మంచి మాట

సరస్వతీ దేవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్య, బుద్ధి, జ్ఞానములకు అధిష్ఠాన దేవతగా పరాశక్తి సరస్వతీ రూపాన్ని ధ్యానించడం జరుగుతుంది. సరస్వతీ దేవిని ఆరాధించడమెలాగో దేవీభాగవతం, బ్రహ్మ వైవర్త పురాణాలు చెపుతున్నాయి. చదువుల తల్లియే సరస్వతి.
మనదేశంలో అన్ని రాష్ట్రాలవారు మహా వైభవంగా సరస్వతీ పూజలు నిర్వహిస్తారు. ప్రతి హిందువు, ప్రతి విద్యార్థి, విద్యార్థినులు సరస్వతిని పూజించి జ్ఞానవంతులవుతారు. అక్షరానికి ఆలంబన సరస్వతీదేవియే. సమాజంలో మానవుల బుద్ధిశక్తి సరిగ్గా పనిచేస్తేనే ఏదైనా సాధించగలం. అలాంటి బుద్ధిని సరిగా పనిచేయించి ఐశ్వర్యాన్ని, జ్ఞానాన్ని శక్తినీ ప్రసాదించే ఆదిశక్తి దేవీ శారదాంబ. సరస్వతిని భారతిగా, శారదగా, చదువుల మాతగా ఆరాధిస్తారు.
ఈ సరస్వతీదేవి పుస్తకాది రూపంలో, విగ్రహంలో ఆవాహన చేసి పూజించడం అనావాయతీగా వస్తోంది. ఈ తల్లిని పూజించే క్రమంలో మొట్టమొదట ‘సరస్వతీ నమస్త్భ్యుం వరదే కామరూపిణీ విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమే సదా’ అంటూ ప్రారంభిస్తే కావాల్సిన విద్యలన్నీ కరతలామలకం అవుతాయ. సరస్వతీ స్తోత్రం పఠించడం వల్ల మేధాశక్తి, ధారణ, స్ఫురణ, ప్రజ్ఞ మంచి వాక్కు, బుద్ధి వృద్ధి చెందుతాయి. సరస్వతీ దేవికి తెల్లని రంగు ప్రీతికరమని ఈ తల్లి పూజలో తెల్లని పూలతో, తెల్లని వస్త్రాలు సమర్పిస్తారు. నైవేద్యంగా క్షీరాన్నం, టెంకాయలు, అరటిపళ్లని నివేస్తారు. పరాశక్తి స్వరూపాంగన ఈమెను అశ్వయుజ మాసంలో నవరాత్రులలో దేవీ ఆరాధనలో, మాఘమాసంలోను మూలా నక్షత్రం రోజున చక్కని అలంకారంతో దర్శించి ధన్యులౌతారు.
మేధాశక్తికోసం ఈ దేవిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు. స్మరిస్తారు. విద్యాదానం చేయమని వేడుకంటారు. వందనాలు చేస్తారు. ఈ దేవీ కృపవలన జ్ఞాన విజ్ఞానాలు వృద్ధి చెందుతాయి. లౌకిక విద్యలు, పరావిద్యా, బ్రహ్మవిద్యలు సరస్వతీదేవి కృపవలన లభిస్తాయి. ప్రాచీన కాలంనుండి పురాణాలలో, ఇతిహాసాలలో ప్రధమంగా తమ గ్రంథాలలో సరస్వతీదేవిని స్తుతించారు. సరస్వతిని ముందుగా ఆరాధించి పిదప గ్రంథారంభం చేసేవారు. నేటి కలియుగంలో కూడా శారదాదేవికి ప్రధమ స్థానమిచ్చి పూజిస్తూ తమ రచనలను ఆరంభిస్తున్నారు. అమ్మ దయలేనిదే ఏదీ లభించదని జ్ఞానులైనవారి పవిత్ర వాక్కు. ఆ వాక్కును సమాజమంతా ఆదరిస్తూనే వున్నది. వాగ్గేయకారులు తమ గీతాలలో సరస్వతిని తొలుతగా స్తుతిస్తూ రచిస్తే గాయకులు కూడా ముందుగా ఆ పాటలనే గానం చేయడం మనం వింటునేవున్నాము.
ఆదిపరాశక్తి-జగదంబ సృష్టికర్తయైన బ్రహ్మదేవునికి సరస్వతిని ఇచ్చి వివాహం జరిపించి ఆశీర్వదించి, వీణను, పుస్తకాన్ని, అక్షమాలను అందించినది. విద్యాధి దేవతగా యుగయుగాలలో ఆరాధింపబడుదువని దీవెనలందించింది. సరస్వతీదేవి లేనిచో బ్రహ్మ విశ్వమును సృష్టించుటలో కృతకృత్యుడు కాలేడని దేవీభాగవతంలో ఇంద్రుడు పలికినట్టు పేర్కొనబడింది. త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల భార్యలలో ప్రధమురాలుగా పూజలందుకుంటున్నది సరస్వతీదేవి.
వాక్కును ప్రసాదించి వాగ్దేవిగా, వీణ వాయిస్తూ వీణాపాణిగా, పుస్తకాన్ని ధరించి పుస్తకపాణిగా పూజలందుకుంటున్నది ఈ భారతీదేవి. హంసవాహినిగా, ఆనందవర ప్రదాయినిగా ఆరాధింపబడుతున్నది. ఈ దేవి ఆరాధన వలన కవితాధార అలవడుతుంది. ఈ తల్లి ధయవలనే అక్షర జ్ఞానంతో అలరారుతూ అవనిలో ఐశ్వర్యవంతులు, జ్ఞానవంతులుగా శోభిల్లుతున్నారు.
ఆదిశంకరాచార్యులవారు పలుచోట్ల దేశంలో శారదాదేవి పీఠాలను స్థాపించి విశ్వవిఖ్యాతిగావించారు. అందులో శృంగేరీ శారదా పీఠం విశిష్టమైంది. కాశ్మీరపురవాసినిగా కమనీయంగా ప్రార్ధింపబడుతున్నది. విధాత రాణిగా వున్నందున బ్రహ్మ ఈ దేవిని కవచ స్తోత్రం రూపంలో లోకానికి ప్రసాదించాడు. సంగీత, సాహిత్యాలకు రూపమే ఈ శారదాదేవి.

-పి.వి.సీతారామమూర్తి