విజయవాడ

కబుర్లని కదిపితినా.. (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉదయం ఐదు గంటలకి వాకిట్లో ముగ్గు వేస్తున్నాను. ఒక వృద్ధురాలు పూర్తిగా నడుము వంగిపోయి నేలవంక చూస్తూ వెళుతోంది. ధనుర్మాసం. ఇంకా పూర్తిగా వెలుగురాని ఈ సమయంలో ఏం పని? మళ్లీ తొమ్మిది గంటలకి ఒక ప్లాస్టిక్ కవరులో బాక్స్ పెట్టుకుని మా ఇంటి ముందు నుంచే వెళ్లింది.
మా వీధిలో అందరి ఇళ్లల్లో వ్య క్తుల స్వభావాలు, చేసే ఉద్యోగాలు, జరిగే సంఘటనలు, సమస్యలు ఎప్పటికప్పుడు తెలియచేస్తుంది (టివి వార్తల్లా వివరంగా) పనిమనిషి రామసాయి. చాలా హుషారుగా వుం టుంది. మిగిలిన పనివాళ్ల ద్వారా వాళ్లు పనిచేస్తున్న ఇళ్లలోని గొడవలు, ఇంట్లోవారి గుణగణాలు అన్నీ తెలుసుకుని నాకొచ్చి చెపుతుంది.
‘నీకెందుకే వీధిలోవాళ్ల గొడవలు?’ అంటే.. ‘మీరు కథలు రాసుకోడానికి పనికొస్తాయిలే అమ్మా’ అంటూ నవ్వుతుంది.
నిజమే అది చెప్పే ప్రతి సంఘటన గురించి ఆలోచిస్తాను. ఒక రకంగా ఇల్లు కదలని నేను ఇలా కథలు రాస్తున్నానంటే రామసాయి చెప్పే కబుర్లే ఆధారమని చెప్పక తప్పదు. ఒకసారి దానితో పొరపాటున ఆ సంగతి అనేశాను. అప్పటి నుంచీ అది రెచ్చిపోయి మరికాస్త విషయ సేకరణ చేస్తోందని అర్థమైంది.
ఆరోజు గేట్లో నిలబడి వుండగా రామసాయి కనిపించింది. లోపలికి రమ్మని పిలిచాను. హుషారుగా వచ్చి పక్కనే కాళ్ల దగ్గర కూర్చుంది.
ఆ వృద్ధురాలి గురించి అడిగాను. ‘ప్రతిరోజూ అంత చీకట్లో ఎక్కడికి వెడుతుంది? ఇల్లెక్కడ?’ ఆరా తీశాను.
అది హుషారుగా చెప్పడం మొదలుపెట్టింది.
‘్భపాలరాజుగారి ఇంట్లోకి అద్దెకి వచ్చారు. కొడుకు, కోడలు. ఏవో చిన్న వుద్యోగాలు. ఈ ముసల్ది కూడా రమణమూర్తి గారింట్లో పనిచేసి నెలకి రెండు వేలు జీతం సంపాదిస్తుంది. భార్యభర్తలిద్దరూ జుట్టుకి రంగు వేసుకోరు. తలలు ముగ్గుబుట్టలే’.. అని కిసుక్కున నవ్వింది.
‘ఏం పని చేస్తుంది? పనిచేయకపోతే అన్నం పెట్టరా?’ అడిగాను కోపంగా.
‘వాళ్ల దొడ్లో నాలుగు చెట్లు.. మామిడి, నిమ్మ, అరటి, దానిమ్మ ఉన్నాయి. తెల్లారేసరికి దొడ్డంతా ఆకులతో నిండిపోతుంది. అవన్నీ ఊడ్చి పోగుపెట్టి, నాపరాళ్లు కడగాలి. పోగు పెద్దదయ్యాక మంటపెట్టాలి. అంట్లుతోమాలి. ఇల్లు ఊడ్చి తడిగుడ్డ పెడుతుంది. ఆయన భార్య వంటకి కూరగాయలు తరిగి ఇస్తుంది. వాళ్లతోపాటే కాఫీ, టిఫిన్ ఇస్తారు. ఒకపూట భోజనం కూడా. వాళ్లబ్బాయి అమెరికాలో వుంటాడు. ఈ మామ్మకి జీతం కాకుండా ఏడాదికి పదివేలు పంపుతాడు. ప్రభుత్వ పింఛన్ వెయ్యి తెచ్చుకుంటుంది. ఇక బట్టలు. వాళ్లతో పాటు మామ్మగారికి కూడా తెస్తారు. దసరాకి, సంక్రాంతికి వాళ్లదగ్గరే ఉండమని బతిమాలతారు. అయినా వుండదు. ‘తను లేకుంటే తన కొడుకుని కోడలు కాల్చుకు తింటుందని, తనంటే దానికి కొద్దిగా భయముంద’ని అంటుంది. కొడుకేమో ‘పనిలోకి వెళ్లకే అమ్మా! అందరూ నాకేసి అసహ్యంగా చూస్తున్నారం’టూ వాపోతాడు. ‘చేతనైనంత వరకూ కష్టపడనివ్వండి. తిని కూర్చుంటే రోగాలు వస్తాయ’ అంటుంది కోడలు.
ఇక పక్కింట్లో రాజమణికి భర్త పెన్షన్ వస్తుంది. అయినా ఏవో లంగాలు రోజుకి డజను కుట్టి రెడీమేడ్ షాపులకిస్తుంది. కట్ చేసి వాళ్లే పంపుతారు గుడ్డని. ఇంట్లో ఒక్కపని కూడా ముట్టుకోదు. ‘కోడలుండగా నాకేం ఖర్మ, వంట చేయడానికి’ అంటుంది.
అన్ని పనులకీ పనిమనిషి వుంది. కోడలు బైటున్న మూడురోజులూ చక్కగా వంట చేస్తుంది. మందుల రేట్లు బాగా పెరిగిపోయాయి. పెద్దతనం వచ్చింది. కొద్దిగా దానధర్మాలు, గుడిలో పూజలకి, ప్రతి గురువారం రొట్టెలు చేసి సాయిబాబా గుడి ముందు కూర్చున్న ముష్టివాళ్లకి పంచిపెడుతుంది. దుర్గమ్మకి, అన్నవరం సత్యన్నారాయణకి, తిరుపతి వెంకన్న అన్నదానానికి డబ్బు కట్టింది. అక్కడి నుంచి ఆవిడకి అప్పుడప్పుడూ ప్రసాదాలు వస్తాయి. ప్రతి శుక్రవారం శివాలయం, అమ్మవారి గుళ్లో లలితా సహస్రనామం చదువుతుంది. పేద విద్యార్థులు నలుగురికి ఫీజు కడుతుంది. ఇంట్లో మాత్రం ఒక్క రూపాయి ఇవ్వదు. ‘తల్లికి అన్నం పెట్టడం కొడుకు బాధ్యత’ అంటుంది. ఆవిడని కొడుకు, కోడలు గౌరవిస్తారు. ‘ఓపికున్నంతవరకు వరకూ సంపాదిస్తూ వుండాలి. తిని కూర్చుంటే ఈసడిస్తారు’ అంటుంది. మరి పాపం మామ్మగారు తనే తిండి తెచ్చుకున్నా నానామాటలు అంటుంది కోడలు. ఈ మామ్మలిద్దరి గురించీ మీరు కథ రాయండమ్మా’ అంటూ వివరించింది రామసాయి.

