విజయవాడ

సామాజిక చైతన్యమే కవిత్వ ప్రతిబింబం( పుస్తక సమీక్ష)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కవిత్వం రాయడానికి వయసుతో సంబంధం లేదు. ఈ సృజనాత్మకత సహజంగా రావాలి. రాటుదేలిన ఊహాశక్తి అక్షరాలలో ప్రతిబింబించాలి. ఇలా రూపుదిద్దుకున్నదే వర్తమాన కవిత్వం. వచనంలో వ్యక్తీకరించడానికి తగినంత అనుభవసారాన్ని ఆకళింపు చేసుకోవాలి. ఈ ప్రయత్నం ఎవరైనా చెయ్యొచ్చును. కానీ బాల్యపు ఛాయలు వదలక ముందే కలాన్ని పట్టుకుని దృశ్యాల్ని చిత్రీకరిస్తుంటే ఆ నేర్పరితనమే వేరు. సుకుమారపు భావాలను సున్నితంగా తడిమి సుతిమెత్తని ఆలోచనలకు బీజప్రాయమైన పునాది వేస్తుంది. ఈ ప్రయత్నం భవిష్యత్తు తలుపులు తెరిచి సంఘర్షణ పూరితమైన సామాజిక చైతన్యానికి పురిగొల్పుతుంది. అలాంటి తడుములాట లోంచి వెలుగు చూసినదే చిన్నారి కూరెళ్ళ శ్రీశ్రేయ కవిత్వం ‘ఎంత బాగుంటుందో’. దశాబ్ద క్రితం మొదలుపెట్టిన కవిత్వ రచనలో తనదైన సొంతశైలి, భాష, వస్తువు దర్శనమిస్తాయి. లేలేత భావకుసుమాలతో పల్లవించి, వర్తమాన సమాజాన్ని నిజాయితీతో దర్శించి, కవిత్వమయం చేస్తుంది. 32 కవితల సమాహారంతో పలు కవితా వస్తువులకి ఊపిరి పోస్తుంది.
‘ముసలి పిక్కల్ని ఓల్డేజ్ హోమ్‌లకు
పసిపిక్కల్ని చైల్డ్ కేర్‌సెంటర్లకు
సంతకి తీసుకెళుతున్న కూరగాయల్లా మాటలతో సహా విసిరేస్తుంటే’ అని ‘సపోటా పిక్కలు’ కవితలో ఎద్దేవా చేస్తుంటే వర్తమాన విషాద వాస్తవికత కళ్ల ముందు కదులుతుంది. అక్షరాలలో పైకి ధ్వనించే వ్యంగ్యం మనసుని మెలిపెడుతుంది. కవయిత్రి శ్రేయలో అంతర్లీనంగా గూడుకట్టుకున్న ఆర్ద్రపూరిత ముఖచిత్రానికి ఇది ప్రతిబింబంగా నిలుస్తుంది.
‘బిచ్చగాడు’ కవితలో లోకనైజాన్ని ప్రతిఫలించే చేదు నిజాన్ని సమస్యాత్మక కోణం లోంచి అక్షరీకరించే ప్రయత్నం జరుగుతుంది.
‘అవిటితనంతో తన శరీరమే
తనకు శత్రువుగా మారినప్పుడు చేతికి ఒక రూపాయి అందుతుందేమో అని అతని కళ్ళలో ఆశ’ అంటున్నపుడు డబ్బుకు దాసోహమైన లోకనైజం బయటపడుతుంది. మానసిక వైకల్యం ముందు శారీరక వైకల్యం ప్రధానలోపంగా బిక్షగాడి కళ్లలో ఆశగా కదలాడుతుంది. యాచకత్వంలో ఉన్న కష్టనష్టాల తడి రుచిని సామాజిక దృష్టి కోణం లోంచి పరిశీలిస్తుంది. ఈ అవగాహనా స్థాయిని అంచనా వెయ్యడానికి లోచూపు చాలా అవసరం. దీనిని సమర్థవంతంగా అందిపుచ్చుకుంది కవయిత్రి శ్రేయ.
