మంచి మాట

వటపత్రశాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకనాడు మార్కండేయ మహర్షి నారాయణమూర్తినుద్దేశించి ‘‘దేవా నీవు మాయాస్వరూపుడవు. నీ మాయను కళ్ళారా చూచుటకు వేడుక పడుతున్నాను. నన్ను కృతార్థుడను చేయుము’’ అనగా పరమాత్ముడు అట్లేకానిమ్ము అని పలుకుచూ బదరికాశ్రమమునకు తరలివెళ్ళెను. శ్రీ మార్కండేయుడప్పటినుండి భగవంతుని మాయను దర్శించుట ఏనాడో కదా అని వ్యాకుల మనస్కుడాయెను.
ఒకరోజు హఠాత్తుగా పెనుగాలులు వీయదొడగెను. కారుమబ్బులు కూడి పెద్ద ధారలతో వర్షింపదొడగెను. ప్రచండ ప్రళయకాల పరిస్థితి దాపురించెను. ఒక మార్కండేయుడు మినహా ప్రపంచమే లేనట్టు తయారయ్యెను. జల జంతులేకమై అతనిని బాధపెట్టుచున్నట్లు మహర్షి బాధితుడాయెను. చాలాకాలమైనట్లు అతనికి తోచెను. ఒకనాడాయన ఒక ఎతె్తైన ప్రదేశమున ఒక చిన్న మఱ్ఱిచెట్టును చూచెను. ఆ వృక్షము ఈశాన్య దిశ యందు కొమ్మపై దొనె్న ఆకారమున చిన్న ఆకు గలదు. అందు ఒక శిశువు పరుండి యుండెను. ఆ శిశువు దేహకాంతి వలన చుట్టుపట్ల చీకటులు పటాపంచలాయెను.
అల్లారు ముద్దుగా కనపడెడి ఆ శిశువును చూచి భ్రమ చెందిన ఆ మహర్షి ఆ శిశువును సమీపించెను. ఆ శిశువు తన చిట్టిచేతులతో పాదారవిందమును పట్టుకొని నోటియందిడుకొని బొటనవ్రేలును చీకుచుండెను. ఈ మహిమాన్విత శిశువు ఎవరని శంక తీర్చుకొనుటకు సమీపించిన మహర్షి శిశువును చేరిన వెంటనే అతడు ఒక దోమ వలె మార్పు చెంది ఆ శిశువు గర్భంలోనికి లాగబడెను. అతడు పసివాని ఉదరమున ఆకాశమును, అంతరిక్షమును, నక్షత్రములో నిండిన జ్యోతిర్మండలమును, పర్వతములను, సముద్రములను, దేశములను, ద్వీపములను, దిక్కులను, సురాసురులను, వనములను, వెయ్యేల సమస్తమును, జగత్తునందేర్పడిన పరిణామములను చూచెను. విశ్వమంతయు అతడాశిశువు ఉదరమందు కాంచెను.
అంతటి ఒక నిట్టూర్పుతో ఆ మహర్షి బయటపడి వచ్చిన వెంటనే ప్రళయకాల జలధిలో పడిపోయెను. మరల అతడు ఆ సముద్ర మధ్యమున వట వృక్షమును, వటపత్రశాయిని దర్శించెను. ఆ చిన్నారి తన అధరముపై ప్రేమామృతముతో మిళితమైన చిరునవ్వు చిందించుచుండెను. మార్కండేయుడు ఇంద్రియాతీతమైన ఆ భగవంతుని తన హృదయమున ప్రతిష్ఠించుకొని ఆ చిన్నారిని అక్కున చేర్చుకొనుటకు సమీపించెను. అంతట ఆ శిశువు మహర్షి తనను సమీపించమునుపే మార్కండేయునకు ఆలింగనము ఇవ్వక అంతర్హితుడాయెను. శిశువు అదృశ్యుడైన వెంటనే వటవృక్షము, ప్రళయకాల దృశ్యము మాయమై మార్కండేయుడు యథాప్రకారముగా తన ఆశ్రమమందు ఆసీనుడాయెను.
అంతట మార్కండేయుడు ప్రదర్శితమైన యోగమాయా వైభవమును సందర్శించి ఆ పరమ పురుషుని శరణుచొచ్చుటయే యుక్తమని నిశ్చయించుకొనెను. అతడు శ్రీహరి నుద్దేశించి ‘‘ప్రభూ, నీ మాయను ప్రదర్శించినతోడనే సత్యముగా భావించెను. గొప్ప గొప్ప విద్వాంసులు కూడా ఆ మాయకు మోహితులగుదురు. సంసార భయముచే నీ పాద పద్మముల నాశ్రయించినవారికి అవి అభయ ప్రదానమొనర్చును. ముకుళితుడనై నీ చరణ కమలములను శరణుచొచ్చుచున్నాను’’ అనెను.

.................................
మంచిమాట శీర్షికకు ఆధ్యాత్మిక సంబంధమైన వ్యాసాలను సులభశైలిలో ఎవరైనా సొంతంగా రాసి పంపించవచ్చు. రచనలు పాఠకులకు ఆసక్తికరంగా వుండాలి.
మూడు అరఠావులకు తగ్గకుండా వుండాలి. ప్రచురించిన రచనలకు పారితోషికం ఉంటుంది.
...............................

-పట్టిసపు శేషగిరిరావు