విజయవాడ

కర్మఫలం (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డెస్క్‌లో వార్తలు దిద్దడంలో బిజీబిజీగా వున్నాను. గడియారం ముళ్లు వేగంగా పరుగులు పెడుతున్నాయి. రిపోర్టర్‌కి అవసరమైతే తప్ప ఫోన్లు చెయ్యడమేకాని పర్సనల్ కాల్స్‌కి అటెండయ్యే తీరిక వుండదు. బిజీబిజీ.. పేజీలు ప్రింటింగ్‌కు వెళ్లేదాకా ఊపిరాడని పని. క్షణాలు దగ్గర పడుతున్నాయి. ఇన్‌ఛార్జి దుర్గారావు తొందర పెడుతున్నారు. మళ్లీ మళ్లీ ఫోన్ రింగవుతోంది. సిటీ ఆఫీస్ నుంచి వచ్చిన వార్తలు సరిచూసుకుంటూ పేజీకి ఎక్కిస్తున్నా. ఫోన్ అదేపనిగా మోగటం భరించలేక ఒక క్షణం ఎవరా? అని ఫోన్ కేసి చూశా. నా శ్రీమతి సుధారాణి. మళ్లీ ఫోన్ చేస్తానని మెసేజ్ పెట్టి పనిలో పడిపోయా. పేజీలు ప్రింటింగ్‌కు వెళ్లిపోయాయి. హమ్మయ్య.. అనుకుంటూ కర్చ్ఫీతో ముఖం తుడుచుకున్నా. రాత్రి 11 గంటలు దాటిన తరువాతే నేను కాస్త తీరికగా ఉంటానని శ్రీమతికి తెలుసు. ఐనా అన్నిసార్లు ఎందుకు చేసిందోననుకుంటూ ఫోన్ చేశా. ఫోన్ రింగవుతోంది. లాంగ్ రింగ్. కాస్త కంగారుగా మళ్లీమళ్లీ చేశా. మనసు ఏదో కీడును శంకించింది. ఎట్టకేలకు ఫోన్ తీసింది.
‘ఏంటి అంత అర్జంట్‌గా ఫోన్ చేశావు’
‘ఏమండీ.. సీతమ్మగారు..’ శ్రీమతి గొంతులోంచి దుఃఖం తన్నుకొస్తున్నట్లుగా ఉంది.
‘చెప్పు ఏమైంది మామ్మగారికి?’ అని అడిగా.
‘మామ్మగారు ఇక లేరండీ. మన అపార్ట్‌మెంట్ వేపచెట్టు కింద పడిపోయి ఉన్నారు. చూస్తే ప్రాణం లేదు. కళ్లు బయటకు వచ్చి భయంకరంగా కనిపిస్తున్నారండీ. నాకు దుఃఖం ఆగటం లేదు. వాళ్ల తమ్ముడూ వాళ్లకు చెపుదామంటే తలుపులు ఎన్నిసార్లు కొడుతున్నా తీయడం లేదండీ. ఫోన్ చేస్తే ఎత్తడం లేదు. ఇంట్లో దీపాలు వెలుగుతూనే ఉన్నాయి’ చెప్పింది ఏడుస్తూనే. ‘నేను ఇక్కడే ఉన్నా. మన అపార్ట్‌మెంట్ వాళ్లు నలుగురైదుగురు కూడా ఉన్నారు’
‘సరే సరే! నేను వెంటనే వచ్చేస్తాలే’ అంటూ ఫోన్ పెట్టేశా.
బయట పార్కింగ్ ప్లేస్‌లో ఆమెను చాపమీద పడుకోబెట్టారు. సీతమ్మగారికి ఎవరూ లేరు. అక్కడ సుధ ఒకతే ఉంది మూర్త్భీవించిన శోకదేవతలా!
పక్క వాటాలోనే ఉంటారు సీతమ్మ గారి తమ్ముడు మరదలు. వాళ్ల తాలూకు వాళ్లెవరో తెలియదు. మరో తమ్ముడనుకుంటా, విశాఖ ఆంధ్రా యూనివర్శిటీలో పెద్ద ఉద్యోగమే. ఒకే ఒక ఆధారం. ఫోన్ చేస్తే అందుబాటులోకి రావటం లేదు. వైజాగ్ లాండ్ లైన్‌కి ఫోన్ చేస్తే ఎవరో తీసి ‘వాళ్లు అమెరికా వెళ్లారండీ. అక్కడి నెంబరు తెలియదు’ అన్నారు. అప్పటిదాకా ఇక్కడున్న వాళ్లు ఎప్పుడో జారుకున్నారు. ఇంత రాత్రి సమయంలో ఏం చెయ్యటానికీ లేదు. వాన తుంపర్లు మొదలయ్యాయి. సన్నగా గాలి. తల కింద పెట్టిన దీపం గాలికి రెపరెపలాడుతోంది. అసలు దీపమే ఆరిపోయింది. ఈ దీపం ఏం చేస్తుంది’ అనిపించింది. ‘మాయమై పోతున్నాడమ్మా మనిషన్నవాడు’ అని ఓ కవి రాసుకున్నాడు. ఇక్కడా అదే కనిపిస్తోంది. శవజాగారం చెయ్యడానికి ఒక మనిషీ లేడు. సీతమ్మ నిర్జీవంగా చాపమీద దీర్ఘనిద్ర పోతోంది. సుధా ఒకతే కుర్చీలో కునికిపాట్లు పడుతోంది.