‘మా ఇంటికి ఉగాది వచ్చింది’ కవితలో ‘అమ్మెప్పుడూ చెబుతూ వుంటుంది/ వాళ్ల ఊళ్లో ఉగాది ఎంత బాగా జరిగేదని’ అంటూనే ఆశ్చర్యకరమైన ముగింపుతో కొసమెరుపు మెరిపిస్తుంది శ్రేయ.
‘ఏదీ నీ చిన్నప్పటి ఉగాది అని
బుంగమూతి పెట్టిన నాకు
మామయ్య చూపించాడు మామిడి చెట్టు
వినిపించాడు కోయిల కూత
ఇంటర్నెట్‌లో.... మీకు తెలుసా
మా ఇంట్లోకి ఉగాది వచ్చేసిందోచ్...’ అని చెప్పడం వెనుక గతంలో ఉన్న ప్రకృతి పచ్చదనం అంతరించిపోయి, వర్తమానం అంతా కట్టడాలతో నిండిపోయి, కాలుష్య ప్రపంచాన్ని మిగుల్చుతున్నదనే భావనని ఇది వ్యక్తపరుస్తోంది. ప్రపంచీకరణలో భాగంగా ఈ విధ్వంసమంతా జరుగుతోందని తెలుపుతోంది శ్రేయ.
‘నా తెలుగు భాష’ శీర్షికలో మాతృభాష గొప్పతనాన్ని తేట తెలుగులో ప్రస్తావిస్తుంది.
‘కోకిల పాటలా తీయని తేనెలా
అమ్మచేతి గోరుముద్దలా నాన్నప్రేమ పిలుపులా
అమ్మమ్మ చెప్పే కథలా తాతయ్య దీవనలా
నా తెలుగు భాష’ అంటూ వుంటే తెలుగుదనం సంస్కృతి, సాంప్రదాయం, మమకారం, ఆప్యాయత, కలుపుగోలుతనం అడుగడుగునా వ్యక్తమవుతాయి. పల్లె సౌందర్యపుబతుకు ముఖచిత్ర ఆనవాలు లీలగా మెదులుతాయి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థల మాధుర్యం రుచి చూపిస్తుంది. ఇవన్నీ శ్రేయలోని బహుముఖ కోణాల్ని ఒడిసిపడతాయి.
కవిత్వం ధ్వనించే వాక్యాలు ఈ సంపుటిలో మనల్ని అలరిస్తాయి. ‘దాని కళ్ళలో/ గంగ ప్రవహిస్తోంది., వౌనం మాట్లాడుతుంది/ మా ఇద్దరిమధ్య, పట్టులంగా ధరించి/అమ్మ ఉగాది కన్యలా ఉండేదని, తన చెమటతో/తాను స్నానం చేస్తూ, అక్షరాల విత్తనాలు/ మా మెదళ్ళలో / మొలిపించడానికి, అది ప్రేమగా మన ఇద్దరి ఆత్మల్లో/ జీవిస్తూనే ఉంటుంది, మా ఇద్దరి వౌన సంబంధం / మళ్లీ ఎప్పుడు చిగురిస్తుందో, ఓటమి నుంచి వచ్చిన / గెలుపె ఎప్పటికీ నిలిస్తుంది’ వంటి పద సంబంధాల నిర్మాణ పంక్తులు శ్రేయలోని సృజనాత్మక తపనను కవిత్వంగా ఆవిష్కరిస్తాయి. భిన్నత్వంలో ఏకత్వ భావన శ్రేయలో అంతర్లీనంగా ధ్వనిస్తుంటుంది. బొమ్మలం బొమ్మలం, నాకర్థం కాలేదు, ఎందుకు, అమ్మ, ఎంత బాగుంటుందో, బాల్యస్మృతి, నది, విలువ, దైవం మున్నగు కవితలు ఈ బాల కవియిత్రిలోని పసితనపు ఛాయల్ని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. చిర్నవ్వు, ఒంటరి అవరు, ఇదినిజం, నాకో మాటివ్వాలి, రహదారి లాంటి శీర్షికలు శ్రేయలోని ఆలోచనా శక్తికి మదును పెడతాయి. ఇలా వైవిధ్య పూరిత సామాజిక వస్తువులను కవితాంశాలుగా స్వీకరించి రచన చేపట్టిన శ్రేయకు ఉజ్వల భవిష్యత్తు ఉందని ఆకాంక్షిస్తూ అభినందిద్దాం!

