మంచి మాట

విచక్షణతో మెలగండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకృష్ణుడు సత్యభామ సమేతంగా నరకాసురుని వధించిన శుభ సమయమున పురుడు పోసుకున్న నరకచతుర్దశి, దీపావళి పండుగలు యుగాల కతీతంగా నేటికీ ప్రపంచ వ్యాప్తంగా కోటానుకోట్ల ప్రజలచే అత్యంత వైభవోపేతంగా జరుపబడుతుండడం ఆమోదయోగ్యం, ఆనందదాయకం. దీపావళి పండుగ సందర్భంగా ఇంటిల్లిపాదీ కొత్తబట్టలు ధరించి పోటాపోటీగా టపాకాయలు పేల్చడం సర్వసాధారణంగా పరిగణించబడే పండుగ నాటి విశేషం.
దీపావళి పండుగకు వారం పది రోజుల ముందు నుండే టపాకాయలు పేల్చడంలో అత్యంత ఆనందాన్ని వ్యక్తపరచే అనేకమంది ఆయా టపాకాయలకై వేల రూపాయలు ఖర్చు చేసేందుకు కూడా ఏ మాత్రమూ వెనుకాడుటలేదు. మరికొందరైతే లక్షల రూపాయలు బాణసంచా కొరకు ధారపోస్తూ తమ దర్పాన్ని టపాకాయల ప్రతిధ్వనుల రూపంలో ప్రపంచానికి చాటుతూ తెగ సంబరపడిపోతున్నారు.
ఇలా వేల లక్షల రూపాయలను టపాకాయల రూపంలో ఖర్చు చేసి దాని నుంచి ఆవిర్భవించే ఆనందజ్వాలలు కేవలం ఆ దీపావళి పండుగనాటి రాత్రికే పరిమితమవుతాయ. మరుసటి రోజు ఉదయానే్న నిన్నటి ఆనంద జ్వాలలు వాకిటపరచుకున్న కాగితాల ముక్కల రూపంలో చెల్లాచెదరై వెక్కిరిస్తాయని గ్రహించగలిగినట్లయితే ఏ ఒక్కరూ కూడా టపాకాయలు పేల్చడానికి ఏ మాత్రమూ సుముఖత వ్యక్తపరచరు.
విద్యాధికులు, మేధావులు, సత్త్వగుణ సంపన్నులైన మహోన్నత భావాలు కలిగిన ఎందరో మార్గదర్శకులు దీపావళి పండుగను ఎలా జరుపుకుంటారో గమనించగలిగితే, ఆ మహనీయులు చూపిన బాటలో పయనించగలిగితే భారతావనిని ఇప్పటికీ పీడిస్తున్న ఆర్థిక అసమానత అనే ప్రమాదకర అంధకారాన్ని శాశ్వతంగా పారద్రోలి దీపావళి పండుగలోని పరమార్థానికి ప్రాణప్రతిష్ఠ గావించవచ్చు.
మన మధ్యనున్న మహనీయులెందరో ఆచరించి చూపిన విధంగా మనం సైతం అనాథలైన చిన్నారుల జీవితాలలో విద్యాకుసుమాలు వికసించడానికై, అవని జనులకు అన్నం పెట్టే అన్నదాతల ఆకలి మంటలను చల్లార్చడానికై, అనారోగ్యం కారణంగా శ్రామికుని కుటుంబంలో నెలకొన్న దరిద్ర దేవతను శాశ్వతంగా సాగనంపటానికై, వృద్ధాశ్రమాలకు పంపబడుతున్న మన ప్రత్యక్ష దైవాలను మన వద్దనే ఉంచుకుని మన జన్మ కారకుల బాగోగులను చూసుకోవడానికై.. మనం సంపాదించిన ధనాన్ని, మన జీవితాన్ని సద్వినియోగం గావించి దీపావళి పండుగ యొక్క అంతరార్థానికి అనుగుణంగా నడుచుకుందాం!
మన మనసులను అతలాకుతలం చేస్తోన్న నరకాసుర తత్త్వాన్ని ప్రయత్న పూర్వకంగా పారద్రోలి శ్రీకృష్ణ-సత్యభామల మనోభీష్టానికి అనుగుణంగా లోకాస్సమస్తా సుఖినోభవంతు అన్న సర్వ మంత్రసారాన్ని సర్వత్రా వ్యాపింపజేద్దాం. భరతమాత మోములో క్రొత్త వెలుగులను నింపుదాం! మన మనోమందిరాలను దీపావళి లక్ష్మి కొలువుదీరిన దివ్యాలయాలుగా తీర్చిదిద్దుకుని పునీతులమవుదాం!

......................
మంచిమాట శీర్షికకు ఆధ్యాత్మిక సంబంధమైన వ్యాసాలను
సులభశైలిలో ఎవరైనా సొంతంగా రాసి పంపించవచ్చు.
రచనలు పాఠకులకు ఆసక్తికరంగా వుండాలి.
మూడు అరఠావులకు తగ్గకుండా వుండాలి.
ప్రచురించిన రచనలకు పారితోషికం ఉంటుంది.
...........................................................................

-అల్లాడి వేణుగోపాల్