విజయవాడ

మహిళా దినోత్సవం (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుధకి హఠాత్తుగా మెలకువ వచ్చింది. టైమ్ చూస్తే 7 గంటలైంది. ‘ఏమిటి ఇవాళ ఇంత నిద్రపట్టేసింది’ అనుకుంటూ బ్రష్ తీసుకుని బాత్‌రూంలోకి పరిగెత్తింది. ఫ్రిజ్‌లోంచి పాలు తీసి కాఫీ కలుపుకుని తాగింది. పనిమనిషి లక్ష్మి రోజూ 6 గంటలకే వస్తుంది. ఇవాళ ఇంకా రాలేదేంటబ్బా.. అనుకుంటూ గబగబా కుక్కరు పొయ్యిమీద పెట్టింది. ఇంతలో మార్నింగ్ వాక్‌కు వెళ్లిన భర్త వినయ్ తిరిగి వచ్చాడు. అతనికి కూడా కాఫీ కలిపి ఇచ్చింది.
‘ఏంటీ! మేడమ్‌గారు ఇప్పుడే నిద్రలేచినట్లున్నారు’? అన్నాడు.
‘మెలకువ రాలేదండీ’.
‘ఏం! నీ కుడిభుజం రాలేదా?’ హాస్యమాడాడు వినయ్.
‘మీకేం బాబూ..! ఎన్నైనా చెప్తారు. పేపర్ చదివి ఆఫీసుకు వెళ్లడమే కదా మీ పని. నాకు బోలెడు పనులున్నాయి. వీలైతే కాస్త వంటలో సాయం చేయొచ్చు కదా?’ అడిగింది సుధ.
‘బాబోయ్! ఆ వంట తంటా నాకొద్దు తల్లీ! కావాలంటే బాటిల్స్‌లో నీళ్లు పోయడం లాంటి పనులైతే ఓకే’ అని ఆఫర్ ఇచ్చాడు వినయ్.
‘అయ్యో! అంత శ్రమ మీకెందుకండీ. ఆ పనులేవో మేం చూసుకుంటాం’ అని కోపంగా కిచెన్‌లోకి నడిచింది సుధ.
ఇంతలో సెల్ మోగింది. ఎవరా అని చూస్తే పనిమనిషి లక్ష్మి. ‘దీనికేమొచ్చిందో’.. అనుకుంటూ ఫోన్ ఎత్తింది.
‘అలో అమ్మగారండీ! నేను లక్ష్మినండి’.
‘నీ నెంబరు చూస్తే నాకు తెలీదా. ఏంటి ఇంకా రాలేదు?’ అడిగింది సుధ. ‘మరేనండి ఇవాళ మన పండుగట కదమ్మా’.
‘మన పండుగేంటే’ విసుగ్గా అడిగింది.
‘అదేనమ్మగారూ! ఆడోళ్ల దినమట కదా! అందుకని మా పక్కింటి సుబ్బులు పనికి వెళ్లొద్దే., ఇద్దరం కలిసి సినిమాకి వెళ్దామని అంది అమ్మగారూ’.
‘నిన్న చెప్పి చావొచ్చుకదే. ఇప్పుడు చెబితే నాకెంత ఇబ్బందో నీకు తెలీదా?’ కోప్పడింది సుధ.
‘తెలుసమ్మగారూ! అది పనిచేసే ఇంటి అమ్మగారు ఆడోళ్ల దినం కాబట్టి మేం బయట భోంచేస్తాం. నువ్వు పనిలోకి రావద్దే.. అని రాత్రి చెప్పిందట. ఇది నాతో పొద్దున్న చెప్పింది. ఇవాల్టికి ఎలాగో సర్దుకోమ్మా. రేపు పొద్దునే్న వచ్చేస్తాగా’ అని మరోమాటకి ఆస్కారం ఇవ్వకుండా కాల్ కట్ చేసింది లక్ష్మి.
అప్పుడే టీవీలో ‘మహిళా దినోత్సవ శుభాకాంక్షలు’ అని ప్రకటన వస్తోంది.
‘ఓహో.. లక్ష్మి చెప్పే ఆడోళ్ల దినం ఇదా!’ అనుకుని సుధ పనిలో మునిగిపోయింది.
‘ఏంటోయ్! లక్ష్మీ ఫోన్‌లా ఉంది. ఏమంటోంది?’ అడిగాడు వినయ్.
‘ఇవాళ ఉమన్స్ డే సెలబ్రేషన్స్‌ట. అందుకని రాదుట. అది చెప్పడానికి ఫోన్ చేసింది’.
‘నిన్ను చీఫ్ గెస్ట్‌గా రమ్మనలేదా?’ పళ్లికిలిస్తూ అడిగాడు వినయ్.
‘మీకు ఇబ్బందని నేనే కుదరదన్నానులెండి’ మరోమాటకు అవకాశమివ్వకుండా సమాధానం చెప్పింది సుధ.
గబగబా టిఫిన్ రెడీ చేసి, వంట చేసేసింది. పిల్లలకి, వినయ్‌కి క్యారేజీలు పెట్టి వాళ్లందరినీ పంపేసరికి 9.30 అయింది. వెంటనే తను కూడా రెండు ఇడ్లీలు తిని ఆఫీసుకి బయలుదేరింది.