- మానాపురం రాజా చంద్రశేఖర్,
సెల్ : 9440593910.
**

అందమైన లోకం..
నవ్వులపాలు..

గోపాలపురంలో రాము వ్యవసాయదారుడు. కృష్ణ అతని పొరుగువాడు. కృష్ణ ఒట్టి సోమరి. ఏ పనీ చేసేవాడు కాదు. పైగా పగటి కలలు కంటూ ఉండేవాడు. ఎప్పుడూ కలల ప్రపంచంలో విహరించేవాడు. భార్య ఆ పనీ, ఈ పనీ చేసి వచ్చిన కొద్దిమొత్తంతో ఇల్లు గడిపేది. ఏదైనా పని చేసి డబ్బులు తీసుకురమ్మని భార్య తిడుతూ ఉండేది. ఆ తిట్లు భరించలేక ఒకరోజు కృష్ణ తన భార్యని పిలిచి ‘రేపు సంతలో ఒక ఆవుని కొనటానికి వెళుతున్నాను’ అన్నాడు.
ఆ సాయంకాలం కృష్ణ భార్య 4 కుండలు కొన్నది.
‘ఈ కుండలు ఎందుకు?’ అడిగాడు కృష్ణ.
‘1 పాలకి, 2 పెరుగుకి, 3 మజ్జిగ’కి అన్నది.
‘మరి నాలుగోది దేనికి’? అని అడిగాడు కృష్ణ.
‘పక్క బజారులో ఉన్న మా చెల్లికి పాలు పంపించటానికి’ అన్నది భార్య.
కృష్ణ కోపంతో ‘నీ చెల్లి నన్ను ఎప్పుడూ సోమరిపోతు అని తిడుతుంది. పంపటానికి నాకు ఇష్టం లేదు’ అని ఆజ్ఞాపించాడు.
‘ఏమిటీ? అంతా నీ ఇష్టమేనా? పాలు పిండేది నేను. నేను పిండిన పాలు నా చెల్లికి పోస్తే తప్పేంటి?’ నిలదీసింది భార్య.
‘అది నా ఆవు. నా డబ్బుతో కొన్నాను. వీలుకాదు’ రెట్టించాడు కృష్ణ.
వీళ్ల గొడవకు పక్కనున్న రాముకి నిద్ర పట్టడంలేదు. విపరీతంగా పొట్లాడుకుంటున్నారు. రాము చాలాసార్లు పిలిచాడు. కేకలేశాడు. అయినా వారు ఆపలేదు. అప్పుడు రాము ఒక కర్ర తీసుకుని కృష్ణకు రెండు తగిలించాడు.
కృష్ణ కోపంతో ‘ఎందుకు నన్ను కొడతావు? నేను ఏమి చేశాను?’ అంటూ పెద్దగా అరిచాడు.
‘నువ్వు కొన్న ఆవు మా తోటలోకి వచ్చి తోటంతా నాశనం చేసింది. కూరగాయ పొదలు పాడుచేసింది. నువ్వు నీ ఆవు గురించి జాగ్రత్త తీసుకోకుండా వదిలేశావు. ఇందాకటి నుంచి అదే చెపుదామని పిలుస్తుంటే నా మాట మీరు ఆలకించటం లేదు. ముందు మీరు నాకు నష్టపరిహారం కట్టి పోట్లాడుకొండి’ అన్నాడు వ్యంగంగా.
దాంతో వీళ్లిద్దరూ వాస్తవంలోకి వచ్చి సిగ్గుతో తలదించుకున్నారు. తమ అనవసర పోట్లాట వల్ల రాముకి కలిగిన అసౌకర్యానికి క్షమించమని వేడుకున్నారు.

- బి లక్ష్మీపార్వతి,
తెనాలి.
చరవాణి : 9848997103
**

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ప్లాట్ నంబర్ సి- 3, 4, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విజయవాడ - 520 007. email: merupuvj@andhrabhoomi.net