విజయవాడ

ఎవరు అదృష్టవంతులు? (చిన్న కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రమ, ఉమ, సీత ఒకటో తరగతి నుంచి టెన్త్ వరకు కలిసి చదువుకున్నారు. టెన్త్ పూర్తికాగానే సీత బావ రఘురాంని పెళ్లి చేసుకుంది. మొదట ఇద్దరు కవలలు. రెండో పురిటికి ఒక పాప. ఇరవై నిండేసరికి ముగ్గురి పిల్లల తల్లయింది. కవల పిల్లల అల్లరికి ప్రతిచోటా ఇంటివారితో గొడవపడి ఇల్లు మారడం.. వాళ్ల సంగతి ఎస్‌ఎన్ పురంలో అందరికీ తెలిసి వాళ్లకి ఇల్లు ఇవ్వలేమనడం వరకూ వచ్చింది. రామూ, శ్యామూ అల్లరి పిల్లలయినా చాలా ముద్దుగా అందంగా వుండేవారు. తెలివైన పిల్లలు కూడా. ఇంత చిన్నవయసులో ముగ్గురు పిల్లలతో వేగటం చాలా కష్టమే. ‘మాకు పిల్లలు లేరు.. ఒక్క బాబుని దత్తత ఇవ్వండి’ అని ఇటు బంధువుల్లో, అటు స్థానికుల్లో చాలామంది అడిగినా ‘మావారు’ పిల్లల్ని వదిలి వుండలేరని నెపం భర్త మీదకి నెట్టేది. పిల్లలిద్దరూ టెన్త్ క్లాస్ పాసయ్యారు. ఉమ, రమ పెద్ద చదువు చదివి ఉద్యోగాల్లో చేరారు. ఉమ ప్రేమ ఫెయిలయి, రమ భర్తతో సరిపడక విడాకులిచ్చి ఒంటరిగా మిగిలిపోయారు. ఒంటరిగా, స్వేచ్ఛగా, ప్రశాంతంగా వున్న ఫ్రెండ్స్‌ని చూసి ‘మీరు భలే అదృష్టవంతులే! హాయిగా నవ్వుతూ బతుకుతున్నారు. నేను ఈ ముగ్గురు పిల్లలతో నరకం అనుకో!’ అంది సీత.
రమ, ఉమ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. చిన్నతనంలోనే బావని పెళ్లి చేసుకుని చక్కని సంసార జీవితం గడుపుతోందని భావిస్తున్నామే.. అని తమలో తామే అనుకున్నారు. జీవితం సుఖమయం చేసుకోవడం ఎవరికి వారి చేతుల్లోనే వుంటుంది. కొన్నిటికి రాజీపడి బతకాలి. పిల్లల్లో ఒకరిని దత్తత ఇస్తే జీవితం స్వర్గమే కదా..! అనుకున్నారిద్దరూ.
- నాగమల్లిక, గుంటూరు.