వినయ్ ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. సుధ ఎస్‌బిఐలో ఉద్యోగి. వారిద్దరి ఆఫీసులు వేర్వేరు రూట్లలో ఉండటంతో సుధ రోజూ ఆఫీసుకి బస్సులోనే వెళ్తుంది. బస్టాపులోకి వచ్చేసరికి రోజూ టైమ్‌కి వచ్చే బస్సు ఈరోజు అరగంట ఆలస్యంగా వచ్చింది. లేట్‌గా వస్తానని చెప్దామని మేనేజర్‌కి ఫోన్ చేస్తే ‘బిజీ టోన్’ వచ్చింది. పక్కసీటులో కూర్చునే తన ఫ్రెండ్ శైలజకి ఫోన్‌చేసి విషయం చెప్పింది.
ఇంతలోనే బస్సు వచ్చింది. ఆఫీస్ టైమ్ కావడంతో అది నిండు గర్భిణిలా ఉంది. కాలు పెట్టడానికి కూడా చోటులేదు. బ్యాంక్‌కి వెళ్లడానికి అదొక్కటే బస్సు కావటంతో ఎలాగోలా ఎక్కేసి లోపలికి వెళ్లింది సుధ. అక్కడ లేడీస్ సీట్లలో ఇద్దరు మగవాళ్లు కూచుని ఉన్నారు. ఇద్దరూ వెకిలి కబుర్లు చెప్పుకుంటూ బిగ్గరగా నవ్వుతున్నారు. ఇదిచూసి సుధకి వళ్లు మండిపోయింది. వారి దగ్గరికి వెళ్లి ‘ఏయ్ మిస్టర్! ఇవి లేడీస్ సీట్లు కదా! మీరు కూర్చున్నారేంటి. లేవండి’ అని అడిగింది. వాళ్లు వినిపించుకోనట్లుగా నటించారు.
బ్యాంక్‌కు చేరేసరికి 10.30 అయింది. గబగబా సీటులో కూర్చుని అటెండర్ రామును పిలిచి అటెండెన్స్ రిజిస్టర్ తీసుకురమ్మంది.
‘రిజిస్టర్ సార్ దగ్గర ఉందమ్మా’ అని చావుకబురు చల్లగా చెప్పి వెళ్లిపోయాడు.
‘ఎందుకు కంగారు. ఇప్పుడు ఏం కొంపలు మునిగాయని?’ పలుకరించింది శైలజ.
‘ఏం లేదు. ఇవాళ పనిమనిషి లక్ష్మి సడన్‌గా హ్యాండిచ్చింది. దాంతో లేటయింది. బాస్ మూడ్ ఎలా ఉంది?’.
‘ఇవాళ చాలా హాట్‌గా ఉన్నారు. ఇప్పుడే వచ్చి అందరినీ కరిచి, సారీ.. అరిచి వెళ్లారు. నిన్ను కూడా అడిగారు. ఏదో చెప్పాలే! తొందరగా వెళ్లి నీ కోటా అట్లు, సారీ.. తిట్లు తినిరా!’ అంది శైలజ.
నెమ్మదిగా మేనేజర్ రూం దగ్గరికి వెళ్లి డోర్‌మీద కొట్టి ‘మే ఐ కమిన్ సార్?’ భయపడుతూ అడిగింది సుధ.
ఆయన లాప్‌టాప్‌లోంచి నెమ్మదిగా తల పైకెత్తి చూసి నవ్వుతూ ‘రండి మేడమ్’ అని ప్రసన్న వదనంతో ఆహ్వానించారు.
అమ్మో! ఇవాళ భూకంపం రావడం ఖాయమనుకుంటూ లోపలికి నడిచి ‘రిజిస్టర్ సార్!’ అడిగింది.
ఆయన ‘ఓ ష్యూర్’ అని అందించారు.
ఎప్పుడు లేట్‌గా వచ్చినా అరగంట క్లాస్ పీకే ఈయనకి ఏమైందబ్బా? కొంపదీసి మహిళా దినోత్సవమని ఊరుకున్నారా? అని ఆలోచిస్తూ గబగబా సంతకం చేసి బయటికి రాబోయింది.
‘సుధగారూ! చిన్న మాట’ అని ఆపారు మేనేజర్.
‘ఏంటి సార్?’ అడిగింది.
‘మరేం లేదు. ఇవాళ మన క్యాషియర్ రమణ గారు, క్లర్క్ శ్యామ్ గారు సెలవు పెట్టారు. కొంచెం మీరు క్యాష్ కౌంటర్ చూసుకోండి. మీరింకా రాలేదని అందాకా రాణిని చూడమన్నాను. మీకు తెలియనిదేముంది, ఆమె డల్ కదా? మీరైతే బాగా హ్యాండిల్ చేయగలరు!’ అని సుధ మొహాన ఒక ప్రశంస పడేసి ఆమె సమాధానం కూడా వినకుండానే కంప్యూటర్‌లోకి తలదూర్చేశారాయన.