ఎప్పటికిలాగే సూర్యుడు నిద్రలేచి క్రమంగా తన ప్రతాపం చూపించుకుంటున్నాడు. అంతా బిజీబిజీ. పాలవాళ్ల రాకపోకలు, కూరగాయల వాళ్ల అరుపులతో అపార్ట్‌మెంట్ మేలుకుంది. స్కూలు పిల్లలు హడావుడిగా రోడ్డెక్కుతున్నారు. ఆఫీసుకు వెళ్లేవాళ్లు కంగారుగా కనిపిస్తున్నారు. ఆడవాళ్లు ఇంటి పనితో సతమతవౌతున్నారు. తమతో అనే్నళ్లు కలిసి ఉన్న ఓ పెద్దావిడ నిర్జీవంగా పడి ఉందనే ధ్యాసే లేదు. కాలంతో పాటు పరుగెడుతున్నారు. ఏం చెయ్యాలో తెలియడం లేదు. సీతమ్మ గారి బంధువులు ఎప్పుడో జారుకున్నారు. ఎంతసేపని శవజాగారం? నాకున్న పరిచయంతో పోలీసులకు సమాచారం అందించా. లేకపోతే వాళ్లవాళ్లు రేపేదైనా గొడవకు రావచ్చు. పోలీసులు వచ్చి తర్జనభర్జనల అనంతరం మృతదేహాన్ని తీసుకెళ్లటానికి అనుమతిచ్చారు. కార్పొరేషన్ వాళ్లు వచ్చి మృతదేహాన్ని పాత తాటాకు చాపలో గట్టిగా చుట్టేశారు. చాలీచాలని చాప. కాళ్లు బయటికి కనపడుతున్నాయి మానవత్వానికి మచ్చలా. అందరూ ఉన్నా అనాథ అంతిమ యాత్రకు బయలుదేరింది. మృతదేహాన్ని వ్యానులో వేసుకుని వెళ్లిపోయారు. వెనుకే సుధా, నేను కూడా బయలుదేరాం సీతమ్మగారిని అమరధామానికి పంపించటానికి.
***
సీతమ్మగారితో నాకు చిత్రమైన అనుబంధం. ఆమె వయస్సు 70ఏళ్ల పైమాటే. పాతకాలం మనిషి. అప్పటి తిండ్లు, అప్పటి రుచులే వేరు. అంత వయస్సున్న దానిలా కనిపించదు. ప్రతిరోజూ రామకోటి రాసేది. ఐదారు సంవత్సరాలుగా ఆమె రాసిన రామకోటి పుస్తకాలను సత్యనారాయణపురంలోని రామకోటిలో నేనే ఇచ్చేవాడిని. ఇప్పటిదాకా ఐదు లేక ఆరు కోట్లదాకా రాసి వుంటుంది. ‘ఏం మామ్మగారూ! మీ రాముడు మిమ్మల్ని ఏం పట్టించుకోవడం లేదేంటి?’ అనడిగితే ‘కర్మఫలం. అనుభవించాలి కదా!’ అనేది. ఆమెకు వచ్చిన పుణ్యం సంగతేమో కాని ఆ పుణ్యంలో నాకూ భాగముందని భావిస్తూ వుంటాను.
సీతమ్మగారి తల్లిదండ్రులది బాగా కలిగిన కుటుంబం. సూర్యారావుపేటలో 1000 గజాలకు పైగా స్థలం ఆమె తల్లిదండ్రులది. అందులో ఆమెకు వాటా రాశారు. ప్రేమించే గుణం ఆమెది. అందర్నీ ఆమె పెంచి పెద్ద చేసింది. చివరి దశలో తిండిపెట్టక పోతారా! అని ఇంటికి సంబంధించిన హక్కులు వద్దంటూ సంతకాలు పెట్టేసింది. చివరకు వాళ్లు మొండిచెయ్యి చూపారు. మిగిలిందల్లా గ్రామంలో రెండెకరాల పొలం. అదీ కోర్టు కేసుల్లో ఉంది. ‘ఇదిగో పసుపు.. అదిగో ముసుగు’ అనే రోజులు. 8 సంవత్సరాలకే పెళ్లి. వెంటనే వైధవ్యం.
