విజయవాడ

ఈ శిక్షే నయం! (చిన్న కథ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎనిమిదో తరగతి విద్యార్థినిని లైంగికంగా వేధిస్తున్న ఉపాధ్యాయుడికి దేహశుద్ధి అని న్యూస్ ఛానెళ్లలో బ్రేకింగ్ న్యూస్, క్లిప్పింగ్స్, స్క్రోలింగ్స్ వరుసగా లైవ్ అవుతున్నాయి. టీవీ చూస్తున్న సహజశ్రీ దిగ్గున లేచింది. సహజశ్రీతో పాటు లాయర్ కూడా ఘటనాస్థలికి చేరుకున్నారు. అక్కడి దృశ్యం భయానకంగా ఉంది. విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్తులు ఒక్కుమ్మడిగా చేతుల్తో, చెప్పుల్తో ఆ మృగాడిని బెండు తీస్తున్నారు.
‘ఆపండి! ఇలా శారీరక హింసతో ఈ మృగాడికి బుద్ధొస్తుందా? మానసికంగా హింసించాలి. అందుకే మీ పాపని దత్తత తీసుకుంటాము. అప్పుడు గానీ ఆ అమ్మాయి ఈ మృగాడి కళ్ల ముందు కూతురిలా తిరుగుతూ ఉంటే సిగ్గుతో చచ్చిపోవాలి’ అంది సహజశ్రీ. అందరూ స్థాణువులా నిలబడి చూస్తుండిపోయారు.
‘వద్దు. ఆ చావుకన్నా ఈ జనం చేతిలో చావటమే నయం. చంపనీ సహజా! మధ్యలోకి రాకు’ రోదన మొదలెట్టాడు ఉపాధ్యాయుడు.
‘్ఛ.. ధూఁ..’ అని లాయర్ అందించిన విడాకుల నోటీసు కసిదీరా అతడి ముఖాన విసిరికొట్టి వెనుదిరిగింది సహజశ్రీ. లాయర్ వౌనంగా ఆమెని అనుసరించాడు.
జనం మళ్లీ వాడిని పిచ్చికొట్టుడుతో పోలీసులకి అప్పగించారు. అతనికి ఉద్యోగం పోయింది. ఆర్నెల్ల తర్వాత విడాకులు మంజూరు కావటంతో కూతురితో సహా ఊరొదిలి వెళ్లిపోయింది సహజశ్రీ. ఆ మృగాడు శిక్షార్హుడై కటకటాల వెనక్కెళ్లాడు.

- డి వెంకట్రావు, ఉయ్యూరు.
***

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండిమెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ప్లాట్ నంబర్ సి- 3, 4, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విజయవాడ - 520 007. పజీౄళూఖఔఖబఘౄజ.ష్యౄ
***

వేధిక
----
కథలు, వ్యాసాలు,
కార్టూన్లు, జోక్స్ పోటీ

‘రేపటి కోసం’ తెలుగు మాసపత్రిక తొలి వార్షికోత్సవం సందర్భంగా కథలు, వ్యాసాలు, కార్టూన్లు, జోక్స్ పోటీ నిర్వహిస్తోంది. కథల విభాగంలో కుటుంబ కథలు, మిళిత కథలు, హాస్య కథలు, క్రైమ్ కథలు, ఫాంటసీ కథలు, బాలల కథలు, కాలమ్ - కార్డు కథలు. వ్యాసాల విభాగంలో స్ర్తి సమస్యలు, మిళితుల సమస్యలు, జానపద కళలు, ఆధ్యాత్మిక వ్యాసాలు. అలాగే పర్యావరణం, రాజకీయం, జనరల్ సబ్జెక్టులపై కార్టూన్లు, జోక్స్ పంపాలి. ప్రతి విభాగంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ, ప్రోత్సాహక బహుమతులు ఉంటాయి. మొత్తం బహుమతుల విలువ లక్షా 25వేల రూపాయలు.
ఆసక్తి కలిగిన రచయితలు, కార్టూనిస్టులు తమ రచనల్ని, కార్టూన్లను ‘ప్రథమ వార్షికోత్సవ పోటీలు, రేపటి కోసం మాసపత్రిక, ప్లాట్ నెం. 209, ఆర్‌ఆర్ టవర్స్, మంగళగిరి - 522503, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్’ చిరునామాకు జూలై 10వ తేదీలోగా పంపాలి. పూర్తి వివరాలకు 99662 37770 నంబర్‌లో సంప్రదించవచ్చని రేపటి కోసం మాసపత్రిక వ్యవస్థాపక సంపాదకులు బొప్పన విజయకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
***