ఇక చేసేదేమీ లేక బయటికి వచ్చి సీటులో కూలబడింది సుధ.
‘ఏంటి? మొహం అలా పెట్టావు. ఇంకా పావుగంటకీ రావనుకుంటే గోడకి కొట్టిన బంతిలా అప్పుడే వచ్చేశావు. కొంపదీసి లీవ్ పెట్టి వెళ్లిపొమ్మన్నారా?’ అని ఆత్రంగా అడిగింది శైలజ.
‘అంత అదృష్టం కూడానా తల్లీ! అవసరం ఆయనది కదా, అందుకని మెత్తగా మాట్లాడి పంపేశారు’ చెప్పింది.
‘ఏంటట?’ అడిగింది శైలజ.
‘ఆయన అస్మదీయులు రమణ, శ్యామ్ సెలవుట. వాళ్ల డ్యూటీ అప్పగించడానికే నాపై కరుణాకటాక్షాలు’ అంది సుధ.
‘అదా సంగతి! ఇప్పుడే అనుకుంటున్నా, అయ్యగార్లు ఇంకా ఊడిపడలేదేమిటా అని’ అంది శైలజ వెటకారంగా.
బాస్ పురుష పక్షపాతి. ఆఫీసులో ఆయన కాక ఇద్దరే మగవాళ్లు. స్వజాతి మమకారంతో ఆయన ప్రతి విషయానికి తిట్టేస్తుంటారు.
సరే ఇంక తప్పదు కదా అనుకుంటూ క్యాష్ కౌంటర్‌లో కూచుంది సుధ. ముందు రెండురోజులు సెలవు కావడంతో జనం బాగా ఉన్నారు. గబగబా పనులన్నీ క్లియర్ చేసేసరికి లంచ్ టైమైంది.
బాక్స్ తీసుకుని డైనింగ్ హాల్‌లోకి వెళ్లింది. అప్పటికే లేడీసంతా బాక్స్‌లు ఓపెన్ చేసి తింటున్నారు.
‘ఏం కూర?’ అడిగింది శైలజ.
‘సొరకాయ’ అని చెప్పి లక్ష్మి ఫోన్ సంగతి వాళ్లకి చెప్పింది సుధ. అందరూ పగలబడి నవ్వారు. ‘పోనే్ల.. మనకెలాగూ గతిలేదు. వాళ్లనైనా సెలబ్రేట్ చేసుకోనీ!’ అన్నారంతా.
అప్పుడు శైలజ అందుకుంది. ‘మహిళా దినోత్సవమనేనా, మన మగమహారాజులు సెలవు తీసుకున్నారు’ అంది అక్కసుగా.
ఇక ఆడవాళ్ల బాధలు, మగవాళ్ల పెత్తనాల గురించి చెప్పుకుని, లంచ్ ముగించి వెళ్లారు. క్యాష్ అంతా లెక్కచెప్పి బ్యాంకులోంచి బయటపడేసరికి ఏడయింది. ఇవాళ బాగా అలసటగా ఉంది. బస్సులో వెళ్లలేనేమో అనుకుంటూ, స్కూటర్ మీద తీసుకెళతారేమోనని భర్త వినయ్‌కు ఫోన్ చేసింది సుధ.
నాలుగు రింగుల తర్వాత ఫోన్ ఎత్తాడు వినయ్.
‘హలో డియర్! నీకు నూరేళ్ల ఆయుష్షు. నేనే నీకు ఫోన్ చేద్దామనుకుంటున్నాను. నువ్వే చేశావు’ అన్నాడు.
‘ఆఁ ఏం లేదండీ! బాగా అలసటగా ఉంది. వచ్చి నన్ను తీసుకెళతారేమోనని అడుగుదామని’ అని నీరసంగా అడిగింది.
‘అయ్యో! అలాగా. సారీ డియర్! నేను రాలేను. నా ఫ్రెండ్ ఉదయ్ అమెరికా నుంచి నెలరోజుల క్రితం వచ్చాడని చెప్పాకదా. వాడు పొద్దున ఇక్కడకు వచ్చాడట. హోటల్‌లో దిగాడట. మధ్యాహ్నం ఫోన్ చేశాడు. అందుకే సెలవుపెట్టి వాడితో ఉన్నాను’.
‘ఓ అలాగా! సరేలెండి. నేను ఇవాళ్టికి ఆటోలో వెళ్లిపోతాను’ చెప్పింది సుధ.
‘మరి బ్యాంకు దగ్గరికి ఆటోలు రావుకదా?’.
‘చూస్తాలెండి’
‘ఇవాళ బాగా లేటయింది. మరి లక్ష్మి రాలేదు కదా. పిల్లల సంగతేంటి’. అడిగాడు వినయ్.
‘పక్కింటి పిన్నిగారికి ఫోన్ చేసి చెప్పాలేండి, వాళ్లింట్లో కూచోపెట్టుకోమని’ చెప్పింది.
