విజయవాడ

రగిలిన భానుడు ( మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేసవి మండుటెండలో
ఉక్కబోతతో హోరెత్తిపోతుంటే
ఉన్నట్టుండి వీస్తున్న వడగాడ్పులకు
ప్రాణాలు ఆవిరైపోతుంటే
జాతీయ రహదారిపై ఒంటరి పయనం
కాళరాత్రి కన్నా కర్కశంగా
కఠిన హృదయం కలదై
కాలం సాగదీసుకొని
కళ్లల్లో నిప్పులు పోసుకొని
ఈ సమస్త ప్రాణికోటిపై
కసిదీరా కుమ్మరిస్తుంటే
ఇక మనుగడ
మరణ సదృశమే!

- బూడిద శ్రీనివాసరావు,
బుద్దవరం, కృష్ణా జిల్లా.
చరవాణి : 9848736511
***

ఏరువాక ఎదురొచ్చింది!

కొత్తనీరు వస్తూనే పాతనీరు పోతుంది
కొత్తతరం మాదంటూ పాతతరాన్ని పాతేస్తుంది!
కొత్తపూత కోసం చెట్టు కోరికతో చూస్తుంది
పూత కాయ కావాలని రుతువుకెదురు వెళుతుంది!
మోడు చిగురులెత్తాలంటే ప్రౌఢాంగన కావాలట
ప్రౌఢత్వం రాగానే ప్రయోజకులం అంటారట!
అత్తగారి ఆరళ్లిక పాతచింత పచ్చళ్లే
ఉద్యోగిత కోడళ్లతో ఉలిక్కిపడే లోగిళ్లే!
కోరికల గుర్రమేమో కొండెక్కి సకిలించింది
మకిలంటిన మానవత మూలనబడి మూల్గుతోంది!
గడియారం ముళ్లతోనే పోటీపడే బతుకులు
ముసలితనపు గాలిపైన ఛీత్కార చికాకులు!
వయస్సు చెప్పే అనుభవాల ఆచరణ సాధ్యపడదు
అర్థంలేని ఆలోచనలవి ఆదర్శాలు నాడు నేడు?
నినే్నమో కొడుకు తనవాడు
కోడలు ‘పరాయి’
ఇప్పుడో? భర్త తనకు కావాలి
అత్తమామలను ‘వెలివేయి’!
అభిజాత్యపు అంతరాల ఆడంబర లక్షణాలు
సప్తపదుల అంతరార్థం అందుకోని భేషజాలు!
ఇరవై ఒక్క తరాల మూడుముళ్ల అనుబంధం
గుండెలోతు గూడులోన పెనవేసిన పేగుబంధం!
బిడ్డల ఆలన పాలన ఆయాలకు దత్తతిచ్చి
అడ్డాలలో బిడ్డడంటూ ఆక్రోశం ఎందుకు?
గుడ్డినమ్మకాల వెంట కాలమంత వెళ్లబుచ్చి
తాతకు పెట్టిన బొచ్చెను చూడగానే సిగ్గెందుకు?
తనకైనా అత్తరికం తప్పదని మదిమరచి
అమ్మతనపు ఆనవాళ్లు చెరిపేందుకు చింత ఏల?
మేడలతో మాడలతో చేసేదే కాపురమా?
తనదాక వస్తే ఇక తల్లడిల్లిపోతామా?
సోదరుల వివాహాల లాంఛనాల ఆడపడుచు
సోదరే వుండరాదు భర్తకంటు మిడిసిపాటు!
తన ఘనతను పుట్టినింట భర్తతోన ప్రకటించును
మెట్టినింట అడుగుపెట్ట పెనిమిటినే అడ్డుకొనును!
ఉమ్మడి కుటుంబాలకు
ఎపుడో ఇచ్చాము తిలోదకాలు
ఆదర్శ దాంపత్యాలకు వచ్చాయట తిరోగమనాలు!
ఆత్మఘోష పడితే ఆంతర్యం తెలుస్తుందా?
మూడునాళ్ల ముచ్చటాయే మూడుముళ్ల బంధాలు?
అత్తమామ ససేమిరా తన ఇంటికి రాకూడదు
పుట్టినింటి పట్టుచీర మోజు తాను వదులుకోదు!
తొలివలపుల మాధుర్యం చేదుకాయలేసింది
ఆత్మీయత ఆదరణ అడుగంటిపోయింది
ఏరువాక చిరుజల్లుల చిగురులెత్తు భూమాత
ఏకుమేకు అయితే ఇక మారిపోద తలరాత!
మనచేతలే మన జీవనగమనానికి మూలం
కూరిమి గల కుటుంబాలు
కుదురుకోవటం జనసూత్రం!!

- బిఎస్ నారాయణ దుర్గ్భాట్టు,
బాపట్ల, గుంటూరు జిల్లా.
చరవాణి: 9346911199
***

నువ్వేనా..?

ఒక జీవితమంత దూరం అనిపించే
ప్రయాణానికి ఆవల ఒక్క నిశ్శబ్దం
విడివడని లోచనాల సెలయేళ్లలో
తెలియాడే కల్లోలాల కంటిపాపలు
ప్రశ్నలై రెప్పల చెరసాలల
పారబోసుకున్న దృశ్యాదృశ్యాల శకలాలు
***
ఒక ఉదయ సంధ్యవేళ
నీ పదాల పరవళ్లను
ఆపలేని నా తలవాకిలి
సరాసరి బాత్రూమ్ దాక
నిన్ను నడిపిస్తుంది
గాలి తరగల సవ్వడి
నా వీనుల వీణియలు దాటి
కరాల తీవలతో
గడియలు తొలగించమంటుంది
అది మొదలు నా తనువును
ప్రకృతిని చేసి వరుణదేవునిలా
తలార స్నానం చేయించి
మనసారా నవ్వుల పువ్వులు పూయించి
పురుషునివై నాలో తాదాత్య్యం చెందుతావు
లీనమై - ధ్యానమై నేనాశించే
నా ప్రియవరుని లక్షణవౌతావు
అంతలోనే పెత్తనం కొరడా ఝుళిపిస్తూ
దూరంగా నెట్టేస్తూ మొక్కుబడిగా
బరువుగా - ఉగ్రంగా - రౌద్రంగా
నువ్వేనా?
జీవన చదరంగంలో సమస్యల సుడిగుండంలో
బతుకుబండిని ఈడ్వలేని నిస్సహాయతని
సరిపెట్టేసుకుంటా!
***
నీ కోసం ప్రాణమీయగలనేమో గాని
నన్ను జీవితాంతం బతికేలా
సజీవ చైతన్యస్రవంతిలా చేయగల
సత్తా మాత్రం నీ ఒక్కడికే ఉంది
మరి ఒకసారి ఒకలా
మరోసారి మరోలా ఎందుకిలా!?
ఒకిలో ఇద్దరివా? ఇద్దరిలో ఒకడివా?

- కె దేవికా రత్నాకర్,
తెనాలి, గుంటూరు జిల్లా.
చరవాణి : 9908706218
***
ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ప్లాట్ నంబర్ సి- 3, 4, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విజయవాడ - 520 007. vijmerupu@gmail.com
email: merupuvj@andhrabhoomi.net