వెంటాడే కవులు..
కవితల ఘనాపాఠి.. ‘కొర్నెపాటి’!

మన తెలుగు కళా సామ్రాజ్యంలో రాజులు ముగ్గురే ముగ్గురు. బమ్మెర పోతరాజు, కంచెర్ల గోపరాజు, కాకర్ల త్యాగరాజు. వీరిలో బమ్మెర పోతరాజు కనుక నారాయణ శతకం రాసి వుంటే ఆయన మకుటం గల - మకుటం లేని మహారాజే. ఎందుకంటే శతకాల్లో మకుటం ఉంటుంది గదా మరి! సరే - కంచర్ల గోపరాజు గారి దాశరథీ శతకం సుప్రసిద్ధం కాబట్టి ఆయన్ని మకుటం గల - మకుటం లేని మహారాజుగా కీర్తించవచ్చు. త్యాగరాజు - అటు భక్తుల్లోనూ, ఇటు కర్ణాటక సంగీతంలోనూ నిజంగా మకుటం లేని మహారాజే. మకుటం గల శ్రీరామచంద్రుణ్ణే నమ్ముకున్న మహారాజే. ఈ విషయాన్ని ఎందుకిలా ప్రస్తావిస్తున్నానంటే ‘తెలుగుతల్లి’ అనగానే ఏ కవియైనా ఈ పై ముగ్గురినీ ప్రశంసించి తీరవలసిందే. ఆ తర్వాతనే ఎవరినైనా ప్రశంసించడం. ఈ పై ముగ్గురినీ ఓ కవి తెలుగుతల్లి పేరుతో సీసంలో ఎలా మూసపోశారో గమనించండి -
‘్భద్రాద్రి రఘురాము పాద సేవఁదరించు
రామదాసుండు గారాపు బిడ్డ
కృతిరామునకు నిచ్చి కృతకృత్యుడైనట్టి
పోతన నీ ముద్దు పుత్రకుండు
రామసంకీర్తనా రక్తిముక్తుండైన
త్యాగయ్య నీ ప్రియతనయుడమ్మ!
కాళహస్తీశ్వరు కరుణా విశేషంబు
కన్న కన్నప్ప నీ కన్నకొడుకు
కాంచికాక్షేత్రమందు శంకరుని కరుణ
నవ్యయపదంబు గైకొన్న యసదృశుండు
వాడు చిరుతొండనంబినీ పాపడమ్మ
తెలియ నీకెవ్వరీడమ్మ! తెలుగుతల్లి!’
పై పద్యంలో పై ముగ్గురు రాజులతో పాటు శివభక్తులైన కన్నప్పను, చిరుతొండ నంబిని పేర్కొన్నారీ కవీశ్వరుడు.
అన్నట్లు ఈశ్వరుడంటే గుర్తుకు వచ్చింది. మనకున్న ముప్ఫై మూడుకోట్ల దేవతల్లోనూ ఈశ్వరుణ్ణి మించిన అమాయక చక్రవర్తి మరొకరు లేరు. అటువంటి ఈశ్వరునికే సర్వజ్ఞుడనే పేరూ ఉంది. ఇది చాలా వింత విషయం. అటువంటి ఈశ్వరుని అమాయకత్వాన్ని ఈ పై తెలుగుతల్లిని స్తుతించిన కవీశ్వరుడే కరవుతీరా ఏకరువు పెడుతూ ‘నీవు సర్వజ్ఞమూర్తివెలా అయినావో తెలియడం లేదయ్యా!’ అని ఇలా జాలిగా సీసంలో మూసపోశారు చూడండి - చిత్రంగా -
‘చంద్రు, గురుద్రోహిఁ జావనీయక తెచ్చి
తలమీద సతి చెంత నిలిపినావు
పుట్టిల్లు పుటమార్చి, గట్టుపట్టికి శక్తి
కర్ధదేహంబిచ్చి యాపినావు
అవనినెల్లనుఁగాల్చు హాలాహల విషంబు
పట్టికుత్తుకలోన పెట్టినావు
కస్సుబుస్సని లేచు కాల సర్పంబుల
కంకణాంగద శోభగాంచినావు
పనుల నెల్లఁజెఱచు గణపయ్యనింటి
పెద్ద కొడుకునుగాఁజేసి పెట్టినావు
భళిర! శంభయ్య! వెఱ్ఱిబాబయ్య వీవు
ఎట్లు సర్వజ్ఞమూర్తివో యెదుగజాల’
ఈ పద్యంలో ఈశ్వర సంబంధ గాథల్ని అనేకం ప్రస్తావించారు. ఈ పద్యంలో పైకి ఈశ్వరుని అమాయకత్వాన్ని జాలితో పరిహసిస్తున్నట్లుగా ఉంది. అట్టి శివుని సర్వజ్ఞత్వాన్ని ఎవరూ గ్రహించలేరన్న స్తుతీ ఉంది. ఇట్టి నిందాస్తుతి రూప పద్య రచనకు ఈ కవికి కాసుల పురుషోత్తమ కవి ఆంధ్ర నాయక శతక పద్య రచన ప్రేరణనిచ్చి ఉంటుంది.