‘దట్స్ గుడ్. మరి నువ్వేమనుకోనంటే ఒక చిన్న రిక్వెస్టు. ఉదయ్ ఫ్లైట్ రాత్రి 11 గంటలకట. అందుకని రాత్రి మనింటికి డిన్నర్‌కి రమ్మన్నాను. పర్వాలేదా’ అనునయంగా అడిగాడు.
ఓహో! డియర్ సంబోధన ఇందుకా?.. మనసులోనే అనుకుంది సుధ.
‘అమ్మో నా వల్లకాదు. బ్యాంక్‌లో అసలే పని ఎక్కువై అలిసిపోయి ఉన్నాను. ఏదైనా హోటల్‌కి తీసుకెళ్లండి’ అంది.
‘నిజమే. నేను కాదనడం లేదు. కానీ వాడు ‘హోటల్ తిండి తినీతినీ విసిగిపోయాడు. ఇంటి వంట తినాలని ఉందిరా. అందులో మీ మిసెస్ వంట బాగా చేస్తుందని మన ఫ్రెండ్స్ చెప్పారు’ అన్నాడు. అలా అన్నాక కూడా పిలవకపోతే ఏం బావుంటుంది చెప్పు! నినే్నమీ ఇబ్బంది పెట్టంలే. మేము కబుర్లు చెప్పుకుని తొమ్మిదింటికి వస్తాం. వాడు పదింటికల్లా వెళ్లిపోతాడు. ఈ ఒక్కరోజుకి కష్టపడు. కావాలంటే రేపు నేను హెల్ప్ చేస్తాను’ అని బతిమాలాడు వినయ్.
ఇక కాదనక తప్పలేదు సుధకి. ఉసూరుమంటూ బయలుదేరింది. బస్టాపు దాకా వచ్చేవరకు ఆటో దొరకలేదు. ఆటో ఎక్కాక ఇంట్లో కూరలు లేని విషయం గుర్తుకొచ్చింది. దారిలో ఆపి కూరలు, రాకరాక ఆయన ఫ్రెండ్ భోజనానికి వస్తే స్వీటు లేకపోతే ఏం బావుంటుందని గులాబ్‌జామ్ ప్యాకెట్ కొనుక్కుని ఇంటికి వెళ్లింది. పక్కింటి పిన్నిగారింటికి వెళ్లి పిల్లలను తీసుకొచ్చి వాళ్లకి స్నానం చేయించింది. గబగబా కూర, చట్నీ, సాంబారు, స్వీటు, హాట్ సిద్ధం చేసింది. వంట అయ్యేసరికి 9 గంటలయింది. పిల్లలకు భోజనాలు పెట్టేసింది. అంతలోనే భర్త వినయ్, అతని ఫ్రెండ్ ఉదయ్ రానే వచ్చారు. ‘రండి ఉదయ్ గారూ! బావున్నారా? కుశల ప్రశ్నలడిగింది సుధ.
‘బావున్నానండీ! మీరు ఎలా ఉన్నారు?’ అని అడిగాడు.
‘బాగానే ఉన్నానండీ’ చెప్పింది సుధ.
‘ఏరా వినయ్! పిల్లలు ఏరి?’ అడిగాడు ఉదయ్.
అబ్బాయ్ వరుణ్‌ని, అమ్మాయి సాహితిని పిలిచాడు వినయ్.
వాళ్లు రాగానే ‘హాయ్ కిడ్స్’ అని వాళ్లిద్దరినీ దగ్గర కూచోబెట్టుకుని బిస్కెట్లు, బొమ్మలు ఇచ్చాడు వినయ్. తను చిన్నప్పుడు చేసిన అల్లరి చెప్పి వాళ్లని కాసేపు నవ్వించాడు.
10 గంటలకు భోజనాలు పెట్టింది సుధ. ఐటమ్స్ అన్నీ ఎంతో బావున్నాయని, ఇలాంటి భోజనం తిని ఎన్నో రోజులైందనీ అన్నాడు ఉదయ్. ఆ తర్వాత ఎయిర్‌పోర్టుకి బయలుదేరాడు. అతన్ని ఫ్లైట్ ఎక్కించి వస్తానని వినయ్ కూడా వెళ్లాడు. కిచెన్ అంతా సర్దుకుని వచ్చి చూసేసరికి పిల్లలు నిద్రపోతూ కనిపించారు. పాపం చూసిచూసి పడుకున్నట్టున్నారు అనుకుని హాల్లోకి వచ్చి సోఫాలో కూచుంది సుధ. టైమ్ చూస్తే 11.30 అయింది. పొద్దున ఆరింటికి లేస్తే ఇప్పటికి తీరుబాటయింది అనుకుంటూ టీవీ ఆన్ చేసింది. అందులో ‘మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు’ అంటూ వస్తున్న ప్రకటన వెక్కిరిస్తున్నట్లు కనిపించింది. ఈరోజంతా తాను పడిన పాట్లు గుర్తొచ్చి ‘మహిళలకు ఉత్సవాలా?’.. అంటూ నిట్టూర్చింది పాపం సుధ.

