విజయవాడ

ఆర్డినరీ బస్సు (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ బస్టాండులోంచి విజయవాడ వెళ్లే ఆర్డినరీ బస్సు బయల్దేరింది. రాత్రికి మా బంధువు పెళ్లి. నింపాదిగా వెళ్లొచ్చునని నేను కూడా బస్సే ఎక్కాను. కిటికీ దగ్గర సీటు దొరికింది. హమ్మయ్య! అనుకుంటూ కూర్చున్నాను. బస్సులోని ప్రయాణికుల మాటామంతిని, శరీర భాషను వౌనంగా పరిశీలిస్తున్నాను.
దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఎక్స్‌ప్రెస్సులే ఎక్కుతాను. ఇప్పుడు ఆర్డినరీ బస్సు ఎక్కటంలో కించిత్తు నా వ్యక్తిగత స్వార్థం వుంది. నేను కథకుడ్ని. ప్యాసింజరు బస్సులో రకరకాల వ్యక్తులు ప్రయాణంలో తారసపడుతుంటారు. వారి వైఖరి, మానసిక ప్రవర్తనల్లోంచి నా కొత్త కథకు ముడిసరుకు దొరుకుతుందని నా ఆశ!
***
అప్పటికే బస్సులోని సీట్లు నిండిపోయాయి. నాలాగ ఒంటరిగా కూర్చొన్నవారు దీర్ఘాలోచనలో పడ్డారు. కొత్త జంటలు, యువకులు, కుటుంబ సభ్యులు ఆరోజు బస్సులో కూర్చొని వుండటం నేను గమనించాను.
బస్సులో ఎక్కిన ఓ పడుచు జంట దగ్గరిగా అంటుక్కూర్చొని లోకం మరచి మాట్లాడుకుంటున్నారు. మరో జంటను పరికించాను. వారి మొహాల్లో ఏదో ఆందోళన స్పష్టంగా కన్పిస్తోంది. ఓ కుటుంబ సభ్యులు ఇంటిల్లిపాదీ తినుబండారాలు తింటూ నిక్షేపంగా కాలక్షేపం చేస్తున్నారు. బస్సు వూరి పొలిమేరలు దాటింది. స్పీడందుకుంది. డ్రైవరు బస్సును చాకచక్యంగా నడుపుతున్నాడు. కండక్టరు తనలోని ఓర్పు, నేర్పును ప్రదర్శిస్తూ లౌక్యంగా టిక్కెట్లను టిమ్స్ మిషను ద్వారా కొడుతున్నాడు. తొలివిడత టిక్కెట్లు పూర్తికాగానే తన స్థానంలో కూర్చున్నాడు. కిటికీ పక్కన కూర్చున్న నన్ను పిల్లతెమ్మెర లీలగా స్పృశించింది. ఆ హాయి నా మేనంతా పాకింది. బస్సులోని కొందరు ప్రయాణికులు మెల్లగా నిద్రలోకి జారుకున్నారు.
మా దగ్గరి బంధువు ఇంట్లో పెళ్లికి వెళుతున్నాను. మా ఆవిడ, పిల్లలను ఉదయానే్న పంపాను. రాత్రి తొమ్మిది గంటలకు పెళ్లి. టయానికి వేదిక వద్దకు చేరొచ్చునని ప్యాసింజరు బస్సు ఎక్కాను.
***
స్టేజీ రాగానే కొందరు ప్రయాణికులు దిగారు. కొందరు బస్సులోకి ఎక్కారు. సీట్లు దొరకని వారు రాడ్‌ని పట్టుకొని, సీటును ఆనుకొని ఓరగా నిలబడి వున్నారు. ప్రతి స్టేజీ వచ్చినప్పుడల్లా కండక్టరు సాలాభంజికలా పైకి లేచి టిక్కెట్లు కొడుతున్నాడు. చిల్లర ఇవ్వని ప్రయాణికులకు ‘మీ చిల్లరను దిగేటప్పుడు తీసుకోండి’ అని మర్యాదగా చెబుతున్నాడు. కండక్టరు వైఖరి చూసి నాకు ముచ్చటేసింది.