విఘ్నేశ్వరుణ్ణి స్తుతించిన కవులనేకులున్నారు గానీ వినాయకుణ్ణి ‘విఘ్నశతఘ్ని’ అన్న కవి మరెవ్వరూ లేరు - ఈ కవి తప్ప. ‘విఘ్నశతఘ్నివి’ అన్న దృష్టితో భక్తి కంటే భయానే్న ఎక్కువగా ప్రదర్శిస్తారని శిష్టంగా, విశిష్టంగా తెల్పారీ కవి. ఇలా 50 ఖండికలతో అనేక భావ పరంపరలతో ‘తెలుగు వెలుగుల’ను విరజిమ్మిన కవి ఎవరో కాదు - ‘కవిరత్న’ బిరుదాంకితులు కీ.శే. శ్రీ కొర్నెపాటి శేషగిరిరావు పంతులుగారు. వీరు గుంటూరు జిల్లా చేబ్రోలులో జన్మించి సుమారు 1980 వరకు జీవించారు. చేబ్రోలులో ఏకోపాధ్యాయ పాఠశాలను నడిపి స్వతంత్ర జీవనం చేశారు.
1949లో ‘తెలుగు వెలుగు’ కాక జగన్నాథ పండితరాయల చాటువులను కమ్మగా తెలుగు చేశారు. ‘సతీ అనసూయ’ వ్యంగ్య నాటకాన్ని వెలయించారు. శివానంద సౌందర్యలహరులను, ముకుందమాల, ఉమర్ ఖయ్యూములను ఆంధ్రీకరించారు. ‘తిమ్మతీయమ’న్న పేరుతో సాంఘిక సంస్కరణాత్మక కావ్యాన్ని విశిష్టంగా రచించారు. అంతకంటే విశిష్టంగా ‘మహాకౌలీనమ’న్న పేరుతో గొప్ప పద్యగద్యాత్మక కావ్యాన్ని రచించారు. పశుపక్ష్యాదులను పాత్రలుగా ప్రవేశపెట్టడమే కాక - శ్రీకృష్ణరాయబారాదులను తలపించే ధోరణిలో, భారత కురుక్షేత్ర వాతావరణంలో పంచతంత్రాది కావ్యాలను మించిపోయే ధోరణిలో హృద్యంగా రచించారు. ‘కల్పనలాశ్చర్యకరంగా చేయగలడ’నీ, ఈ కథా నిర్మాణములోననే ఈయన కల్పనా సామర్ధ్యము విశదమగుచున్నద’ని కవిసమ్రాట్ విశ్వనాథ ప్రశంసించారు. తిక్కన భారతాన్ని తలపింపజేసే దేశీయమైన పలుకుబడి ఇందులో కలదనడానికి-
‘గండుసెడి, బెండువడి, కలగుండు వడియు
చెల్లచెదరయి, బెదరియు, జిక్కి, స్రుక్కి,
త్రొక్కటంబడి, కడుపొక్కి, దిక్కు దక్కి
సంకటంబడెఁ బశుచమూ సముదయములు’.. అన్న తేటగీతి పద్యం నిదర్శనం. ఈ కృతిని వీరి కుమారుడు కె భానుప్రసాద్‌గారు హృద్యంగా గద్యంలోకి మార్చారు.
ఇటువంటి ఈ ‘కవిరత్న’ పద్యాలనెన్నింటినో వారి మనుమడు, గుంటూరు స్టేట్‌బ్యాంక్ మేనేజర్ - శ్రీ కొర్నెపాటి విద్యాసాగర్‌గారు శ్రావ్యంగా, భావయుక్తంగా, ఎంతోమంది సాహిత్యవేత్తలకు సెల్‌ఫోన్‌లో చదివి వినిపించి, సముచిత రీతిని ప్రచారం చేస్తూ, తాతగారి ఋణాన్ని తీర్చుకుంటున్నారు. వాళ్ల నాన్నగారు శ్రీ సుబ్రహ్మణ్యంగారి ద్వారా పద్యాన్ని హృద్యంగా చదవడాన్ని అభ్యసించి, తాతగారివే కాక - మహా సహస్రావధాని డా. గరికపాటి నరసింహారావు గారి పద్యాలను కూడా రసజ్ఞ మనోజ్ఞంగా చదివి, పద్యపఠన విద్యాసాగరులుగా పేరు గడిస్తున్నారు.
ఇంతకీ - ‘తెలుగు వెలుగు’ల ద్వారా, ‘మహాకౌలీన’ చంపూ కావ్య రచన ద్వారా పద్య కవిరత్న కాంతుల్ని విరజిమ్ముతూ కీర్తివి‘శేషగిరి’యైన కొర్నెపాటి వారు తలమానికమైన ఘనపాఠియే కదా!
- డా. రామడుగు వేంకటేశ్వరశర్మ,
గుంటూరు.
చరవాణి : 9866944287
***