- కూచిమంచి పద్మావతి, విజయవాడ.
చరవాణి : 9000323764
పుస్తక పరిచయం

కవితా వెలుగుల ‘బాలకిరణాలు’!
ప్రతులకు:
కొమ్మవరపు కృష్ణయ్య,
తెలుగు పండిట్,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
నిదానపురం,
మధిర మండలం,
ఖమ్మం జిల్లా.
చరవాణి : 9440671251

‘ఒక దేశం అవినీతి రహితంగా సద్బుద్ధి కలిగిన ప్రజలతో విలసిల్లితే నా ఉద్దేశ్యంలో అది కేవలం ముగ్గురి వల్లనే సాధ్యమవుతుంది. వారే తల్లి, తండ్రి, గురువు’ అని అన్నారు దివంగత రాష్టప్రతి ఎపిజె అబ్దుల్ కలాం. గురువులు సమాజంలో చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తారు. విద్యార్థులకు చదువు చెప్పడమేగాక వారి గుణగణాలను తీర్చిదిద్ది, వాళ్లలో సృజనాత్మక ఆలోచనలు పెంపొందించి వారి వ్యక్తిత్వాన్ని కూడా ప్రభావితం చేస్తుంటారు. అలాంటి గురువుల్లో నిదానపురం ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న తెలుగు ఉపాధ్యాయులు కొమ్మవరపు కృష్ణయ్య కూడా ఒకరు. మనిషిని పరిపూర్ణ వ్యక్తిగా తీర్చిదిద్దడమే చదువుల ప్రధాన లక్ష్యం. అప్పుడే అతను నైతిక విలువలతో కూడిన జీవనమార్గంలో వ్యక్తిగత బాధ్యతలు నిర్వర్తిస్తూనే సమాజ శ్రేయస్సుకు పాటుపడతాడు. అందుకే కృష్ణయ్యగారు తన విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించి, సమాజం పట్ల చైతన్యాన్ని కలిగించేందుకు వారిలో కవిత్వపు విత్తులు నాటారు. అవి పెరిగి పెద్దవై ‘బాలకిరణాలు’గా పుస్తకరూపం దాల్చాయి.
కృష్ణయ్య గారి సంపాదకత్వంలో వెలువడిన బాలకిరణాలులో నిదానపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 45 మంది బాలకవులు తమ ఆలోచనలతో అక్షరాలకు కవిత్వ రూపాన్నిచ్చి చైతన్యపు కిరణాలను ప్రసరించారు.
ఈ సృష్టిలో అత్యంత విలువైనది వెలకట్టలేని అమ్మ. అమ్మను గురించి రాయని కవి లేడంటే అతిశయోక్తి కాదు. 6వ తరగతి చదివే యామిని తన చిట్టి కవితలో అమ్మ గొప్పతనాన్ని చెబుతూ.. ‘నాకు మంచిని నేర్పిన మొదటి గురువు/ నా జీవితానికి అర్థానిచ్చింది/ అందుకే అమ్మే నా ప్రాణం/ ఆమె కోసం చేస్తా నా జీవితం త్యాగం’ అంటుంది. మరో బాల కవయిత్రి ఎస్‌కె నాగుల్‌బీ ‘అమ్మ నా ప్రాణం’ అనే కవిత రాసింది. ఇంకా ఎ నర్శిరెడ్డి, పి ప్రశాంత్, కె మహేష్‌బాబు, పున్నారెడ్డి వంటి విద్యార్థులు అమ్మ గురించిన కవితల్ని హత్తుకునేలా రాశారు.