టిక్కెట్లు పూర్తయిన తర్వాత కండక్టరు డ్రైవరు దగ్గరకు వెళ్లి వృత్తిపరమైన విషయాలను చర్చకు పెడుతున్నాడు. బస్సును తనదైన శైలిలో నడుపుతూ డ్రైవరు ఆలకిస్తున్నాడు. స్టేజీలు దాటుతుండటంతో బస్సులో ప్రయాణికులు పెరుగుతున్నారు. కొందరు సెల్‌ఫోన్లలో బిగ్గరగా మాట్లాడుతున్నారు. యువతరం స్మార్ట్ ఫోన్లలో మమేకమయ్యారు. కండక్టరు టిక్కెట్లు కొడుతూ దిగిపోతున్న ప్యాసింజరుకు చిల్లర ఇస్తున్నాడు. మరో స్టేజీ రాగానే ఇద్దరు హిజ్రాలు బస్సులోకి ఎక్కారు. ఖాళీ అయిన మగవారి సీటులో వారు కూర్చున్నారు. కండక్టరుతో వారు సరస సల్లాపాలాడి టిక్కెట్లు తీసుకున్నారు. వారి ఆహార్యం, వాచికం వింతగా వుండటంతో బస్సులోని ప్రయాణికులు వారివేపు వింతగా చూస్తున్నారు.
ఇంకో స్టేజీ దాటగానే ఇద్దరు మహిళా కూలీలు ఎక్కారు. వారి చేతిలో కొడవళ్లు, గుడ్డమూటలు వున్నాయి. మహిళలు తమ జాకెట్లోంచి చిత్తడిగా వున్న 10 రూపాయల నోటును కండక్టరుకు ఇచ్చారు.
‘వీటిని ఎక్కడి నుంచి తెచ్చారమ్మ?’ కండక్టరు దాన్ని తడుముడూ అడగటంతో గమనిస్తోన్న అందరూ నవ్వుకున్నారు.
మూడు గంటలు కరిగిపోవటంతో నేనెక్కిన బస్సు విజయవాడ బస్టేషన్‌కి చేరింది. కొత్త జంటలు, యువకులు, ఓ కుటుంబ సభ్యులు నాతోపాటే లగేజీతో బిలబిలమంటూ దిగారు. వారి గమ్యస్థానాలకు వెళ్లారు. ఆర్డినరీ బస్సులో ప్రయాణం నాకు సరదాతో పాటు నాలో నూతనోత్తేజాన్ని నింపిందే కానీ, నా కొత్త కథకు ముడిసరుకు దొరకలేదు!
బస్సు దిగిన కండక్టరు, డ్రైవరు బాత్రూంకి వెళ్లి క్యాంటిన్ దగ్గర టీ తాగటానికి వచ్చారు. నేను కూడా ప్రెషప్ అయి వారికి కాస్త దూరంలో టీ తాగుతూ వారిద్దరినీ గమనిస్తూ వున్నాను. ఈ ట్రిప్పులో ఏ ప్రమాదం జరగకుండా, ప్రయాణికులతో ఏ గొడవలూ లేకుండా వారికి హ్యాపీ జర్నీ ఇచ్చామని కండక్టరు, డ్రైవరు చర్చించుకుంటున్నారు. ‘మనం ఇంత ఓర్పూ, నేర్పుతో సంస్థకు సేవలందిస్తోన్నా.. ఆ సిఐ మన మీద కక్ష కట్టినట్లు ఓటీలు వేస్తాడేమిటి?’ అంటూ వారిద్దరూ అంతర్మథనం చెందుతున్నారు.
ఇంతలో వారికి సిఐ నుంచి ఫోన్ రావటంతో ఒకరి తర్వాత ఒకరు తీసి గౌరవంగా మాట్లాడారు. ‘విజయవాడకు వెళ్లేందుకు మరో ట్రిప్పు వుంది. మానసికంగా సిద్ధంగా వుండండి’ అంటూ ఫోన్‌లో సిఐ ఆదేశం. ఆ మాటలకు కండక్టరు, డ్రైవరు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. నైరాశ్యంతో ‘ఎవరైనా.. పాలిచ్చే గేదెనే పిండుతారనుకుంటా!’ స్వగతంలా అనుకుంటూ తమ బస్సు వేపు నడిచారు వారిద్దరూ.
ఆ మాటలను స్వయంగా విన్న నేను వారిద్దరి మీద జాలిపడ్డాను. నేను రాసే కథకు మంచి ఇతివృత్తం దొరికిందని అనుకున్నాను. సెల్‌లో టైం చూసుకున్నాను. సాయంత్రం ఆరు దాటింది. పెళ్లి సమయం దగ్గర పడుతుందనే ఆతృతలో నా లగేజీని తీసుకొని మరో బస్సు ఎక్కాను.

- జి.సూర్యనారాయణ, బందలాయి చెరువు, కృష్ణా జిల్లా. చరవాణి : 9704784744