ఆ నలుగురు(కథ )

‘హలో కమల గారూ! టైముకే వచ్చేసారే. ఇంట్లో కుదురుతుందో లేదో, మీరు వస్తారో రారోనని అనుమానిస్తున్నా. మొత్తానికి సంసార చీద్రం వదిలించుకొని త్వరగానే తెమిలారు.’
‘మరేనమ్మా విమలా! ఆయనగార్ని వదిలించుకు వచ్చేసరికి ఇంత టైమైయింది. అవతల సేవా కార్యక్రమాలాయె. వెళ్ళకపోతే ఎలా? ఆయన గారేమో నాకది అందించు.. ఇదందించు.. టిఫిన్ పెట్టు.. కాఫీ ఇవ్వు.. అంటూ మనిషిని కదలనిస్తేనా!’
‘ఈ పూటకు రెండు బ్రెడ్డు ముక్కలు తిని, కాసిని పాలు తాగి పడుకోండి. ఆకలయితే ఆ బ్రెడ్డే ఇంకోసారి తినండి అని చెప్పి, తిరిగి చూడకుండా వచ్చేశా. లేకపోతే ఆ సేవా కార్యక్రమాలు మనం కాకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పు!’ అంటూ కూలింగ్ గ్లాసెస్ సరిచేసుకుంది కమలమ్మ.
‘మరేనండీ! ఈ మగాళ్లు బొత్తిగా అర్థం చేసుకోరు. ఆ వృద్ధాశ్రమాల్లో వాళ్లని మనబోటి వాళ్లు కాకపోతే ఎవరు ఆదుకుంటారు? నేను కూడా మా అత్తగారి మీద అన్నీ వదిలేసి లేచ్చక్కావచ్చా. ఆయనేమో ‘అమ్మకి 80 ఏళ్లు. ఆమేం చేస్తుంది. ఇంట్లో పనంతా ఆమె మీద వదిలేస్తే ఎలా?’ అంటూ చిందులేశారు. అయినా పెద్దవాళ్లయినా వూర్కే కూచుంటే రోగమే కదండీ! కాస్తోకూస్తో పనిచేస్తుంటే శరీరం స్వాధీనంలో వుంటుంది ఏమంటారు?’ అంది విమల.
‘మరే! అదీ నిజమే. వాళ్లని వూర్కే కూచోబెట్టకూడదు. మగాళ్లు అలానే అంటారులెండి. ఎంతయినా అమ్మగదా! ప్రేమ.. ప్రేమ ఒలక బోస్తారు!’ గొంతు కలిపింది కమలమ్మ.
ఇంతలో చరిత, హరిత.. ఇద్దరూ అక్కడికి చేరారు.
‘హలో! పెద్దవాళ్లమయినా మీకంటే మేమే ఫస్ట్. ఏమిటి సంగతి? ఐదు నిమిషాలు ఆలస్యమయింది?’
‘ఆఁ ఏముంది! మామూలేగా. గృహచీద్రం. పిల్లని స్కూలుకి పంపాలిగా. దానికి క్యారేజీ అదీ ఇచ్చి తర్వాత నీ కార్యక్రమాలకి వెళ్లరాదా’ అంటారాయన. నేనేమో ‘అదెలా కుదుర్తుంది. నేను టైముకి వెళ్లకపోతే మా సేవా సంఘం వాళ్లకు కోపం వస్తుంది. వాళ్లు నా కోసం వెయిట్ చేస్తూ వుంటారు. వెళ్లక తప్పద’ని