ప్రకృతితో మానవునికి విడదీయరాని బంధం ఉంది. ప్రకృతి లేని మానవుని జీవితం అసాధ్యం. కానీ ప్రకృతి నాశనమైపోతోంది. మనిషి నిర్వహించే కార్యకలాపాలు ప్రకృతి వనరుల్ని ఘోరంగా దెబ్బతీస్తున్నాయి. అంతకంతకూ కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. ప్రకృతి మనల్ని మారమంటోంది. మనం మారడం లేదు. హరితహారం, మా చెరువు, మట్టిలో దేవుడు, పర్యావరణం వంటి కవితల్లో పర్యావరణ రక్షణకు నడుం కట్టారు బాలకవులు. నాగుల్‌బీ పర్యావరణంపై కవితలో ‘పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం/ రేపటి అడుగులకు బాటలు వేద్దాం/.. అంటూనే స్వచ్ఛ భారత్ కోసం చైతన్యాన్ని రగిలించింది. మనోహర్, శివనారాయణ చెరువు అవసరాన్ని తెలియచేస్తూ చెరువుల్ని రక్షించాలని కోరుకున్నారు.
పర్యావరణాన్ని నాశనం చేయటంలో ప్లాస్టిక్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అందుకే వాటివల్ల కలిగే నష్టాల్ని వివరిస్తూ మట్టిలో దేవుడు కవిత రాసాడు జగదీశ్వర్‌రెడ్డి. ‘ప్లాస్టిక్‌ని తొలగించు/ మట్టితల్లికి విముక్తి కలిగించు/ మట్టి గణపయ్యను పూజించు/ మట్టి మనిషివై జీవించు’ అంటూ ఉద్బోధ చేస్తాడు. ఈ దేశానికి వెనె్నముక రైతు అయితే, రక్షణ కవచం జవాన్. వీరిద్దరినీ తలుస్తూ రాసిన కవితలు అద్భుతంగా ఉన్నాయి. ‘రాత్రీ పగలూ శ్రమిస్తావు/ మనదేశాన్ని కాపాడతావు/ శత్రువులను మట్టికరిపిస్తావు/ మాతృదేశానికి రక్షణనిస్తావు’ అంటూ జవాన్ గురించి సిహెచ్ అనిల్‌కుమార్ రాస్తే, ‘పంట పండించే ఓ రైతన్నా / నీ పెట్టుబడికి డబ్బు ఏదన్నా? / వర్షం లేకపోతే పొలానికి నీరులేదు కదన్నా /.. రైతే దేశానికి వెనె్నముక / నీవు లేకపోతే లేదు మాకు అన్నమిక’.. అంటూ రైతన్న కష్టాలను తెలియజెపుతూనే రైతు ప్రాధాన్యాన్ని వివరించాడు అజయ్‌కుమార్.
మద్యం మత్తులో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అయినా ఎక్కడబడితే అక్కడ బార్లు బార్లా తెరుచుకుంటున్నాయి. అందుకే మద్యం ప్రియులకు దానివల్ల కలిగే నష్టాలను తెలియచేస్తూ ‘మద్యం మానుకో/ నీ జీవితాన్ని బాగుచేసుకో’ అంటూ హెచ్చరిస్తున్నాడు జగదీశ్వరరెడ్డి. ‘మనిషి ఉన్నది దేనికి?’ అనే శీర్షికతో ఎం శివారెడ్డి రాసిన కవిత మనిషిని, ప్రకృతిని తూకం వేసి మనముందుంచుతుంది.
ఇంకా ఇందులో మన సంస్కృతిని చాటే పండుగల గురించి, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం, కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ భారత్ గురించి, బడిని గురించి, గురువులను తమ భావాలను అక్షరాలుగా మలిచి మనముందుంచారు బాలకవులు. ఈ అక్షరాల్లో ఎంతో నిజాయితీ, నిబద్ధత గోచరిస్తున్నాయి. ఈ బాలకవులు మరింతగా వారి భాషా పటిమను పెంచుకుని, భావికవులుగా ఎదగాలని, తద్వారా సత్కీర్తిని పొందాలని ఆకాంక్ష. వీరిని తీర్చిదిద్దిన కృష్ణయ్య మాష్టారు ధన్యజీవి.

