరుల ఆదరాభిమానములతో.. గురువుయందు వినయ వినమ్రతతో.. అతిథులకు ప్రేమానురాగాలను పంచుతూ... ఆర్తులకు, అపన్నులకు తన వంతు చేయూతనిస్తూ మనిషిగా జీవించాలి. అపుడే ఈ జన్మకు అర్థం పరమార్థం.
ప్రతి మనిషి ఈర్ష్య అసూయా ద్వేషాలకు చాలా దూరంగా ఉండాలి. లేదంటే అవి మనిషిని అధఃపాతాళానికి తోస్తాయి. మరికొంతమంది వుంటారు. ఎపుడూ పరాయివారిని, తన వారిని దూషిస్తూ వుంటారు. అది కూడా ఎంత మాత్రం తగదు. ఎవరి కర్మకు వారే బాధ్యులు. ఎవరి కర్మ ఫలం వారే అనుభవిస్తారు. పరదూషణ ఎంత మాత్రం భావ్యం కాదు. అనుక్షణం భగవంతున్ని దూషించిన శిశుపాలుడు ఏమయ్యాడు. భగవంతుని చేతిలో హతమయ్యాడు. అలాగే మనిషికి ఎన్ని కష్టాలు వచ్చినా నమ్మిన సిద్ధాంతాన్ని వీడరాదు.
దానానికి మరోపేరైన కర్ణుడు, శిబి, బలి చక్రవర్తులు తమ ప్రాణాలు పోయినా వాళ్ళ దాన గుణాన్ని వీడలేదు. అందుకే చరిత్రలో అమరులుగా నిలిచిపోయారు. సత్యాన్ని వీడని హరిశ్చంద్రుడు రాజ్యాన్ని, భార్యాబిడ్డలను సైతం వదిలాడు కాని సత్య ధర్మాన్ని విడలేదు. రాజైనా కాటికాపరిగా జీవించాడు. చివరకు సత్యాన్ని గెలిచి ‘సత్యహరిశ్చంద్రుడు’గా చరిత్రలో నిలిచిపోయాడు. నమ్మిన సిద్ధాంతాలకై...ఈ వేద భూమిలో ఎందరో మహాత్ములు చిరంజీవులుగా మన హృదయాన నిలిచారు. భగవత్‌సింగ్, అల్లూరి సీతారామరాజు, మదర్ థెరీస్సా, లాంటి మహాత్ములు దేశం కోసం, ప్రజల కోసం ఏ స్వార్థం లేకుండా తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మనకై సేవ చేశారు. అందుకే భగవంతుని సమానంగా వారిని సదా పూజిస్తాము.
ప్రతి మనిషి మనిషిగా జీవిస్తే చాలు. ప్రతి మనిషి జీవితంలో తెలిసో తెలియకో తప్పు చేస్తాడు. తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపం పడేవాడు మనిషి. ఒక్క తప్పు కప్పిపుచ్చుకోడానికి వేయి తప్పులు చేసేవాడు మనిషే కాడు. మరికొంతమంది వుంటారు.. తావలచింది రంబ అన్నట్లు తాము చేసేదే అంతా ఒప్పనుకుంటారు. ఎదుటివారేమైనా ఫర్వాలేదు. తాము బాగుంటే చాలనుకుంటారు. అది సమంజసం కాదు. అలాగే ఎదుటివాడి తప్పులను మన్నించి అక్కున చేర్చుకొన్నవాడు కచ్చితంగా మహాత్ముడు అవుతాడు. పాప పుణ్యాలు ఎవరి కర్మ అనుసారం అనుభవిస్తారు. అంతేకాని తామేదో మహాత్ములు అయినట్లు అహంకారంతో కన్ను మిన్ను కానకుండా నడ్చుకోవడం ఎంత మాత్రం కాదు. దుష్టశిక్షణ.. శిష్టరక్షణ భగవంతుని లీలా విశేషం. అలాగే మనం ధర్మో రక్షితి రక్షితః అనే సూత్రాన్ని పాటిస్తే.. ధర్మాన్ని మనం కాపాడితే.. ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. ధర్మానికి ప్రతిరూపం భగవంతుడు. ఆ భగవంతుని సేవలో మనం తరిస్తే ఆ జన్మ ధన్యం అవుతుంది. అలాగే మానవసేవయే మాధవసేవ అన్నారు మహాత్ములు. ఆపన్నులు, అనాధలు, అన్నార్తులను మన వంతు బాధ్యతగా సేవిస్తే.. ఆ భగవంతుని సన్నిధికి ఆసాంతం చేరుకొంటాము.

-కురువ శ్రీనివాసులు