డ్రస్ చేసుకుని వచ్చేశా. లేచేసరికే 8 గంటలైంది. ఆ పిల్ల ఒకటే ఏడుపు. అయినా సరే వదిలించుకు వచ్చా. మా అత్తా మామా గుడ్లు మిటకరించి నోట్లో బెల్లంగడ్డ వున్నట్లు నోరు మూసుక్కూర్చున్నారు. మా ఆయన కాసేపు గెంతి పిల్ల పనిలోకి దిగారు. అంతే నా బైక్ తీసుకు వచ్చేశా’ అంటూ పకపకా నవ్వింది చరిత.
‘్భలే మేనేజ్ చేశావు చరితా. మరి సోషల్ ఏక్టివిటీస్ చేసేవారు ఆమాత్రం స్పోర్టివ్‌గా లేకుంటే కుదరదు’ అన్నారిద్దరూ.
‘అన్నట్లు హరితా.. నీ సంగతేమిటి? నీక్కూడా ప్రాబ్లమా?’ అడిగారు మిగతా ముగ్గురు.
‘ప్రాబ్లమ్ అనుకుంటే ప్రాబ్లమ్. నా సంగతి మీకు తెలుసుగా. నేను చాలా డాషింగ్. నేనెక్కడికి వెళ్తున్నానో, ఎప్పుడు వస్తానో ఎవరూ నన్ను క్వశ్చన్ చేయకూడదని మా ఆయనకు ముందే కండిషన్ పెట్టాను. ఆయన అందుకే ఏమీ అడుగరు. ఆయనే వంట చేసుకుని, పిల్లల్ని స్కూలుకు పంపి, తను ఆఫీసుకు వెళతారు. వెరీ నైస్ హజ్బండ్. నా విషయంలో అస్సలు కలగజేసుకోడు. ఇక అత్తా మామా అంటారా? వాళ్లు మా ఇంటికే రారు. అందుకని నాకా ప్రాబ్లమ్ అస్సలు లేదు. అయామ్ వెరీ హ్యాపీ’ ఒకింత గర్వం ఒలకబోసింది హరిత.
‘అబ్బ! ఎంత అదృష్టవంతురాలివో! అయినా మనలాంటి సేవా భావాలున్న వారికి ఈ గృహచీద్రాలుంటే ఎలా? ఆ వృద్ధులు, అనాధలు, దివ్యాంగులు మొదలైన వారందరినీ పలకరించి, పండ్లూ, ఫలహారాలు ఇచ్చి వాళ్లని ఆదుకోకపోతే మనకు సొసైటీలో రికగ్నిషన్ ఏముంటుంది? మొన్నటికి మొన్న పేపర్లో మన సంఘం గురించి ఫొటో వేసి ఎంచక్కా రాశారో చూశారు కదా! మంచి మంచి కార్యక్రమాలు చేస్తేనే అలాంటి ప్రచారం లభించేది. ఇంట్లో కూర్చుని సంసార సేవ చేస్తే ఏముంటుంది?’
‘మరేనండీ! మా బాగా చెప్పారు. పదండి పోదాం. ఇప్పటికే ఆలస్యమయింది’ అంటూ ఆ నలుగురూ ముందుకు నడిచారు.
పక్కనుండి వారి సంభాషణలన్నీ ఆలకిస్తున్న పూలమ్ముకునే అమ్మాయి ‘ఔరా! ఇదా మీ సేవ?’ అంటూ ముక్కున వేలేసుకుంది.
- లక్కరాజు వాణీసరోజిని,
విజయవాడ.
చరవాణి : 9346978829
**