- సిద్ధాంతపు ప్రభాకరాచార్యులు,
అశ్వారావుపేట, ఖమ్మం జిల్లా.
చరవాణి : 9491357842

జలమేవ జయతే!
తరువుల నరికివేత
ఖనిజాల వెలికితీత
సహజ వనరుల విధ్వంసం
భూతాపాన్ని పెంచే శాపాలు
జీవనదులు, చెరువులు
నీటి చెలమలు
ఊటపుట్టు తావులు
ఎండిపోతున్నాయి
మలిన వ్యర్థాలు
సుజలాన్ని విషతుల్యం చేస్తున్నాయి
వర్షధారల ఉనికి లేక
పర్యావరణం
పచ్చదనాన్ని కోల్పోతోంది
నీటి కరవు
జీవుల చలనగతికి
యమపాశం బిగిస్తోంది
అడవిలో మసలే
వన్యమృగాలు సైతం
దాహార్తికి
జనారణ్యం
బాటపడుతున్నాయి
సర్వప్రాణుల రక్షణకు
జలసిరి ముఖ్యం
వర్తమాన గమనంలో
మేఘం కరుణించే
వాన చినుకుని
ఒడిసిపట్టి
అవనిలో
వసంత శోభను పెంచాలి
భూక్షేత్రంలో మెతుకుపంట
తీయాలన్నా
యంత్ర సంస్కృతి ద్వారా ఉపాధి పొందాలన్నా
పారిశ్రామిక ప్రగతి
సాధించాలన్నా
దేశ సౌభాగ్యరేఖను నిండుగా పూరించాలన్నా
నీటి వినియోగం అనివార్యం
జలమేవ జయతే!
నీరుప్రాణాధారం
ఆదాచేస్తే పన్నీరు
వృథాచేస్తే కన్నీరు!