- జ్యోతిర్మయి, విజయవాడ.
**

మనోగీతికలు

రైతే రాజు

పంచ భూతాలకు
పరమావధిగా
ధరణి గర్భాన
పుట్టిపెరిగే సస్యములకు
పుడమిపై ప్రాణికోటికి
ఆహారపు అంతర్యామిగా
హాలికుడనే రైతన్నకు
నింగిలోని తారకలు
దారిచూపు రాణులుగా
పంట క్షేత్రాలందించిన
నవధాన్యపు ఫలాలను
విత్తన శుద్ధి రక్షణతో
రైతన్నలకు సాయంగా
చికటిలో వెలుగులను
అందించే మిణుగురుల
సృష్టిమాత దీవెనతో
స్వయం ప్రకాశాలుగా
రైతన్నకు దారిదీపాలు
హితులాయెను అవనిలోన
నాగరికతన నగరాల
వెలుగులన్నీ ప్రజలకైతే
సస్యములను పోషించే
రైతులకు చీకటులు
ఎరువులు, మందులు
మంచి విత్తనాలూ
సమకూర్చండి సవ్యంగా
ప్రజలు బాగుంటేనే
దేశం బాగుపడుతుంది
పాలించే ప్రభువులు
ఆలోచనలు చేయండి
పాలితులకు పాలకులకు
అసలు సిసలైన
హాలికుడే రాజు కదా
దేశ రక్షకుడు జవానైతే
ప్రజారక్షకుడు కిసానుకదా
అందుకే అన్నారు
రక్షించేవాడు జవాన్
పండించేవాడు కిసాన్
జైజవాన్.. జైకిసాన్
రేరాజుకు, రారాజుకు
అందరికీ రైతేరాజు!