వేదిక
వంద కవితల పండుగ!
కవిత, గజల్స్, కథలపై శిక్షణ శిబిరం
మల్లెతీగ సాహిత్య వేదిక (విజయవాడ), కవితా వికాస వేదిక (హైదరాబాద్) సంయుక్తంగా ఈ నెల మూడో వారంలో కవిత, గజల్స్, కథలపై శిక్షణ శిబిరం ఏర్పాటు చేయనున్నాయి. విజయవాడలో జరుగనున్న ఈ శిబిరంలో వర్ధమాన కవులకు, రచయితలకు కవిత, గజల్స్, కథ నిర్మాణ పద్ధతులు, కథన రీతులు, జాతీయ, అంతర్జాతీయ సాహితీ ధోరణులు, తదితర అంశాలపై ప్రముఖులు శిక్షణ ఇస్తారు. ఈ శిబిరంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి చంద్రకుమార్, ప్రఖ్యాత కవి డా.ఎన్ గోపి, డా. గజల్ శ్రీనివాస్, ప్రజాకవి, గాయకుడు గోరటి వెంకన్న, మాణిక్యాలరావు వంటి ప్రముఖులెందరో పాల్గొంటారు. ఈ సందర్భంగా వంద మంది కవులతో కవి సమ్మేళనం వుంటుంది. శిబిరంలో పాల్గొనదలచిన వారు పేర్లు నమోదు చేసుకోవాలని మల్లెతీగ సాహిత్య వేదిక అధ్యక్షుడు కలిమిశ్రీ (92464 15150), కవితా వికాస వేదిక ప్రధాన కార్యదర్శి బిక్కి కృష్ణ (99127 38815) ఒక ప్రకటనలో సూచించారు.
‘సోమేపల్లి’ పురస్కారాల కోసం
జాతీయస్థాయి చిన్న కథలకు ఆహ్వానం
జాతీయ స్థాయిలో గత ఎనిమిదేళ్లుగా తెలుగు చిన్న కథల పోటీలు నిర్వహిస్తూ, తెలుగు సాహిత్య రంగంలో నికార్సైన విశిష్ట అవార్డులుగా ప్రఖ్యాతని చాటుకుంటున్న ‘సోమేపల్లి సాహితీ పురస్కారాలు’ ఈ ఏడాది కూడా ఇవ్వాలని సోమేపల్లి వారి కుటుంబం నిర్ణయించింది. కథారచనను పరిపుష్టం చేసే ఉత్తమ కథలు వెలుగుచూడాలని, తద్వారా యువ రచయితలను ప్రోత్సహించి, తెలుగు కథ గొప్పదనాన్ని దశదిశలా చాటాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ పోటీలను ఎప్పటిలాగే విజయవంతం చేయాల్సిందిగా అవార్డు కమిటీ చైర్మన్ సోమేపల్లి వెంకటసుబ్బయ్య, రమ్యభారతి సాహిత్య త్రైమాస పత్రిక ఎడిటర్ చలపాక ప్రకాష్ ఒక ప్రకటనలో కోరారు. అత్యుత్తమ కథకు రూ.1500, ఉత్తమ కథకు రూ.1500, మంచి కథకు రూ.1000, ప్రత్యేక బహుమతులు రూ.500 చొప్పున ఇద్దరికి ఇవ్వనున్నట్లు వారు తెలిపారు. రాతప్రతిలో రెండు నుంచి ఐదు పేజీల్లోపు ఒకరు ఎన్ని కథలనైనా పంపవచ్చని తెలిపారు. కథలను అక్టోబర్ 30లోపు ‘రమ్యభారతి, పి.బి. నెం-5, 11-57/1-32, జెఆర్ కాంప్లెక్స్, రెండో అంతస్తు, రజక వీధి, విజయవాడ - 520001, (చరవాణి: 9247475975) అనే చిరునామాకు పంపాలి. విజేతలకు నగదు బహుమతితో పాటు విజయవాడ లేదా గుంటూరులో జరిగే ప్రత్యేక సభలో సత్కరించనున్నట్లు వివరించారు.

సౌంభక వృత్తాంతం

మాయాజ్యూతం వేళ నేనే వుండివుంటినా..!

