మంచి మాట

నిరాడంబర భక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఎవ్వనిచే జనించు జగమివ్వని లోపల నుండ లీనమై’’ అంటూ ఈ చరాచర ప్రపంచం ఎవరివల్ల పుడుతుందో, ఎవరిలో లయం అవుతుందో ఆత్మభవుడైన ఆ ఈశ్వరుని శరణు వేడుతున్నాను అంటూ ఆర్తుడై, ఆర్తత్రాణ పరాయణుడైన ఆ విష్ణువును ఆర్తిగా ప్రార్థించాడు గజేంద్రుడు భాగవతంలో భగవంతుని, భక్తిని కలిపే సాధనం భక్తి. శరీరం మీద మమకారం వదలిపెట్టి, కోరికలన్నీ విడచి త్రికరణములుగా అనగా మాటలో, మనసులో, చేతలో ఆ సర్వేశ్వరుని ఫలాపేక్షారహితంగా ధ్యానించి పూజించడమే భక్తి. పూజ అంటే మనసును చైతన్యవంతం చేసి ఆ దేవుని సన్నిధికి చేర్చడం. అంతేగానీ ఖరీదైన పూజాద్రవ్యాలు, పళ్ళూ వగైరా భారీ స్థాయిలో కుప్పగా పోసి ఆడంబరం ప్రదర్శించడం కాదు. సాక్షాత్తూ ఆ భగవానుడే నిర్మలమైన మనసుతో పత్రం, పుష్పం, ఫలం, తోయం ఏది అర్పించినా అది తనకు ప్రీతిపాత్రం అవుతుందని చెప్పాడు గీతలో.
భగవంతుని పూజించేటప్పుడు ఐహికమైన ఐశ్వర్యాలు గానీ, సుఖ సంపదలు ఆశించి కోరుకొని పూజ చేయడం వ్యర్థం. మనం భగవంతుని ఏమి కోరుకోనవసరం లేదు. మనం ఈ లోకంలోకి ప్రవేశించేముందు భగవంతుడు మనకి అన్ని ఇచ్చేశాడు. ఆరోగ్యకరమైన అన్ని జ్ఞానేంద్రియాలు సక్రమంగా పనిచేసే శరీరం, విచక్షణతో ఆలోచించగల బుద్ధి, మనసు అన్నీ ఇచ్చాడు. వాటిని ఉపయోగించుకోవాలి. మన జీవితం సాగించుకోవాలి. కాని ఇవాళ జరుగుతున్నదేమిటి? భగవంతుడితో బేరసారాలాడుతున్నాం.
అసలు ఏది నిజమైన భక్తి? భగవంతుని నిజంగా నమ్మి కొలుచుకునేవాడికి ప్రచారం అవసరమా? భగవంతునికి భక్తుని ప్రేమపూర్వకమైన నివేదన భక్తి. భగవంతుని భక్తుడు ప్రేమించాలి స్నేహితునిలా, సేవించాలి ఒక నమ్మినబంటులా. ఒక బిడ్డలా అతనికి చేరువ కావాలి. అతనికై తపించాలి, స్మరించాలి, ధ్యానించాలి. తొమ్మిది విధాలా భక్తి మార్గాలను చెప్పింది భాగవతం. నిర్మలమైన మనసుతో ఈ తొమ్మిది రకాల భక్తి మార్గాలలో భగవంతుని పూజించాలి. భగవదర్చనకు కుల, జాతి, ప్రాంతీయ విచక్షణలు లేవు. వయసుతో నిమిత్తం లేదు.
కావాల్సినదల్లా కల్మషం లేని నిర్మలమైన అంకిత భక్త్భివం. భాగవత పురాణం అంతా విభిన్న మనస్తత్వాల గల భక్తుల కథలే. వారి కథలను తెలుసుకొంటే దేనిని భక్తిమార్గంగా ఎంచుకోవాలో అర్థం అవుతుంది. తమోగుణ ప్రధానుడైన గజేంద్రుడున్నాడు. ఒంట్లో స్వంత శక్తి, బలం ఉన్నంతసేపూ తన బలం చూసుకొని తామసంతో అహకరించి, మొసలితో జరిపిన సుదీర్ఘపోరాటంలో శక్తి అంతా క్షీణించి చివరికి అవసానదశలో ఆర్తుడై విష్ణువును శరణువేడిన గజేంద్రుని తామసభక్తి. ద్రువునికి రజోగుణ ప్రధాన భక్తి. ప్రహ్లదునికి సాత్విక భక్తి. వీరుకాక అజామిళ, అంబరీషాదులున్నారు. మార్గాలే వేరు, భక్తి ఒకటే. హిరణ్యకశిపుడు, బలిచక్రవర్తి, రావణాది ప్రభృతులంతా మహా తపస్సంపన్నులే. కాని వారి భక్తి, తపస్సు వెనుక స్వార్థకాంక్ష, లోకపీడనకు కారణమైంది. వారి తపస్సు, భక్తి తాత్కాలిక ప్రయోజనం కోసం కారణమై లోక కంటకులయారు వారు. కానీ ప్రహ్లాదాదులది ప్రతిఫలాపేక్షారహితమైన కైవల్య భక్తి.
తెలుగునాట ప్రముఖ వాగ్గేయకారులుగా కీర్తించబడ్డ త్యాగయ్య, అన్నమయ్య, రామదాసు వంటి వరేణ్యులందరూ ఏమీ ఆశించక కేవలం భగవంతుని పద సేవా కాంక్షతోనే, సంగీత సాధనతో ముక్తిని పొందారు. ‘నిధి చాల సుఖమా రాముని సన్నిధి సుఖమా’ అన్న త్యాగయ్య, ‘తక్కువేమి మనకు రాముండొక్కడుండువరకు’ అన్న గోపన్న, ‘బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానీ పాదము’ అని కీర్తించిన అన్నమయ్యలది నిర్మలమైన భక్తిమార్గం. ఆరాధించినది శివుని అయినా కేశవుని అయినా కావాల్సినది అంకితభావంతో నమ్మి సంపూర్ణ శరణాగతితో కొలవడం. శైవ సాహిత్యంలో మనకు కన్పించే భక్తులు. బెజ్జ మహాదేవి పరమేశ్వరుని పసికందుగా భావించి, తానే తల్లియై నలుగుపెట్టి, తలంటి స్నానం చేయించి అలంకరించి ఒక తల్లి శిశువుకు చేసే ఉపచారాలన్నీ శివునికి చేసింది. నిర్మలమైన ఆమె భక్తి భావానికి శివుడు పరవశుడై ఆమె పరిచర్యలను స్వీకరించి ఆమెకు ముక్తినిచ్చాడు.

-సూరికుచ్చి బదరీనాధ్