- తన్నీరు సీతారామాంజనేయులు,
జగ్గయ్యపేట, కృష్ణా జిల్లా.
చరవాణి : 8332824726
***

తెలుగును నమ్ముకో..

తే.గీ. అందఱును కట్టగుట్టుకు అమెరికాకు
పొండిరా నేను మీ చెల్లి ఇండియాలొ
కలియొ గంజియొ ద్రావుచు తెలుగుభాష
కొఱకు కృషిచేసెదము శక్తికొలది యిచట

సీ. మల్లాది వారును మల్లాప్రగడ వారు
గరికిపాటి యువద్దిపర్తి వారు
చాగంటి వారును సామవేదము వారు
మహతిశంకరు గారు మైలవరపు
మేడసాన్యవధాని మాడుగులవధాని
మంజులశ్రీ అన్నమయ్యవారు
గజలు శ్రీనీవాసు కందాళె వారును
కొలకులూరు ఇనాకు కులపతులును

తె.గీ. వీరు తెలుగును నమ్ముకొన్నారు గాదె
వీరినీ తెల్గు రాష్ట్రాల వారు ప్రేమ
మీరగా గౌరవించుచున్నారు గాదె
ఈ మహద్భాగ్యమమెరికా ఈయగలదె?

సీ. తిక్కన్న కలములో తీయందనాలను
రుచిచూడని నరుండులుబ్ధకుండు
త్యాగయ్య గొంతులో తారాడునాదాలు
ఆలకించనివాడు వ్యర్థజీవి
బమ్మెర పోతన భగవత్క్థాసుధా
పానమొల్లనివాడు పామరుండు
ఎంకి పాటలలోని హృదయంగమ ప్రేమ
చవిచూడని నరుండు చచ్చుమనిషి

తే.గీ. మందరము కల్పవృక్షము మల్లెమాల
రంగనాథాది శ్రీరాము రమ్యమైన
రచనలు జద్వకయె నాల్గురాళ్ల కొఱకు
భరతభుని వీడువాడు వానరుగాడె!

- డా. రామసుందర్రావు,
విజయవాడ.
చరవాణి : 9441026360
***

కాలం గుండెచప్పుడు!

అదేం పోగాలమో ఆస్తికోసం
కన్నవారినే చంపటాలు
కట్నపిశాచి ఆవహించి
కట్టుకున్న భార్యను
ఇంటి నుండి తరిమేయడాలు
ర్యాగింగ్ భూతానికి బలౌతున్న
హాస్టల్ విద్యార్థినులు
పుట్టింది ఆడశిశువని తెలియగానే
పురిట్లోనే చిదిమేయడాలు
హవ్వ.. అంతేనా?
అనాదిగా వస్తున్న
ఆచారాల్ని మంటగలిపి
అగ్రవర్ణాల వారూ
అన్యమతంలోకి వలసపోతుంటే
భారీ వేతనం పొందుతూ
పనికావాలంటే
చెయ్యి తడపాల్సిందేనని
అధికారులు వేధిస్తుంటే
కల్తీ విక్రయాలు, అధిక ధరలతో
సగటు గృహిణి
సతమతవౌతుంటే
గోమాంసం భుజిస్తానని
గొప్పగా సెలవిచ్చిన
బాలీవుడ్ నటుడి
పలుకులు వింటుంటే
ఎవరెందుకో ఆత్మహత్యలకు
పాల్పడుతుంటే
చైన్‌స్నాచింగ్‌లు,
సూదిగాడి ఆగడాలు
ఎవరో ఏదో చెప్పారని గృహిణులు
తాళి విసర్జించటం చూస్తుంటే
గుండె చప్పుడు కాదు
గుండె చెరువౌతోంది!

- బిఆర్‌సి మూర్తి,
విజయవాడ.
చరవాణి : 0866 2437967