బుద్ధుడైన సిద్ధార్థుడు(మనోగీతికలు)

తే.గీ. ఏమి జీవితమిది మానవేంద్ర ధరణి
ఇన్ని బాధలు మనిషికి ఎటుల ఏమి?
అనుచు, రాజసం కదిలింది రాణవీడి
భోగభాగ్యాలు విడనాడి బోధపర్చ

తే.గీ. జగము శాసించు వింతైన సంగతేదొ
సిద్ధపర్చెను సిద్ధార్థునుద్ధరించ
రాజభోగాలు సర్వము రాళ్లకొదిలి
బుద్ధి సిద్ధించ కదిలెను సిద్ధినంద

సీ. వడలి వంగిన వృద్ధ బడలిన దేహము
సిద్ధార్థు హృదయాన్ని చిదిమి కుదిపె
రాజభోగాలతో రాజిల్లు రాజసం
రోగాల తేరులా రూపుగాంచె
ధిక్కరించెడి రాచనిక్కుల పీఠము
పల్లకీ దిగివచ్చి పాడెగాంచె
అధికార ఖడ్గము అదురుచూ వర నుండి
రహదారి భిక్షుపు నడలుగాంచె

తే.గీ. వెగటు జెందిన జీవిత సగటుతనము
భువన వాంఛల వైభవ భవనమందు
కఠిన మలినాల కడతేర్చ కదిలెసిద్దు
రాజమహలు వీడి రమణి రబసవీడి

సీ.మా. ఏలోటు తనుగాంచి ఎగతాళి జేసెనో
మానవత్వము గాంచి మనసు చెదరె
ఏవింత తను గాంచి వెక్కిరించెనొ మరి
తలవంచి భోగాలు తలుపు మూసె
ఏ కాంక్ష ప్రేమించి ఏకాంతపర్చెనో
దివ్యార్థ మార్గాలు దిశలుగాంచె
ఏమర్మ విదితమో సిద్ధార్థు కార్యమై
బుద్ధత్వమిమిడెనొ బోధితునకు

