మంచి మాట

హనుమజ్జయంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీమద్రామాయణం సకల వేద సారమైన గాయత్రీ మంత్రాక్షరములతో కూర్చబడిన పవిత్ర కావ్యం. వేద ప్రతిపాదిక ధర్మ నిరూపకం. ఈ మహాకావ్యంలో సీతారాముల తర్వాత వెంటనే చెప్పుకోతగిన విశిష్ట పురుషుడు హనుమంతుడు. శ్రీరామునివలె హనుమంతుడు కూడా ఆదర్శపురుషుడే. సీతాదేవికి కల్గిన రాక్షస పీడను దూరం చేయడంతోపాటు శ్రీరామచంద్రుని వైభవాన్ని ప్రకటించి, రావణుని కీర్తిని చీల్చి చెందాడిన శక్తిసంపన్నుడు, బుద్ధిశాలి.
హనుమంతుడు వైశాఖ మాస కృష్ణపక్ష దశమి తిథి శనివారంనాడు పూర్వాభాద్ర నక్షత్ర యుక్తమందు వైధృతి నామయోగమున గ్రహాలన్నీ శుభస్థానంలో సంచరిస్తూన్న మధ్యాహ్న సమయంలో కర్కాటక లగ్నమున జన్మించాడు. ఆయన కౌండిన్య గోత్రోద్భవుడు. ఆ స్వామి జననం పరోపకారం కోసమే జరిగింది.
హనుమ సూర్యభగవానుని శిష్యుడై తూర్పు పడమరల పర్వతముల రెండింటిపై అటు ఇటు పాదముల మోపి వేద వేదాంగములతోపాటు సకల శాస్త్ర పారంగతుడయ్యాడు. వానరశ్రేష్ఠుడైన హనుమంతుడు నవ వ్యాకరణవేత్త. నవబ్రహ్మలలో ఒక బ్రహ్మదేవుడు. ఆయనను మించిన పండితుడే లేడన్న ఆధారాలు బుధజనులెనె్నన్నో చూపెట్టారు. హనుమంతుడు సౌఖ్యప్రదాయి. ఎల్లవేళలా తన భక్తుల సుఖశాంతులే కోరుకొంటాడు. అలాగే ఆయన రూప విలాసం కూడా అద్భుతమయినదే. వానర రూపమున ఉన్నా శత్రుగణానికి మాత్రం యముడై కనిపిస్తాడు. భక్తకోటికి సదా శ్రీరామనామామృతాన్ని ఆనందంగా గ్రోలుతూ శాంతవదనంతో దర్శనమిస్తాడు.
హనుమజ్జననం ఎంతో ప్రత్యేకతను సంతరించుకొని ఉంది. లోకానుగ్రహ కాంక్షతో రాక్షస సంహారణార్థం హనుమంతుడు ఉదయించినట్టు పలు పురాణాలు చెబుతూన్నాయి. కేసరి భార్య అయిన అంజనాదేవికి ఫలప్రదంగా అగ్ని, వాయుదేవుల సహాయంతో అందిన శివుడి తేజోమూలంగా ఆయన జన్మించాడు. కావుననే హనుమంతుడు కేసరీనందనుడయ్యాడు. అగ్నిమూలంగా అనిలాత్ముడుగా, వాయుదేవుని కారణంగా పవనసుతుడుగా, శివశక్తితో శంకర తనయుడుగా కీర్తింపబడుతున్నాడు. హనుమ శ్రీరాముని పరమ భక్తుడు, దాసుడు కూడా. శ్రీరామచంద్రునిపై ఆయనకున్న భక్తి అపారం. ఒకానొక సందర్భంగా తన భక్తి చాటుకొనేందుకై ఎదలను చీల్చి అందున్న సీతారాములను చూపెట్టాడు.
నిశ్చలమైన ఆయన భక్తికి అవరోధం కల్గకుండా మేరు పర్వతమునకు నైరుతి దిశలో వున్న గంధమాదన పర్వతాన్ని తన తపోదీక్షకు తగిన స్థలంగా ఎన్నుకున్నాడు. ఆ పర్వతం మహావృక్షాలతో, వివిధ ఫల పుష్పాదులతో అలరారుతూ మనోల్లాసాన్ని కల్గిస్తూంటుంది. దాని శ్రేణులలో కదళీవనాలున్నాయి. రామధ్యాన తత్పరుడై అక్కడనే వుంటూ ఆకలివేళలో అరటిపండ్లు ఆరగించి ఆకలి తీర్చుకునేవాడు. ఈ కారణంగానే హనుమకు అరటిపండ్లంటే మహా ఇష్టం. హనుమ నామస్మరణం పాపహరణం. శుభాశుభ సమయములందు అన్నింటా పవిత్రమగు హనుమ నామం భక్తితో పనె్నండుసార్లు భజించినట్లయితే తప్పక కార్యసిద్ధి అగునని పరాశర మహాముని తెలిపిన ఆధారాలున్నవి. హనుమను భజిస్తే రోగాలు దరిచేరవని తెలుస్తోంది. గ్రహదోషాలున్నవారు హనుమంతుని పూజించినా, మండలంరోజులపాటు స్వామివారికి ప్రతిరోజూ ఐదు ప్రదక్షిణలు గావించినా దోషాలు దూరమవుతాయని సుందరకాండలో తెలుపబడింది. రామశబ్దం వున్నచోట సజలనేత్రుడిగా ముకుళిత హస్తుడై హనుమ తలవంచుకుని నిలబడి ఉంటాడని ఆర్యోక్తి. మారుతి మాట నేర్పరేగాని మితభాషి.
హనుమంతుడు కార్యసాధకుడు, ఉత్తమ దూత. రామ సుగ్రీవుల నడుమ సయోధ్య సమకూర్చి సుస్థిర స్నేహమందిర నిర్మాణానికి శ్రమించిన కరసేవకుడు. హనుమచరితం ఆద్యంతం మహిమాన్వితమే. ఆ రామదూతను స్మరించి, ధ్యానించి, పూజించి, కీర్తించినట్లయితే ఆయన అపార కృపాకటాక్షాలకు తప్పక పాత్రులమయితీరుతామన్నది ముమ్మాటికీ నిజం.

-ఎం.సి.శివశంకరశాస్ర్తీ