మంచి మాట

సమతాభావం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ప్రతి వ్యక్తీ తాను పుణ్యాత్ముణ్ణి అని అనుకుంటాడు. అలా అనుకోవడంవల్ల అంత ఇబ్బంది లేదు. కానీ ఇతరులు మటుకు పాపాత్ములని అనుకోవడం ఎంతమాత్రం మంచిదికాదు. నిజంగా మహాపాపాలు చేసేవారి యందు కూడా అలాంటి నీచభావన ఉండకూడదు. అయితే ఆ పాపకృత్యాలు కళ్ళారా చూస్తూ అనుకోకుండా ఎలా ఉండగలం అన్న సందేహం కలగడం సహజం. అటువంటి సందేహంతో సతమతం కాకుండా ఉండేందుకో మార్గం ఉంది. అదే ఆధ్యాత్మిక భావన!’ అన్నారు ఆదిశంకరాచార్యులు.
ఆత్మ శాశ్వతమైనది. అది సత్ చిత్ ఆనందరూపం. అనాది. అనంతం. శరీరాలను బట్టి ఆత్మలు అనేకంగా కనబడుతున్నాయి. ఒకే సూర్యుడు వేరు వేరు కుండల్లో వున్న నీటిలో ప్రతిబింబించి అసంఖ్యాకంగా కనబడుతున్నట్లు ఒకే ఆత్మ అనేక దేహాలలో అనేకంగా కనబడుతున్నది. కనుక మన ఆత్మవలెనే ఎదుటివారి ఆత్మ కూడా సచ్చిదానంద స్వరూపమే. అంటే ఒకటే అని అర్థం. ఈ విషయం చక్కగా బోధపరచుకుంటే ఇతరులు పాపాత్ములు అన్న భావమే కలుగదు.
కొంతమందికి ఎప్పుడూ ఇతరుల సంగతులు తెలుసుకోవాలనే ఆసక్తి విపరీతంగా ఉంటుంది. ఇరుగు పొరుగువారి సంగతులు వినడానికి చెవికోసుకుంటారు. ఇది ఎంతమాత్రం మంచి అలవాటు కాదు. ఇతరుల కుటుంబాల్లోని కలతలు వీరికి వినసొంపుగా వుంటాయి. వారి అభివృద్ధి వీరి మనస్సుల్లో అనంతమైన అలజడి, క్షోభ కలిగిస్తుంది. అలా కాకుండా ఉండాలంటే మనస్సు చంచలమవకుండా చూసుకోవాలి. చిత్తస్థయిర్యాన్ని సాధించగలిగితే నైర్మల్యం దానంతటదే కలుగుతుంది. అప్పుడు ఇతరుల విషయాలు వినాలనే ఆసక్తి పోతుంది.
జీవితంలో ఎవరైనా సరే కఠినంగా వ్యవహరించడం అంత మంచిది కాదు. దానివల్ల మనిషిలో క్రౌర్యం చోటుచేసుకొంటుంది. అది అతన్ని క్రూరుడిగా మార్చుతుంది. ఇంత చెడు చేసే క్రౌర్యం దరిచేరకుండా చేసుకోవాలంటే దయాగుణాన్ని అలవరచుకోవాలి. దయాగుణం క్రౌర్యానికి విరుగుడు మందు. దయ ఆత్మయొక్క గుణం. దీనివల్ల మనిషిలో కాఠిన్యం కరిగిపోతుంది.
ఇక మనిషి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు తారసిల్లుతాయి. మానావమానాలు కలుగుతాయి. నిష్కారణంగా ఇతరులవల్ల అవమానించబడటం సంభవిస్తుంది. దానివల్ల తీరని మనోవ్యధ అనుభవించాల్సి వస్తుంది. ఉత్తపుణ్యానికి భరించాల్సి వచ్చిన ఈ అవమాన భారాన్ని, అందువల్ల కలిగిన దుఃఖాన్ని దూరం చేసుకోవడానికి ‘అది నా కర్మవల్ల జరిగిందిలే’ అనుకుంటే సరిపోతుంది. లేదా ‘నాలో ఏదో దోషం ఉంది. కనుకనే వాళ్ళు నన్ను అవమానించారు’ అని భావించినా చాలట.
అలా భావించగలిగితే అవమానంవల్ల వచ్చిన దుఃఖం వెంటనే ఉపశమిస్తుంది. అది మనస్సుకు అంటనే అంటదు. కాబట్టి అసలు బాధపడే పరిస్థితి రానే రాదు. ఈ విధానాలతో సరిపెట్టుకోలేకపోతే ‘ఎదుటివారిని అవమానించడం ఆ వ్యక్తుల స్వభావం’ అని సర్దుకుపోతే ఏ సమస్యా వుండదు. ఇది ఆధ్యాత్మిక ఉన్నతికి కూడా ఎంతగానో దోహదపడుతుంది.
ఇంతటి సహనాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకుంటే ‘ఆత్మవత్సర్వభూతాని’ అనే భావం వారిలో కలుగుతుంది. ఈ ఆధ్యాత్మ భావం గనుక అలవడితే అందరూ సమానులే అన్న సమభావం ఏర్పడుతుంది. అప్పుడు ఏ కులమైనా, ఏ మతమైనా, పండితుడైనా పామరుడైనా ప్రతి దేహిలోనూ ఏకాత్మతత్త్వమే గోచరమవుతుంది. అలాంటివారే జ్ఞానులు. ఇది సాధించడానికి సమతాభావమే సాధనం. సమతాభావంవల్ల సర్వ ప్రపంచం శాంతిగా ఉంటుందని జగద్గురు శంకరాచార్య ప్రబోధించారు. ఈ ప్రబోధం నిత్యమూ అనుసరణీయమైనది. ఆచరించదగ్గదీ. కనుక మనమందరమూ దీనిపై దృష్టిని నిలుపుదాం. సార్వజనీనమైన ఈ సత్యాన్ని భావితరాలకు అందిద్దాం.

-చోడిశెట్టి శ్రీనివాసరావు