ఈవింత లోకాన యేవింత గాంచెనో
నడిరేయి పయనము నడిచిపోయె

తే.గీ. సంకటములందు జీవన శిఖరమందు
జీవహింసల నేమార్చి భావపర్చి
హెచ్చుతగ్గుల తేడాల హేళనందు
జననమందెను సిద్ధార్థు జనులకొరకు

తే.గీ. జీవితాంతము జీవించి జీవనమున
జీవి శ్రమలందు మరణించు సృష్టిదమ్మ
జన్మ కర్మార్థ మెరుగున జగతి జనులు
జీవిగా జీవనముజేసి జీవమిడుచు

సీ. మరచిపోలేదు నీ మాధుర్య బోధలు
ఆసియా ఖండాన అమరపురిన
మరువలేదిల నీదు తీరైన యోగ్యత
పదిరెండు భావాల పరవశాలు
మారాడలేదేమి మనసైన హేతువు
సిద్ధార్థుదీక్షన బౌద్ధమందు
ఆద మరువలేదు ఆర్యార్థసంహిత
బుద్ధత్వ చరణాల ధూళినందు

ఆ.వె. పుడమి శాంతికొరకు పడరాని శ్రమలతో
సృష్టి వింతలందు శిక్షలందు
బౌద్ధ ధర్మమమరి బౌద్ధమై త్యాగమై
కాలచక్రమిచట కదులుచుండె

తే.గీ. ఇది మహాత్యాగి సిద్ధార్థు బుద్ధుడైన
నాటి బోధనలర్పించి నడచినట్టి
పుణ్య అమరాపురము మహాపుణ్యస్థలము
దమ్మ ప్రతిధర్మ మెలసిన ధరణిధూళి

తే.గీ. ధరణి జనజీవ కష్టాల కారణాన
కర్మ ఫలమును నిలదీసి కాంతి జూపి
సత్య సద్గుణ సంపన్న బుద్ధమూర్తి
వెడలిపోయెను జనవాస విడిది వీడి

తే.గీ. కాలవాహిని కన్నీటి కాంతిమూర్తి
కాల విలువల నెదిరాడి కలలుగన్న
బుద్ధునెరుగని జీవిత సుద్దులేమి
కలదు నిజమైన త్యాగము కలినగనుము
- దుబ్బల దాసు,
వినుకొండ, గుంటూరు జిల్లా.
చరవాణి : 8886224765
**
తొలకరి సొగసులు (మనోగీతికలు)

అపుడే కనులు తెరిచి
నీటి మువ్వలా ఉదయించిన చిరుజల్లు
ఎడారిని తలపించే ఎదబీడును
తుషారమై పలకరించే వానవిల్లు
గగనాన జరిగే గమ్మత్తయిన ఆటల పోటీలో
గెలిచిన కరిమబ్బు నేలవైపు తీసే పరుగు..
అరవిరిసిన సుమబాలల రెప్పలపై
సుతారంగా పెట్టే చిరుముద్దు
మేఘాల నడకల లయకు
మయూరాల నాట్యపు హొయలు
తరువుల తలంటు స్నానాలకు
పెట్టిన ఆదిముహూర్తం...
అలసి సొలసిన జీవనాడులకు
చైతన్యాన్ని నింపే ఉత్ప్రేరకం
ప్రకృతి కాంత ఒంటిపై
చిలకరించిన పన్నీరు
మట్టి మనసును తట్టి
మాతృత్వపు భావనలకు ఊపిరిపోసే
మురిపెపు ముత్యాల జల్లు
ఉరుముల మంగళ వాయిద్యాలతో
మెరుపుల సరస సయ్యాటలతో
ప్రభవించిన తొలకరి
పసినవ్వులతో ఇంద్రధనుస్సై విరిసిన జలసిరి
కవుల హృదయవీణను మీటిన సొగసరి
అన్నదాత కళ్లలో ఆనందపు పంటసిరి
ఆబాల గోపాలానికి హర్షాన్నిచ్చే తొలకరి
అవనిపై నర్తిస్తూ సాగే నాట్యమయూరి!

- బండికల్లు జమదగ్ని,
గుంటూరు.
చరవాణి : 9848264742