ఇక్కడకు వచ్చినప్పటి నుంచే ఆమెతో మాకు పరిచయం. వాళ్లవాళ్లు ఎవరూ లేనప్పుడు మాతో వచ్చి కూర్చునేది. విజయవాడతో ఆమె అనుబంధం 70 ఏళ్లు పైమాటే. ఎప్పటెప్పటి విషయాలో చెపుతూ ఉండేది. పారుపల్లి వారి సంగీత పాఠాలు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ చిన్నతనంలో డొక్కు సైకిల్ మీద సంగీత పాఠాలకు వెళ్లటం, రామకోటిలో జరిగే రామకోటి మహాయజ్ఞాలు, విశ్వనాథ సత్యనారాయణ రామాయణ పాఠాలు కథలుకథలుగా చెప్పేది. ఏంపెట్టినా తినేది కాదు. చివరికి కాఫీ ఇచ్చినా తాగేది కాదు. పైగా తమ్ముడు, మరదలు తిడతారని భయం. ఆమెవన్నీ అష్టకష్టాలు.
మా పక్కవాటాలో ఉన్నది ఆమె తమ్ముడు శివరావు. ఏదో ప్రైవేటు కంపెనీలో పనిచేశాడు. వాస గ్రాసాలకు లోటులేదు. కానీ పక్కవాడికి తన ఊపిరి తగులుతుందేమోనని గాలి పీల్చటం కూడా మానేసే రకం. ఒక్కతే కూతురు. ఆడపిల్లల్లో ఉండే సహజ సౌకుమార్యం, లాలిత్యం మచ్చుకైనా ఆమెలో కనిపించవు. తెలుగు సినిమాల్లో సూర్యాకాంతం, ఛాయాదేవి పాత్రల్లో 100 మందిని ఒకే మూసలో పోస్తే ఎంత భయంకరంగా ఉంటుందో అంత భయానకమైన వ్యక్తిత్వం. సీతమ్మగారు కనీసం బాత్‌రూం ఉపయోగించుకోడానికి కూడా వీల్లేదు. ఆమె ఎదురుగా నడవటానికి కూడా లేదు. పొరబాటున ఎదురుపడితే అడ్డగోలుగా తిడుతుంది. తెలుగులో ఉన్న అన్నిరకాల తిట్లు తిట్టిపోస్తుంది. కసి తీరకపోతే చెయ్యి చేసుకుంటుంది కూడా. ఉన్నతమైన కుటుంబం అని చెప్పుకునే వాళ్ల ఇంట్లో కూడా ఇంత భయంకర మనుషులు ఉంటారా? అనిపిస్తుంది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నుంచి ఒంటరి కుటుంబ వ్యవస్థకు మారిన సంధికాలం. అసలే అపార్ట్‌మెంట్ సంస్కృతి. పక్కవాడి కుటుంబం తగలబడి పోతుంటే ఇంటి తలుపులు తడుపుకునే విష సంస్కృతి! ఎప్పుడూ మూసి ఉండే ఇంటి తలుపులు. వాటివరకైతే పరవాలేదు. మనసు తలుపులు కూడా మూసేస్తే!? సహజంగా అపార్ట్‌మెంట్ కల్చరే అంత. శివరావు కుటుంబం కూడా అంతే. ఎప్పుడూ తలుపులు మూసే వుంటాయి. నవ్వులేని ముఖాలు బ్యాంక్ చెక్‌బుక్‌లా! ఎవరు ఎదురుపడినా కనీసం నవ్వటానికి కూడా ఆయన ముఖం అంగీకరించదనుకుంటా. ఈ ఐదారు సంవత్సరాల్లో ఒకటి రెండుసార్లు మాట్లాడినట్లు మాత్రమే గుర్తు. ‘మీ ఇంట్లో కరెంట్ ఉందా? కేబుల్ వస్తోందా? మంచినీళ్లు వచ్చాయా?’ ఇలాంటి పొడి మాటలు. నాకు సంబంధించి ఇలాంటివి నాకు నచ్చవు. ఉమ్మడి కుటుంబంలో సంస్కృతి నుంచి వచ్చిన వాళ్లు, ఉద్యోగాలు, జీవన పోరాటాల సందర్భంగా ఎక్కడెక్కడో ఉంటున్న కుటుంబ సభ్యులు, మినీ ఇండియాగా భావించే అపార్ట్‌మెంట్స్‌లో జీవనం ఏదైనా చిన్నచిన్న సమావేశాలు ఉమ్మడిగా చేసుకునే పండుగలు, నెలకోసారైనా గెట్ టుగెదర్‌లా కలవాలనుకుంటా. ‘ఎవరికి వారే.. యమునా తీరే’.. అనుకుంటున్న సమయాలవి.
