మంచి మాట

తాపత్రయములు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాపమనగా దుఃఖము. లౌకిక జీవనములో మానవుడు మూడు రకములైన దుఃఖములలో మునిగితేలుచుండును. అవి ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవికములు. ఈ తాపత్రయములనుండి బయటపడుటకు నిరంతరము ఏదో ఒక రక్షణ మార్గాన్ని అనే్వషిస్తూనే యున్నాడు. తాపత్రయాలతో ప్రధానమైనది ఆధ్యాత్మిక దుఃఖము. దీనికి బాధ్యత వహించునది మనసు.
మానవునికి శ్రేయస్సును చేకూర్చినా, పతనానికి దగ్గర చేసినా దీని చేతులలోనే యున్నది. మనసును ఉత్తేజపరచి ధర్మమునకు దగ్గర చేయునది ఒక్క సనాతనము మాత్రమే! సనాతనమనగా నిత్యనూతనమని అర్థము. యుగయుగాలకు అనుసరణీయమైనది. అందుకే ఇది నిత్యసత్యమై వెలుగొందుచున్నది. దీనికి మూలములు మన వేదా వేదాంగములు.
ఆధ్యాత్మిక దుఃఖమునకు కారణములు సోమరితనము, కామక్రోధములు, దుర్మార్గము మొదలైన తమోగుణ ప్రధానములు. సోమరితనమువలన అగౌరవము, కామము వలన క్రోధము తద్వారా విచక్షణ కోల్పోయి అవమానముల పాలగును. అవమానమును కప్పిపుచ్చుకొనుటకు తిరిగి దుర్మార్గమును ఆశ్రయించును. ఈ విధముగా తుదకు పతనమగును.
ప్రస్తుత సమాజము ఆధ్యాత్మిక దుఃఖములో మునిగితేలుచున్నది. శ్రమతో రాని సంపద అసలు సంపదే కాదనే సత్యాన్ని ప్రతి ఒక్కరు గ్రహించవలెను. శ్రమతో వచ్చినది అతి స్వల్పమైనా ధర్మమును కాపాడుతుంది. నల్లధనము మనిషి మనసును, సమాజాన్ని అంధకారములోకి నెట్టేస్తుంది. అక్కడ చీకటే కాని వెలుగుండదు. వెలుగులేనిదే అజ్ఞానము పటాపంచలగుట అసాధ్యము. భోగలాలసత్వము మరింత దుఃఖమును కలిగించును తప్ప ఆనందమును చేకూర్చదు. సమాజ హితమే మనకానందము కలిగించును.
ఈ దుఃఖమునుండి బయటపడుటకు మార్గము ఆధ్యాత్మికమే! ఆత్మను అధ్యయనము చేసేది ఆధ్యాత్మికము. అనగా ఆత్మ భావన పొందుట. నిరంతరము సృష్టికర్తను సంకీర్తనము చేసి దుఃఖమును పోగొట్టుకొనవలెను. ఇది భక్తి మార్గములో పయనింపజేసి సత్సంగమునకు దారితీయును. అది సంతోషము, సన్మార్గము కలిగించును.
ఇక రెండవ తాపము ఆధిభౌతికము. ఇది అనేక విధములుగా తటస్థించును. ఆధ్యాత్మిక చింతన లోపించుట వలననే ఈ దుఃఖము కలుగును. ప్రకృతిని నాశనము చేయుట వలననే క్రూరమృగములు తమ ఆవాసములు వీడి జనవాసములపై పడుచున్నవి. సోమరితనమువలననే స్వార్థము పెరిగి దోపిడీలు, దొంగతనములు పెరిగిపోవుచున్నవి. వసుధైక కుటుంబ భావన లోపించుటవలననే పరస్పర శత్రువులై నిత్యమూ భయకంపితులై జీవించుట జరుగుచున్నది.
పర్యావరణమును కలుషపరచుట చేత క్రిమికీటకాదులు విజృంభించి అనేక చిత్ర విచిత్ర సూక్ష్మరోగములకు కారణమయినది. ఈ దుఃఖ నివారణ కూడా ఆత్మచింతనలోనే యున్నది. మానవులంతా ఆత్మస్వరూపులనే భావన కల్గియుండిన, ఈ భావనకు వ్యతిరేకముగా జనించే రుగ్మతలను నాశనం చేసే శక్తి కూడా ఆత్మచింతనలోనే లభిస్తుంది. పంచభూతములనుండి జనించిన జీవుడు వాటికి లోబడే జీవించవలెననే శాసనమును గుర్తుకుతెచ్చేది కూడా ఈ ఆధ్యాత్మిక మార్గమే!
ఇక మూడవ తాపము ఆధిదైవికము. ఈ దుఃఖమునకు కారణము అకాల వర్షములు, భూకంపములు, అనావృష్టి, అతివృష్టి, పిడుగుపాటు, ఇంకా అనేక చిత్రమైన ప్రకృతి భీభత్సములు. ఆధిదైవిక దుఃఖాలు కూడా ఆధ్యాత్మిక లోపమువలననే ఏర్పడును. ప్రకృతికి ఎదురునిల్చి జయించవచ్చనే మూర్ఖత్వము. ప్రకృతికి ఎదురొడ్డి మనగలిగిన జాతి లేదు. దానికి అనుగుణముగానే జీవించగలము తప్ప చేతులలోనికి తీసుకొని మార్గనిర్దేశనము చేయుట అసంభవము.
ఈ తాపత్రయములనుండి బయటపడుటకు మార్గము ఆధ్యాత్మికత. సర్వకాల సర్వావస్థలయందు చరాచర సృష్టికి మూలమైన ఆ పరాత్పర శక్తిని సదా స్మరిస్తూ ధర్మనిరతితో ముందుకు సాగుటకు కంకణం కట్టుకొనవలెను. మానవాళిని కాపాడునది ధర్మము. అదే సనాతనము. సర్వేజనా సుఖినోభవంతు.

- వారణాశి వెంకట సూర్యకామేశ్వరరావు