- సందుపట్ల భూపతి
మంగళగిరి, గుంటూరు జిల్లా.
చరవాణి: 9603569889

మనోగీతికలు

పల్లె కన్నీరు
రమణీయమైన ప్రకృతి అందాలతో
కనువిందు చేసిన పల్లెల్లో
కరవు రాకాసి కోరలు
కరాళ నృత్యం చేస్తున్నాయ్

రాలిన పండుటాకులు
మోడువారిన చెట్లకొమ్మలు
పల్లె ప్రజల జీవితాలను
వెర్రిగా వెక్కిరిస్తున్నాయ్

పచ్చనాకుల్ని తాకుతూ వీచే
పైరగాలి వేడెక్కుతోంది
బోరుబావులు నోరు తెరచుకొని
బావురు బావురుమంటున్నాయ్

మేతా నీళ్లు లేక
బక్కచిక్కిన గోదాలు
బీరు బ్రాందీలో మటన్ పకోడీలకై
కబేళాలకు కదులుతున్నాయ్

పనిపాటల్లేక పల్లె చిన్నబోయింది
రెక్కాడితేగాని డొక్కాడని
కూలినాలి పేదోళ్ల
రెక్కలిరిగి డొక్కలెండినయ్

మిరుమిట్లు గొలిపే కరెంటు
కటిక చీకటిగా మారింది
నేనంటే నేనంటూ దుమ్మూ ధూళి
పల్లెవీధుల్లో తగవులాడుతున్నాయ్

ఎండతాపానికి తాళలేక
అందమైన పక్షులు అల్లల్లాడుతూ
కాళ్లు-రెక్కలు చాచి
గిలగిలా తన్నుకుంటున్నాయ్
నాలుక చాపి
దాహం దాహం అంటూ
పంచరంగుల పక్షుల
కిలకిలారావాలు ఆగిపోతున్నాయ్

కంచంలో కూడులేక
కడవలో నీళ్లులేక
నీడనిచ్చే గుడిసెలేక
జాలిపడే జనం లేక
నెత్తురింకిన కండరాలు
ముడతలుపడిన దేహంతో
పండుముసలిదై పల్లె
బిక్కుబిక్కుమంటూ
దిక్కుదిక్కుకు చూస్తోంది

వయసు మీదపడ్డ అవ్వల్ని
పూరిగుడిసెల్లో వదిలేసి
చంటిబిడ్డల్ని చంకనేసుకొని
మూటాముల్లే నెత్తికెత్తుకొని
కనిపెంచిన తల్లిదండ్రుల
కడుపు నింపలేక
కన్నతల్లిలాంటి ఉన్న ఊరు
విడిచి వెళ్లలేక
పట్టెడు దుఃఖంతో
బండెడు బాధతో
కన్నీరు కారుస్తూ
కాలు కదుపుతూ
అన్నమో రామచంద్రంటూ
ఆకలి కేకలతో అలమటిస్తూ
పట్టణాలకు పరుగెడుతున్న జనం
హృదయాల్ని పిండే దైన్యం

పసిపిల్లల ఆటపాటలతో
రైతుకూలీల పనిపాటలతో
వావివరసల పలకరింపులతో
పాడిపంటల ధాన్యరాశులతో
అనునిత్యం కళకళలాడిన పల్లెల్ని
కమ్ముకున్న నిర్మానుష నిశ్శబ్దం
అమావాస్య నిశీధి శ్మశానంలో
శవాలు రాజ్యమేలుతున్నట్లు
పల్లె వల్లకాడవుతోంది!

- జె విశ్వ,
బయ్యారం, ఖమ్మం జిల్లా.
చరవాణి : 7793968907

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ప్లాట్ నంబర్ సి- 3, 4, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విజయవాడ - 520 007. పజీౄళూఖఔఖబఘౄజ.ష్యౄ

- కూచిమంచి పద్మావతి