***
సీతమ్మగారికి ఆత్మాభిమానం ఎక్కువ. ఏదైనా వృద్ధాశ్రమంలో చేర్పిస్తామంటే అంగీకరించేది కాదు. ‘నా రాముడు నాతో వుంటే నేను అనాథను ఎందుకవుతాను!’ అనేది. ఆమె తమ్ముడు వాళ్లు వూరు వెళుతూ బయట తాళం పెట్టి వెళ్లేవారు. అది చూసినప్పుడల్లా నాకు కడుపులో రగిలిపోయేది. నగరంలో ఉన్న మీడియానంతా తీసుకొచ్చి తాళాలు బద్దలుకొడదామా? అనేంత ఆవేశం వచ్చేది. ‘బాబూ! నాకు ఈమాత్రం ఆశ్రయం లేకుండా చేస్తావా?’ అని కన్నీళ్లు పెట్టుకునేది. ఏమీ చెయ్యలేని అశక్తత. కళ్లముందే అన్యాయం జరుగుతుంటే న్యాయం చెయ్యలేని సందర్భం. నన్ను నేను తిట్టుకోని క్షణం లేదు.
***
సీతమ్మగారి అంత్యక్రియలు పూర్తయ్యాయి. కృష్ణానదిలో మునిగి ఈనాటితో ఆమెకు, మాకూ రుణం తీరిపోయిందనుకుంటూ ఇంట్లోకి అడుగు పెడుతున్నా. ఎదురుగా మామ్మగారు కూర్చునేచోట వ్యాసపీఠం. దానిమీద రామకోటి పుస్తకం. చివరి పేజీలు అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఒకే ఊపులో ఆ రెండు పేజీలు పూర్తిచేసి, పుస్తకం తీసుకొని శివరామకృష్ణ క్షేత్రానికి బయలుదేరాను. ఎదురుగా త్యాగరాజ స్వామి, సీతారామచంద్రులు. నా కళ్లల్లో కన్నీటి తెరలు. ‘ప్రభూ.. నీకందించే చివరి పూజాపుష్పం’ అని చెప్పుకున్నా.
కాలం ఎప్పుడూ ఒకే రీతిగా వుండదు. ‘మనం ఈ జన్మలో చేసుకున్న పాపం ఈ జన్మలోనే అనుభవించాలి’ అని పెద్దలు చెపుతూ వుంటారు. దుబాయిలో ఉన్న ఒకే కూతురు మొగుడితో గొడవపడి ఇంటికి చేరుకుంది. అల్లుడు కూడా ఏదో గొడవల్లో పడి జైలు పాలయ్యాడు. ఒకటి, రెండు నెలలు గడిచాయి. అమెరికాలో ఉన్న సీతమ్మగారి మరో తమ్ముడు భారత్ వచ్చాడు. గ్రామంలోని సీతమ్మగారి దాయాదులు ఆమె ఆస్తి మీద దావా వేసిన కేసులో గెలిచి రెండెకరాల పొలం ఆమె సొంతమైందని, ఆమె గతంలో కేసు గెలిస్తే వచ్చే ఆస్తిని అనాథ శరణాలయానికి చెందేటట్లు విల్లు రాసిందని, దాని ప్రకారం సదరు ఆస్తి అనాథ శరణాలయానికి చెందుతుందని- చెప్పాడాయన. అది విన్నప్పటి నుంచి శివరావు నిప్పుతొక్కిన కోతిలా గెంతుతూ ‘ముసలిది చచ్చేటప్పుడు ఎంత పని చేసింది?’ అని తిట్టుకున్నాడు కూడాను.
***
సీతమ్మగారు వదిలి వెళ్లిన రామకోటి రాసే బాధ్యతను తీసుకున్నాను. క్రమంగా మామ్మగారి జ్ఞాపకాలు కనుమరుగవుతున్నాయి. ఆమె ఆస్తి దానం చేసిన ‘దీనదయాళ్ వృద్ధాశ్రమం’ విజయవంతంగా నడుస్తోంది. చేసిన పాపం అనుభవించడానికా అన్నట్లు సీతమ్మగారి తమ్ముడు, మరదలు అదే అనాథాశ్రమంలో ఆశ్రయం పొందుతున్నారు. కర్మఫలం అనుభవించక తప్పదుకదా..!

- వేలూరి కౌండిన్య, విజయవాడ. చరవాణి : 9392942485