అరణ్యవాస కాలంలో పాండవులు ద్వైత వనంలో నివసిస్తున్నారు. శ్రీకృష్ణుడు యాదవ ప్రముఖులతో కలిసి వారిని చూడటానికి వచ్చాడు. ధర్మరాజు ఎదురెళ్లి, వారిని ఆహ్వానించి, అతిథి సత్కారాలు చేశాడు. కుశల ప్రశ్నల తర్వాత ద్రౌపది శ్రీకృష్ణుని చూసి ‘అన్నయ్యా! నేను వీరాధివీరుడైన పాండురాజు కోడలిని. ధర్మాత్ములైన పాండవుల భార్యను. నీకు చెల్లెలిని. అటువంటి నన్ను దుశ్శాసనుడు నిండు సభలోకి జుట్టు పట్టుకుని ఈడ్చుకు వచ్చి, వలువలూడ్చి అవమానించాడు. ఆ అవమానం అరని జ్వాలలా నన్ను దహించి వేస్తున్నది. నీవైనా నా పరాభవాగ్ని చల్చార్చలేవా?’ అని అడిగింది కన్నీళ్లతో.
‘సోదరీ! నీకు జరిగిన పరాభవాన్ని సాత్యకి చెప్పగా విని, ఎంతో బాధపడి నిన్ను ఓదార్చటానికి ఇలా వచ్చాను. మీకు త్వరలోనే మంచి రోజులు వస్తాయి. ధర్మరాజు మళ్లీ పట్ట్భాషిక్తుడు అవుతాడు. ఆ జ్యూతం జరిగేటప్పుడు నేనే కనుక అక్కడ ఉంటే భీష్ముడు, ద్రోణుడు, విదురుడు వంటి పెద్దలను ఒప్పించి ఆ మాయాజ్యూతాన్ని ఆపి ఉండేవాడిని. ఆ సమయంలో నేను సాల్వుడితో యుద్ధం చేస్తూ దూరంగా ఉండిపోవలసి వచ్చింది’ అన్నాడు.
‘ఎవరీ సాల్వుడు? అతనితో నీవు ఎందుకు యుద్ధం చేయవలసి వచ్చింది? వివరంగా చెప్పు బావా!’ అని అడిగాడు ధర్మరాజు. అందుకు శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు.
‘నీవు రాజసూయ యాగంలో నన్ను సత్కరించటం చూసి ఓర్వలేక శిశుపాలుడు నా చేత మరణించాడు కదా! అతని తమ్ముడే ఈ సాల్వుడు. అతని నగరం పేరు సాంభకం. ఇది పుష్పక విమానం లాగా ఆకాశ గమనం చేయగల శక్తికలది. నేను రాజసూయ యాగం ముగిసి ద్వారకకు రాగానే పట్టణమంతా కళావిహీనంగా కనిపించింది. ఉద్యానవనాలు నాశనమయ్యాయి. ప్రవేశ ద్వారాలు ధ్వంసమయ్యాయి. బ్రాహ్మణుల ఇళ్లలో వేదపారాయణం వినిపించటం లేదు. ‘ఏం జరిగిందని’ సాత్యకిని అడిగాను.
‘శిశుపాలుడు వధించబడ్డాడనే వార్త వినగానే అతని తమ్ముడు సాల్వుడు ఆగ్రహంతో సాంభక నగరంతో సహా వచ్చి ద్వారకాపురిని ముట్టడించాడు. మన యాదవ వీరులు ప్రద్యుమ్నుడు, సాంబుడు, చారుదేష్ణుడు వంటివారు సాల్వుడితో తలపడ్డారు. పోరు ఘోరంగా జరిగింది. రెండు పట్టణాల్లోని పౌరులు భయభ్రాంతులయ్యారు. ప్రద్యుమ్నుడు సాల్వుడితో యుద్ధం చేస్తున్న సమయంలో నారదుడు వచ్చి ‘వీడు నీ చేతిలో చావడు. శ్రీకృష్ణుడే ఇతడిని వధించగలడు’ అని చెప్పివెళ్లాడు. అది విని ప్రద్యుమ్నుడు వెనుకకు తగ్గగా సాల్వుడు విజయగర్వంతో వెళ్లిపోయాడు’ అని వివరించాడు సాత్యకి.
