మంచి మాట

సత్యధర్మాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏకం సత్ విప్ర బహుధా వదంతి. ఇది అందరూ ప్రవచిస్తున్న ఆర్యోక్తి, వేదోక్తి. వేదాలు ఏ జాతికి ఏ మతానికి ఏ సంప్రదాయానికి చెందినవి కావు. సర్వమత సామరస్యానికి సమన్వయానికి చెందిన జీవన ధర్మం, విజ్ఞాన సర్వస్వం. ఈ వేదోక్తి భావం సవివరంగా తెలుసుకుందాం. స్థూలంగా దీని అర్థం ఇది. సత్యం ఒక్కటే. విప్రులు అనగా పండితులు ఈ సత్యమును బహు విధాలుగా చెప్పుదురు అని అర్థం.
ఏది సత్యం అంటే- సర్వమానవ సంక్షేమానికి, శ్రేయస్సుకు మార్గం చూపగల తేజస్సు, బృహత్తర సత్యాన్ని జ్ఞాన శిఖరాగ్రం నుండి ఋషీశ్వరుడు శృంగధ్వనితో దిగంతాలకు వినిపించాడు. ఆ సత్యం స్వప్రకాశం, అఖండం, అవిభాజ్యం, అనంతం, శాశ్వతం. అది సర్వతంత్ర స్వతంత్రం. అద్వితీయం. ఆ సత్యం ‘ఏకం సత్’ అంటే ఒక్కటి సంఖ్యావాచకం కాదు. అది సంపూర్ణం, సమగ్రం. అంతా అదే. ఉన్నదంతా అదే. మరొకటి లేదు అని భావం. అది సర్వనామ రూపాలకు అతీతం. గుణాతీతం అన్నారు ఋషీశ్వరులు, యోగీశ్వరులు. వారు దర్శించే కోణాన్ని బట్టి, అనుభూతి బట్టి అనేక రూపాలుగా, అనేక విధాలుగా కనబడుతుంది. వారు ఏ విధంగా ఆరాధించినా సత్యం స్థిరమైనది, శాశ్వతమైంది. దానినుండే ఈ చరాచర జగత్తు ఆవిర్భవించింది. వారు దర్శించిన అంతస్తు, అనుభూతి కోణమే తేడా.
నాస్థికులు, ఆస్థికులు, హేతువాదులు, భౌతికవాదులు, ఆజ్ఞేయవాదులు భగవంతుడి ఉనికిని లేక అస్థిత్వాన్ని అంగీకరించకపోవచ్చు. కాని సత్యము సర్వమానకోటి అంగీకరించక తప్పదు. భౌతిక విజ్ఞాన శాస్త్రం ప్రకారం హెచ్2ఒ అనే రసాయనిక పదార్థం పరిశోధనాలయంలో ఉదజని, ఆమ్లజని కలిపితే ఏర్పడే ద్రవపదార్థం. ఇంగ్లీషులో వాటరు, తెలుగులో నీరు, సంస్కృతంలో జలం, తమిళంలో తన్ని, హిందీలో పాని అని ఒక్కొక్క భాషలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. అలాగే సత్యమును భగవంతుడని, పరమాత్మ అని, అల్లా అని, జీసస్ అని, శివుడని, విష్ణువు అని, శ్రీరాముడని, శ్రీకృష్ణుడని అనేక నామాలతో పిలుస్తారు. పరమ సత్యం సర్వతంత్ర స్వతంత్రమైనది. పంచేంద్రియాలకు, పంచభూతాలకు, పంచకోశాలకు (అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయకోశాలకు) సప్త్ధాతువులకు అతీతమైనది. అదే పరమాత్మ. దానినుండి ఈ సమస్త చరాచర జగత్తు ఆవిర్భవించినది. ఒక సందర్భంలో మహాత్మాగాంధి భగవంతుని అస్తిత్వాన్ని అంగీకరించడం అభ్యంతరమైతే, సత్యమే భగవంతుడన్నాడట. ఈ సమస్త విశ్వమునకు సూర్యుడు ఒక్కడే. కిరణాలు అనంతం. అలాగే సత్యం ఒక్కటే. దానినుండే అనేక నామ రూపాలు, అవతారాలు అవతరించినై. భిన్నత్వంలోనే ఏకత్వం ఉన్నది. పరస్పరం విరుద్ధం కాదు, ఆశ్రయం. అనేకత్వం ఏకత్వమునకు విలాసం, శీల. ఇది అనుభవములోకి రావాలి. అపుడు మృణ్మయ జీవితం చిన్మయం కాగలదు. శ్రీ అరవిందుడు ఆశించిన పృధ్విపై అధిమనస్సు అవతరించగలదు.
నా ఆరాధనయే సత్యం, మిగిలినవి అసత్యం అనుకొనడం అవివేకం. ఆ ధోరణి నిరంకుశత్వానికి దారితీయగలదు. ఆశించవలసినది పరమత సహనమే కాదు, పరమతాన్ని సహృదయంతో గౌరవించాలి. లక్ష్యం ఒక్కటే మార్గం. మార్గాలు అనేకం. ఇదే రామకృష్ణ పరమహంస తన సాధనలో రుజువుచేశాడు. దీన్ని బట్టి మతాంతరీకరణ ఎంత హాస్యాస్పదమో అర్థవౌతుంది. ఈ విశాల దృక్పథం మానవ జీవితంలో అన్ని రంగాలలో అనుష్ఠించాలి. అప్పుడు శాంతియుత సహజీవనం సాధ్యవౌతుంది. మానవ జీవితం స్వర్గ్ధామం అవుతుంది.
ఒకచోట అన్నాడు స్వామి వివేకానందుడు- క్రైస్తవుడు ఉత్తమ క్రైస్తవుడుగా, మస్లిము ఉత్తమ ముస్లిముగా, హిందువు ఉత్తమ హిందువుగా మారాలి అని అన్నాడు. భవిష్యత్తులో రాగల మతం ఒక్కటే ‘వేదాంత మతం’. అన్ని మతాలు దానిలో విలీనం అవుతాయి అన్నారు. ‘దేర్ ఈజ్ నో రెలిజియస్ హైయ్యర్ దేన్ ట్రూత్’.

-పున్నావఝుల వెంకటేశ్వరరావు