మంచి మాట

పాపనివారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అఘ’మనగా సంస్కృత భాషలో పాపము అని అర్థము. ‘మర్షణ’ అంటే పోగొట్టుకొనుట. మంత్రాలు పఠిస్తే చేసిన పాపాలు పోవు. కాని పాపం చేయకుండా ఉండటానికి దోహదపడతాయ. ఋగ్వేదములోని దశమ మండలములో అఘమర్షణ సూక్తం వివరించబడినది. సస్వర యుక్తంగా వేద పఠనము చేసే వేద పండితులు ‘అధ అఘమర్షణ సూక్తమ్’ అంటూ ఈ సూక్తాన్ని పఠిస్తారు. కేవలం మూడు మంత్రాలుగల అతి చిన్న సూక్తం ఇది. అయినప్పటికిని సృష్టిరచనను ఎంతో సంక్షిప్తంగా తెలుపుతుంది. ఈ మంత్రాలను అఘమర్షణో మధుఛందసుడు అనే ఒక గొప్ప ఋషిపుంగవుడు మంత్రాల అర్థాన్ని మననం చేస్తూ యోగసాధనతో సమాధి స్థితిలోనికి వెళ్లి అంతర్యామి సాక్షాత్కారం పొంది ఆయన ద్వారా మంత్రాల అసలు రహస్యాన్ని తెలుసుకున్నాడు. తను తెలుసుకున్న విషయాలను తన శిష్యులకు తోటి మానవులకు చక్కగా విడమరచి చెప్పాడు. ఈ మంత్రాలను అర్థ్భావనతో పఠిస్తే విశ్వాత్మ, సర్వశక్తిమంతుడు సర్వవ్యాపకుడని గ్రహించి పాపాలు చేయకుండా ఉంటారని భావం.
వేద ప్రకరణములో దేవత అంటే ఆ సూక్తము అనగా ఆ మంత్రము చెప్పే విషయము భావవృత్తము. అనగా భావించబడిన, ఊహించబడిన వృత్తం అని గ్రహించాలి. మేఘావృతం కాని ఆకాశాన్ని పరికించి చూచినట్లయితే అగణితమైన నక్షత్రాలు అన్ని వైపులా గోచరిస్తాయి. అవన్నీ ఈ భూమి చుట్టూ ఒక వలయంగా వృత్తంలా ఉన్నట్లు గోచరమగుతుంది. ఆ నక్షత్ర వలయానే్న ఋషిపుంగవులు భావవృత్తమని, కాంతి వృత్తమని, ఖగోళ వృత్తమని వివిధ పేర్లతో పేర్కొన్నారు. ఈ మంత్రాలలో ఆ భావ వృత్తం అనేకానేక నక్షత్ర కుటుంబాల సృష్టి ఏ విధంగా జరిగినదో తెలుపుతుంది.
వేద సాంప్రదాయంలో ఏదేని సూక్తాన్ని పఠించేటపుడు ఆ జ్ఞానాన్ని ప్రసాదించిన సృష్టికర్తను స్మరించడం వేద సాంప్రదాయము. సృష్టికర్తయొక్క గుణ గణాలు శక్తి సామర్థ్యాలు అనేకం, అనంతం. అందువలననే గుణానికి ఒక పేరుగా అనేకానేక నామాలు ఏర్పడినాయి. వాటిలో ‘ఓమ్’ అనునది అతని అసలు పేరు. ముఖ్యనామం. ఆ నామంతోనే స్మరించుట ధర్మం మరియు విధి విధానం కూడా. పరమాత్ముని యొక్క ప్రకాశవంతమైన తపస్సుతో ఋతసత్యములు సృష్టిగా ఉత్పన్నమనవి. ఋతం అంటే ప్రాకృతిక నియమాలు. సత్యం అంటే సత్త్వరజస్తమో గుణాత్మకమైన అవ్యక్త ప్రకృతి. అనగా తనలోని ప్రకృతిని సృష్టికర్త తనదైన తపస్సుతో, కొన్ని శాశ్వత నియమాలతో విశ్వంగా నిర్మించాడు. మునుముందుగా ప్రళయరూప రాత్రి ఉత్పన్నమైనది. దాని నుండి అర్ణవ సముద్రము ఉద్భవించినది. ఆ అర్ణవ సముద్రం క్రమంగా ఒక చోటికి చేరి ఒక పెద్ద అండంగా ఏర్పడింది. అది ఒక క్రమపద్ధతిలో కేంద్రంవైపునకు నొక్కబడుటచే ఆ ఒత్తిడికి ప్రేలిపోయి ముక్కలు ముక్కలుగా విడిపోయినవి. ఆ చిమ్మబడిన ముక్కలు నక్షత్రాలుగా ఏర్పడినవి. అవి మళ్లీ కేంద్రిక ఒత్తిడికి గురియై గ్రహాలుగా, ఉపగ్రహాలుగా, నక్షత్రాల చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. నక్షత్రాలను సూర్యులని వాటి చుట్టూ తిరుగువానిని గ్రహాలనీ, గ్రహాల చుట్టూ తిరుగువానిని ఉపగ్రహాలని (చంద్రుడు) వ్యవహరించారు. కొన్ని గ్రహాలకు 2, 3, 4 ఉపగ్రహాలు కూడా ఉన్నాయి. కాని భూమికి మాత్రం ఒకే ఉపగ్రహమున్నది. సూర్య కుటుంబంలో సూర్యుడొక్కడే స్వయం ప్రకాశకుడు. సూర్యునిలోనున్న హైడ్రోజన్ వాయువు హీలియం వాయువుగా మార్పు చెంది అగ్నిజ్వాలలు వెలువడి సూర్యుని ప్రకాశవంతంగా చేస్తాయి. ఈ ప్రక్రియ గ్రహాలలో లేనందున అవి సూర్యప్రకాశంలో ప్రకాశితవౌతున్నాయి. గ్రహాలన్నీ తమ చుట్టూ తాము తిరుగుటవలన సగభాగంపై సూర్యకాంతి పడి పగలుగా మిగతా భాగం రాత్రిగా ఏర్పడుతుంది. ఈ ఏర్పాట్లన్నీ వాటంతట అవే ఏర్పడినవి ఎంతమాత్రం కాదు. ‘వశీ’ అను విశ్వాత్మ వాటిని అట్టి నియమాలతో బంధించి తన వశంలో పెట్టుకున్నాడని ఈ మంత్రం స్పష్టపరుస్తుంది. దీనికి సృష్టికర్త పాలకుడు ఒకడున్నాడని అనేక మంత్రాలు చెబుతున్నాయి. ఇవన్నీ సహజంగా జరుగుతున్నట్లు కనబడినా వాటిని ఆ విధంగా ఏర్పాటుచేసిన జ్ఞానతత్త్వం ఒకటి ఉంది. ఈ సృష్టి రచననే అఘమర్షణ సూక్తం.

-పెండెం శ్రీధర్