‘అయితే నేను సాల్వుడిని వధించి గానీ ద్వారకకు తిరిగిరాను’ అని ప్రయాణభేరీ మ్రోగించి యుద్ధయాత్రకు తరలివెళ్లాను. నా రాక గమనించి సాల్వుడు సౌంభక నగరంతో సహా సముద్రగర్భంలో దాక్కున్నాడు. నేను వాడిని వెంబడించి, అస్త్రాలు వర్షం వలె కురిపించి, యుద్ధం చేశాను. నా బాణాల చేత ముక్కలైన సైనికుల దేహాలు సముద్రం నిండా వెదజల్లినట్లయినాయి. సాల్వు డు నా మీద గండ్రగొడ్డళ్లు, అంకుశాలు, కత్తులు, బల్లాలు వర్షంలా కురిపించాడు. వాటినన్నింటినీ నేను వ్యర్థం చేశాను. మా ఇద్దరి యుద్ధంతో సముద్రజలాలు అల్లకల్లోలమయ్యాయి. ఇంతలో ఒక యాదవుడు వచ్చి ‘వసుదేవుడు సాల్వుడి చేతిలో చిక్కాడు’ అని చెప్పాడు. ‘సాల్వుడి చేతిలో చిక్కి దీనంగా ఉన్న నా తండ్రిని చూడగానే నేను శోకంతో మూర్ఛపోయాను. తెలివి వచ్చి చూసేసరికి వసుదేవుడు లేడు, యాదవుడు లేడు. అది సాల్వుడి మాయ అని తెలుసుకుని పట్టరాని ఆగ్రహంతో అతని మీద నా సుదర్శన చక్రాన్ని ప్రయోగించాను. అది భయంకరమైన అగ్నిగోళంలా వెలుగులు విరజిమ్ముతూ సౌంభక నగరం మధ్యలో పడింది. నా చక్ర వేగానికి సాల్వుడు రెండు ముక్కలై కిందపడ్డాడు. సౌంభకం మంటల్లో దగ్ధమయింది’ అంటూ శ్రీకృష్ణుడు సౌంభక వృత్తాంతం చెప్పాడు.
‘్ధర్మజా! అరణ్య, అజ్ఞాతవాసాలు ముగిసిన తర్వాత కురుపాండవ సంగ్రామం జరగటం తథ్యం. అప్పుడు భీష్మ, ద్రోణుల వంటివారిని ఎదుర్కోవటానికి అర్జునుడు దివ్యాస్త్ర సంపన్నుడు కావాలి. ఈ వనవాస కాలం మీకు చక్కని అవకాశం. అర్జునా! నీవు హిమవత్పర్వత ప్రాంతానికి వెళ్లి, శివుడి గురించి తపస్సు చేసి, పాశుపతాస్తమ్రును సంపాదించు. అది మీకు అనంత విజయాన్ని చేకూరుస్తుంది’ అని చెప్పాడు శ్రీకృష్ణుడు.
‘అలాగే బావా! నీ ఆజ్ఞ తప్పక పాటిస్తాను’ అన్నాడు అర్జునుడు.
‘విజయోస్తు’ అని దీవించి తిరుగు ప్రయాణమయ్యాడు శ్రీకృష్ణుడు.
(మాయాజ్యూతం జరిగేటప్పుడు శ్రీకృష్ణుడు దగ్గర లేడు- అనే విషయం మహాభారతం లోతుగా చదివినవారికి తప్ప, చాలామంది పాఠకులకు తెలియదు. అది తెలియజేయటానికే ఈ రచన)

- గోనుగుంట మురళీకృష్ణ,
రేపల్లె, గుంటూరు జిల్లా.
చరవాణి : 9701260448

పుస్తక పరిచయం

సువ్యక్తమైన ‘అవ్యక్తం’!

పుస్తకం : ‘అవ్యక్తం’ దీర్ఘకవిత
రచయిత: ఆత్మకూరు రామకృష్ణ
పేజీలు: 167, వెల: 150/-
చరవాణి : 9493405152

అనుభూతులుంటాయి అందరికీ.. ఒకరి పట్ల ఒకరికి అభిమానాలూ ఉంటాయి కొందరికి. కానీ గుప్తంగానే వుంటా యి ఎక్కువమందిలో. వ్యక్తం చేసే గుణం వుంటుంది చాలా తక్కువమందిలో! కేవలం మనిషి చలిస్తే చాలదు అవ్యక్తం వ్యక్తంగా మారడానికి. మనసు కూడా చలించాలి. అప్పు డే హృదయం నుండి జనిస్తాయి దాని తాలూ కు భావాలు. అప్పుడు కవి అయినవాళ్లు దాన్ని వ్యక్తీకరిస్తారు అక్షరాల్లో. చిత్రకారుడు వ్యక్తం చేస్తాడు అదే విషయాన్ని రంగుల్లో.
ఆత్మకూరు రామకృష్ణగారు ప్రధానంగా చిత్రకారుడు మాత్రమే కాదు, స్పందించే మనసున్న చక్కని కవి కూడా. అందుకే తన తండ్రి గతించిన వేదనతో చలించిపోయారు. ఆవేదనను అక్షరీకరించాడు ఒక కవిగా ‘అవ్యక్తం’ పేరుతో, చిత్రీకరించాడు ఒక చిత్రకారుడిగా. కవి, చిత్రకారుడు రెండూ తానే కావటం వల్ల ఆయన కలం నుండి వెలువడిన ఇతర గ్రంథాలతో కలరవాలు, తుపాను రాత్రి, వికల కూజితం వలెనే ఈ ‘అవ్యక్తం’ కూడా కేవలం సాహితీ గ్రంథంగానే కాకుండా చిత్రకళా గ్రంథంగానూ కనిపిస్తుంది. కారణం, సాహిత్యంతో పాటు చిత్రాలను కూడా కలిగి వుండటం ఈయన పుస్తకాల ప్రత్యేకత.
ఈ విశాల ప్రపంచంలో తాను ఒక జీవిగా ఈ భువిపై ఉద్భవించడానికి మూలమైన ఒక బీజంగా మాత్రమేగాక తన జీవన ప్రస్థానంలో అణువణువునా తోడుండి తన ప్రతీ పురోగమనానికీ కారకుడైన తండ్రి తన నుండి శాశ్వతంగా దూరమైన క్షణంలో మనసు పుటల్లోంచి ఉబికి వచ్చిన శోకతప్త హృదయానికి ప్రతిరూపంగా వెలువడిన గ్రంథం ‘అవ్యక్తం’.
‘శూన్యంలో పడిపోయాం మీ మరణ వార్త విని
ఇన్నాళ్లూ మేము నిల్చున్నది
మీ కాళ్లపైనే నాన్నా
ఈ వార్త విన్న క్షణమే అవగతమైంది
మీ మరణం కడలంత శోకమై మాలో నిండిందని’.. అంటూ ప్రారంభిస్తారు ఈ దీర్ఘకవితను రామకృష్ణ.
‘ఆసుపత్రిలో మంచంపై
యోగనిద్రలో వున్న మిమ్ము చూసి
స్వయం నిర్ణయం అయిపోయిందని
ఆ క్షణమే అనిపించింది’ అని తన అనుమానాన్ని వ్యక్తం చేస్తారు.
‘పున్నామ నరకాన్ని తప్పించేవాడు పుత్రుడంటారు
కానీ దిక్కుతోచని ఆత్మలను
పాపలను చేసి భూతల స్వర్గాన్ని చూపించేవాడు తండ్రి అంటానే్నను’ అంటారు రచయిత రామకృష్ణ తండ్రి గొప్పతనం గురించి చెపుతూ.
‘నాన్న మాటే తారకమంత్రంగా జపిస్తూ
నేడు మీ నీడలా మేమున్నాం
ఇలా మిగిలాం మీరు లేక
నిలువలేక విలవిల్లాడుతున్నాం’ అంటూ వేదన పడతారు.
నాన్న ఇక లేడని కళ్లు నమ్మచెబుతున్నాయి. నీళ్లను వర్షిస్తూ జ్ఞాపకాలను కదుపుతున్నది మనసు శూన్యాన్ని సాగుచేస్తూ
నా దేహం స్థాణువయ్యింది మీరు లేరన్న ఆ క్షణం
నిట్టనిలువుగా నిలిచిన రాతిస్తంభంలో చిక్కిన హృదయంలా
నొక్కబడింది, పొగిలి పొగిలి ఏడుస్తోంది’ అంటూ తన మనోవేదనను వ్యక్తం చేస్తారు.
చివరి క్షణాల్లో వున్న తండ్రి స్థితిని పరుల మాటల్లో ఉటంకిస్తూ ఆయన ఇంకా ఇలా అంటారు.
‘శస్త్ర చికిత్సలెన్నో ఎదుర్కొన్న మిమ్ము చూసి భీష్ముడు
అంపశయ్యపై ఉన్నట్లున్నాడు అన్నారు తమ్మెరిగినోళ్లు’ అని అంటారు. ఇంకా వేదాంత ధోరణిలో.
‘చిలక ఎటో ఎగిరిపోయింది..
పంజరం పాడయ్యి
మట్టిలో కలసిపోయింది-
జ్ఞాపకాల రెపరెపలు గ్రీష్మంలో
పశ్చిమ సమీరాలై గుండెను
జల్లెడ జేస్తూ విలవిల్లాడిస్తోంది
ఇదేనా జీవితం’.. అంటూ తీవ్ర మనోవేదనను వ్యక్తం చేస్తారు చివరికి.
తండ్రి లేదా తల్లిని గురించి విడివిడిగా ఎన్నో కవితలు రావచ్చు. సంకలనాలు కూడా వచ్చి వుండవచ్చు. కాని తండ్రి ఎడబాటుకు చలించి ఆ బాధ, వేదనలను ఏకంగా ఒక దీర్ఘకవిత రాయడం, అది పుస్తక రూపంలో తీసుకొచ్చి ఆవిష్కరింపజేయడం నిజంగా అరుదైన విషయమే. ఇది రామకృష్ణగారికి తన తండ్రి పట్ల వున్న అవ్యాజమైన ప్రేమ, అభిమానం, అంతులేని మమకారాలకు ప్రతీక అని వేరే చెప్పనవసరం లేదు. చిత్రకారుడు, డిజైనరు తనే కావడంతో పుస్తకంలో ముఖచిత్రం మొదలు ప్రతీ పేజీని ఎంతో శ్రద్ధతో తీర్చిదిద్దిన విధం కూడా రామకృష్ణగారికి ఈ గ్రంథం పట్ల ప్రత్యేక శ్రద్ధ, అభిమానాన్ని తెలియజెపుతుంది.

వెంటపల్లి సత్యనారాయణ,
ఖమ్మం.
చరవాణి : 9491378313

రూప విక్రయం
వెనె్నల సందేశాలూ.. మోహన వీచికలూ..
కనుమరుగవుతున్న ప్రతి క్షణమూ.. అనుభవించే ప్రతి శ్వాసా
మనం దూరమైన నాటి నుంచే కథ మళ్లీ మొదలైనట్లు
చేజారిన ఆనందాల్ని యెత్తి చూపుతున్నై..
వదులుకున్న అవకాశాల్ని ఇంటిముందు పరిచినట్లు
నేలా-నింగీ, నీరు-నిప్పూ, చిరుగాలీ కనుమరుగయేలోపు
యేనాడో మనసు పలికిన స్వరాలు మరల మధురంగా మీటి
మళ్లీ రుచి చూడటం అసలు తప్పేకాదంటున్నై..
ఇద్దరి చూపుల్లో నిన్నటి మెరుపులు, కలల తరకలూ
బాధ్యతలన్నీ ముగించుకుని, మళ్లీ చేయందుకొమ్మన్నై
అలలై కదిలిన జ్ఞాపకాలూ.. కలలై కరిగిన వయసు ముచ్చట్లు..
వొదులుకున్న సంతోషాలన్నీ.. మళ్లీ వొడిసి పట్టమంటున్నై
ఆ వయసుకు ఆ పిలుపు తగినదే
ఈ వయసుకీ పిలుపు సరైతే
ఇహంలో మిగిలిన ఈ కాసిని రోజులూ మనవైతే
పాపం-పుణ్యం, తప్పు-వొప్పూ తర్కించకు మనసైతే
ముందురోజులిడచబెట్టు ఈరోజే మనదనెయ్..
నిన్నటి అందం నేడు లేదు.. నేటి ఓపిక రేపు రాదు
గడిచిపోయిన జీవితం చేజార్చుకున్న స్వర్గం..
అవసరాలు ఆవిరి చేసి బతికింది చాల్లెమ్మని
ఇచ్చ వచ్చినట్లు ఇంకోసారి బతికి చూడమంటున్నై
యేదోఒక ఆరాటంతో గడిచిపోయింది గత జీవితం
కట్టుబాట్లూ, బరువులకి కొంచెం విరామమిచ్చి
కట్టుకున్న బాధ్యతలూ పెంచుకున్న ఆస్తిపాస్తుల
కకూన్లని ఛేదించమని నలభైలు గర్జిస్తున్నై
అణగారిన ఆశలూ, తీరని కొర్కెలూ
రెక్క తొడిగి సీతాకోక చిలుకలయ్యాయ్!

- దుగ్గిరాల రాజ్యలక్ష్మి, ఎర్రబాలెం,
గుంటూరు జిల్లా.
చరవాణి : 9440172537

దగాదగా..
దగాదగా దగాదగా
ఎటుచూసినా దగా
ముందు చూడు వెనుక చూడు
మనిషిలోన దగా మనసులోన దగా
ఈ చిత్రం చూస్తుంటే
మండదా గుండె భగభగ
ఎటుచూసినా మోసగాళ్లు
పేనుతున్నారు ఉరితాళ్లు
మోసపోతున్నాయి ఊళ్లు
ఎండిపోతున్నాయి సెలయేళ్లు
మొద్దుబారింది ప్రభుత్వం
తెరవాలిక నీవు త్రినేత్రం
వేయాలి అభివృద్ధికి మంత్రం
అప్పుడే ప్రజలకందుతుంది స్వతంత్రం
త్యాగాల బాట పట్టు
అన్యాయంపై గురిచూసి కొట్టు
సొంతవౌతుంది స్వేచ్ఛా తేనెపట్టు
ఎక్కడుంది అభివృద్ధి తొలిమెట్టు?

- మొహమ్మద్ బురహానుద్దీన్,
వేంసూరు, ఖమ్మం జిల్లా.
చరవాణి: 9704076179

హరిత హననం!
గతం ఘనమే
మొక్కలు నాటినా
బావులు తవ్వినా
చెరువులు నిర్మించినా
వారి ముందుచూపుకి
పాదాభివందనం
ఇప్పుడంతా
వ్యతిరేక చందనం
అడవిని నరికి
చెరువును మింగి
ఆనందతాండవమాడే
నరుల విధ్వంస గానం
కూర్చున్న కొమ్మను
నరుక్కుని
నడమంత్రపు సిరికి
విలువల్ని తాకట్టుపెట్టి
మూర్ఖత్వంతో
ముందుకు సాగే మనిషి
ఇకనైనా మేల్కొనకుంటే
నీటిచుక్క అడుగంటి
గుక్కెడు నీటికి దిక్కుతోచక
తలో దిక్కుకు పరుగెత్తే జనం
విషవాయువులతో
భూమండలం వేడెక్కితే
చినుకు రాలదు
నేల తడవదు
బీడువారిన భూమి
దాహం తీరదు
పంట పండదు
పాడి వుండదు
ఆకలి మంట చల్లారదు
గడ్డి లేక గొడ్డుగోద
బతుకు తెల్లారుతుంది
చివరికి కరవుకోరల్లో చిక్కి
ప్రకృతి ప్రకోపానికి
బలికాక తప్పదు
తప్పదు.. తప్పదు!

- ఎస్‌ఎం సుభాని,
గుంటూరు.
చరవాణి : 9490776184

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

email: merupuvj@andhrabhoomi.net
మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ప్లాట్ నంబర్ సి- 3, 4, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విజయవాడ - 520 007. email: merupuvj@andhrabhoomi.net

- నాగమల్లిక